jump to navigation

Osmania University – Mother Tree of Telangana Consciousness: ‘అమ్మచెట్టు’ ఉస్మానియా- కె. శ్రీనివాస్ మార్చి 10, 2017

Posted by M Bharath Bhushan in Articles, Culture, Essays, heritage, Hyderabad, Identity, Mulki, Nizam, Osmania, politics, students, Telangana.
trackback
అధికారికమైన వేడుకలు జరుగుతాయి. జరగవలసిందే. పాలకులనుంచి నిధులను, ఖాళీల భర్తీని, అనేక ఆధునికీకరణలను డిమాండ్‌ చేయవలసిందే. ఉస్మానియా తలుపులను ప్రజాస్వామిక పవనాలకు ఎప్పుడూ తెరచి ఉంచే హక్కు కోసం కూడా అడిగి తీరాలి. కేవలం వేడుకలతో, స్ఫూర్తిని సాధ్యమైనంత పలచబరచి, కేవలం అట్టహాసం చూపినందువల్ల ఉపయోగం లేదు. వేడుక కేవలం అధికారికమైనదే కానక్కరలేదు. హైదరాబాద్‌ రాజ్యానికి అంతటికీ అది తొలి విశ్వవిద్యాలయం. సుదీర్ఘకాలం తెలంగాణకు అదొక్కటే యూనివర్సిటీ…  ప్రతి ఒక్కరూ తమకు తెలిసిన ఉస్మానియా గురించి, తాము జీవించిన ఉస్మానియా పార్శ్వం గురించీ తలచుకుని సంబరపడవలసిన సమయం ఇది. అధ్యాపక పోస్టులను అసంఖ్యాకంగా ఖాళీగా ఉంచి, శిథిల విద్యాలయంగా మార్చడానికి ప్రయత్నిస్తున్న విధానాలకు తిరస్కారం చెప్పవలసిన తరుణం కూడా ఇదే. 
……………

‘అమ్మచెట్టు’ ఉస్మానియా

 కె. శ్రీనివాస్, ఆంధ్ర జ్యోతి 09-03-2017
కాకతీయతో మొదలుపెట్టి, తెలంగాణ యూనివర్సిటీ దాకా అన్నిటికీ ఉస్మానియాయే తల్లి. శాస్త్రవిజ్ఞాన రంగాలలోను, సామాజిక శాస్త్రాలలోను సవ్యసాచిలా అసామాన్య ప్రతిభలను ఆవిష్క రించిన ఉస్మానియా స్ఫూర్తితో, అన్ని చదువులను కాపాడుకోవడానికి ప్రపంచమంతా వ్యాపించిన పూర్వవిద్యార్థులు సంకల్పం చెప్పుకోవాలి.
‘అమలులో ఉన్న విద్యావిధానంతో కొన్ని సమస్యలున్నాయి. వాటిని అధిగమించాలి. ప్రాచీన, ఆధునిక జ్ఞానాలను, సంస్కృతులను ఏ ఘర్షణా లేకుండా మేళవించాలి. భౌతిక, బౌద్ధిక, ఆధ్యాత్మిక రంగాలకు సంబంధించి పాతకొత్తలలోని ఉత్తమమైనవాటి నుంచి ప్రయోజనం పొందాలి. ఈ లక్ష్యాలను సాధించడానికి ఒక విశ్వవిద్యాలయం అవసరం. జ్ఞాన సముపార్జనలో ఈ విశ్వవిద్యాలయం నైతిక శిక్షణ మీద కేంద్రీకరించాలి. అది అన్ని శాస్త్రరంగాలలో పరిశోధనకు ప్రేరణ ఇవ్వాలి. ఉర్దూయే బోధనాభాషగా ఉండాలన్న సూత్రం మీద ఈ యూనివర్సిటీ పనిచేయాలి. అదే సమయంలో విద్యార్థులందరూ నిర్బంధంగా ఇంగ్లీషును కూడా అభ్యసించాలి. ఈ లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకుని, నాముందున్న ఈ అర్జీలో పేర్కొన్న తీరులో హైదరాబాద్‌ అధినివేశ ప్రాంతాలలో ఒక విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయడానికి, నేను అధికారపీఠం అధిష్ఠించిన సందర్భానికి గుర్తుగా దాన్ని హైదరాబాద్‌ ఉస్మానియా విశ్వవిద్యాలయం అని పిలవాలని ఆదేశిస్తున్నాను.’
హైదరాబాద్‌ రాజ్యానికి ఒక విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని కొందరు అధికారులు, విద్యావేత్తలు చేసిన విజ్ఞప్తిని అంగీకరిస్తూ ఏడవ నిజాం మీర్‌ ఉస్మాన్‌ అలీ ఖాన్‌ 1917 ఏప్రిల్‌ 26వ తేదీన సంతకం చేసిన ఫర్మానా అది. ఆధునిక విద్య అతి ప్రాథమిక దశలో ఉన్న సమయంలో విశ్వవిద్యాలయ స్థాపన అవసరాన్ని, అది సాధించవలసిన లక్ష్యాలను ప్రభుత్వ ఉత్తర్వులోనే అంత లోతుగా పేర్కొనడం ఆశ్చర్యం కలిగిస్తుంది. భూస్వామ్య-రాచరిక సమాజం, పరోక్ష వలస పాలనలో ఉన్న దేశీయ సంస్థానం అయిన హైదరాబాద్‌ రాజ్యం, ఒక ప్రజాసంస్థ ఏర్పాటు ద్వారా, మారే కాలంలోకి వేసిన ఒక ముఖ్యమైన అడుగు- ఉస్మానియా విశ్వవిద్యాలయం.
వచ్చే నెల 26 నుంచి 28వ తేదీ వరకు ఉస్మానియా విశ్వవిద్యాలయం శతవార్షికోత్సవాలు అధికారికంగా ఘనంగా జరగబోతున్నాయి. రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ఈ కార్యక్రమానికి వస్తున్నారు. గవర్నర్‌, ముఖ్యమంత్రి పాల్గొంటున్నారు. ఒక చారిత్రక సంస్థకు నూరేళ్ల వయస్సు రావడం నిస్సందేహంగా ఒక విశేష సందర్భమే. అదే సమయంలో ఆ సంస్థ సమాజపు చరిత్రతో కలిసి చేసిన చరిత్రాత్మక ప్రయాణాన్ని సమీక్షించుకోవడం, ఆవిర్భావకాలం నాటి దాని విలువలు, ఆదర్శాలను మననం చేసుకోవడం, భవిష్యత్తుకు దాని నుంచి తీసుకోవలసిన స్ఫూర్తిని మదింపువేసుకోవడం- వేడుకలకు, సంబరాలకు ప్రాతిపదికలుగా ఉండాలి. విద్యా, పరిశోధనా ప్రమాణాల స్థాపనలో, ఉత్తమశ్రేణి మేధాశక్తిని ప్రపంచానికి అందించడంలో, చదువును సామాజిక సాధికారతగా మలచడంలో ఉస్మానియా వంటి సంస్థ చేసిన కృషి- ఆ సంస్థతో సంబంధం ఉన్నవారందరికీ, ఆ సంస్థతో పెనవేసుకున్న చరిత్రతో నడిచిన వారందరికీ గర్వకారణం. ఒక విద్యాలయం కేవలం అధ్యాపకులకు, విద్యార్థులకు మాత్రమే సంబంధించినది కాదు. అది స్వేచ్ఛాలోచనలకు వేదిక, విభిన్న భావాల కూడలి, విరుద్ధ ఆశయాల యుద్ధస్థలి, తన చుట్టూ ఉన్న సమాజం అంతటికీ మెదడూ, గుండే కూడా.
ఏడో నిజాం గురించి, ఆయన పాలన గురించి రకరకాల అభిప్రాయాలున్నాయి. తెలుగులో చదువును ఆయన పాలన ప్రోత్సహించలేదని, నూతనత్వంలోకి తెలంగాణ తెలుగు సమాజం వికసించడానికి అన్నీ అవరోధాలే ఉండేవని విమర్శిస్తాం. అందులో అసత్యం ఏమీ లేదు. నాటి తెలంగాణ తెలుగుసమాజం తనను తాను వెలుగులోకి తెచ్చుకోవడానికి ఎంతో ప్రయాస పడింది, పోరాడింది. భాషా సాంస్కృతిక అస్తిత్వ పోరాటాన్ని రాజకీయ సాయుధపోరాటం దాకా తీసుకువెళ్లింది. నిజాం పాలనలో తెలుగుపై ఉండిన వివక్షను విమర్శించడానికి నాటి తరానికి హక్కు ఉన్నది కానీ, ఈ నాడు ఇతరేతర కారణాలతో సానుకూలతను, వ్యతిరేకతలను నిర్మించుకుంటున్న వారికి ఆ హక్కు లేదు. తెలుగును మనం మాత్రం ఏం నిలుపుకుంటున్నాం? తెలుగు విద్యామాధ్యమంగా కనీసస్థాయిలో అయినా బతికించుకోవాలని కోరుకుంటున్నవారిని హేళన చేస్తున్నాం, తిండిపెట్టే విద్యను, ఉపాధినిచ్చే భాషను తిరస్కరిస్తే భవిష్యత్తు ఏమిటని నిలదీస్తున్నాం. ఉస్మానియా యూనివర్సిటీ స్థాపన నాటికే నాటి ప్రభుత్వానికి ఈ అంశంపై ఒక స్పష్టత ఉన్నది. బహుళభాషా రాజ్యమైన హైదరాబాద్‌లో ఎక్కువమందికి అర్థమయ్యే భాషగా ఉర్దూను గుర్తించడంలో, తెలుగుకు అన్యాయం జరిగి ఉండవచ్చు. తెలుగుమాధ్యమంగా వెలిగిన కాలంలో, ఉర్దూకు పట్టిన గతి ఏమిటి? అనేక గిరిజన భాషల పరిస్థితి మాత్రం ఏమిటి? భారతీయ భాష అయిన ఉర్దూలో సకల విద్యాంశాలనూ బోధించాలన్న నిర్ణయం సామాన్యమైనది కాదు. అదే సమయంలో, ఇంగ్లీషును తప్పనిసరిగా అందరూ నేర్చుకునేట్టు విద్య ఉండాలన్న షరతూ ఉండింది. శాస్త్రసాంకేతిక అంశాలను ఉర్దూలో బోధించడంలో అనేక సమస్యలున్నాయి. ఉర్దూలోనే కాదు, ఏ భారతీయ భాషలో నేర్పించాలన్నా పరిభాషకు, వ్యక్తీకరణకు సంబంధించిన సమస్యలుంటాయి. దాన్ని అధిగమించడానికి ఉస్మానియాయూనివర్సిటీ ప్రత్యేకంగా అనువాద విభాగాన్ని ఏర్పరచి, గణితం, భౌతిక శాస్త్రాలను ఉర్దూలో రచింపజేయడానికి వీలు కల్పించారు. ఇవాళ తెలుగు ఆధునిక భాషగా ఎదగాలంటే కూడా జరగవలసింది అటువంటి కృషే. బోధనాభాష సంగతి పక్కనపెట్టండి, కనీసం ఒక సబ్జెక్టుగా పదోతరగతి వరకైనా తెలుగును నిర్బంధం చేయమంటే తెలుగుపాలకుల స్పందన ఏమిటి?
ఉర్దూ బోధనా మాధ్యమంగా యూనివర్సిటీని స్థాపించడం దేశవ్యాప్తంగా నాడు జాతీయవాదుల ప్రశంసలకు పాత్రమైంది. ‘‘విదేశీ భాష శృంఖలాల నుంచి విముక్తమై, విద్య అందరికీ సహజంగా అందే రోజు కోసం దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్నాను. ఈ సమస్య పరిష్కారం దేశీయ రాజ్యాలలోనే సాధ్యపడుతుందని అనుకున్నాను. మీ రాజ్యం ఉర్దూ భాషలో బోధించే విశ్వవిద్యాలయాన్ని స్థాపించనున్నదని తెలిసి ఎంతో ఆనందం కలిగింది’’ అని రవీంద్రనాథ్‌ టాగూర్‌ నిజామ్‌కు రాసిన లేఖలో ప్రశంసించారు. జాతీయోద్యమ కాలంలో ఒక దేశీయ సంస్థానం జాతీయవాద దృష్టితో ఉర్దూభాషపై వైఖరి తీసుకోగా, స్వాతంత్ర్యానంతరం కేంద్రప్రభుత్వం ఉర్దూ స్థానంలో హిందీని బోధనామాధ్యమం చేసే ప్రయత్నం చేసింది. ఆ సమయంలో యాక్టింగ్‌ వైస్‌చాన్స్‌లర్‌గా ఉన్న దేవులపల్లి రామానుజరావు కేంద్రప్రభుత్వ ప్రయత్నం మీద తీవ్రంగా నిరసన తెలిపారు. హిందీ యూనివర్సిటీగా మార్చాలనుకోవడం ఉత్తరాది ఆధిపత్యానికి చిహ్నమని ఆయన వాదించారు.
విద్యాప్రమాణాలకు, ఉత్తమశ్రేణి మానవశక్తి రూపకల్పనకు ఉస్మానియా పెట్టింది పేరుగా ఉండేది. ఇప్పటికీ అనేక విభాగాలలో ఉస్మానియా జాతీయస్థాయిలో తొలిర్యాంకులలో కొనసాగుతున్నది. ఉస్మానియా పూర్వవిద్యార్థుల జాబితాను చూస్తే కళ్లు మిరుమిట్లు గొల్పుతాయి. ఎంతమందిని, ఎంతటి శాస్త్రవేత్తలను, రచయితలను, కవులను, మేధావులను, రాజకీయనేతలను, పాలనాదక్షులను, విప్లవకారులను, మితవాద అగ్రనేతలను- ఈ విశ్వవిద్యాలయం దేశానికి అందించింది!
నిజాం వ్యతిరేక ఉద్యమంలోని రకరకాల ధోరణలకు ఉస్మానియా వేదికగా ఉండింది. మతపాక్షిక జాతీయవాద శ క్తులు, వామపక్షీయులు, కాంగ్రెస్‌ పక్షీయులు- ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులలో ఉండేవారు. 1960 దశకం చివరినుంచి విప్లవవిద్యార్థి ఉద్యమానికి ఉస్మానియానే కేంద్రం అయింది. సుమారు రెండు దశాబ్దాల పాటు విద్యార్థిలోకం చైతన్యానికి ఇంధనాన్ని అందించింది. తొట్టతొలి ముల్కీ ఉద్యమం దగ్గరనుంచి ఇటీవలి ప్రత్యేక తెలంగాణ ఉద్యమం వరకు ఉస్మానియా యూనివర్సిటీయే ప్రేరణ స్థలంగానూ, రణస్థలంగానూ ఉండింది. తెలంగాణ సమాజానికి తనను తాను ఒక ప్రతీక చేసుకుని, దిగ్బంధ ఉస్మానియా కేంపస్‌ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంతో పోరాడింది. ఉద్యమాలకు ఆలోచనాశక్తిని, కార్యకర్తల బలాన్ని ఇచ్చింది. అమరవీరులనూ అందించింది. నాయకత్వం తప్పొప్పులను ఎత్తిచూపడానికి ఉద్యమకాలంలోనూ వెనుకాడలేదు, తరువాత కాలంలోనూ వెనుకాడడంలేదు. ఉస్మానియా లేకపోతే తెలంగాణ రాష్ట్రమే లేదు. ప్రత్యేకరాష్ట్రం ప్రయోజనాలను అనుభవిస్తున్నవారు నిరంతరం ఉస్మానియాకు మొక్కులు చెల్లించుకున్నా రుణం తీరదు.
ఉస్మానియా శతవార్షికోత్సవం జరుపుకుంటున్న సందర్భం- విద్యారంగంలో, స్వేచ్ఛాలోచనల వ్యాప్తిలో తీవ్రమయిన నిరోధాలు ఎదురవుతున్న సమయం. పబ్లిక్‌ సంస్థలుగా యూనివర్సిటీలు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న కాలం. దేశీయమైన, చారిత్రకమయిన యూనివర్సిటీలను చేజేతులా చిదిమివేసి, ప్రైవేటు, విదేశీ యూనివర్సిటీలకు ఎర్రతివాచీలు పరుస్తున్నారు. సామాజికశాస్త్రాలు పూర్తిగా అణగారిపోతున్నాయి. ప్రలోభాలను, స్వార్థాన్ని తప్ప ఏ నైతికతనూ విద్య అలవర్చలేకపోతున్నది. ఉస్మానియా వంటి సంస్థలు ఏ ఆశయాలతో పుట్టాయో, ఎటువంటి చారిత్రక సందర్భాలలో ఎదుగుతూ వచ్చాయో, ఏ ఏ సామాజిక సంచలనాలకు వేదికలుగా ఉంటూ, ప్రజల విషయంలో విద్యావంతుల బాధ్యతలను నెరవేరుస్తూ వచ్చాయో ఒకసారి గుర్తుకు తెచ్చుకోవలసిన సందర్భం కూడా ఇది.
అధికారికమైన వేడుకలు జరుగుతాయి. జరగవలసిందే. పాలకులనుంచి నిధులను, ఖాళీల భర్తీని, అనేక ఆధునికీకరణలను డిమాండ్‌ చేయవలసిందే. ఉస్మానియా తలుపులను ప్రజాస్వామిక పవనాలకు ఎప్పుడూ తెరచి ఉంచే హక్కు కోసం కూడా అడిగి తీరాలి. కేవల వేడుకలతో, స్ఫూర్తిని సాధ్యమైనంత పలచబరచి, కేవలం అట్టహాసం చూపినందువల్ల ఉపయోగం లేదు. వేడుక కేవలం అధికారికమైనదే కానక్కరలేదు. ఉస్మానియా వందేళ్ల పండుగ దాని భౌగోళిక పరిధికి మాత్రమే పరిమితం కావలసిన పనిలేదు. హైదరాబాద్‌ రాజ్యానికి అంతటికీ అది తొలి విశ్వవిద్యాలయం. సుదీర్ఘకాలం తెలంగాణకు అదొక్కటే యూనివర్సిటీ. కాకతీయతో మొదలుపెట్టి, తెలంగాణ యూనివర్సిటీ దాకా అన్నిటికీ ఉస్మానియాయే తల్లి. ఉస్మానియా ఆవిర్భావం ఈ అన్ని ప్రాంతాలకు చెందిన విద్యావంతులదీ. ప్రతి ఒక్కరూ తమకు తెలిసిన ఉస్మానియా గురించి, తాము జీవించిన ఉస్మానియా పార్శ్వం గురించీ తలచుకుని సంబరపడవలసిన సమయం ఇది. అధ్యాపక పోస్టులను అసంఖ్యాకంగా ఖాళీగా ఉంచి, శిథిల విద్యాలయంగా మార్చడానికి ప్రయత్నిస్తున్న విధానాలకు తిరస్కారం చెప్పవలసిన తరుణం కూడా ఇదే. శాస్త్రవిజ్ఞాన రంగాలలోను, సామాజిక శాస్త్రాలలోను సవ్యసాచిలా అసామాన్య ప్రతిభలను ఆవిష్కరించిన ఉస్మానియా స్ఫూర్తితో, అన్ని చదువులను కాపాడుకోవడానికి ప్రపంచమంతా వ్యాపించిన పూర్వవిద్యార్థులు సంకల్పం చెప్పుకోవాలి. అవిద్య అలముకున్న తెలంగాణలో ఆశాదీపంలా ఆవరించిన ఉస్మానియాను, నూతన తెలంగాణ నిర్మాణంలో ఒక సజీవ బౌద్ధిక కేంద్రంగా నిలబెట్టుకోవాలి.

 

source: http://www.andhrajyothy.com/artical?SID=379739

వ్యాఖ్యలు»

No comments yet — be the first.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: