jump to navigation

1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమం: ఉప్పొంగిన పొరిగింటి తెలుగు ‘సమైక్య’ కవిత్వం – వెల్దండి శ్రీధర్ నవంబర్ 8, 2013

Posted by M Bharath Bhushan in 1969, Andhra, Art, Culture, Identity, Poetry & Songs, politics, Settler, Telangana, Telangana Languages, Telugu, Telugu (తెలుగు).
add a comment

1969 ‘సమైక్య’ కవిత్వం – వెల్దండి శ్రీధర్
andhra jyothy, 4 November 2013

‘తెలంగాణాను వర్ణించటానికి తెలుగులో మాటలు చాలవు… దానిని ‘హెలంగాణ’ అంటున్నాను’ అని సానుభూతి కురిపించారు కుందుర్తి. తీరా 1969 నాటికి ఆ సానుభూతి కాస్తా ఇగిరిపోయి తెలంగాణ సమాజమంతా ఉద్యమ ‘ఉడుకు’తో కింద మీదవుతుంటే విడిపోదామనే మాట వినకూడదు, అనకూడదని శాసనం జారీ చేశారు. శ్రీశ్రీ కూడా ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని నిరసిస్తూ విజయవాడ ఆకాశవాణిలో 1969 సౌమ్య ఉగాది పర్వదినాన ‘సౌమ్యవాదం’ కవిత చదివారు. కె.వి.రమణారెడ్డి ప్రత్యేక తెలంగాణ ఉద్యమంపై ‘అంధకసీమ’ కవిత్వంతో ఎర్ర పిడికిలి బిగించారు..

ప్రపంచంలో ఏ దేశంలోనైనా, ఏ భాషలోనైనా సాహిత్య కళాజీవి ఎవరైనా పీడితుని పక్షాన నిలబడి తానెంచుకున్న ప్రక్రియతో గుండెలో మూగ మంటలేసుకున్న బాధితుని తరఫున ఒక ఆయుధంగా, ఒక నినదించే గొంతుగా, ఒక బిగించిన పిడికిలిగా మారి రాజ్యానికి ఎదురు నిలుస్తాడు. అవసరమైతే ప్రత్యక్షంగా కార్యరంగంలోకి దిగి పీడితుని రక్తంలో రక్తంగా, చెమటలో చెమటగా, నినాదంలో నినాదమై అల్ప ప్రాణులకు కొండంత అండగా నిలబడి అన్యాయాన్ని ఎదురించే ప్రశ్నల కొడవలవుతాడు. కానీ తమ ఆత్మగౌరవం కోసం, తమ సాంస్కృతిక వారసత్వం కోసం, తమ ఉద్యోగాల కోసం, తమ వనరుల కోసం, తమ నిధుల కోసం, తనదైన పిడికెడు నేల కోసం సుమారు నాలుగు వందలమంది యువకుల ప్రాణాలను ధారబోసి చేసిన 1969 ప్రత్యేక తెలంగాణ తొలి దశ ఉద్యమ కాలంలో విచిత్రంగా మహాకవులు, ప్రముఖ కవులనుకున్న వాళ్లందరూ పీడకుల పక్షాన నిలబడి పీడితుని నడ్డీపై మరిన్ని కవిత్వపు బరిసెలు వదిలారు. నాలుక లేని వానికి నాలుకై నిలవాల్సిన కవులు దోపిడీకి కవిత్వపు రహదారిని నిర్మించారు. ఉద్యమాన్ని మరణ శయ్యపై కెక్కించి ‘తమ్మూడూ స్నేహ హస్తం అందుకో, వేర్పాటువాదం మానుకో’ అని రగిలిపోతున్న నిప్పును తాత్కాలిక కవిత్వపు పదబంధాల బూడిదలో కప్పిపెట్టారు. తెలుగు కవిత్వపు ప్రయాణంలోనే ఇదొక మరుగుజ్జు దశ. ఒక విలోమ కవిత్వం.

‘ఇలారా తమ్ముడూ ఏమిటి నీ బాధ/కూచున్న చెట్టును గొడ్డలి తో నరుక్కున్నట్లు/ఎవరు చేశారు నీకీ వేర్పాటు బోధ/ఒరలోంచి కత్తిలాగి/తన బొడ్లో పొడుచుకున్నట్లు/పుష్కరం తర్వాత గుర్తు వచ్చిందా/ప్రత్యేక ఏర్పాటు గాధ …. …. కోటి కోర్కెలు కోరుకో/ కోటిన్నొక్కటి తీరుస్తాను/విడిపోదామనే మా/ వినకూడదు అనకూడదు’ (‘స్నేహగీతి’ -కుందుర్తి, ఫిబ్రవరి 19, 1969 ఆంధ్రప్రభ దినపత్రిక)
వచన కవితా పితామహులు, కుందుర్తి ఆంజనేయులు ‘వచన కవిత్వానికి వ్యాకరణం ప్రజలు, నిఘంటువులు ప్రజలు, అలంకారాలు ప్రజలు’ అంటూ ‘పీడిత వర్గాలను గురించి రాసే కవి ఆ వర్గానికి చెందిన వాడే కానక్కర లేదు సానుభూతి ముఖ్యం. ఆ వర్గాల సమస్యల పట్ల సమగ్రమైన అవగాహన ఉండాలి. అందుకు తగ్గ బలమైన అభివ్యక్తి అవసరం’ అని చెప్పి రైతాంగ సాయుధ పోరాటంపై ‘తెలంగాణ’ కావ్యాన్ని రాశారు. ‘తెలంగాణాను వర్ణించటానికి తెలుగులో మాటలు చాలవు… దానిని ‘హెలంగాణ’ అంటున్నాను’ అని సానుభూతి కురిపించారు. తీరా 1969 నాటికి ఆ సానుభూతి కాస్తా ఇగిరిపోయి తెలంగాణ సమాజమంతా ఉద్యమ ‘ఉడుకు’తో కింద మీదవుతుంటే విడిపోదామనే మాట వినకూడదు, అనకూడదని శాసనం జారీ చేశారు. 1969 సౌమ్య ఉగాది పర్వ దినాన ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో చదివిన కవిత్వంలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని ‘కాలం చేసిన గారడీ’గా కొట్టిపారేశారు.

‘ఈ యేడే ఉగాది నాటికి/అనైక్య ఫలితాల బహుగాథా పరంపరలను/సిగ్గుతో డిపోలో దాచుకున్న/సిటీ బస్సులు చెప్పాయి నాకు/ మూసేసిన పాఠశాలలు పూసగుచ్చినట్లు చెప్పాయి/అసాంఘిక శక్తుల చేతుల్లోకి/మారిన చరాస్తులు మరీ మరీ చెప్పాయి/హఠాత్తుగా వచ్చి న వరద పొంగులా/ఈ అనైక్యత యింక పోదా?/ఏ నాటికైనా యింకి పోదా?… … ఇక్కడ చేరిన కవిమూర్తుల్లోని ఆంధ్రైక్యత/కనిపిస్తుందో లేదో వరంగల్లులో/ఓ ప్రభూ పొరపాటు పడ్డాము/ఈ ముక్కోటి తెనుగుల్ని యీ దఫాకు క్షమించు/మేమందరం తాగి ఉన్నాము మం చీ చెడు తెలియని/స్వార్థం ముసుగులో దాగి వున్నాము’ -అంటూ ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని తాగిన మత్తులో జరుగుతోన్న ఉద్యమంగా చిత్రించారు. ‘ఇది నా కన్నీటి లేఖ – ఇది నా దురదృష్ట రేఖ/మసిలో కన్నీరు కలిపి మాతృశ్రీ వ్రాయు లేఖ … … ఒక్క తల్లి బిడ్డలలో – ఎక్కడిదయ్యా ఈ కసి/చక్కని సౌధం నడిమికి – ముక్కలు చేసే రక్కసి … పంట చేలు పాడు చేయు – పందికొక్కులను జెనకుడు/తాడు తెగిన గాలి పటం – తప్పుడు బాటల జనకుడు/చుప్పనాతి శూర్పనఖల – చెప్పుడు మాటలు వినకుడు …. పచ్చని పందిళ్ల కింద – చిచ్చు బుడ్లు కాల్చకండి/పక్క ఇండ్ల మీద ‘పిచ్చికుక్కల’ నుసికొల్పకండి … ప్రత్యేక తెలంగాణం పగబట్టిన దృక్కోణం/ప్రత్యేక తెలంగాణం స్వార్థపరు ల నిర్మాణం/ప్రత్యేక తెలంగాణం భరత భూమికవమానం/ప్రత్యేక తెలంగాణం ‘దక్షిణ పాకిస్థానం’/దింపుడు ఉష్ణోగ్రత సాధింపుడు సర్వసమగ్రత/’భస్మాసురులొస్తున్నారోయ్-తస్మాజ్జాగ్రత! జాగ్రత!!” (‘కన్నతల్లి కన్నీటి లేఖ’ -కరుణశ్రీ, ఆంధ్రప్రభ, ఫిబ్రవరి 18, 1969) (మరింత…)