jump to navigation

1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమం: ఉప్పొంగిన పొరిగింటి తెలుగు ‘సమైక్య’ కవిత్వం – వెల్దండి శ్రీధర్ నవంబర్ 8, 2013

Posted by M Bharath Bhushan in 1969, Andhra, Art, Culture, Identity, Poetry & Songs, politics, Settler, Telangana, Telangana Languages, Telugu, Telugu (తెలుగు).
trackback

1969 ‘సమైక్య’ కవిత్వం – వెల్దండి శ్రీధర్
andhra jyothy, 4 November 2013

‘తెలంగాణాను వర్ణించటానికి తెలుగులో మాటలు చాలవు… దానిని ‘హెలంగాణ’ అంటున్నాను’ అని సానుభూతి కురిపించారు కుందుర్తి. తీరా 1969 నాటికి ఆ సానుభూతి కాస్తా ఇగిరిపోయి తెలంగాణ సమాజమంతా ఉద్యమ ‘ఉడుకు’తో కింద మీదవుతుంటే విడిపోదామనే మాట వినకూడదు, అనకూడదని శాసనం జారీ చేశారు. శ్రీశ్రీ కూడా ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని నిరసిస్తూ విజయవాడ ఆకాశవాణిలో 1969 సౌమ్య ఉగాది పర్వదినాన ‘సౌమ్యవాదం’ కవిత చదివారు. కె.వి.రమణారెడ్డి ప్రత్యేక తెలంగాణ ఉద్యమంపై ‘అంధకసీమ’ కవిత్వంతో ఎర్ర పిడికిలి బిగించారు..

ప్రపంచంలో ఏ దేశంలోనైనా, ఏ భాషలోనైనా సాహిత్య కళాజీవి ఎవరైనా పీడితుని పక్షాన నిలబడి తానెంచుకున్న ప్రక్రియతో గుండెలో మూగ మంటలేసుకున్న బాధితుని తరఫున ఒక ఆయుధంగా, ఒక నినదించే గొంతుగా, ఒక బిగించిన పిడికిలిగా మారి రాజ్యానికి ఎదురు నిలుస్తాడు. అవసరమైతే ప్రత్యక్షంగా కార్యరంగంలోకి దిగి పీడితుని రక్తంలో రక్తంగా, చెమటలో చెమటగా, నినాదంలో నినాదమై అల్ప ప్రాణులకు కొండంత అండగా నిలబడి అన్యాయాన్ని ఎదురించే ప్రశ్నల కొడవలవుతాడు. కానీ తమ ఆత్మగౌరవం కోసం, తమ సాంస్కృతిక వారసత్వం కోసం, తమ ఉద్యోగాల కోసం, తమ వనరుల కోసం, తమ నిధుల కోసం, తనదైన పిడికెడు నేల కోసం సుమారు నాలుగు వందలమంది యువకుల ప్రాణాలను ధారబోసి చేసిన 1969 ప్రత్యేక తెలంగాణ తొలి దశ ఉద్యమ కాలంలో విచిత్రంగా మహాకవులు, ప్రముఖ కవులనుకున్న వాళ్లందరూ పీడకుల పక్షాన నిలబడి పీడితుని నడ్డీపై మరిన్ని కవిత్వపు బరిసెలు వదిలారు. నాలుక లేని వానికి నాలుకై నిలవాల్సిన కవులు దోపిడీకి కవిత్వపు రహదారిని నిర్మించారు. ఉద్యమాన్ని మరణ శయ్యపై కెక్కించి ‘తమ్మూడూ స్నేహ హస్తం అందుకో, వేర్పాటువాదం మానుకో’ అని రగిలిపోతున్న నిప్పును తాత్కాలిక కవిత్వపు పదబంధాల బూడిదలో కప్పిపెట్టారు. తెలుగు కవిత్వపు ప్రయాణంలోనే ఇదొక మరుగుజ్జు దశ. ఒక విలోమ కవిత్వం.

‘ఇలారా తమ్ముడూ ఏమిటి నీ బాధ/కూచున్న చెట్టును గొడ్డలి తో నరుక్కున్నట్లు/ఎవరు చేశారు నీకీ వేర్పాటు బోధ/ఒరలోంచి కత్తిలాగి/తన బొడ్లో పొడుచుకున్నట్లు/పుష్కరం తర్వాత గుర్తు వచ్చిందా/ప్రత్యేక ఏర్పాటు గాధ …. …. కోటి కోర్కెలు కోరుకో/ కోటిన్నొక్కటి తీరుస్తాను/విడిపోదామనే మా/ వినకూడదు అనకూడదు’ (‘స్నేహగీతి’ -కుందుర్తి, ఫిబ్రవరి 19, 1969 ఆంధ్రప్రభ దినపత్రిక)
వచన కవితా పితామహులు, కుందుర్తి ఆంజనేయులు ‘వచన కవిత్వానికి వ్యాకరణం ప్రజలు, నిఘంటువులు ప్రజలు, అలంకారాలు ప్రజలు’ అంటూ ‘పీడిత వర్గాలను గురించి రాసే కవి ఆ వర్గానికి చెందిన వాడే కానక్కర లేదు సానుభూతి ముఖ్యం. ఆ వర్గాల సమస్యల పట్ల సమగ్రమైన అవగాహన ఉండాలి. అందుకు తగ్గ బలమైన అభివ్యక్తి అవసరం’ అని చెప్పి రైతాంగ సాయుధ పోరాటంపై ‘తెలంగాణ’ కావ్యాన్ని రాశారు. ‘తెలంగాణాను వర్ణించటానికి తెలుగులో మాటలు చాలవు… దానిని ‘హెలంగాణ’ అంటున్నాను’ అని సానుభూతి కురిపించారు. తీరా 1969 నాటికి ఆ సానుభూతి కాస్తా ఇగిరిపోయి తెలంగాణ సమాజమంతా ఉద్యమ ‘ఉడుకు’తో కింద మీదవుతుంటే విడిపోదామనే మాట వినకూడదు, అనకూడదని శాసనం జారీ చేశారు. 1969 సౌమ్య ఉగాది పర్వ దినాన ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో చదివిన కవిత్వంలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని ‘కాలం చేసిన గారడీ’గా కొట్టిపారేశారు.

‘ఈ యేడే ఉగాది నాటికి/అనైక్య ఫలితాల బహుగాథా పరంపరలను/సిగ్గుతో డిపోలో దాచుకున్న/సిటీ బస్సులు చెప్పాయి నాకు/ మూసేసిన పాఠశాలలు పూసగుచ్చినట్లు చెప్పాయి/అసాంఘిక శక్తుల చేతుల్లోకి/మారిన చరాస్తులు మరీ మరీ చెప్పాయి/హఠాత్తుగా వచ్చి న వరద పొంగులా/ఈ అనైక్యత యింక పోదా?/ఏ నాటికైనా యింకి పోదా?… … ఇక్కడ చేరిన కవిమూర్తుల్లోని ఆంధ్రైక్యత/కనిపిస్తుందో లేదో వరంగల్లులో/ఓ ప్రభూ పొరపాటు పడ్డాము/ఈ ముక్కోటి తెనుగుల్ని యీ దఫాకు క్షమించు/మేమందరం తాగి ఉన్నాము మం చీ చెడు తెలియని/స్వార్థం ముసుగులో దాగి వున్నాము’ -అంటూ ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని తాగిన మత్తులో జరుగుతోన్న ఉద్యమంగా చిత్రించారు. ‘ఇది నా కన్నీటి లేఖ – ఇది నా దురదృష్ట రేఖ/మసిలో కన్నీరు కలిపి మాతృశ్రీ వ్రాయు లేఖ … … ఒక్క తల్లి బిడ్డలలో – ఎక్కడిదయ్యా ఈ కసి/చక్కని సౌధం నడిమికి – ముక్కలు చేసే రక్కసి … పంట చేలు పాడు చేయు – పందికొక్కులను జెనకుడు/తాడు తెగిన గాలి పటం – తప్పుడు బాటల జనకుడు/చుప్పనాతి శూర్పనఖల – చెప్పుడు మాటలు వినకుడు …. పచ్చని పందిళ్ల కింద – చిచ్చు బుడ్లు కాల్చకండి/పక్క ఇండ్ల మీద ‘పిచ్చికుక్కల’ నుసికొల్పకండి … ప్రత్యేక తెలంగాణం పగబట్టిన దృక్కోణం/ప్రత్యేక తెలంగాణం స్వార్థపరు ల నిర్మాణం/ప్రత్యేక తెలంగాణం భరత భూమికవమానం/ప్రత్యేక తెలంగాణం ‘దక్షిణ పాకిస్థానం’/దింపుడు ఉష్ణోగ్రత సాధింపుడు సర్వసమగ్రత/’భస్మాసురులొస్తున్నారోయ్-తస్మాజ్జాగ్రత! జాగ్రత!!” (‘కన్నతల్లి కన్నీటి లేఖ’ -కరుణశ్రీ, ఆంధ్రప్రభ, ఫిబ్రవరి 18, 1969)

పుష్పవిలాపాన్ని అర్థం చేసుకున్న సున్నిత మనస్సు, తెలంగాణ ప్రజల ఆక్రందనను, బతుకుపోరును గ్రహించలేకపోయింది. ఎన్నో ఏండ్లు పటేలు, పట్వారీలు, రజాకార్ల దోపిడీలో ఎముకలు నుసి నుసి చేసుకొని దగా సర్ప ద్రష్ట అయిన తెలంగాణ ఏ నూతన వెలుగుల కోసమో బలవంతంగానే ఆంధ్రప్రదేశ్‌లో విలీనం అయింది. కానీ వెలుగు స్థానే మునుపటి చీకటి కన్నా రెట్టించిన చీకటి తమ జీవితాల్లో పర్చుకున్న క్షణంలో పుష్కర కాలం పాటు పంటి బిగువున అవమానాలనూ, దౌర్జన్యాలను భరించిన తెలంగాణ ‘సోయి’ తెచ్చుకొని స్వేచ్ఛ కోసం, స్వాతంత్య్రం కోసం, పొట్టకు కాసిన్ని మెతుకుల కోసం ఆకలి పోరాటాన్ని నెత్తికెత్తుకుంటే అది కరుణశ్రీకి తెలుగు జాతి అద్దాల మేడను ముక్కలు చేసే రాక్షసిలాగా కనిపించింది. ఉద్యమకారులు పందికొక్కులుగా, పిచ్చికుక్కలుగా, భస్మాసురులుగా కనిపించారు. రాజకీయ నాయకులైతే చుప్పనాతి శూర్పనఖలే వారి దృష్టిలో. అయితే ఆనాడే ‘ప్రత్యేక తెలంగాణ దక్షిణ పాకిస్థానమా?’ అని నల్గొండ జిల్లా సూర్యాపేట పాఠకుడు డి.వి.కృష్ణమాచార్యులు కరుశ్రీ కవిత్వాన్ని ఒక లేఖ ద్వారా ప్రశ్నించారు-
‘ఆర్యా! 1969 ఫిబ్రవరి 18వ తేదీ ఆంధ్రప్రభలో కరుణశ్రీగారి గేయం చూశాను. ‘ప్రత్యేక తెలంగాణం-దక్షిణ పాకిస్థానం’ అన్నారు వారు. కానీ కరుణశ్రీ అనుకుంటున్నంత క్రూరులు కాదు తెలంగాణవారు.

వారిలోనూ జాతీయాభిమానాలున్నాయి. వారేమీ పాకిస్థాన్‌కు తొత్తులు కారు. హిందూ-ముస్లింల మేలుకలయిక తెలంగాణం. మహాకవులయినవారే ఇలా వ్రాయడం ఆంధ్రదేశమే విచారించవలసిన విషయం. కవిత్వం కోసం కాని వాటిని సృష్టించడం కవుల లక్షణం కాదు. ఒకవేళ ప్రత్యేక తెలంగాణమే వున్న యెడల (పాపం శమించుగాక) ఆనాడు ఇరు రాష్ట్రాలలో ముఖ్యంగా తెలంగాణలో శాంతియుత సంఘజీవనం వెలయగలదు. తెలంగాణలో భారత దేశాభిమానం వున్న హిందువులు ముస్లింలు వున్నారు. అంతేగాకుండా నేడు తెలంగాణలో వున్న హిందూ ముస్లింలను చూస్తే వారి సోదరత్వానికి ఆశ్చర్యపడకపోరు. కరుణశ్రీగారు తెలంగాణానే పాకిస్థాన్‌గా వర్ణించారు. ఇంకేం రాయగలను. ఇది ప్రతి తెలంగాణ వాడి గుండెలో అగ్ని మంటలు రేకెత్తిస్తుంది. దేశ ఐక్యతకు పాటు పడవలసిన కవులు ఇట్లాంటి భావనలు వెలిబుచ్చడం మంచిది కాదు.’ (3 మార్చి 1969, ఆంధ్రప్రభ) అని పత్రికాముఖంగా వారి ఆవేదనను, నిరసనను ప్రకటించారు. ఇది తెలంగాణ ఆత్మకు నిలువుటద్దం.కమ్యూనిస్టుగా, మార్క్సిస్టుగా, ప్రగతి పథంలో నవ్య ధోరణులకు స్వాగతం పలికి ప్రయోగ దృష్టితో కవిత్వం రాసిన ఆరుద్ర 1949లోనే ‘త్వమేవాహం’ పేర తెలంగాణ సాయుధ పోరాటాన్ని కవిత్వంగా మలిచిన కవులు. 1969 నాటికి ఆ-రుద్ర నేత్రునిలాగా తెలంగాణ ఉద్యమంపై మూడో కన్ను తెరిచి ‘అన్న తమ్ముని ఇంట పగవాడా?’ (‘స్రవంతి’ సాహిత్య మాసపత్రిక, జనవరి-1969) అని ప్రశ్నించారు.

అంతేగాక సౌమ్య ఉగాదికి విజయవాడ ఆకాశవాణిలో ‘సౌమ్యవాదం’ వినిపించారు. అందులో- ‘ఎలా నిజం పాడగలవు పరభృతాలు/పువ్వు తొడిమను వీడిపోతానంటున్నప్పుడు/మెదడు గుండెను విడిచిపెడతానన్నప్పుడు/చెట్టుకున్న ముళ్లే చీడపురుగులుగా మారుతున్నప్పుడు/చేతినున్న అయిదు వేళ్లూ అయిదు రాజ్యాలవుతున్నప్పుడు/దేవతలు పీడిస్తున్నప్పుడు/దెయ్యాలు దీవిస్తున్నప్పుడు/దీపాలు వెలగడం మానేసి/ పాపాలు వీక్షిస్తున్నప్పుడు/ జలగలు చెలరేగి జాతర చేసుకుంటున్నప్పుడు … … పొగరెత్తిన గూండాలూ/పొగచూరిన జెండాలూ/కలుపుతారు భుజం భుజం’ -అని దేశం ముక్కలైపోతోందని, ఈ ఉద్యమ రాబందులకు దూరంగా జరిగి ఒక శాంతి గువ్వనెగరెయ్యాలని ప్రబోధించారు. ఎల్లకాలం ముసురు కాదిది తాత్కాలిక గడ్డివాము మంట, జలగల జాతర అని అంచనా కట్టారు. ‘తెలుగువాడి ఎద ఏ రాక్షస నినాదానికి స్పందిస్తున్నది? పద్యాల సేద్యానికి యోగ్యమైనది కాదీ కార్తి, ఉద్యమాల ఉన్మాదంతో ఉత్పాదితమవుతున్న ఆర్తి’ అని తెలంగాణ ఉద్యమాన్ని చివరికి పుకార్ల తుఫానుగా తేల్చిపారేశారు.

శ్రీశ్రీ కూడా ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని నిరసిస్తూ విజయవాడ ఆకాశవాణిలో 1969 సౌమ్య ఉగాది పర్వదినాన ‘సౌమ్యవాదం’ కవిత చదివారు. అడుగడుక్కీ మనం ఎక్కడకు పోతున్నాం అనే స్వస్వరూప జ్ఞానం ఉన్న ఆత్మ విమర్శకుడు-పరామర్శకుడు అని పేరు పొందిన కె.వి.రమణారెడ్డి (కెవిఆర్) ప్రత్యేక తెలంగాణ ఉద్యమంపై ‘అంధకసీమ’ కవిత్వంతో ఎర్ర పిడికిలి బిగించారు-
‘కుడిచేతిని ఎడమ చేయి పడగొట్టగ జూచినపుడు/కంటిని పెర కన్ను ద్వేషకంటకాల గ్రుచ్చినపుడు /రాక్షసీయ రాజకీయ/తక్షక కర్కోటకులై/వీధులబడి బడులకు చెడి వీదు కాడుగా జేసిన/విధ్వంసోన్మాదంలో విలయ భయావరణంలో/పల్పులూడ్చుకొని పశువులు/పిలుపునందుకొని అసురలు … … జాతికి పట్టిన జాడ్యం జాం తవ తత్వమ్మయితే/జ్ఞాతి వైర దుష్టజ్వాల భ్రాతృత్వం మసిజేస్తే … … ఏమయ్యా రెటుబొయారయ్యా ఓ కవులారా/ఏమైనా మీ ధర్మం ఏమరడం ఏం న్యాయం … … కాళోజీ దాశరథి ఆళ్వార్‌స్వామి సినారె/కాహళులై దీపికలై కవిగట్టి కథలల్లీ/ఎవడో సైతాన్ పాచిక/కెందరి బాధా వీచిక … … తగునా క్రౌర్యము పగతుర నగవులార్పగా జాలిన/తీవ్ర శౌర్యమీ సోదర తీరాం«ద్రులపై జూపగ/నైజాం బూజన్న మోజు/నేటికి గూడా పోదా’ (‘అంధకసీమ’ -కెవిఆర్, విశాలాంధ్ర, 23 ఫిబ్రవరి 1969). కెవిఆర్ దృష్టిలో తెలంగాణ ఉద్యమమంటే అదొక రాక్షస క్రీడ. విద్యార్థులు కళాశాలలు మానేసి వీధులను వల్లకాడులుగా మార్చేసే విధ్వంసకారులు. పశువులు రాక్షసులు…
‘అంత చిన్నవయసులో/సొంత అన్న మీద పెరిగిన ద్వేషానికి/ఆవేశం కలుగుతోంది… … అబ్బబ్బ పాడు పిల్లలు/దేశంలో లక్షా తొంబై సమస్యలతో పాటు వీళ్లూ ఒక పెద్ద సమస్యే…/విసుక్కుంటూ వీరనారిలా/అడుగులు కదిపింది అమ్మ/పోలీసుల చేతుల్లో మెదిలే/లాఠీ కర్రలాంటి చూపు ల్ని విసిరింది/మిలటరీ జనం కవాతే చేసినట్లు/నడచిన మేరా కదను తొక్కింది/టియర్ గ్యాసు సెల్లుల్లాంటి/తిట్ల వర్షం కురిపించింది/ఆట కట్టించింది’ అంటూ కవిత రాశారు నాయని కృష్ణకుమారి. (‘అన్నదమ్ములు’ -నాయని కృష్ణకుమారి 19 మార్చి 1969 ఆంధ్రప్రభ’) ఆనాటి ఉద్యమాన్ని నిర్దాక్షిణ్యంగా అణచివేసిన ఆ అమ్మ ఎవరో కాదు నాటి ప్రధాని ఇందిరా గాంధీ.

ఆవంత్స సోమసుందర్, సినారె, దాశరథి, తుమ్మల సీతారామమూర్తి, వానమామలై వరదాచార్యులు, ఎం.కె.సుగమ్‌బాబు, డా.తంగిరాల వెంకటసుబ్బారావు, బొల్లిముంత నాగేశ్వర్‌రావు, పురాణపండ రంగనాథ్ లాంటి లబ్ధ ప్రతిష్ఠులైన కవులే కాక మారెళ్ల కేశవరావు, డా.శంకరశ్రీరామారావు, వింజమూరి శివరావు, బులుసు వేంకటేశ్వ ర్లు, వక్కలంక లక్ష్మీపతిరావు, వి.సంపత్కుమారాచార్య, మధ్యాహ్నపు లీలానంద్, యస్.వెంకటరంగారెడ్డి, శ్రీమతి యలమంచిలి తాయా రు, ఆర్.ఎమ్.చల్లా, మేరెడ్డి యాదగిరిరెడ్డి, ఆదూరి సత్యనారాయణమూర్తి, కళ్యాణం వీరస్వామి, నెల్లుట్ట కోదండ రామారావు, గంధం జోయెల్… లాంటి ఎంతోమంది కవులు ఆనాడే ఊరూరుకు విస్తరించిన ఒక ప్రజా ఉద్యమానికి వ్యతిరేకంగా కవిత్వం రాశారు. తప్పొనరించుట సహజం, ఎక్కడున్నాం మనం?, ఎక్కడికి పోదాం? మనిషి మనిషి మధ్యనున్న అగాధాల్ని పూడ్చేద్దాం, కాలు నొప్పిగా ఉందని కన్ను పొడుచుకుంటారా?, ఒక్కసారి ఆత్మావలోకనం చేసుకుందాం, మరొక్కసారి పునరాలోచన చేద్దాం, చూడు తమ్ముడూ నీ వెవరివి? నేనెవరిని ఒకే తెనుగు తోటలో పుష్పించిన పూవులం, అయ్యో! ఆంధ్రులంధులైపోయారా? అమ్మను చీల్చే అసురులైపోయారా?, కారాదు అఖండాంధ్రం ఖండాంధ్రం, మన పయనం ముందుకా వెనక్కా?, వద్దు చేతులను కలుపుదాం.. ఇలా అనేక రకాలుగా ఉద్యమాన్ని జోకొట్టే ప్రయత్నం చేశారు.

అయినా నివురుగప్పిన నిప్పులాగా తాత్కాలికంగా సద్దుమణిగి అన్యాయాలు జరుగుతున్న ప్రతిసారీ రెక్కవిచ్చుకుంటూనే 2001 తర్వాత ఒక నిప్పుల పతాకై ఆకాశ పర్యంతం ఎగిసి ప్రతి గుండెకూ ఉద్యమ ‘హార్ట్‌బీట్’ను అందిస్తోంది తెలంగాణ ఉద్యమం. 1969 ప్రత్యేక తెలంగాణ తొలి దశ ఉద్యమంలో, 2001 తర్వాతి మలి దశ ఉద్యమంలో కవులు స్పందించిన తీరును గమనిస్తే ఒక స్పష్టమైన తేడా కనిపిస్తుంది. ఇప్పటి సీమాంధ్ర కవులను ‘మీరు పీడకుల వైపా? పీడితుల వైపా?’ అని ప్రశ్నించినపుడు, తెలంగాణ ఉద్యమం వేకువజాము తొలి కోడి కూత లాంటిదైతే సమైక్యాంధ్ర ఉద్యమం కీ ఇస్తే మోగే అలారం మోత లాంటిదని సంఘీభావంగా డా.కోయి కోటేశ్వరరావు సంపాదకత్వంలో ‘కావడి కుండలు’ కవితా సంపుటి వెలువరించారు. ప్రజల పక్షం వహించే కవులు ఏ కాలంలోనైనా పీడితుల పక్షాన్నే నిలుస్తారు.

– వెల్దండి శ్రీధర్

(సంగిశెట్టి శ్రీనివాస్‌కు కృతజ్ఞతలు)
http://www.andhrajyothy.com/node/19876

వ్యాఖ్యలు»

No comments yet — be the first.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: