jump to navigation

Telangana History 1947 to 2014: G Vijay Kumar డిసెంబర్ 29, 2014

Posted by M Bharath Bhushan in 1969, Andhra, heritage, Hyderabad, Identity, movement, Mulki, regionalism, Settler, Telangana, Telugu (తెలుగు).
trackback

అతిథిలా వచ్చిపోలేదు!
-గటిక విజయ్‌ కుమార్, నమస్తే తెలంగాణ December 30, 2014

రైలులో ప్రయాణం చేస్తుంటే.. చెట్లు, గుట్టలు, స్టేషన్లు వెనక్కి ఉరుకుతుంటయ్. మనకన్నా ముందున్న ఆకారాలు క్షణాల్లోనే వెనకబడుతుంటయ్. మనం దిగాల్సిన స్టేషన్ ఒక్కటే మనతో పాటు కొద్ది సేపు ఉంటది, అది మన గమ్యస్థానం కాబట్టి. కాలం కూడా అంతే.. క్షణాలు, నిమిషాలు, గంటలు, రోజులు, నెలలు, సంవత్సరాలు.. వెనకబడిపోతున్నయ్. వాటిని నెట్టేసుకుంటూ, మనమే ముందుకు ఉరుకుతున్నమ్. ఇప్పుడు 2014 వంతు. మరొక్క రోజులో దీని ఆయుష్షు కూడా తీరుతున్నది. ఈ ఏడాది చరిత్రలో భాగమైపోతున్నది. కానీ ఈ ఏడాది.. మన స్టేషన్ లాగానే మనతోనే ఉండిపోతది.

కాలాన్ని క్రీస్తు జనానికి ముందు, క్రీస్తు జననానికి తర్వాత అని లెక్కవేసినట్లే, తెలంగాణ చరిత్ర గమనాన్ని 2014కు ముందు, ఆ తర్వాత అని లెక్కిస్తారు. భవిష్యత్ చరిత్రలో ఇప్పటి వర్తమానానికి చాలా ప్రాముఖ్యం ఉంటది. ఈ ఏడాది తెలంగాణ ప్రజలకు సంబంధించి ఓ సాదాసీదా కాలం కాదు. ఈ ఏడాదికున్న ప్రత్యేకత.. గత ఏడాదిలతో పోల్చి చూస్తే మరింత స్పష్టంగా కనిపిస్తుంది. తెలంగాణ చరిత్ర పేజీలు తిరగేస్తే.. కనిపించేదంతా చీకటే. దాదాపు వందేళ్ళ చరిత్ర అంతా బాధలు, కన్నీళ్లు, పోరాటాలు,బలిదానాలు, అవమానాలు. ఏ ఒక్క ఏడాది కూడా మొత్తంగా తెలంగాణ ప్రజలకు సంతృప్తిని, సంతోషాన్ని కలిగింగలేదు.

1947.. దేశ స్వాతంత్యసాధన సంవత్సరం. భారతదేశ ప్రజలందరూ సంబుర పడ్డారు. కానీ తెలంగాణ ఆ సంబురంలో భాగంగా లేదు. తన చుట్టూ ఉన్న ప్రాంతాల్లో మువ్వన్నెల జెండా ఎగిరినా ఇక్కడ అనిశ్చితి ఉంది. రేపటి గురించి స్పష్టత లేదు.

1948.. హైదరాబాద్ స్టేట్‌ను భారత్‌లో కలిపిన ఏడాది. విముక్తా? విద్రోహమా? ఇప్పటికీ క్లారిటీ లేదు. నిజాం నిర్బంధం నుంచి విముక్తి కలిగిందని కొందరు సంతోషపడ్డారు. స్వతంత్ర ప్రతిపత్తి కోల్పోయామని కొందరు బాధపడ్డారు. అసలు ఏం జరుగుతున్నదో తెలియక ముందే, భవిష్యత్ పరిణామాల పై అంచనా కుదరకముందే అంతా జరిగిపోయింది. భారతదేశం తెలంగాణను కలుపుకున్నది. ఇది జరిగి 66ఏండ్లు గడిచినా.. జరిగింది విద్రోహమో, విలీన మో, విముక్తో స్పష్టతలేదు. మొట్టమొదలే సైనిక పాలన అమలయింది. భారత్ లో విలీనమైతే ప్రజలు స్వాతత్య్రం పొందుతారని ప్రచారం జరిగినా, చివరికి నిర్బంధ సైనిక పాలనే దిక్కయింది.

1952.. మొదటి సారి ప్రజా ప్రభుత్వ పాలన రుచి చూపించిన ఏడాది. సైనిక పాలన, అధికారుల పాలన పేరుతోనే 1948 నుంచి 1952 వరకు కేంద్రమే పెత్తనం చెలాయించింది. హైదరాబాద్‌ను ఓ స్టేట్ గా గుర్తించినా, ఇక్కడ స్వయం పాలకులు లేరు. హైదరాబాద్ రాష్ట్రంలో 1952లో బూర్గుల రామకృష్ణారావు నేతృత్వంలో మొదటి సారి ప్రజాస్వామ్య పాలన ప్రారంభమయింది. బూర్గుల కుర్చీ సదురుకుని కూర్చునే లోపే, సమైక్య ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదన పిడుగు పడింది. సీమాంధ్రుల కుట్రలన్నీ ఫలించి, సమైక్య ఆంధ్రప్రదేశ్ ఏర్పడనే ఏర్పడింది. స్వంత రాష్ట్రంలో సొంత ప్రభుత్వ పాలన అనుభవించకముందే పరాయి పాలనలోకి వెళ్లాల్సిన దైన్యం. 1956.. తెలుగు ప్రజలందరినీ కలిపిన సందర్భంగా ప్రచారం జరిగిన ఏడా ది. అంతిమంగా తెలంగాణకు నష్టం చేసిన ఏడాదిగానే అది మిగిలిపోయింది. నాటి నుంచి ఈ ఏడాది వరకు దాని దుష్ఫలితాలను అనుభవించాల్సి వచ్చింది.

1969.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను బలంగా బయట పెట్టిన ఏడాది. ఒప్పందాలు, షరతులు అన్నీ ఉల్లంఘనలకు గురికావడంతో ఉద్యమం వచ్చిం ది. అది తెలంగాణ ప్రజల్లో స్వరాష్ట్ర ఆకాంక్షను పెంచింది. కానీ ఆ ఏడాది కూడా అనుకున్నఫలితం రాకపోగా, తెలంగాణకు దుఃఖమే మిగిల్చింది. వందలాది మంది అమరులు కావాల్సి వచ్చింది. గానీ ప్రత్యేక రాష్ట్రం రాలేదు.

1971.. తొలి తెలంగాణ ముఖ్యమంత్రిని అందించిన ఏడాది. 1969 ఉద్య మం వల్ల ఎగిసిపడిన స్వపరిపాలనా కాంక్షను ఎదుర్కోవడానికి కాంగ్రెస్ నాయకత్వం పివి నరసింహారావు రూపంలో ఆంధ్రప్రదేశ్‌కు తెలంగాణకు చెందిన తొలి ముఖ్యమంత్రిని అందించింది. నీలం సంజీవరెడ్డి నుంచి మొదలుకుని కాసు బ్రహ్మానందరెడ్డి దాకా అందరు ముఖ్యమంత్రులు తెలంగాణేతరులు కావడం వల్ల అన్యాయం జరిగిందని, ఇక అలా జరగదని జనం కొంత నమ్మారు. కానీ ఆ ప్రయోగం కూడా విఫలమయింది.

తెలంగాణ ప్రయోజనాల విషయంలో కొంత సానుకూలంగా ఉండడంతో పీవీ ఆంధ్ర కుట్రలకు బలయ్యారు. రాష్ట్రం ఏర్పడిన పదిహేనేళ్ల తర్వాత ఓ తెలంగాణ పౌరుడు ముఖ్యమంత్రి అయితే ఓర్వలేకపోయారు. జై ఆంధ్ర ఉద్యమం తెచ్చారు. రాష్ట్రపతి పాలన రావడానికి కారణమయ్యారు. తొలి తెలంగాణ ముఖ్యమంత్రి అనే ఓ ఊరట నుంచి రాష్ట్రపతి పాలన అనే అగాధంలోకి తెలంగాణ వెళ్లాల్సి వచ్చింది.

1978.. తెలంగాణ ఉద్యమకారుడినే ముఖ్యమంత్రిని చేసిన ఏడాది. 1969 ఉద్యమాన్ని నడిపినా, అప్పుడున్న జాతీయ రాజకీయ పరిస్థితుల్లో అనుకున్న లక్ష్యం సాధించ లేకపోయాడన్న అభిప్రాయం(ఉద్యమాన్ని తాకట్టు పెట్టాడనే విమర్శలున్నప్పటికీ) మర్రి చెన్నారెడ్డి మీద ఉండేది. చివరికి తెలంగాణ కష్టం, తెలంగాణ బాధ తెలిసిన తెలంగాణ ఉద్యమకారుడైన మర్రి చెన్నారెడ్డి ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఈ ఏడాది వచ్చింది. ఆయన కూడా కొంచెం తెలంగాణపై దృష్టి పెట్టడంతో ఓర్వలేకపోయారు. రెండేళ్లు పరిపాలించాడో లేదో, సీమాంధ్రుల కండ్లు మండినయ్. పదవి నుంచి తొలగించారు.

1983.. తొలి కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పడిన ఏడాది. తెలుగు ప్రజలందరి కష్టాలు కడతేర్చే మహోన్నత వ్యక్తిగా ప్రచారం పొందిన ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చారు. గతంలో ఉన్న వారంతా కాంగ్రెస్ పాలకులు. వారు వివక్ష చూపించా రు. కొత్త ఆలోచనావిధానంతో వచ్చిన ఎన్టీఆర్ కచ్చితంగా నిస్పక్షపాతంగా ఉం టారనే ఆశించింది తెలంగాణ. కానీ ఎన్టీఆర్ అధికారంలోకి రావడం వల్ల కోస్తాలోని బలమైన పెట్టుబడిదారీవర్గం హైదరాబాద్‌లో గట్టి పునాదులు వేసుకున్నది. అన్ని రంగాల్లో బలంగా స్థిరపడ్డది.

అది అంతకుముందున్న అధికారవర్గం కన్నా, దారుణమైన వివక్షను అమలు చేసింది. ఆ అహంకారం తెలంగాణలో తెలంగాణ పదాన్ని నిషేధించేదాకా వెళ్లింది. 1989.. కోస్తా పెట్టుబడిదారుల నుంచి తెలంగాణ బిడ్డకు అధికారం అప్పగించిన ఏడాది. ఎన్టీఆర్ ప్రభంజనాన్ని, ప్రభావాన్ని తట్టుకుని గెలిచింది మళ్లీ తెలంగాణ బిడ్డే. అదే చెన్నారెడ్డి తెలుగుదేశంతో పోరాడి, 1989లో కాంగ్రెస్‌ను మళ్లీ అధికారంలోకి తెచ్చి ముఖ్యమంత్రి అయ్యారు. ఈసారైనా పూర్తికాలం అధికారంలో ఉంటాడు, ఫర్వాలేదు అనుకునేంతలోనే పక్కనున్న పాములు విషం చిమ్మనే చిమ్మాయి. ఈ సారి తెలంగాణ పౌరుడి అధికారం ఏడాదికే పరిమితమయింది.

2004.. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తామని మొదటిసారి కేంద్ర ప్రభుత్వంచే ప్రకటన ఇప్పించిన ఏడాది. తెలంగాణ వచ్చినట్లే అని ఊరించిన సంవత్సరమది. టిఆర్‌ఎస్ పొత్తుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, తెలంగాణ ఏర్పా టు చేస్తామని పార్లమెంటులో ప్రకటించింది. కనీస ఉమ్మడి కార్యక్రమంలో పెట్టుకున్నది. రాష్ట్రపతి నోటితో చెప్పించింది. అనుకున్నది అనుకున్నట్లు జరిగితే, 2014దాకా ఆగాల్సిన పని రాకుండా ఉండేది. కానీ 2004 సంవత్సరం ఆ అదృష్టానికి నోచుకోలేదు.

2009.. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు చర్యలు ప్రారంభించామని స్పష్టమైన ప్రకటన చేయించిన ఏడాది. కేసీఆర్ దీక్షతో కేంద్రం దిగొచ్చింది. సోనియా గాంధీ జన్మదిన కానుక అని జనమంతా సంబురం చేసుకున్నరు. డిసెంబర్ 9 తెలంగా ణ స్వాతంత్య్ర దినం కూడా అయింది కొన్ని గంటల పాటు. అర్థరాత్రి ప్రకటన తెల్లారేసరికి రూపు మార్చుకున్నది. 2009 సంవత్సరం కూడా ఆశలపల్లకిలో ఊరేగించి, అర్థాంతరంగా వదిలివెళ్లిపోయింది.
1947-2009 దాకా దాదాపు పది సందర్భాలు తెలంగాణ ప్రజలను ఊరిం చి ఉసూరుమనిపించిన సంవత్సరాలే. అవి తెలంగాణ ప్రజల తలరాత మార్చే అవకాశాన్ని జారవిడుచుకున్నాయి. కానీ 2014 అలా చేయలేదు. అది పదిలో పదకొండు కాలేదు. తెలంగాణ రాష్ర్టాన్ని తెచ్చిపెట్టింది.

ఉద్యమ పార్టీకే పట్టం గట్టింది. ఆరు దశాబ్దాలుగా అధికారం అనుభవించిన కాంగ్రెస్, టీడీపీలను పక్క న బెట్టింది. దార్శనికుడికే అధికారం అప్పగించింది. తెలంగాణ తలరాతను నిర్దేశించే తొలి బడ్జెట్‌కు చోటు కల్పించింది. రాష్ట్ర పునర్నిర్మాణ ప్రణాళికలు రచించుకునే సమయం ఇచ్చింది. కాలం మనతో కలిసొచ్చింది. 2014 నడిచొచ్చింది. అన్ని సంవత్సరాల లాగా అతిథిలా వచ్చి పోవట్లేదు. మనతోనే నిలిచి ఉంటుంది. మనతో పాటే నడుస్తుంది. తెలంగాణ చరిత్రను రాసుకుంటే.. అది 2014కు ముందు, 2014కు తర్వాత అని రాసుకోవాలి.

-గటిక విజయ్‌కుమా

ప్రకటనలు

వ్యాఖ్యలు»

No comments yet — be the first.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: