jump to navigation

తెలంగాణ అస్తిత్వం నా వ్యక్తిత్వం – పద్మశ్రీ లక్ష్మా గౌడ్‌ జనవరి 27, 2016

Posted by M Bharath Bhushan in Art, Culture, Identity, Interview, Personalities, Telangana, Telugu, Telugu (తెలుగు).
Tags:
trackback

తెలంగాణ అస్తిత్వం నా వ్యక్తిత్వం

Interview with Padma Shri Laxma Goud by Kandukuri Ramesh Babu, Namasthe Telangana, January 27, 2016

ఆధునిక చిత్రకళలో సంచలనాత్మకమైన సృష్టికి ప్రతీకగా పేరొందిన లక్ష్మా గౌడ్‌తో ముఖాముఖి అంటే ఒక సాహసితో కరచాలనం. ఆయన జానపదుడు. మోటు మనిషి. కానీ అతడి చిత్రాల్లోని రేఖా లావణ్యం, రంగుల మేళవింపు చూడముచ్చటైంది. లలిత లలితంగా సాగే ఆయన చిత్రాలు మానవుడి చిత్తప్రవృత్తులను నిఖార్సంగా ఆవిష్కరిస్తూ చూపరులను ఒక్కపరి భీతిల్ల చేస్తాయి. కలవరపాటుకు గురిచేస్తాయి. ఎందుకంటే ఆయనది గ్రామ సంప్రదాయం. అందులో చెట్లు, చేమలు, గేదెలు, మేకలు – మనుషులూ ఉంటారు. ఆ మనుషుల్లోని ఆప్యాయతలు, అనురాగాలు – మరీ ముఖ్యంగా పశుపక్ష్యాదులతో వారికున్న అనుబంధాలు ప్రస్ఫుటంగా గోచరిస్తాయి. నాగరికులకు అనాగరికంగా అనిపించే అలవాట్లు, ప్రవర్తనలు, కోపతాపాలు, ఉద్రేకాలు, ఉద్వేగాలు, సరససల్లాపాలు, మోహావేశాలు – ముఖ్యంగా సెక్సు సంబంధాలన్నిటినీ మరే ఆధునిక చిత్రకారుడూ సృశించ సాహసించనంతటి విశిష్టంగా ఆయన చిత్రిస్తారు. అదే లక్ష్మాగౌడ్‌ ప్రత్యేకత. ఒక్కమాటలో ఆయన నిర్భీతికి మారుపేరు. అటువంటి కళాకారుడితో మామూలు సమయంలో ముఖాముఖి అంటే అది సాహసమే. కానీ, పద్మశ్రీ వరించిన సందర్భంలో ఆయన ఎంత హాయిగా ముచ్చటించారంటే తెలంగాణ మురిపాల ముద్దుబిడ్డగా ప్రాంతీయ అభివ్యక్తి గురించి కూడా నిర్మొహమాటంగా వ్యక్తమయ్యారు. టీవీ చానళ్ల హడావిడి మధ్యన తనదైన యాస భాషలతో లక్ష్మాగౌడ్‌ తన చిత్రకళా ప్రస్థానాన్ని కాసేపు ‘నమస్తే తెలంగాణ’తో ఇలా పంచుకున్నారు. ..

*తొలి ప్రశ్న. ఈ శుభ సందర్భంలో మొట్టమొదట మీరు ఎవర్ని యాది చేసుకున్నారు?

– ముఖ్యంగా మా నాయినని. నేనంటే ఆయనకు చాలా ప్రేమ. ఆయనే ఇంతటి స్థితికి కారణం అంటాను నేను. తండ్రిగా ఆయన నన్ను ఇది చేయి అది చేయి అని ఎప్పుడూ దేంట్లోనూ కల్పించుకోలేదు. అది నాకు చాలా సంతోషకరమైన విషయం. నాయిన్నే నన్ను ఆర్ట్ స్కూల్లో జాయిన్ చేశారు. అందుకు తొలి యాది నాయన. తర్వాత నా టీచర్‌ను యాది చేసుకున్నాను. బరోడాలో నా గురువర్యులు కె.జి.సుబ్రమణ్యన్ గారిని తలుచుకున్నాను. ఆయన సాన్నిహిత్యంలో, మాట ముచ్చట్లలో నా తెలివిని పెంచుకోవాల్సిన అవకాశం ఏదైతే దొరికిందో దానికి నేను జన్మాంతరం రుణపడి వుంటాను. ఔర్ ఆయన వల్లనే నేనీ దశకు వచ్చానని అంటాను.

*ఒక్క మాటల మీ టీచర్ చెప్పింది ఏమిటి?

– నా టీచర్ చెప్పిన ముచ్చట ఏమిటంటే – నీలో గనుక కళాకారుడిని కావాలన్న అభిలాష ఉంటే నీదైన- వ్యక్తిగత రూపకల్పన (ఇండివిజులిస్టిక్ ఐడియా) చేసుకోమని చెప్పిండు. అందరు కళాకారులే. కానీ, వ్యక్తిగత రూపకల్పన చేయగలిగితే నీ బొమ్మ తయారవుతుందని చెప్పిండు. అదే శైలి. నీదైన శైలిని గుర్తించగలగే స్థితికి వస్తే, అది నీ మనసుకు అతికినట్లుగా ఉంటే అక్కడ కళాకారుడు పుడతాడు. అలా కనపడాలన్న సూచన ఆయన ఇచ్చిందే. కళను జీవితాన్ని సెపరేట్ చేయకుండా, దాన్ని చూసి గుర్తించగలిగి, అందులో నీదైన గుణం వ్యక్తం అయ్యేలా కృషి చేయాలని చెప్పిండు.

*మీరు జన్మించిన కులం (కలాల్ పని- గీత అక్కడే ఉంది) మీ ప్రాంతం (సహజ సిద్దమైన తెలంగాణ గ్రామీణ సాంస్కృతిక నైసర్గికత) – ఈ రెంటితో కూడిన వ్యక్తిత్వం వల్లే మీరు బలమైన కళాకారుడిగా ఎదిగారని అనవచ్చా?

– జీన్స్ అంటమే. నిజమే. అదిట్లా వుండి ఈ విత్తనం ఇట్లా తయారైంది. కానీ మా ఇంట్లో కళాకారులు లేరు. ఎవరన్న ఉంటే నాకు ప్రేరణ వచ్చిందనుకోవచ్చు. కానీ, లేదు. నాయన మాలీ పటేల్‌గా వుండె. ఇప్పుడు విలేజ్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ అంటున్నారు. ఆయన పొట్టిగా నా లెక్క… గల్ల రుమాలు, కమీజ్, హాఫారం, దోతి, చెప్పులు వేసుకునేవాడు. కాని ఆయన అభిరుచి, క్రమశిక్షణ నాకొచ్చింది. దాంతో నాదైన కృషితో ఆర్టిస్టు నయ్యాను.

laxma goud f

*మీది సాహసోపేతమైన వస్తువు, శైలి. ‘ఎవడైతే నిర్భయంగా నిత్యజీవితంలో ఉన్న భాషను, ఆకృతులను ఉపయోగించి సత్యాన్ని కథగా అల్లుతాడో, వాడి ఆయుధం ఏదైతే ఉన్నదో అది వాడిష్టం. ఆ మేరకు నేను సెక్స్‌ని ఆయుధం చేసుకున్నాను’ అని గతలో మీరు స్పష్టంగా చెప్పారు. లైంగికతను నిర్భీతితో ఆవిష్కరించారు. కానీ, ఈ యాభై ఏళ్ల ప్రస్థానంలో ఎన్ని విమర్శలు? వాటన్నటినీ దాటి సగర్వంగా పద్మశ్రీ అందుకుంటున్నారు. ఈ సందర్భంగా మీరు పట్టించుకున్నదేమిటి? పట్టించుకోనిదీ ఏమిటి?

– సమాజంలో ప్రతి ఒక్కరూ ఉంటరు. కళను అందరూ అప్రిషియేట్ చేస్తరా? చేయరు. నా కంటెంట్ మ్యాటర్ చూసి నన్ను రిజెక్ట్ చేసిన మ్యాటర్ మాట్లాడుతున్నవు నువ్వు. కానీ, అది ముఖ్యం కాదు. సమాజంలో అంతరాలున్నయి. పైది -మధ్యది- కిందది. ఇప్పటిదాకా ఈ మూడింట్లో పైనున్న సమాజమే కీలకం అయింది. వాళ్లకు అర్థమైనా కాకపోయినా వాళ్లు నిన్ను గుర్తిస్తెనే లెక్క అన్నట్లుగా మారింది. కానీ, కాదు. వాళ్లు తమ సోషల్ ప్రిస్టేజ్ కోసం మనల్ని రికగ్నైజ్ చేస్తరు గని కళ కోసం కాదు. సమాజం అంటూ ఏమీ లేదు. అందులో కొద్దిమంది మాత్రమే ఉంటారు. ఆ కొద్దిమంది కోసం నేను కళాకారుడని కావాలని ఆలోచిస్తే నేను కళాకారుడిని కాను, వెధవను అవుతాను. అంతేకాదు, ఆ కొద్దిమందిని నేను తలవొంచేలా చేస్తాను అనే విధానం కూడా కరక్టు కాదు. వాళ్ల కొరకు నేను చేయడం లేదు. వాళ్లు గుర్తిస్తే ఏంది? గుర్తించకపోతే ఏంది? ఈ సంగతి అర్థం చేసుకుని పెరగడం లేదంటే తనంతట తాను పెరుక్కుంటూ అర్థం చేసుకోవడం…ఇది ముఖ్యం అంటాను నేను. అప్పుడు నువ్వు ఎటువంటి ఆర్ట్ చేసినా, ఏ సమాజం కోసం చేసినా దేనికీ భయపడనక్కర్లేదు. అట్లా నేను నిర్భయంగా నా స్వీయ కళా దృక్పథాన్నే నమ్మాను. దాన్నే సాధన చేశాను. దైవం నాకు అది ఇచ్చింది. ఇచ్చిందాని మీద మనకు నమ్మకం లేకపోతే ఎట్లా? నువ్వు బుద్దితక్కువోడవు అయితవు. నీ దగ్గర ఉన్నదే నువ్వు వాడుకోకపోతే దానికి మందేం చేస్తరు? మంది కాదు కదా కారణం. సో, అందుకే నన్ను నేను నమ్మాను. దిసీజ్ వాట్ వెరీ ఇంపార్టెంట్ అంటాను నేను. ఆర్ట్ ఈజ్ నాట్ కేటర్డ్ టు వన్ మిలియన్ పీపుల్ ఇన్ ది వరల్డ్. యు డు ఆర్ట్ ఇన్ యువర్ స్టుడియో ఫర్ యువర్ సెల్స్. నాకు దానిమీద నమ్మకం ఉంది. పిల్లలకు కూడా అదే చెబుత.

laxama goud d

*ఇట్ల చూస్తే మీ పట్ల మీకు నమ్మకం వచ్చింది కె.జి.సుబ్రమణ్యన్ గారి దగ్గరకు వెళ్లాక అనుకోవచ్చా?

– అవును. అయితే ఆ సందిగ్దత ఉంటది. ఇప్పటికి గూడా ఉన్నది. గొప్పొళ్లు చెప్పేదేమిటంటే, రాత్రి గడిచాక పొద్దున ఉంటది. ఒక పెయింటింగ్ అయిపోయిందీ అంటే ఇంకొక పెయింటింగ్ మొదలైతదని అర్థం. దేరీజ్ నో ఎండ్ టు ఎండ్, యు నో. ఎండ్ ఈజ్ ది బిగినింగ్ ఆఫ్ ఎవ్రీ గుడ్ థింగ్. ఆర్ట్ కూడా అంతే. డోంట్ సపరేట్. ఆర్ట్‌ను, జీవితాన్ని వేరే చేసే చూస్తే యు స్టార్ట్ వండరింగ్ ఔర్ భయం కూడా అవుతది. కాదా? అదెట్లనో ఇది గూడా అట్లే. అందుకే సపరేట్ చేయకు. నమ్మకంతో పనిచేయి. పని తప్ప ఇంకేమీ లేదు. నీ గురించి నువ్వే ఎప్పటికీ అలర్ట్‌గా ఉండు. దటీజ్ వాట్ ఇన్ నేచర్ ఇఫ్ యూ అబ్జర్వ్. మనమీద ఉన్నదుమ్ము దులుపుకోవాలె. లిటరల్‌గా దుమ్ము కాదు. ఎన్నోన్నో ఉన్నయి. అట్లా ఆలోచిస్తే ఎవ్విరీథింగ్ ఈజ్ బ్యూటిఫుల్.

*ఈ సందర్బంలో తెలంగాణ గురించి ఏమంటరు?

– మొట్టమొదట అయితే తెలంగాణ అంటే నాకు కూడా అభిమానమే. నా లోపల బయటోళ్లకంటే గూడా పెద్ద అభిమానం ఉంది. ప్రాంతీయత అన్నది ఒక వ్యక్తిత్వమే. కళలో ఒక వ్యక్తిత్వం ఎట్లయితే వుండాలని ఇంతదాకా మాట్లాడుకున్నమో అట్ల. తెలంగాణం అన్నది నా వేషభాష, నా దినాం జీవితం. నిన్ననే ఎవరో చెబ్తుండె. నేను జొన్న రొట్టె తింట. ఎవరో దాన్ని పశువులకేసే గడ్డి అని అన్నరు. ఐ ఫీల్ వెరీ బ్యాడ్ ఎబౌట్ ఇట్. దట్ దె డోంట్ నో. నేను ఆవకాయ అన. మామిడికాయ తొక్కు అంట. నేను సాంబారు అన. నేను పప్పుచారు అంట. అది నా రీతి. కాబట్టి దాన్ని నేను ఎటువంటి పరిస్థితుల్లో కూడా కోల్పోదల్చుకోలేదు. ఒక వేళ ప్రాంతీయత అని మాట్లాడితే బహుశ ఇదే ప్రాంతీయత. అయితే, ఒకరకమైన కల్చరల్, ఎమోషనల్ డిఫరెన్సెన్ ఉన్నయి. అందుకని మనం వేరుపడ్డాం. ఈ రకంగా ఉన్నం. సో, లెటజ్ యాక్సెప్ట్ దట్ వి ఆర్ నాట్ అగ్రెసివ్ పీపుల్. వి ఆర్ నాట్ బిజినెస్ మైండెడ్. మన భాషలో కూడా నువ్వు-నేను. అంతే. మీరు, తమరు అని మాట్లాడం. అవి మర్యాదకరమైనవే కావచ్చు ఎక్స్రార్డినరీ సోషల్ వే ఆఫ్ కమ్యూనికేషన్ కావచ్చు. కానీ అవి నా నోటి మీద లేనే లేవు. కొత్తగా నువ్వు నేర్చుకోమంటే నేర్చుకోను. నాకు ఆ అవసరం కూడా లేదు.

laxma goud c
*ఇప్పటి వాస్తవిక స్థితిని అంగీకరిస్తారా? తెలంగాణ రావడం వల్ల మన ప్రతిభకు నిదానంగానైనా గుర్తింపు వస్తోందని అంగీకరిస్తారా?

– నిజమే. అది ఎట్లాగూ వస్తది. ఎందుకు రాదు. మొట్టమొదట మనం ఏరకంగా జీవించాలనుకుంటున్నామో అట్ల జీవిస్తే అన్నీ వస్తయి. అయితే తెలంగాణ వచ్చినంత మాత్రన సరిపోదు. తెలంగాణను మనం సస్టేన్ చేయగలగాలి. అంటే పోయినటువంటిది ఏదైతే ఉన్నదో ఆ చెంబును చింతపండు, ఎర్రమన్ను వెట్టి మంచిగ తోమితే చక్ మంటది. ఉండే చెంబు ఆడ అట్లనే ఉన్నది. పాత్ర ఉన్నది. దానిమీద ఒకరకమైన తప్పు పట్టి ఉన్నది. సమయం కారణంగా, వాడని కారణంగా దానికి తుప్పు పట్టింది కావచ్చు. కానీ, అది నాది అన్న దృక్పథం నీలో ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడు దాన్ని తోము. సాఫైతది. కష్టపడు. దేన్నీ అని నువ్వు తెలంగాణ అనుకుంటవో దాని కొరకు కృషి చేయి. ఏం పోగొట్టుకున్నమో, అప్పుడేముండిందో ఆ ఉన్నదాన్ని రియార్గనైజ్ చేయగలిగితే, ఇంటర్ ఫియరెన్స్ లేకుండా, ఇంపొజిషన్స్ లేకుండ, కండీషన్స్ లేకుండ మనం ఇట్ల ఉండాలి అని గనుక చేయగలిగితే తెలంగాణ నిలుస్తది. మనము, నాది, నేను అన్న భావంతో ఇది జరగాలి. ప్రతోడు వ్యక్తిగతంగా బాగుపడితే అప్పుడు సమూహం బాగవుతది. ప్రతి వోడు …ప్రతి మనిషి దగ్గరా ఆ తెలంగాణ భక్తి అనేది రావాలంటాను.

ఇంకో మాట చెబుతాను. మన ఇంటి ముంగర పెండతోని సాన్పు జల్లుతం. అంటే మన దగ్గర ఒక సంస్కారం గాక మనింట్ల పశువున్నది అని అర్థం. పశువున్నది అంటే పాడి ఉన్నది అన్నట్టు. పాడి ఉన్నది అంటే వ్యవసాయ దారున్ని అన్నట్టు, అది ఉన్నది అంటే నేను పంటలు పండిస్త అన్నట్టు, పంటలు పండిస్తే ఆ పంటల్తోని పండిందే నేను తింట అన్నట్టు. అంటే అసలు విషయం- పత్తి పండియ్య అని అర్థం. అవును. పత్తి లేదు నాకు. ఇప్పుడు యాడజూడు పత్తిపంట. పైసల్తోనే కళనా, పైసల్తోనే జీవితమా? సంస్కృతి కాదా? ఇదంతా తెలంగాణ ప్రాంతీయ దృక్పథం అంటను నేను. ఈ మాట ఎన్ని ప్రశ్నలకైనా సమాధానాలు చెబ్తది. ప్రాంతీయత తిరిగి నెలకొనాలంటే ఈ రకమైన దృక్పథం లేకపోతే అది కళ గాదు. ఇంకేమీ కాదు. అది అనవసరమైన ముచ్చట. దాని గురించి మాట్లాడవద్దు. సాలా?

*లేదు. చివరి ప్రశ్న. మీరు స్త్రీ పురుషుల రిలేషన్స్ మీద ప్రధానంగా చిత్రాలు వేస్తరు. ఎందుకు?

– ఆ సంబంధం లేదా? అది లేదా? అది వద్దా? అదెందుకొద్దు? మన ఖజరహోను పడేద్దామా? ఇంకా ఉన్నవాటన్నిటినీ పోగొట్టుకుందామా? అది ప్రతి గుడి ముంగర కూడా వుంటది. ఎందుకంటే అది శుభం. కాదా? నీకవసరం లేదా? లేలే.. నీకవసరం లేదా చెప్పు? అదే కళ అయినప్పుడు ఇంకేముంటది. అది నా ఇష్టం. ఇష్టముంటే చూడు, లేకపోతే లేదు.

laxma goud
*ఇదే…ఈ సాహస ప్రవృత్తికే పద్మశ్రీ రావడం గర్వంగా ఉంది!
– అది వేరే సంగతి. నువ్వు బునియాద్ మాట ఏం మాట్లాడుతున్నవు అంటే నీ లోపల ఈ ఎలిమెంట్ ఉందంటున్నవు. ఎందుకుండకూడదు నాలోపల. నేను ప్రపంచాన్ని చూస్తున్న. ప్రకృతిని చూస్తున్న. ఆడదాన్ని, మొగోడ్ని చూస్తున్న. పశువులను చూస్తున్న. నేను పుట్టిందే అటువంటి వాతావరణంల. నేను తిడ్త… అరె ఏం రా? అంట. అది తిట్టా. నాకు కాదు. నేను మాట్లాడే విధానం ఇది. సో, నేననేది ఏమంటే నువ్వు ఊర్లవోయి ఇనుపో. ఇట్ల లేదా? అని అడుగుత! దటీజ్ ది మోస్ట్ ఆర్గానిక్ వే ఆఫ్ అడ్రసింగ్ పీపుల్. ఆ ఎలిమెంట్ నా దగ్గర ఎందుకున్నదీ అంటే నాదగ్గర ఉన్నదే అది. నేను పుట్టిందే అటువంటి గడ్డనాయె. నా గుణమే అటువంటిదాయె. అందుకే నా చిత్రకళలో రిలేషన్స్ వ్యక్తమైతయంటను. అది నా వ్యక్తిత్వం. బలం

కామకోరికలతో వుండే మానవుడిని నేను చిత్రిస్తాను. వాడు ఒక్కోసారి తపస్సు చేసి సమాజానికి పనికొచ్చే కోరికలు కూడా కోరుతడు. ఒక్కోసారి తనకు పనికొచ్చే కోరికలు కోరుతడు. ఈ రెండు గూడ దేవుడిచ్చిండు. వాడి ప్రవృత్తిని చిత్రిస్తను. వాడికెన్ని కోరికలు. ఆ కోరికలకు, ఆలోచనలకు వేయి పడగలున్నాయి. నీలో నాలో అవి లేవా. వాటినే చిత్రిస్తున్నను. అది సాహసం కాదు, సహజం.

ఇంటర్వ్యూః కందుకూరి రమేష్ బాబు

వ్యాఖ్యలు»

No comments yet — be the first.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / మార్చు )

Connecting to %s

%d bloggers like this: