jump to navigation

Stop Land Sales in Hyderabad- ఎవరివీ హైదరాబాద్‌ భూములు? ఎన్‌ వేణుగోపాల్‌ నవంబర్ 28, 2015

Posted by M Bharath Bhushan in Economy, Hyderabad, KCR, KTR, Nizam, Settler, TDP, Telangana, Telugu (తెలుగు), TRS, YSR.
trackback

ఎవరివీ హైదరాబాద్‌ భూములు?
ఎన్‌ వేణుగోపాల్‌
నవ తెలంగాణ 11 నవంబర్ 2015

“ఒరులేయవి యొనరించిన నర వర యప్రియము తన మనంబునకగు దానవి యొరులకు సేయకునికి పరాయణము పరమ ధర్మ పథములకెల్లన్‌” అని పాటించవలసిన రాజధర్మం ఏమిటో మహాభారతంలో తిక్కన విదురుడి నోట చెప్పించాడు. అది రాజధర్మం మాత్రమే కాదు. మనుషులందరూ పాటించవలసిన సహజ నైతిక సూత్రం. ఇతరులు ఏ పని చేస్తే మనకు అసంతృప్తి కలిగిందో, ఇతరులు ఏ పని చేయడాన్ని మనం అభ్యంతర పెట్టామో అదే పని మనంతట మనం చేయకపోవడమే అన్ని ధర్మాల్లోకీ అనుసరించవలసిన ధర్మం అనేదే ఆ నీతి.

ఘనత వహించిన తెలంగాణ ప్రభుత్వం తాజాగా తీసుకున్న ఒక ఆర్థిక నిర్ణయం ఈ గత కాలపు వివేకాన్ని గుర్తుకు తెస్తున్నది. అప్పుడు ప్రతిపక్షంగా, ఉద్యమపక్షంగా ఉండిన ఇవాళ్టి అధికారపక్షం సమీప గతంలో తీసుకున్న రాజకీయ వైఖరినీ ఇవాళ ప్రకటిస్తున్న విధానాలనూ పోల్చి చూసినప్పుడు ఈ వివేకం గుర్తుకు వస్తున్నది. తిక్కన అక్షరీకరించిన మానవ ధర్మం, రాజధర్మం ఇవాళ్టికి కూడ ఎంత ప్రాసంగికంగా ఉన్నదో తెలుస్తున్నది.

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ భూమిని వేలం వేయడానికి నిర్ణయించిందని, అందుకోసం 12,500 ఎకరాల భూమిని గుర్తించిందని, ఆ వేలంద్వారా రు. 13,500 కోట్ల సంపాదించాలని ఆలోచిస్తున్నదని వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలు పూర్తిగా ఊహాగానాలు కాకపోవచ్చు. అంకెలలో ఏమైనా చిన్న తేడాలు ఉండవచ్చు గాని ఉద్దేశాలూ నిర్ణయాలూ నిజాలే కావచ్చు. భూముల అమ్మకాన్ని నిధుల సేకరణకు ఒక మార్గంగా చూస్తామని ప్రభుత్వాధినేతలు చాలసార్లే ప్రకటించారు. కాని ఇవాళ అధికారంలో ఉన్నవారు రెండు సంవత్సరాల కింది వరకూ ఇటువంటి నిర్ణయాలను వ్యతిరేకిస్తూ మాట్లాడారని, నిరసన ప్రదర్శనలు కూడ జరిపారని గుర్తు తెచ్చుకోవలసి ఉంది.

ఈ భూముల అమ్మకాలనూ నిరసనలనూ అర్థం చేసుకోవాలంటే హైదరాబాద్‌ రాజ్య చరిత్రకు సంబంధించిన రాజకీయార్థిక విషయాలు కొన్ని తెలుసుకోవాలి. అసఫ్‌ జాహి పాలనాకాలంలో హైదరాబాద్‌ రాజ్యంలోని మొత్తం ఐదుకోట్ల ఎకరాల భూమిలో కనీసం రెండున్నరకోట్ల ఎకరాల భూమి భూస్వాముల సొంత ఆస్తిగా ఉండేది. ఈ భూస్వాములలో అతి పెద్ద భూస్వామి స్వయంగా రాజు. రాజ్యంలో పదో వంతు భూమి, యాభై లక్షల ఎకరాలు రాజుగారి ఇంటిఖర్చులకు (సర్ఫ్‌ ఎ ఖాస్‌) కేటాయించుకున్నారు. ఈ సర్ఫ్‌ ఎ ఖాస్‌ రాజ్యం మొత్తంలో ఇటు తెలంగాణలో మాత్రమే కాక, అటు మరాఠ్వాడాలో, కన్నడ జిల్లాల్లో కూడ ఉండేది. అది రాజ్యం మొత్తంలో 1900 గ్రామాలకు విస్తరించి ఉండేది. అందులో తెలంగాణ గ్రామాలు 900 ఉండేవి. అందులో 600 పైగా గ్రామాలు అత్రాఫ్‌ బల్దా జిల్లాలో, అంటే ప్రస్తుత హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లోవి. ఇక ఈ సర్ఫ్‌ ఎ ఖాస్‌ కాక, మొత్తంలో మూడో వంతు భూమి పాయెగాలు, ఉమ్రాలు, జాగీర్లు, సంస్థానాలు, మక్తాలు, ఇజారాలు, దేశముఖ్‌లు, దేశ పాండేలు వంటి నిచ్చెనమెట్ల పెత్తందారీ భూస్వామ్య వ్యవస్థలో ఉండేది.

సైనిక చర్య ద్వారా 1948 సెప్టెంబర్‌ 17న హైదరాబాద్‌ రాజ్యం భారత యూనియన్‌లో విలీనం అయిన తర్వాత, నాలుగు నెలల్లోనే సైనిక ప్రభుత్వం 1949 ఫిబ్రవరిలో సర్ఫ్‌ ఎ ఖాస్‌ రద్దు చట్టాన్ని ప్రకటించింది. మరొక ఐదు నెలలకు 1949 ఆగస్ట్‌లో జాగీర్ల, ఇనాంల రద్దు చట్టం ప్రకటించింది. ఈ రెండు చట్టాల ద్వారా హైదరాబాద్‌ రాజ్యంలోని విస్తారమైన భూమి భూస్వామ్య బంధనాల నుంచి విముక్తి అయిందనాలి. కాని ఈ విముక్తి నిజమైన విముక్తి కాలేదు. ఆ భూమిలో అత్యధిక భాగం పెనం మీది నుంచి పొయ్యిలో పడ్డట్టయింది. ఆ తర్వాత 1952లో హైదరాబాద్‌ ప్రభుత్వం చేసిన కౌల్దారీ రక్షణ చట్టం వల్ల కౌలు రైతులకు కొంత భూమి దక్కింది గాని కౌలుదార్లు లేని భూమి, పడావు భూమి, అటవీ భూమి అంతా కూడ అక్రమాలకు నిలయమై పోయింది. అదే సమయంలో ఉన్నత, ప్రభువంశీక భూస్వాములు కొందరు పోలీసుచర్య తర్వాత పాకిస్తాన్‌కో, ఇతర దేశాలకో తరలిపోవడంతో వారు చరాస్తులు తీసుకు పోయినప్పటికీ, స్థిరాస్తులు – భూమి, భవనాలు – లావారిస్‌ ఆస్తులుగా ప్రభుత్వాధీనంలోకి వచ్చాయి.

ఈ పరిణామాల వల్ల హైదరాబాద్‌ ప్రభుత్వం హఠాత్తుగా లక్షల ఎకరాల భూస్వామి అయింది. ఈ భూమి అన్యాక్రాంతం కావడం, ఇతర ప్రాంతాల కబ్జాదార్ల చేతికి చిక్కడం సైనిక పాలన రోజుల్లో, వెల్లోడి పాలన రోజుల్లోనే మొదలయింది. తెలంగాణ – ఆంధ్ర విలీనానికి, ఆంధ్రప్రదేశ్‌ ఏర్పాటుకు పునాది అయిన పెద్దమనుషుల ఒప్పందంలో ‘తెలంగాణలో భూముల క్రయవిక్రయాలు తెలంగాణ ప్రాంతీయ మండలి ఆమోదం మేరకే జరగాలి’ అనే నిబంధన ఈ భూములను పరిరక్షించడానికే చేరింది. కాని ఆ పెద్దమనుషుల ఒప్పందం ఉల్లంఘనకు గురయింది. తెలంగాణ ప్రాంతీయ మండలి చివరికి రద్దు అయిపోయింది. తెలంగాణ భూముల పరిరక్షణ ఎవరికీ గుర్తులేని విషయమైపోయింది. కాని 1956 నాటికి బహుశా దేశం మొత్తం మీదనే అతి ఎక్కువ భూమికి యజమానిగా ఉన్న ఏకైక రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వమే. రాజరికాల నుంచి, స్వదేశీ సంస్థానాల నుంచి ఏర్పడిన నగరాలెన్నో ఉన్నాయి గాని ఎక్కడా కూడ పాత రాజులకు, భూస్వాములకు ఇంత భూమి లేదు. మొత్తం తెలంగాణ అలా ఉంచి, అత్రాఫ్‌ బల్దా గ్రామాలన్నిటినీ తనలో కలుపుకుని ఏర్పడిన హైదరాబాద్‌కు మాత్రమే ఆ విశిష్టత దక్కింది. నివాస స్థలాలకు, సొంత రైతులకు, కౌల్దార్లకు, తొలి ఆక్రమణలకు పోయినది పోగా, హైదరాబాద్‌లో లక్షలాది ఎకరాలతో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అతి పెద్ద భూస్వామిగా మిగిలింది. ఇంత విశాల భూక్షేత్రాలు అతి సులభంగా అందుబాటులో ఉండడం వల్లనే అనేక కేంద్ర ప్రభుత్వ రంగ పరిశ్రమలూ, సైనిక, రక్షణ, సాంకేతిక విజ్ఞాన, విద్యా సంస్థలూ హైదరాబాదుకు తరలివచ్చాయి.

ఈ విస్తారమైన భూమి మీద కన్నువేసిన ఆంధ్రప్రదేశ్‌ పాలకవర్గాలు తెలంగాణలోనూ హైదరాబాదులోనూ ప్రభుత్వ భూములను ప్రోత్సాహకాల పేరుతో, కానుకల పేరుతో ఆశ్రితులకు ఉచితంగా ఇవ్వడం, కారుచౌకగా 25 సంవత్సరాల, 49 సంవత్సరాల, 99 సంవత్సరాల సుదీర్గకాలపు లీజుకు ఇవ్వడం, విసిరి పారేసే చిల్లర పైసలకు (థ్రోఅవే ప్రైసెస్‌ అనేది వాళ్ల మాటే!) అడ్డికి పావుసేరుగా అమ్మడం, వేలం వేయడం, జాతీయ, అంతర్జాతీయ పరిశ్రమలను ఆహ్వానించడానికి భూమి ఇవ్వడం వంటి అనేక రూపాలలో ఈ భూమిని పరాధీనం చేస్తూ వచ్చారు. బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొదలై, చంద్రబాబు నాయుడు, రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రులుగా ఉన్న కాలాల్లో విచ్చలవిడిగా సాగిన ఈ హైదరాబాద్‌ భూ పరాధీన గాథలు వాటికవే ఒక గ్రంథంగా రాయదగినవి.

ఆ ముఖ్యమంత్రులు పందారాలు చేశారు గాని అసలు ఈ భూమంతా ఎవరిది? ‘భూమి నాది యనిన భూమి ఫక్కున నవ్వు’ అని వేమన రాశాడు. నిజానికి భూమి నాది అని దొరలూ ప్రభుత్వాలూ అంటే భూమి మరింతగా ఫక్కున నవ్వుతుందని అనాలి. ఆ భూమిలో ఎవరి నెత్తురు చెమట అయిందో, ఎవరి నెత్తురుతో చెమటతో ఆ భూమి తడిసిందో వాళ్లదే ఆ భూమి. అలా చూస్తే ఈ లక్షలాది ఎకరాల తెలంగాణ భూమి, హైదరాబాద్‌ భూమి ఉస్మాన్‌ అలీఖాన్‌ దీ కాదు, జాగీర్దార్లదీ దేశముఖ్‌లదీ భూస్వాములదీకాదు, తమకు తాము ప్రజాస్వామిక మని చెప్పుకునే ప్రభుత్వాలదీ కాదు. అది ప్రజలది. అది కష్టజీవు లైన ప్రజలది. దాన్ని ఏ కారణం మీదనైనా సరే మరొకరికి పందారం చేసే హక్కు ప్రభుత్వాలకు ఎంతమాత్రం లేదు.

తెలంగాణ భూమి గురించి ఈ ఆలోచనను తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలోని అన్ని పాయలూ పంచుకున్నాయి. అంతకు ముందరి ఆంధ్ర ప్రభుత్వాలకు తెలంగాణ భూములను అమ్మే హక్కు లేదనే రూపంలో అది వ్యక్తమై ఉండవచ్చు గాని, దాని అర్థం ఆ హక్కు తెలంగాణ ప్రభుత్వానికి ఉంటుందని కాదు. బోర్డు మార్చగానే అమ్ముకునే హక్కు వస్తుందని కాదు.

2007లో ఆంధ్రప్రదేశ్‌ ఇండిస్టియల్‌ ఇన్‌ ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌ (ఎపిఐఐసి) భూముల వేలం ప్రకటించినప్పుడు, తెలంగాణ రాష్ట్ర సమితి, భారత కమ్యూనిస్టు పార్టీ, భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు), తెలుగుదేశం పార్టీలు ఆగస్ట్‌ 24న ఎపిఐఐసి కార్యాలయం ముందు నిరసన ప్రదర్శన జరిపి అరెస్టు అయ్యారు. ప్రభుత్వం రియల్‌ ఎస్టేట్‌ బ్రోకర్‌లాగ ప్రవర్తిస్తున్నదనీ, విచ్చలవిడిగా భూములు అమ్ముతున్నదనీ, ప్రజల భూములు ఇలా అన్యాక్రాంతం చేయడాన్ని అంగీకరించబోమనీ తెరాస నాయకులు అన్నారు. సరిగ్గా ఇప్పుడు ప్రభుత్వం చెపుతున్నట్టే అప్పటి ఆర్థికమంత్రి కె రోశయ్య ప్రభుత్వ భూములను అమ్మకానికి పెట్టడం పూర్తిగా సమర్థనీయమనీ, ఈ అమ్మకాల ద్వారా వచ్చే నిధులను సంక్షేమచర్యల కోసమే వెచ్చించబోతున్నామనీ అన్నారు. మళ్లీ 2012లో ప్రభుత్వభూముల అమ్మకం ప్రస్తావన వచ్చినప్పుడు వ్యతిరేక ఆందోళనకు తెరాస నాయకత్వం వహించింది. జూన్‌ 28న శాసనసభ్యుడు కె టి రామారావు, భూముల అమ్మకాన్ని ప్రకటించిన హైదరాబాద్‌ మెట్రో డెవలప్‌ మెంట్‌ అథారిటీ తార్నాక కార్యాలయం ముందు ధర్నాచేశారు. నిజాంల వారసత్వంగా వచ్చిన ఈ భూములు న్యాయంగా హైదరాబాద్‌ ప్రజలవనీ, వీటిలో వేలాది ఎకరాలను వేలం పేరుమీద ఆశ్రితులకు కట్టబెట్టే అధికారం ప్రభుత్వానికి లేదనీ అన్నారు. తెలంగాణ ఏర్పడగానే, అప్పటివరకూ ఎచ్‌ఎండిఎ, ఆంధ్రప్రదేశ్‌ హౌజింగ్‌ బోర్డ్‌, ఎపిఐఐసిలు అమ్మిన భూములన్నిటినీ సమీక్షించి అన్ని అమ్మకాలనూ రద్దుచేస్తామని అన్నారు. పాత అమ్మకాల సమీక్ష, రద్దు, భూముల అన్యాక్రాంతాన్ని అరికట్టే కార్యక్రమాన్ని తెరాస ప్రభుత్వం ఎంత బాగా జరుపుతున్నది!!!

– ఎన్‌ వేణుగోపాల్‌
సెల్‌: 9848577028

spurce: http://www.navatelangana.com/article/net-vyaasam/150086

వ్యాఖ్యలు»

No comments yet — be the first.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / మార్చు )

Connecting to %s

%d bloggers like this: