jump to navigation

లెక్కలు తేల్చాలి, అపోహలు పోవాలి – చలసాని శ్రీనివాస్ డిసెంబర్ 22, 2012

Posted by M Bharath Bhushan in Andhra, Congress, Hyderabad, Polavaram, Rayalaseema, regionalism, suicide, Telangana, Telugu (తెలుగు), YSR.
trackback

లెక్కలు తేల్చాలి, అపోహలు పోవాలి

చలసాని శ్రీనివాస్

1972లో ఆంధ్ర ఉద్యమాన్ని అణిచివేస్తూ డిసెంబరు 21న ప్రధాని ఇందిర అధికారికంగా రాష్ట్రాన్ని విడగొట్టేది లేదని ఆంధ్రులు శాశ్వతమని నమ్మారు. అదే రోజు విడిపోయి వుంటే తీర సీమాంధ్రలు దేశంలోనే నెంబర్ 1గా ఉండేవి. పోయి మీ ప్రాంతాలలో స్వాభిమానంతో పాటు బతకండని, తెలంగాణ వస్తే లక్షల మంది ఉద్యోగాలు లాక్కుని తీరుతామని బెదిరిస్తుంటే అక్కడ స్థిరపడ్డ మిగతా ప్రాంతవాసులు ఎక్కడికి పోవాలి.. చావాలా అంటూ ఆవేదన చెందే వారి ఇబ్బందులను పట్టించుకోవాలి కదా?

ఆంధ్రులూ ఆలోచించాలని లవణం, రమణ, రాంప్రసాద్‌లు రాసిన వ్యాసాల తీరు వేరుగా ఉన్నా మూడూ ఆంధ్రుల ఆవేదనను వెలిబుచ్చాయి. తీర సీమాంధ్రులు అన్ని విధాలుగా త్యాగంచేసినా ఎంతకాలమీ గొడవని విసుగు చెందే లవణం గారు ప్రత్యేక రాష్ట్రం కోరి ఉండవచ్చు. కోస్తా అభివృద్ధిని అడగక ఫక్తు రాజకీయ స్వార్థం కోసం జై ఆంధ్ర వాదులని విమర్శించే కొందరు సమైక్య వాదులు ఉన్నారు. అదే విధంగా కొద్దిమంది రియల్ ఎస్టేట్ బ్రోకర్లో లేదా కొందరు ప్రత్యేక తెలంగాణ నాయకుల కాల్మొక్కి వారి దయతోనో నీళ్ళెవడికీ అక్కర్లేదంటూ హైదరాబాద్ కె సిఆర్ గారి సొత్తనే జై ఆంధ్రవాదులూ ఉన్నారు.

వాస్తవానికి నీటి పారుదల, హైదరాబాద్‌లో స్థ్థిరపడ్డ వారి భవిష్యత్తు, తీర సీమాం ధ్ర యువత ఉపాధి-ఉద్యోగాల సమస్యలని విభజనకు ‘ముందే’ పరిష్కరించకుండా విభజనకి ఎవరు అంగీకరించినా అది కోస్తా , రాయలసీమ ప్రాంతాల వాసులకు ఖచ్చితంగా ఆత్మహత్యా సదృశమే అవుతుంది. నిజంగానే అలా హక్కులని తాకట్టు పెడితే ఇప్పుడు పెరిగిన రేట్లు నీటిపై రాసిన మాటలై గాలి బుడగలై నీరు, నిధులు, ఉద్యోగాలు ఏమీ దక్కవు; ఆ తరువాత కోస్తా, సీమ ప్రజలు బోరున విలపించినా లాభం ఉండదు. మోసపోవడం ఆంధ్రులకి కొత్త కాదు.

ఏనాడో చెన్నపనాయుడి చెన్నై పట్నాన్ని కోల్పోగా మొదటి ఎస్సార్సీ ఏకగ్రీవంగా ఆంధ్రరాష్ట్రానికి సిరిగుప్ప, బళ్లారి, మల్లాపురం, హంపీ, విజయనగరం మొదలైన వాటిని కలపమంది; అయినా వాటితో పాటు, విశాలాంధ్ర ఉద్వేగంలో నాయకులు సిరోంచ, కోలారు, బళ్ళారి, ధర్మపురి, ఆర్కాటు, బస్తర్, కోరాపుట్ , బరంపురం లాంటి ప్రాంతాలను పరభాషా రాష్ట్రాలకు చేతులారా కోల్పోయారు. తరువాత అభివృద్ధిని హైదరాబాద్ పరిసర ప్రాంతాలకు దఖలు చేశారు. అయితే ఆనాడు ఆంధ్ర నాయకులు పోగొట్టుకున్నవి తిరిగి కలపాలనుకోవడం మంచిదే కాని, నేడు ఏదో చిరాకుతో ఉన్న హక్కులే కోల్పోతే తరతరాలు ఈ ద్రోహాన్ని క్షమించవు.

ఓ 30 టియంసిల నీటికోసమే మన తెలుగు ప్రజలు ఒక ప్రక్క కటకటకటలాడుతుంటే అల్మట్టి ( 300 టియంసిలు వాడుకోవచ్చు) ఎత్తును కర్ణాటక పెంచుకోవాలనే తెలంగాణ రాష్ట్ర సమితి నాయకుల డిమాండ్/ ప్రగాఢ ఆకాంక్ష మన ఖర్మకొద్దీ నెరవేరేటట్లే ఉంది. ఇక వచ్చే తరతరాలు తెలుగు జాతి నోటిన మట్టేనేమో? నిన్ననే టి ఆర్ ఎస్ ఎమ్మెల్యే, మరి వారి ఆస్థాన నిపుణుడు శ్రీశ్రైలంలో కనీస మట్టం లేకుండా క్రిందికి నీరు విడుదల చెయ్యకూడదని తెలంగాణకు కూడా అన్యాయం చేస్తూ నాగార్జునసాగర్‌కే నీరురాకుండా స్టే తీసుకు వచ్చింది విద్వేషాల పెంపుకేనా? రాష్ట్ర విభజన అయితే 700 కిలో మీటర్ల మన రాష్ట్ర సరిహద్దులు నదుల ప్రవాహాలతో పాటు వాటి మధ్యలోనే చీలి వెళుతూ ఉండటమే కాక, 8 అంతరాష్ట్రీయ ప్రాజెక్టులు ఉంటాయి. కావేరీనది క్యాచ్‌మెంట్ ఆ రాష్ట్రం మొత్తంలో 18 శాతం లేకపోయినా, నదీ జలాలపై ట్రిబ్యునల్, సుప్రీం కోర్టు, కేంద్రం ఆదేశాలు ఉన్నా కర్ణాటకలో జరిగిన మారణకాండ- ఇవన్నీ పూర్తిగా అర్థం చేసుకున్న తరువాత నీటి సమస్యలు ముందుగా పరిష్కరించుకునే విడిపోవాలని ఏ మాత్రం విజ్ఞత ఉన్న వారైనా కోరుకుంటారు. కేటాయింపుల కంటే ఒక్క చుక్క నీరు ఎవ్వరికీ ఎక్కువ అక్కరలేదు.

ఇక హైదరాబాద్. 1589లో ఆ నగర పునాది నిర్మాణం మొదలుపెట్టినప్పటినుంచి 432 సంవత్సరాలపాటు సాగిన నగర అభివృద్ధిలో తెలంగాణ సామాన్య ప్రజలతో పాటు అత్యధిక కాలం తీర సీమాంధ్రుల రక్తం స్వేదం కూడా ఉందనే నిజాన్ని ఎందుకు దాచి పెడుతున్నారు? పైగా హైదారబాద్ సంస్థాన ప్రజల రక్షణార్థం నిజాంలు బలిమేకలాగా రాయలసీమని బ్రిటిష్ వారికి అప్పగించారు. 1972లో హైదరాబాద్ వద్దని ప్రత్యేక ఆంధ్రరాష్ట్రం కావాలని ఉద్యమిస్తే తెలంగాణ ముఖ్యమంత్రి , తెలంగాణ నాయకులు ఇతరులు దారుణంగా ఆంధ్రులని పిట్టల్లా కాల్పించారు ( ఉద్యమంలో వందలాదిమంది ప్రాణాలు కోల్పోగా / వేలాది మంది క్షతగాత్రులు అయ్యారు).

అలా ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఉద్యమాన్ని అణిచివేసి హైదరాబాద్‌ని అందరి నిధులతో అభివృద్ధిచేయాలని ఒప్పందం చేయించి వందలాది రాష్ట్ర సంస్థలు పరిశ్రమలే కాక వందల కేంద్ర సంస్థలు కూడా అక్కడే పెట్టించారు. మరల ఇప్పుడు నలభై సంవత్సరాల తరువాత హైదరాబాద్ మీద ఏ విధమైన హక్కూ లేదనటం సరైనదా? కోటిపై బడి ఆదాయం వస్తూ లోటులో ఉండే ఒకనాటి హైదరాబాద్ పరిస్థితిని నేటితో పోల్చలేము. 1972లో ఆంధ్ర ఉద్యమాన్ని అణిచివేస్తూ డిసెంబరు 21న ‘అత్యధిక మెజారిటీ’ ఉన్న ప్రధాని ఇందిరాగాంధి అధికారికంగా రాష్ట్రాన్ని విడగొట్టేది లేదు అని ప్రపంచానికి పార్లమెంట్ సాక్షిగా చేసిన ప్రకటనని తీరసీమాంధ్రులు శాశ్వతమని నమ్మారు.

అదే రోజు విడిపోయి వుంటే తీర సీమాంధ్రలు దేశంలోనే నెంబర్ 1గా ఉండేవి. పరాయి పంచన ఎందుకు బతుకుతారు పోయి మీ ప్రాంతాలలో స్వాభిమానంతో పాటు బతకండని ఒకరూ, తెలంగాణ వస్తే లక్షల మంది ఉద్యోగాలు లాక్కుని తీరుతాం అని మరొకరు, తమ స్వంత రాజకీయ లబ్ధి కోసం రోజుకో విధంగా మరి కొందరు బెదిరిస్తుంటే అక్కడ స్థిరపడ్డ మిగతా ప్రాంతవాసులు ఎక్కడికి పోవాలి.. చావాలా అంటూ ఆవేదన చెందే రమణ లాంటి మధ్యతరగతి వారి ఇబ్బందులను పట్టించుకోవాలి కదా? లక్షలాది మధ్యతరగతి ఉద్యోగ కుటుంబాలకి ప్రాతినిధ్యం వహించే ఎపి ఎన్ జి ఓ సంఘం కూడా సమైక్యాంధ్ర అంటుంది.

అందువల్ల మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాల ప్రకారం ఖచ్చితంగా వారి సూచనల, పట్టికల, పటాల ప్రకారం ప్రత్యేకంగా హైదరాబాద్ మహానగర ప్రాంతాన్ని దేశానికి రెండవ రాజధానిగా చేస్తే రక్షణలతో పాటు చుట్టు ప్రక్కల తెలంగాణ ప్రాంతాలు అనితర అభివృద్ధిని సాధిస్తాయి. పైగా తెలంగాణ రాజధాని కూడా సహజంగానే హైదరాబాద్‌లోనే ఉంటుంది. హైదరాబాద్‌తో పాటు దీటుగా అభివృద్ధి జరపి కోస్తా సీమలకు ప్రత్యేక రాజధానులు ఏర్పాటు చేయవచ్చు. రాష్ట్రం రెండుగా విడిపోతే పెనంలోంచి పొయ్యిలో పడ్డట్లు పాత కర్నూలునో లేదా రేణిగుంట / తిరుపతినో కోస్తావారు రాజధానిగా ఒప్పుకోరు.

అలాగే బైరెడ్డి, రమణారెడ్డి లాంటి ప్రత్యేక సీమ వాసులు చేసే భీకర సింహనాదాలు విన్న తరువాత కలహాలు, సందేహాలు, బుజ్జగింపులతో మరో సీమ తీర ఉమ్మడి రాష్ట్ర ప్రయోగం నిస్సందేహంగా విఫలం అవుతుంది. ముందే మూడు లేదా నాలుగు రాష్ట్రాలు స్పష్టంగా ప్రకటించకపోతే తాంబూ లిచ్చాం తన్నుకు చావండి అన్నట్లుండే పరిస్థితి ఖాయం. అందువల్ల జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ సూచించిన ప్రకారం నాలుగైదు తాలూకాలు కలిపి (కోస్తా, సీమలకు భూసరిహద్దుతో) హైదరాబాద్‌ను మెట్రోపొలిస్ చేస్తే మూడు రాష్ట్రాలకి ఉమ్మడి రాజధానిగా ఏర్పరచవచ్చు. ఆయా రాష్ట్రాలలో రెండవ రాజధానులు (కొంతకాలం తరువాత ముఖ్య రాజధానులుగా మార్చుకోవచ్చు) అనేక హైకోర్టు బెంచ్‌లు ఏర్పరచుకుని ఇప్పటినుంచే సేవారంగం, ప్రభుత్వ సంస్థల స్థాపన, వికేంద్రీకరణ ద్వారా అభివృద్ధిచేసుకోవడం సూచించవచ్చు.

కొందరు ప్రత్యేక తెలంగాణ నాయకులు భర్తీచేయాల్సిన లక్ష ఉద్యోగాలపై మాట్లాడకుండా రాజకీయం కోసం తెలంగాణేతర భారతీయులు వేల/ లక్షల ఉద్యోగాలు ఆక్రమించుకున్నారనే అభూతకల్పనలు చెప్పడం మంచిదికాదు. అసలు ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలెన్నో, వాటిల్లో స్థానికేతరులు ఉండాల్సిన (20-30 శాతం) సంఖ్య కంటే ఎన్ని వందల మంది ఎక్కువగా ఉన్నారో తేలాలి. 1956-2012 సంవత్సరాల మధ్యన విద్యుత్, వైద్య, ఆరోగ్యం, విద్య, ఉద్యోగ, ఉపాధి, నీటి పారుదల, పారిశ్రామిక, సేవా రంగాలలో ఏ ప్రాంతాలు ఎంత అభివృద్ధితో పయనించాయో తేల్చాలి. అసలు గోదావరి, కృష్ణానదుల్లో మొత్తం ఐదు రాష్ట్రాల నుంచి ఎంత నీరు వస్తుందో ప్రతి విషయంలోనూ లెక్కలు ఖచ్చితంగా తేలాల్సిందే.

అపోహలు పోవాల్సిందే. ఎన్నో కమిటీలు ఆ ఆరోపణలు మోసం అని తేల్చినా ఆ కమిటీలపై కొందరు నమ్మకం లేదంటున్నారు కాబట్టి ఆరు నెలల సమయం తీసుకుని ఐక్యరాజ్యసమితి నుంచి కమిటీని ఏర్పాటుచేసి తేల్చాల్సిందే. దొంగలు ద్రోహులనే ముద్రలు అవాంఛనీయంగా తరతరాలు వేయించుకుని విడిపోవాల్సిన అవసరం ఎవరికీ లేనేలేదు. కింకర్తవ్యమేమిటి? సొంత లబ్ధి, స్వార్థరాజకీయాల కోసం తీర సీమాంధ్ర ప్రజలని అత్యంత దారుణంగా దూషించని ప్రత్యేక తెలంగాణ కోరే మంచి నాయకత్వం ముందుకు వచ్చి ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఉత్తరాంచల్‌లో లాగా ఉద్యమించి ఉంటే ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానం చేసి తెలంగాణ, సీమ, అలాగే ఎన్ని రాష్ట్రాలుగానైనా సుహృద్భావంతో శాస్త్రీయంగా విడిపోయి ఉండేవి. ‘ప్రాంతాలుగా విడిపోదాం-సోదరులుగా ఎప్పటికీ మెలుగుదాం’ ఇదే స్వర్గీయ కొండా లక్ష్మణ్ బాపూజీ కోరింది.

ఇప్పటికైనా ప్రొఫెసర్ హరగోపాల్, కోదండరాం, గాలి వినోద్‌ కుమార్, పత్రికా సంపాదకులు లాంటి మేధావులు ముందుకు వచ్చి స్వార్థ రాజకీయ నాయకుల స్వార్థం కోసం విద్యార్థుల త్యాగాలు అవసరం లేదని రాష్ట్రం వచ్చిన తర్వాత పునర్నిర్మాణం కోసం వారి పోరాటాలు అవసరమని చెప్పాలి. తమ స్వార్థం కోసం విద్వేషాలు రెచ్చగొట్టే నాయకులని దూరంపెట్టి, వెంటనే ఇతర ప్రాంతాలలోని సోదరులతో చర్చలు జరిపి సుహృద్భావంతో విడిపోయేటట్లు ప్రయత్నించాలి. అది సాధ్యం. ఉత్తమం. అలా కాకుండా కొందరు నాయకుల రెచ్చగొట్టిన విద్వేషాల ఆధారంగానే రాష్ట్ర విభజన జరిగి విడిపోతే ఈ భూమి ఉన్నంత వరకూ పక్క పక్క సరిహద్దులు ఉండే మన రాష్ట్రాల ప్రజలూ ప్రశాంతంగా ఎప్పుడూ ఉండలేరు.

ఉందామన్నా కొంత మంది స్వార్థ నాయకులు ఉండనివ్వరు. అఖిలపక్ష సమావేశ విషయానికి వస్తే తెలుగుదేశం, వై యస్ ఆర్ కాంగ్రెస్, సిపి ఐ, భారతీయ జనతాపార్టీ లాంటి పక్షాలు కోస్తా, సీమ హక్కులు కూడా ముందుగా పరిష్కరించాలని కోరకుండా తెలంగాణ ఇచ్చేస్తే మేమడ్డురామని తెలివిగా చెప్పామనుకుంటే అది తీర సీమాంధ్రులకి శాశ్వతంగా చేసిన ఘోర ద్రోహం గానే పరిగణించాలి. కోస్తా సీమవాసుల సమస్యలన్నీ ముందుగా పరిష్కరించి ఆ వెంటనే మూడు నాలుగు రాష్ట్రాలుగా చీల్చమని చెపితే మంచిదే.

కోస్తాంధ్ర నుంచి ఎన్నికైన ప్రజాప్రతినిధులు కేవలం 11 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులుగా పనిచేశారు. దశాబ్దాలుగా ఇతర ప్రాంతాల నుంచి ఎన్నికైన నాయకులని మోసీ మోసీ అసలు ముఖ్యంగా కోస్తా హక్కుల కోసం మాట్లాడే గట్టి ప్రతినిధే లేకుండా పోయారు. ఏకంగా ఉత్తర కోస్తాలో అయితే రెండు కోట్ల జనాభా ఉన్నా నేటివరకూ ఒక్కరూ ముఖ్యమంత్రి కాలేకపోయారు. ఏది ఏమైనా కోస్తా ప్రాంతానికి మంత్రులు, పెట్టుబడిదారులు, సినీ హీరోలు లాంటి వారు ఉన్నా ప్రస్తుతం దీటైన రాజకీయ నాయకత్వం కొరత చాలా స్పష్టంగా కనపడుతుంది. అక్కడ కూడా ఒక పోరాట పటిమ కల బహుజన సామాజిక నాయకత్వం బయటికి వచ్చి తెలుగు వారి సౌభ్రాతృత్వాన్ని దృష్టిలో ఉంచుకునే ఆంధ్రుల ఆత్మ గౌరవం కోసం, హక్కుల కోసం ఒక పార్టీ ఏర్పాటు చేసి ఆంధ్ర ఉద్యమాన్ని చేపట్టాల్సిన సమయం వచ్చింది. ఆ కోర్కె తొందరలోనే నెరవేరుతుందని గట్టి నమ్మకంతో ఉన్నాము.

చలసాని శ్రీనివాస్, ఆంధ్ర ఇంటలెక్చువల్స్ ఫోరం

ప్రకటనలు

వ్యాఖ్యలు»

No comments yet — be the first.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: