jump to navigation

deja vu Telangana అవే మాటలు, అవే చేతలు, అవే ప్రతిజ్ఞలు… – కె. శ్రీనివాస్ జూలై 3, 2011

Posted by M Bharath Bhushan in 1969, agitation, Congress, corruption, drama, JAC, KCR, regionalism, Sonia, suicide, TDP, Telugu (తెలుగు), TRS.
Tags: , , , , , ,
trackback

సందర్భం

అవే మాటలు, అవే చేతలు, అవే ప్రతిజ్ఞలు…
– కె. శ్రీనివాస్

…………………………………………….
తెలంగాణ నేతల దగ్గర కానీ, సీమాంధ్ర ప్రతినిధుల వద్ద కానీ కొత్త ఆయుధాలేమీ లేవు. కొత్త ఆలోచనలు కూడా లేనట్టున్నాయి. రాజీనామాలు చేయండి, రాజకీయ కల్లోలం సృష్టించండి, కానీ, మళ్లీ పోటీచేయడం ఎందుకు? దానివల్ల ఉపయోగమేమిటి? ఇప్పుడున్న అంకగణితమే అప్పుడూ ఉంటుంది కదా? – అని ప్రశ్నించేవారి గొంతు పీలగా మాత్రమే వినిపిస్తుంది. భావదారిద్య్రం వల్ల జరిగే పునరుక్తికి కూడా చారిత్రక పునరావృత్తానికి ఇచ్చే గౌరవం ఇవ్వగలమా?
…………………………………………….

డెజా వూ అన్న ఫ్రెంచి మాటకు అర్థం – ఇంతకు ముందే చూసినది – అని. ఒక దృశ్యం కానీ, సన్నివేశం కానీ, పరిస్థితుల సంపుటి కానీ ఎదురయినప్పుడు – అది ఇంతకు మునుపే అనుభవంలోకి వచ్చినట్టు అనిపించడమే డెజా వూ. మనోవైజ్ఞానిక శాస్త్ర పరిభాషగా వాడుకలోకి వచ్చిన ఈ మాట, ఇప్పుడు ఇతర శాస్త్ర, కళారంగాల రచనల్లోనూ, సాధారణ వ్యక్తీకరణల్లో కూడా భాగమైంది. రిజర్వేషన్ వ్యతిరేక ఆందోళన జరిగిన 80ల చివర్లో వరవరరావు డెజావూ శీర్షికతో ఒక గొప్ప దీర్ఘ కవిత రాశారు.

చరిత్ర పునరావృత్తం అవుతుందంటారు. నిజమే, కానీ యథాతథంగా కాదంటారు మార్క్స్. మొదటిసారి విషాదంగా జరిగినది రెండోసారి ఆభాసగా జరుగుతుందని ఆయన వ్యాఖ్యానించారు. ప్రతి మనిషికి సొంత జ్ఞాపకశక్తి ఉంటుంది, అంతేకాదు, సామూహిక జ్ఞాపకాలను చరిత్రగా, పురాణాలుగా భద్రపరచుకోవడం మనిషికి తెలుసు. విజయమో అపజయమో, సంబరమో సంక్షోభమో తారసపడినప్పుడు, గతంలోని అటువంటి సందర్భాలు గుర్తుకురావడం సహజం. అటువంటి అనేక పునరావృత్తాల నుంచి మనిషి అనుభవమూ జ్ఞానమూ పదునెక్కుతూ వచ్చింది.

తరచు ఎదురుపడే ఒకేరకమైన సందర్భాలను చూసి విసిగిపోయో, అర్థం చేసుకునే శక్తిలేకో మనిషి వేదాంతంలో పడిపోయి, జీవితం రంగులరాట్నం అనీ, చరిత్ర అంటే చర్విత చర్వణం అనీ, నిరంతరం ఒకే సంఘటనల క్రమం వలయాకారంలో జరుగుతుంటుందని నిర్ధారణకు వచ్చాడు. కానీ, అది నైరాశ్యంతోనో చమత్కారంగానో చెప్పుకునేదే తప్ప హేతువుకు నిలిచేది కాదని భౌతికవాదులు ఖండిస్తూనే వస్తున్నారు. ‘చరిత్ర పునరావృత్తమయ్యేదే నిజమైతే, మనిషి ఊహించని సంఘటనలు ఇన్ని ఎట్లా జరుగుతాయి? జరిగేది ప్రతీదీ మునుపెప్పుడో జరిగినదే అయితే, మనిషి తరచు ఎదురుదెబ్బలు ఎందుకు తింటున్నాడు? అనుభవం నుంచి నేర్చుకోవడంలో మనిషి ఉట్టి శుంఠ అన్న మాట’ – అంటాడు జార్జి బెర్నార్డ్ షా.

గతంలో జరిగిన సంఘటనలు ఏదో ఒక రూపంలో స్ఫురించే అవకాశమే లేకపోతే చరిత్రకు అర్థం లేదు. పోల్చుకునే సామర్థ్యమే లేకపోతే అనుభవానికి అర్థమే లేదు, చరిత్ర నుంచి అనుభవం నుంచి నేర్చుకోకపోతే మనిషికి జ్ఞానమే లేదు. అయినప్పటికీ, మనుషుల్లో కొందరు పోల్చుకోరు, నేర్చుకోరు, జ్ఞానాన్ని ఖాతరే చేయరు. తమబోంట్లకు చరిత్రలో ఏ గతిపట్టిందో తెలిసినా, తామొక్కరే భిన్నమనుకుంటారు. కాలం మునుముందుకే సాగుతుందని ఎన్ని సాక్ష్యాలున్నా, తిరోగమనం సాధ్యమేనని నమ్ముతారు.

న్యాయపక్షంలో నిలబడి ఓడిన వీరుడు మరణిస్తూ పునరుత్థానాన్ని వాగ్దానం చేస్తాడు. జనం చేతిలో చావు దెబ్బతిన్న వ్యవస్థ, ఆదమరిస్తే తాను మళ్లీ తలెత్తుతానని హెచ్చరిస్తుంది. అవశేషమైన చెడు మళ్లీ మళ్లీ పుడుతుంది. మిగిలిపోయిన మంచి కూడా మరోసారి ప్రయత్నిస్తూనే ఉంటుంది. పునరావృత్తం ఎందుకైనా సరే అది ఒక అసమగ్రతకు చిహ్నం, పట్టువదలని విక్రమార్కానికి సంకేతం. ప్రపంచగమనం నిండా అడుగడుగునా డెజా వూ లే.

తెలంగాణ ఉద్యమంలో మళ్లీ చెలరేగిన రాజీనామాల కలకలం మాత్రం ఆభాసా కాదు, అనివార్య పునరావృత్తమూ కాదు. కేవలం ఒక చర్విత చర్వణం. ఇప్పటికి ఎన్నిసార్లు రాజీనామాలు, ఎన్నిసార్లు ఉప ఎన్నికలు! ఇదే సన్నివేశం ఇంతకు ముందు పదే పదే జరిగినట్టు తెలిసిపోతూనే ఉన్నది. జానారెడ్డి ఇంటికి కెసిఆర్ – ఎప్పుడో విన్నట్టు లేదూ? డిసెంబర్ 9 వాగ్దానాన్ని నెరవేర్చనందుకే రాజీనామాలు చేస్తున్నట్టు లేఖ – ఇదీ జరిగినట్టే లేదూ? ఒక నిమిషంలో తేలేది కాదు తెలంగాణ – ఇదీ చిరపరిచితమే కదూ? రాజీనామాల వల్ల ఒరిగేదేమీ లేదు, ఎవరో చెబితే మేం చేస్తామా, మా నేత వేరు – ఈ మాటలూ అలవాటయినవే కదా? తెలంగాణ కోసం ప్రాణత్యాగమైనా చేస్తాం- తుప్పు పట్టిపోయినమాట.

శనివారం నాడే ఒక సీమాంధ్ర నేత కూడా ఈ మాట అందిపుచ్చుకున్నాడు- సమైక్యాంధ్ర కోసం ప్రాణాలైనా ఇస్తాం- అట. ఒక్కటి మాత్రం కొంచెం తేడాగా వినిపించింది. ఈ సారి తాము రాజీనామాలు చేయబోమని సీమాంధ్ర రాజకీయనేతలు చేసిన ప్రకటన. అప్పుడంటే తెలంగాణ నిజంగా వస్తుందేమోనని భయపడి రాజీనామాలు చేశాము, ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదు కనుక అటువంటి తీవ్రచర్య అవసరం లేదని వారు వివరణ కూడా ఇచ్చారు. అయినా అంతటి అవసరమే వస్తే, మళ్లీ అదే అస్త్రం తీయకుండా ఉంటామా? అని మరో సీమాంధ్ర నేత సన్నాయి నొక్కులు.

తెలంగాణ నేతల దగ్గర కానీ, సీమాంధ్ర ప్రతినిధుల వద్ద కానీ కొత్త ఆయుధాలేమీ లేవు. కొత్త ఆలోచనలు కూడా లేనట్టున్నాయి. రాజీనామాలు చేయండి, రాజకీయ కల్లోలం సృష్టించండి, కానీ, మళ్లీ పోటీచేయడం ఎందుకు? దానివల్ల ఉపయోగమేమిటి? ఇప్పుడున్న అంకగణితమే అప్పుడూ ఉంటుంది కదా? – అని ప్రశ్నించేవారి గొంతు పీలగా మాత్రమే వినిపిస్తుంది. భావదారిద్య్రం వల్ల జరిగే పునరుక్తికి కూడా చారిత్రక పునరావృత్తానికి ఇచ్చే గౌరవం ఇవ్వగలమా?

వంటావార్పులూ కొవ్వొత్తుల ప్రదర్శనలూ రాస్తారోకోలూ ముట్టడులూ మానవహారాలూ – అన్నీ అరిగిపోయాయి. లేస్తే మనిషిని కాననే భీషణ ప్రతిజ్ఞలకూ కాలం చెల్లిపోయింది. 1952, 1969, 2009 తిరిగి తిరిగి వస్తూనే ఉన్నది తెలంగాణ సందర్భం. పాలకుల దుర్మార్గం వల్లనో, నిర్లక్ష్యం వల్లనో కాదు, ఉద్యమాలలోని బలహీనతల వల్ల కూడా ఒకే సన్నివేశం పదే పదే ప్రత్యక్షమవుతున్నది.

పరమపదసోపాన పటంలో పాము మింగినప్పుడల్లా మళ్లీ మొదటినుంచి పావులు కదపవలసి వస్తుంది. కేశవరావు మొహం చూడండి, జానారెడ్డి మాటలు వినండి, నాగం ఉద్ఘాటనలు ఆలకించండి, ఎర్రబెల్లి అభిభాషణను గమనించండి- ఎక్కడో చూసినట్టే, విన్నట్టే, అన్నీ తెలిసిపోయినట్టే ఉంటున్నాయి.

ఇక కెసిఆర్ అయితే, తనను తానే ప్రతిధ్వనిస్తూ వస్తున్నారు. అన్ని మొహాల్లో మరేవో ముఖాలు తొంగిచూస్తున్నాయి. కంఠాలు ఖంగుమంటున్నా, చూపుడువేళ్లు సవాళ్లు విసురుతున్నా, అందరి పాదాలూ వారి వారి పార్టీల గుంజలకు కట్టేసే ఉన్నాయి. తెగింపు కనిపిస్తోందా, త్యాగనిరతి తెలుస్తోందా, దృఢసంకల్పం వ్యక్తమవుతోందా, ఎవరిలోనైనా శ్రీకాంతాచారి కనిపిస్తున్నాడా? తప్పదేమో ఒక్కోసారి, మళ్లీ మళ్లీ మొదలుపెట్టవలసి రావచ్చు. దెబ్బతిన్నవాడు కోలుకుని కత్తిపట్టడానికి సమయమూ పట్టవచ్చు. సుదీర్ఘ పోరాటంలో కొంత కాలక్షేపమూ అవసరం కావచ్చు.

రాజకీయ వ్యూహాల్లో వెనుకబడితే రేపు ఫలితంలో వాటా దక్కకపోవచ్చు. కానీ, జనం మాటేమిటి? ఇదిగో ఇక్కడిదాకే అని మభ్యపెట్టడం ఎందుకు? మూలమలుపులోనే తుదిమజిలీ ఉన్నదని మాయ చేయడం ఎందుకు? ఆందోళనతో ఉత్కంఠతో ఆత్మహత్యలెందుకు, ఊపిరి ఆగిపోవడం ఎందుకు? పదే పదే అదే జరగడంలో మా బాధ్యతేముందని ఎవరైనా ప్రశ్నించవచ్చు. మొదటిసారి మోసపోతే మోసగాడి తప్పు. మళ్లీ మళ్లీ మోసపోతే మోసపోయేవాడిదే తప్పు అంటారు. అనుభవం ఏమినేర్పింది నాయకుడా నీకు? కాంగ్రెస్ ఏమి చేస్తుందో నీకు తెలియదా? పదేపదే ఆశాభంగమైన విద్యార్థి ఏమి చేస్తాడో నీకు అర్థం కాలేదా? యాంత్రికంగా జరిగే పునరావృత్తంలోకి ప్రవేశించి దారిమరల్చాలని తెలియదా నీకు?

రాజీనామాల ప్రకటనతో గడువు గండం గట్టెక్కవచ్చు. ఢిల్లీ పిలుపువచ్చి లాలన బుజ్జగింపు దొరికితే వీరులు మెత్తపడనూ వచ్చు. అడుగు ముందుకు పడినందుకు ఆశావాదులు ఇప్పుడు ఆనందించవచ్చు. సహజమే. పునరావృత్తపు హింసలో ఆశ ఒకటే ఉనికిని కాపాడుతుంది. కానీ, ఆస్కారం లేని చోట అత్యాశ మొదటికే మోసం తెస్తుంది. ప్రాంతీయ మండలి పునరావృత్తమై ఉద్యమాన్ని వెక్కిరిస్తుంది. మరో ఆరు సూత్రాలో, వేల కోట్ల ప్యాకేజీయో పరిష్కారమై పలకరిస్తాయి. ఉద్యమం మరో తరం వాయిదా పడుతుంది. సిద్ధంగా ఉన్నావా తెలంగాణా?

ఏదో ఒకటి తేల్చమని అక్కడా ఇక్కడా కోరుతున్నారు. నిష్క్రియలో నిండా మునిగిన కేంద్రం ఏదీ తేల్చదు. గొంగడి వేసిన చోటనే ఉంటుంది. మూడోసారి నాలుగో సారి కూడా చరిత్ర విషాదంగానే పునరావృత్తమవుతూ ఉంటుంది.

– కె. శ్రీనివాస్
andhra jyothy 3/7/2011

source: https://www.andhrajyothy.com/EditorialShow.asp?qry=2011/jul/3/edit/3edit1&more=2011/jul/3/edit/editpagemain3&date=7/3/2011

ప్రకటనలు

వ్యాఖ్యలు»

1. కృష్ణశ్రీ - జూలై 3, 2011

ఇన్నాళ్లకి ఓ మంచి టపా ప్రచురించారు వుత్సవ కమిటీ వారు. రచయిత కె. శ్రీనివాస్ తో యేకీభవించాలా వద్దా? అసలు లేని గోదావరిని వూహించుకుంటూ, దాన్ని కుక్కతోక సాయంతో ఇదేద్దామనుకునేవాళ్లేమంటారు?


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: