jump to navigation

ఈ గడిని కూలగొట్టు.. అల్లం నారాయణ మే 27, 2010

Posted by Telangana Utsav in 1969, agitation, Andhra, BCs, compromise, corruption, Culture, heritage, Hyderabad, Identity, Mulki, Muslim, Osmania, politics, Reddy, regionalism, SC, Settler, ST, struggle, students, suicide, Telangana, Telugu (తెలుగు), Velama, youth.
Tags: , , ,
trackback

ఈ గడిని కూలగొట్టు.

అల్లం నారాయణ

మరొక గడిని కంటున్నది తెలంగాణ. కూలిపోయిన గడి మళ్లీ మొలుస్తున్నది. గడి కోటగోడలు బద్దలు కొట్టింది తెలంగాణ. అరవై ఏళ్ల కిందటి మాట. తట్టు ఆరామ్ కుర్సీ.. తక్తు బల్ల.. కండ్లద్దాలల్ల నుంచి కిందకి మీదికి చూసే పట్వారీ, పటేల్‌లు. మీసం మెలేసే దొరల గడీలు కూల్చింది తెలంగాణ. వీర తెలంగాణ విప్లవ పోరాటం. వేల మంది ప్రాణాలను బలిచ్చిన తెలంగాణ. గడిని నేలమట్టం చేసింది. కానీ.. తెలంగాణలో ప్రజారాజ్యం రాలేదు. తెలంగాణ వెతుకులాడిన ఆత్మ దొరకలేదు.

అది పరాయిదై పలవరించినప్పుడు, ఎవరో ఎక్కి తొక్కినప్పుడు ఊపిరాగిన క్షణాలను, కాగడాలా మళ్లొకసారి వెలిగించింది తెలంగాణ. పోలీసు చర్య. కూలిన గడి మళ్లీ మొలిచింది. దొడ్డి కొమరయ్య, బందగి, చాకలి ఐలమ్మల వారసులెవరు? వారెక్కడ? పలుగులు, పారలు, బర్మార్లు, బందూకులు పట్టిన తెలంగాణ సాయుధ పోరాట వీరుల వారసులేమయ్యారు? నిజాం గడికి.. గ్రామాల్లో కోటలు కట్టిన జాగీర్దార్లు, దేశ్‌ముఖ్‌లు.. ముఖాలు మార్చుకుని, రూమీటోపీలు, గాంధీ టోపీలయి మళ్లీ తెలంగాణల గడి మొలిచింది.

నిట్టనిలువునా.. కాపోతే అది మరింత మెరిసిపొయ్యే గడి. ప్రజాస్వామ్యం గడి. విశాలాంధ్రలో ప్రజారాజ్యం వస్తుందనుకుంటే వలసల రాజ్యం స్థాపించింది ప్రజాస్వామ్యం. కొలువులు తన్నుకుపొయ్యారు. కోటలు కట్టారు. తన ప్రాంతంలో తాను పరాధీన అయినప్పుడు నలభై ఏళ్ల కింద లేచి నిలబడింది తెలంగాణ. సాదాసీదా రైతు కుటుంబాల నుంచి ఎదురీది ఎక్కివచ్చిన పిల్లలతో నిండిన యూనివర్సిటీలు, కాలేజీలు, కార్ఖానాలు ప్రత్యేక రాష్ట్రం కల కన్నవి. ఆ కలను చిదిమేసింది ప్రజాస్వామ్య గడి. తెలంగాణ అప్పుడొక ఘనత వహించిన పోలీసు మ్యూజియం.

navya. నానాజాతి పోలీసుల అడ్డా. బీహార్ సాయుధ బలగాలు, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, మలబారు స్పెషల్ పోలీసు, ఉత్తరప్రదేశ్ సాయు« ద పోలీసు, జమ్మూకాశ్మీర్ మిలీషియా, గూర్ఖా, మరాఠా సాయుధ బలగాలు.. విశాలాంధ్ర ప్రజాస్వామ్యం.. మున్నూ టా డెబ్బై మంది ప్రాణాలను బలిగొని.. కూలగొట్టిన, బద్దలుకొట్టిన గడీలను మరోసారి పునః ప్రతిష్టించింది.

మనసు, అది కలత చెందినప్పటి భావోద్వేగము, కళ్ల ముందరి పచ్చి అన్యాయాలకు మసిలిన ఆవేశ, ఆక్రోశాలతో ఎగరేసిన తెలంగాణ పతాకలయిన విద్యార్థులు, జీవోల మాయామర్మాల్లో చిక్కు దారపు ఉండలను కనిపెట్టి తెలంగాణ ఆగమై పోతుందనుకున్న ఎన్జీవోలు, నిరుద్యోగులు.. అప్పుడే గడ్డాలు మొలిచిన పసిరేకల పిల్లలు నడిపిన ఆ ఉద్యమమూ.. ప్రజాస్వామ్య గడీ లో.. రాజకీయ దొరలు ఆక్రమించుకున్న గత చరిత్ర.

వైట్‌హౌస్ కోటలోంచి వచ్చిన అతను చెన్నారెడ్డి కావొచ్చు… నిజాం తొత్తు. దేశ్‌ముఖ్‌లు, జాగీర్దార్ల వారసుడు కావచ్చు. అతను ప్రజాస్వామ్య గడీలో గాంధీ, లేదా నెహ్రూ టోపీ ధరించిన కాంగ్రెస్ నేతా కావొచ్చు. చివరికి గడి మళ్లీ నిలిచింది. కానీ.. తెలంగాణ కదా.. గాయపడిన ప్రతిసారీ.. ఓడిపోతున్న ప్రతిసారీ.. కూలిపోతున్న ప్రతిసారీ.. కొన్ని కన్నీళ్లు.. అనంత త్యాగాలు.. కొంత నెత్తురూ ప్రవహించే వారసత్వం. తెలంగా ణ నక్సల్బరీ అయింది. గడీలు మళ్లీ బద్దలయినయి. పారిపోయింది దొరతనం.

తక్తు బల్లలు విరిగిపోయినయి. ఆరామ్ కుర్చీలు చిరిగిపోయినయి. గడీల గుడ్లగూబ కూసింది. గోడల్ల పచ్చటి మొక్క సూర్యునికేసి నిటారుగా చూసింది. కత్తుల కోలాటం.. త్యాగమెవరిది? పోరాటమెవరిది? పోరాడేవాడిదే ఎర్రజెండా.. తెలంగాణ మళ్లీ లేచి నిలుచున్నది. కల్లోలమయింది. కల్లోలితమయింది. ఆలివ్‌గ్రీన్ ఆయు«ధ ధారి.. తెలంగాణకు విముక్తి ప్రసాదించే విప్లవ యోధుడయ్యాడు. కాలం మారింది. దొరల కాళ్ల కింద నేల కళ్లలో చిమ్మిన కాలం. గడీలకు అగ్గి, నీళ్లు బంద్. కాలం కడుపుతో ఉండి విప్లవాన్ని కన్నది.

మళ్లీ ప్రజాస్వామ్యం ప్రవేశించింది. చరిత్ర రెండోసారీ.. మరోసారీ.. నెత్తుటి శిశువులను కన్నది. పందొమ్మిది వందలా నలభై ఎనిమిది.. పందొమ్మిది వందలా అరవై తొమ్మిది.. పందొమ్మిది వందలా.. డెబ్భైలు.. గడి కూలినట్టే కూలింది. పాటగాడు పరివ్యాప్తమైన నేలంతా పచ్చని భూములు నవ్వినయి. భాగో.. దొరా.. భాగో.. కాలం మారింది. తెలంగాణ విముక్తి జరగనే లేదు. ప్రపంచమే రూపుమార్చుకున్నది. అమెరికా అంతటా వ్యాపించింది. మార్కెట్ మంత్రజపం ఆసియానూ కమ్ముకున్నది.. కాలం మారింది.

భూములు పోతేనేం.. జాగాలు పోతేనేం.. గడీలు కూలితేనేం.. పల్లె వేరు మూలాలు తెగితేనేం.. సింగేసి ధోతి కట్టిన దొర.. పట్నంల కాంట్రాక్టరయ్యాడు.. బ్రాందీ షాపు యజమాని అయ్యాడు. ఎకరాలు వదిలిన దొర గజాలు, మూరల లెక్కన రియల్ వ్యాపారయిండు. షానిగయిండు దొర. గెట్ల మీద మీసం మెలేసిన దిష్టిబొమ్మ.. ఇప్పుడు పట్నంల గడీ కట్టింది. అది కొత్త గడి.. తెలంగాణల మళ్లీ గడి మొలిచింది.

అది నాజూగ్గా ఉంది. తట్టు కుర్చీ.. తక్తు బల్ల స్థానంలో రెగ్జిన్ కుట్టిన షోకులాడి కార్పొరేట్ కుర్చీ.. ముందర తళతళలాడే బిజినెస్ మేజాబల్ల.. కుర్చీ ఒదుగుతున్నది.. తిరుగుతున్నది… తెలంగాణ మారలేదా? తెలంగాణకు ఏమీ ఒరగలేదా? కానీ.. రాజకీయము, ఆర్థికము, సామాజికము, సాంస్కృతికము.. సమ న్యాయము.. అన్నీ పద్ధతులు మారిన, రూటు మారిన, రూపు మారిన దొర గడీల నిర్మాణం చట్రంలోనే ఉన్నప్పుడు.. ఏమి మారింది తెలంగాణ.. పద్నాలుగేళ్ల కిందట, పాటగాడు.. ఆటగాడు.. బుద్ధిజీవి.. కడుపు మండిన మాజీ విప్లవకారుడు.. విద్యార్థి.. కవి.. జర్నలిస్టు.. తెలంగాణ మీద పావురం ఉన్న ప్రతివాడూ.. ఉద్యోగి.. ఉపాధ్యాయుడు.. ఆచార్యుడు.. మళ్లీ ఒకసారి.. మళ్లీ మళ్లీ ఒకసారి.. తెలంగాణ పతాక నెత్తుకున్నాడు.. మలి తెలంగాణ చరిత్రకు తొమ్మిదేళ్లు కాదు.. పద్నాలుగేళ్లు.. భువనగిరి, వరంగల్లు.. చరిత్రను గడీ కమ్మేసింది.

గడీ మబ్బులో.. గడీ ముసురులో చరిత్ర.. మళ్లీ పోరాటం మొదలయింది. చరిత్రలో కవి, గాయకుల చిరునామా ఎక్కడ. ఫుట్‌పాత్ నుంచి ఫుట్‌పాత్ దాకా.. పై కప్పు లేని గుడిసెల నుంచి గుడిసెల దాకా.. జీవితం ప్రారంభమైన కాన్నుంచి.. మళ్లీ అంతమయినదాక.. మూడు విప్లవాలు.. తెలంగాణ సాయుధ పోరాటం.. ప్రత్యేక తెలంగాణ పోరాటం.. నక్సల్బరీ రైతాంగ పోరాటం.. ఇప్పుడిక నాలుగో విప్లవం.. పోరాడిందెవరు?

ప్రాణమిచ్చింది ఎవరు? అనిశెట్టి రాజ్‌కుమార్.. నువ్వివ్వాళ్టికి మాత్రమే చివరివాడివి.. మలి పోరాటంలో శ్రీకాంత్ చారి మొదటి వీరుడు.. గడి మాటలు మాట్లాడుతూ ఉంటుంది. అదొక డెమొగాగీ.. వదరుబోతు.. తలలు నరుక్కుంటుంది. చస్తానంటుంది. కానీ గడి.. నిట్టనిలువునా పెరుగుతూ ఉంటుంది. ఆర్ట్స్ కాలేజీలో లాఠీలు, బుల్లెట్లు మింగిన పిలగాడెక్కడ? వాడి త్యాగానికి గడి పెట్టుబడి పెట్టినట్టు బొంకుతున్నది. గడి లక్షణం. గడి ఆధిపత్యం. గడిదే రాజ్యం.. బతుకమ్మలాడిన వాళ్లెక్కడ?

రోడ్డు మీద బట్టలుతికిన వాళ్లెక్కడ? బాడిసె చెక్కిన వాళ్లెక్కడ? ఉద్యమ పతాకం ఎత్తిన వాళ్లెక్కడ? ఎవరిది చిరునామా? ఎవ్రీ బడీ క్లెయిమ్స్.. నెత్తురు చిందించిన వాడి త్యాగం.. నిలువు నిలువునా కాలిపోయిన వాడి త్యాగం. గడి మళ్లీ.. మెరుగు పెట్టుకున్నది.. ఇప్పుడిక తెలంగాణ కోసం ఆంధ్రలో యాత్ర చెయ్యాలా? అంతర్యుద్ధాన్ని డిసెంబర్ తర్వాత ప్రారంభించాలా? అప్పుడప్పుడు తల నరుక్కోవాలా? శ్రీ కృష్ణ కమిటీ ముందు మోకరిల్లాలా? జగన్‌కు అడ్డు తగలాలా? జూ.ఎన్టీఆర్ సినిమా అడ్డుకోవాలా?

ఎజెండా గడిది.. పాటించడం ప్రజ లది.. అరుణాచలం చెబుతాడు.. అనంత జనం పాటిస్తారు. కానీ.. తెలంగాణ కదా.. అది ఇవ్వాళ్లే కాకతీయ యూనివర్సిటీలో గవర్నర్ ప్రసంగానికి అడ్డం పడి అరెస్టయిన అయిదుగురు తెలంగాణ పిల్లలను పదే పదే కంటుంది. రూపం మార్చుకున్న గడీలను బద్దలు కొట్టందే తెలంగాణ రాదు.. గడీలు బద్దలు కొడదాం.. ఫుట్‌పాత్‌గాళ్లు.. పేదరికంలో వికసించిన వజ్ర పుష్పాలు.. త్యాగాల సాలుబోసిన యాదయ్యలను తెలంగాణ కంటూ ఉన్నంతకాలం.. ఇదొక రుద్రభూమి. తెలంగాణలో గడీలు కూలే కాలం కోసం.. తెలంగాణ కోసం.. పలవరిస్తూ.. కలవరిస్తూ..

(నా సహాధ్యాయి.. చిరకాల మిత్రుడు ఎం.భరత్ భూషణ్‌కు ప్రేమతో..)

source : andhra jyothy 22 may 2010

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / మార్చు )

Connecting to %s

%d bloggers like this: