jump to navigation

యాగాల తెలంగాణనా? పోరాటాల, త్యాగాల తెలంగాణనా? – ఎన్.వేణు గోపాల్ జనవరి 16, 2016

Posted by M Bharath Bhushan in 29th State, agitation, Culture, Essays, Identity, KCR, Personalities, politics, struggle, Telangana, Telugu (తెలుగు), TRS.
trackback

యాగాల తెలంగాణనా? పోరాటాల, త్యాగాల తెలంగాణనా? – ఎన్.వేణు గోపాల్
నడుస్తున్న తెలంగాణ మాసపత్రిక, జనవరి 2016 సంచిక

తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు అయుత మహా చండీ యాగం జరపడం, ఆ యాగం ప్రభుత్వ కార్యక్రమం లాగ, తెలంగాణ కార్యక్రమం లాగ జరగడం చాల ప్రశ్నలకు చర్చకు ఆస్కారం ఇస్తుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే అయుత మహా చండీ యాగం చేస్తానని తాను మొక్కుకున్నానని, ఇప్పుడు రాష్ట్రం ఏర్పడింది గనుక ఆ యాగం చేస్తున్నానని ఒకసారి, విశ్వశాంతి, లోక కళ్యాణం, తెలంగాణ సౌభాగ్యం, ప్రజాశ్రేయస్సు కొరకు ఈ యాగం చేస్తున్నానని ఒకసారి ఆయన ప్రకటించారు. కాని ఈ రెండు వివరణలు కూడ చర్చకు నిలిచేవి కావు.
తెలంగాణ రాష్ట్రం అశేష ప్రజానీకం సాగించిన పోరాటాల వల్ల, త్యాగాల వల్ల, రాజకీయ ఎత్తుగడల వల్ల వచ్చిందా లేక ఒకానొక వ్యక్తి మొక్కు వల్ల వచ్చిందా అనే సందేహానికి మొదటి వివరణ దారితీస్తుంది. స్వయంగా తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి నాయకత్వం వహించానని చెప్పుకుంటున్న పార్టీ అధ్యక్షుడే తన మొక్కు వల్లనే తెలంగాణ సాధించిందని అనడం తన పద్నాలుగు సంవత్సరాల కృషిని తానే అపహాస్యం చేసుకున్నట్టవుతుంది. ఉద్యమక్రమంలో తెలంగాణ సమాజం యావత్తూ పాల్గొన్న అనుభవం ఉంది. చేపట్టిన ఎన్నో పోరాట రూపాలున్నాయి. చేసిన ఎన్నో కార్యక్రమాలున్నాయి. చివరికి తెలంగాణ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందిన తర్వాత చంద్రశేఖర రావే సకుటుంబ సమేతంగా వెళ్లి తెలంగాణ ఇచ్చినందుకు మరొక మాతకు కృతజ్ఞతలు చెప్పివచ్చారు. ఇప్పుడు ఆ కారణాలూ పరిణామాలూ అన్నీ పక్కకు పోయి, కేవలం చండీమాత మొక్కు వల్లనే తెలంగాణ వచ్చిందనడం ఆయనకు స్వవచోవ్యాఘాతమని అనిపించకపోవచ్చు గాని తెలంగాణ సమాజానికీ ఉద్యమకారులకూ అవమానం.తెలంగాణ కోసం ప్రాణాలు బలిపెట్టిన వందలాది మంది విద్యార్థి యువజనులకు అవమానం.

ఇక చండీ యాగం గురించి ఏ సాంప్రదాయక వివరణలో కూడ దాని లక్ష్యాలలో విశ్వశాంతి, లోక కళ్యాణం, లోక సౌభాగ్యం, ప్రజాశ్రేయస్సు అనే మాటలు లేవు. అతి తక్కువగా ఉన్నచోట్ల కూడ చాల అస్పష్టంగా ఉన్నాయి. సాంప్రదాయిక వివరణల ప్రకారం మార్కండేయ రుషి రాసిన మార్కండేయ పురాణం (రచనా కాలం క్రీ.శ. 400-500) లో దేవీ మాహాత్మ్యం లేదా దుర్గా సప్తశతి అనే ఏడువందల శ్లోకాల పదమూడు అధ్యాయాల భాగం ఉంది. ఈ దుర్గా సప్తశతిని పారాయణం చేస్తూ చేసే యాగాన్ని చండీయాగం అంటారు. ఒకసారి చదివితే చండీ యాగం అని, పది సార్లు చదివితే నవచండీ యాగం అని, వందసార్లు చదివితే శతచండీ యాగం అని, వెయ్యి సార్లు చదివితే సహస్ర చండీయాగం అని అంటారు. దక్షిణ భారతదేశం మొత్తానికీ మొదటిసారి అయుత (పదివేల సార్లు) చండీయాగాన్ని 2011లో తాము చేశామని శృంగేరి శారదా పీఠం చెప్పుకుంటున్నది. చండీయాగం ప్రధానంగా వ్యక్తులు మాత్రమే చేస్తారు. చేసే వ్యక్తి విజయ మార్గంలో ఉన్న ఆటంకాలను తొలగించడానికి మాత్రమే ఆ యాగం చేస్తారు. ఈ యాగంతో చెడుదృష్టి నుంచి తప్పించుకోవడం, రోగాలనుంచి విముక్తుడు కావడం, కష్టాలనుంచి గట్టెక్కడం, అనుకున్న కోరిక నెరవేర్చుకోవడం జరుగుతాయనే మాటలను బట్టి చూస్తే, ఇది బాణామతి, చేతబడి వంటి క్షుద్ర, తాంత్రిక ప్రక్రియలతో సమానమైనది. కాకపోతే ఇందులో రుత్విక్కులు అని పిలవబడే బ్రాహ్మణుల ఆర్భాటాలు, ఎక్కడా ప్రజలకు అర్థం కాకుండా జాగ్రత్తపడే సంస్కృత వ్యవహారం, వేల కిలోల నెయ్యి, విలువైన కర్రలు, భారీ భోజనాలు, సంభావనలు వంటి దుబారావ్యయం ఉంటాయి. ఆశ్చర్యకరమైన విషయమేమంటే, బాణామతి, చేతబడి అనే మాటలు వినబడగానే ముఖం చిట్లించే మధ్యతరగతి విద్యావంతులు వాటికి సంస్కృత రూపమైన ఈ మహా చేతబడిని మాత్రం సగౌరవంగా చూస్తున్నారు, పాల్గొంటున్నారు, అసహ్యకరంగా ప్రవర్తిస్తున్నారు.
ఈ యాగం చంద్రశేఖరరావు వ్యక్తిగా, తన సొంతఖర్చుతో, సొంత స్థలంలో చేశారనీ, వ్యక్తిగా ఆయనకు ఆ హక్కు లేదా అనీ కూడ బుద్ధిమంతులు ఆగ్రహంగా ప్రశ్నిస్తున్నారు.

ముఖ్యమంత్రిగా ఉండే వ్యక్తికి బాణామతి, చేతబడి వంటి వాటిమీద నమ్మకం ఉండవచ్చు. కాని ముఖ్యమంత్రిత్వం అనేది రాజ్యాంగ బద్ధమైన పదవి. ఆ రాజ్యాంగం రాజ్య వ్యవహారాలలో మత జోక్యం ఉండగూడని లౌకికవాదాన్ని తన ప్రవేశికలో రాసుకుంది. దేశప్రజలందరికీ శాస్త్రీయ స్పృహను కలిగించడం, మూఢనమ్మకాల నుంచి విముక్తి చేయడం ప్రభుత్వ బాధ్యత అని రాసుకుంది. శాస్త్రీయ స్పృహను ప్రచారం చేయడం, పాటించడం ప్రతి ఒక్క పౌరుడి బాధ్యత అని రాసుకుంది. ఆ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి రాజ్యాంగ పదవిని చేపట్టిన వ్యక్తి ఆ రాజ్యాంగ స్ఫూర్తిని పాటించవలసి ఉంటుంది. ఆ మేరకు తన వ్యక్తిగత ఇష్టాయిష్టాలను కూడ పక్కన పెట్టవలసి ఉంటుంది.
కవిగా కూడ సుప్రసిద్ధుడైన మొఘల్ చక్రవర్తి బహదూర్ షా జఫర్ గురించి ఒక కథ చెపుతారు. ఆయన దగ్గర రెండు కొవ్వొత్తులుండేవట. ప్రభుత్వ పత్రాల మీద పనిచేసేటప్పుడు ఒక కొవ్వొత్తి వెలిగించి పనిచేసేవాడట. తన కవిత్వం రాసుకునేటప్పుడు మరొక కొవ్వొత్తి వెలిగించి పనిచేసుకునేవాడట. ప్రభుత్వానికీ, వ్యక్తిగతానికీ తేడా చూసిన ఆ మధ్యయుగ రాజు సంస్కారం కూడ లేకుండా పోతున్న సందర్భంలో ఉన్నాం మనం!

ఇంతకూ ఈ యాగం కేవలం వ్యక్తిగత స్థాయిలో జరిగిందనడం పచ్చి అబద్ధం. యాగం గురించిన ప్రచారాన్ని ప్రభుత్వ యంత్రాంగం చేసింది. యాగానికి అవసరమైన వసతులను ప్రభుత్వ యంత్రాంగం కల్పించింది. యాగం జరిగినన్ని రోజులూ ప్రభుత్వ యంత్రాంగమంతా అక్కడే ఉంది. చివరికి కేంద్ర మంత్రులు, రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు, మంత్రులు, శాసనసభ్యులు, న్యాయమూర్తులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ తో సహా ఉన్నతాధికారులు అందరూ ఆ యాగంలో పాల్గొన్నారు. లోకకళ్యాణం చేసే మాత తన యాగశాలలో అగ్నిప్రమాదాన్ని నివారించలేకపోవడం వల్ల రాష్ట్రపతి హెలికాప్టర్ దిగడానికి అవకాశం లేక ఆయన హాజరు కాలేకపోయారు గాని, కూతవేటు దూరంలో వేచి చూశారు. ఈ తమాషా అంతా జరిగిన తర్వాత, యాగం వ్యక్తిగతమనీ, ప్రభుత్వానికి సంబంధం లేదనీ అని సమర్థించడానికి ప్రయత్నిస్తున్నారంటే మేతావుల దుస్సాహసం ఎంతటిది!

ఉన్నతాధికారులు పాల్గొనడం మాత్రమే కాదు, ప్రభుత్వ యంత్రాంగం అతి భయంకరంగా దుర్వినియోగం అయిన సందర్భం కూడ ఇదే. అది వ్యక్తిగతమైన కార్యక్రమం మాత్రమే అయితే ఐదువేల మంది సాయుధ పోలీసు బలగాలను మోహరించడం ఎందుకు అవసరమైంది? ప్రభుత్వమే హడావుడిగా నాలుగు వైపుల నుంచీ రోడ్లు ఎందుకు వేసింది? హైదరాబాద్ నుంచి గజ్వేల్ దాకా ప్రభుత్వ శాఖలు ఆహ్వాన ద్వారాలు, బానర్లు ఎందుకు కట్టాయి? ముఖ్యమంత్రి కార్యాలయం ఇక రాష్ట్రంలో మరే ఘటనా లేనట్టు ఆ వారం రోజులూ యాగ వార్తలు, ఫొటోలు మాత్రమే ఎందుకు పంపించింది? ఒక్కమాటలో చెప్పాలంటే, ఆ వారం రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఏకైక పని యాగ నిర్వహణ, యాగ ప్రచారం మాత్రమే. ఒకవైపు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటూ పిట్టల్లా రాలిపోతుంటే, వారి కుటుంబాలను పరామర్శించడానికి, సహాయం అందించడానికి ప్రభుత్వ యంత్రాంగం ఈ ఉత్సాహంలో వెయ్యోవంతు కూడ చూపలేదు.
సమాజానికి మంచీ చెడూ చెప్పవలసిన మేధావులు, బుద్ధిజీవులు, ప్రచారసాధనాలు ఈ భారీ బాణామతి కార్యక్రమంలో తలమునకలై, పరవశులై, అసహ్యకరమైన వస్త్రధారణతో ప్రత్యక్ష ప్రసారాలతో, తన్మయమైన రాతలతో అత్యంత జుగుప్సాకరమైన ప్రవర్తన కనబరిచారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షలను, ఉద్యమాన్ని అడుగడుగునా వ్యతిరేకించిన, దుష్ప్రచారం చేసిన మీడియా అధినేతలు, తెలంగాణ శత్రువులుగా ప్రపంచానికంతా సుప్రసిద్ధులైన నాయకులూ, ప్రచార సాధనాల అధిపతులూ ఈ మహా చేతబడి ప్రదర్శనలో చంద్రశేఖరరావుతో సరస సంభాషణల్లో పాలుపంచుకున్నారు.

యాగం చివరిరోజున అగ్నిప్రమాదం జరగడం, లోకానికి మేలు చేసే మంత్రాలు చదివిన ఘనాపాటీలు అగ్నిదేవుడి ప్రతాపానికి చెల్లాచెదురుగా పరుగులు తీయడం, అగ్నిమాపక సిబ్బంది మంటలు చల్లార్చిన తర్వాత గంటకు తిరిగివచ్చి, చండీమాత అగ్నిదేవుడిని శుభసూచకంగానే పంపించిందని గంభీర వచనాలు పలకడం ఎంత హాస్యాస్పదంగా, అసహ్యకరంగా ఉన్నాయో యాగ సమర్థకులకు కనబడడం లేదు. శుభసూచకమైన అగ్ని నుంచి రుత్విక్కులూ, నాయకులూ ఎందుకు పారిపోయారు? ఈ యాగంతో ప్రజాశ్రేయస్సు ప్రసాదించే చండీమాత తన యాగశాలలో నిప్పును ఆర్పుకోలేకపోయిందా? లోకాన్నంతా రక్షించే ఈ జగన్మాతకు అంతకు ముందు ఐదువేల మంది సాయుధ పోలీసుల రక్షణ ఎందుకు అవసరమైంది? కనీసమైన ఇంగిత జ్ఞానం, ఆలోచించే మెదడు ఉంటే రావలసిన ప్రశ్నలివి. కాని రాజుగారి దేవతావస్త్రాల కథలో చెప్పినట్టు, అటు ప్రభుత్వ యంత్రాంగపు పెద్దలూ, ఇటు మేధావుల రూపంలో ఉన్న రాజుగారి భక్తులూ ఈ ప్రశ్నలను తమ దరి చేరనివ్వడం లేదు.

రాజుకూ, రాజకుటుంబానికీ, ఆశ్రితులైన పెద్దలకూ, మేతావులకూ ఈ ప్రశ్నలు రానివ్వకపోతేనే ప్రయోజనాలు ఉండవచ్చు. కాని, చైతన్యానికీ, ప్రశ్నకూ, ధిక్కారానికీ, పోరాటానికీ మారుపేరుగా చెప్పుకుంటున్న తెలంగాణ సమాజం కూడ ఈ అసహ్యకరమైన మహా చేతబడి క్రతువును మౌనంగా, నిర్లిప్తంగా సహించి చూస్తూ ఉండిపోవడం విచారకరం. కనీసమైన వ్యతిరేకత, ప్రతిస్పందన అయినా ఎందుకు రాలేదని తెలంగాణ సమాజంలోని హేతువాదులు, బుద్ధిజీవులు, ప్రగతిశీల ఉద్యమాలు ఆలోచించుకోవలసిన సందర్భం ఇది. కారణాలు సంక్లిష్టమైనవి కావచ్చు. ఎన్నో ఉండవచ్చు. కాని ఆ కారణాలను అన్వేషించి, తెలంగాణ సమాజంలో ప్రగతిశీల ఉద్యమాలు చేయవలసిన పని ఎంత విస్తృతమైనదో గుర్తించవలసి ఉంది.

ఈ యాగానికి అసలు కారణం తెలంగాణ సమాజాన్ని మత్తులో ముంచాలనే కోరిక. ఇంతకాలం తెలంగాణ ప్రజల సమస్యలన్నిటికీ ఆంధ్ర వలస పాలకులే కారణమని చెప్పి, ఆ పాలకులను తొలగించిన తర్వాత పద్దెనిమిది నెలలు గడిచినా పాత విధానాలే కొనసాగుతున్నప్పుడు, ప్రజాసమస్యలు పరిష్కారం కానప్పుడు ప్రజా ఆగ్రహం ఈ ప్రభుత్వం మీదికి కూడ మళ్లే అవకాశం ఉంది. ప్రజలు తమ సమస్యల మూలకారణాలను అన్వేషించే ప్రయత్నం లోకి దిగే అవకాశం ఉంది. గద్దె మీద కూచున్న వాళ్ల గురించి మాత్రమే కాక, వాళ్ల విధానాల గురించి ఆలోచించే అవకాశం ఉంది. అందువల్ల, వాళ్లకు ఆ ప్రశ్నలు, ఆ ఆగ్రహం రాకుండా చేయడానికి వారిని జోకొట్టాలి. నిద్ర మత్తులో ముంచాలి. రుజువులు లేని లోకాతీత శక్తుల మీద నమ్మకం కలిగించాలి. తమ పోరాటం వల్ల, తమ బిడ్డల త్యాగం వల్ల తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సిద్ధించిందని వారిలో బలంగా ఉన్న నమ్మకాన్ని చెదరగొట్టి, తెలంగాణ రూపొందడానికి చండీమాత దయే కారణమనే అబద్ధాన్ని వాళ్ల మనసుల్లో నింపాలి. అంటే తక్షణం ప్రశ్నించవలసినవారూ, ప్రత్యర్థులూ ఎవరూ లేరనీ, ఇదంతా మనకు తెలియని మాయాలోకపు వ్యవహారమనీ ప్రజలను నమ్మించాలి. అప్పుడే నిన్నటివరకూ గంభీరంగా ప్రవచించిన ఆదర్శాలకు తూట్లు పొడిచినా, నిన్నటిదాకా దోపిడీ పీడనలు సాగించినవాళ్లతో భుజాలు రాసుకుని తిరిగినా, నిన్నటిదాకా ప్రజలందరూ వ్యతిరేకించిన విధానాలనే నిస్సిగ్గుగా అమలు చేసినా సరిపోతుంది. ఈ క్రమంలో రాజ్యాంగ ఆదర్శాలు భగ్నమైనా ఫరవాలేదు.

అలా పాలకుల ఉద్దేశాలూ ప్రయోజనాలూ స్పష్టమైనవే. మరి ప్రజల వైపు నుంచి ఆలోచించేవాళ్లు మరెంత స్పష్టంగా ఉండాలి?!

– ఎన్ వేణుగోపాల్

ప్రకటనలు

వ్యాఖ్యలు»

No comments yet — be the first.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: