jump to navigation

ఆంధ్ర వ్యాపారాల బహిష్కరణతో ప్రత్యేక తెలంగాణ డిసెంబర్ 31, 2009

Posted by Telangana Utsav in 1969, agitation, Andhra, Congress, Economy, Hyderabad, Identity, livelihoods, politics, regionalism, Sonia, Telangana, Telugu (తెలుగు).
trackback

కాళోజీ స్పూర్తితో కర్తవ్యాన్ని గుర్తిద్దాం

అనిత, తెలంగాణ ఉత్సవ్ కమిటి

కన్నడులు మహారాష్ట్రులు తుర్కీ
అన్నయ్యలు తరతరాలేలినది.
గుజరాతీ, మార్వాడీ, పారిసీ
గుజ్జన గూళ్ళు అనుభవించినది
కాబూలీ ఈరాని భాయీలకు
కనువిప్పుగ వెలిగిన విధమిది.
తెలంగాణమిది తెలంగాణమిది
తీరానికి దూరాన ఉన్నది.
ముంచే యత్నము చేస్తే తీరము
మునుగును తానే తీరము తప్పక (కాళోజి)

ఎవరు ఎంత కాలం పాలించినా, తెలంగాణాగడ్డ ఎన్నిరకాలుగా దోపిడీకి గురైనా,ఎన్నో సార్లు తెలంగాణా ప్రజలు దోపెడీ వ్యతిరేక ఉద్యమాలు చేసి విజయం సాధించినా మునుపెన్నడూ లేనటువంటి పరిస్థితులు ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొని ఉన్నాయి. ‘మమ్మల్ని దోచుకున్నది చాలు ఇంక ఎల్లిపొండంటె, ‘మేము మిమ్మల్నొదలం మీతో కలిసే ఉంటాం, దోపిడీ ఇలానే కొనసాగిస్తాం’ అంటూ కనీ వినీ ఎరుగని రీతిలో “అన్యాయ పోరాటం” చేస్తున్నారు. అందుకు కాంగ్రెస్ మద్దతు పలకడం, తెలంగాణకిచ్చిన వాగ్దానాలు పదేపదే వెనక్కి తీసుకోడము పెద్దగా ఆశ్చర్యంకలిగించాల్సిన విషయం కాదు. ఎవరో దయదలచి ఉత్తపుణ్యానికి బర్త్ డే కానుకగనైనా తెలంగాణను ఇవ్వకపోరా అనుకొంటే ఇట్లనే ఉంటది.

“వీర తెలంగాణ నాది వేరు తెలంగాణ నాది
వేరై కూడ తెలంగాణ వీర తెలంగాణ ముమ్మాటికి.
తెలంగాణ వేరై నిలిచి భారతాన వెలయు ముమ్మాటికి” అన్న కాళోజి పోరాట స్ఫూర్తికి ప్రత్యామ్నాయంగా ఎన్నికల ప్రక్రియలతో, వోట్ల గారడిలోని ఎత్తులకు పైయెత్తులతో సాదిస్థామన్న వ్యూహం ఎంత కాలయాపనకు కారణమైందో, ఏ విధంగా పూడ్చలేని వనరుల నష్టానికి దారితీసిన తీరుకు సమకాలీన చరిత్రే సాక్ష్యం. లాబీయింగ్ సూత్రం విఫలమందని అకస్మాత్తుగా ఆమరణ దీక్షల బెదిరింపులే ప్రత్యామ్నాయంగా కొనసాగిన ప్రస్తుత తీరు పాలకుల నైజాన్ని మార్చడంలో విఫలమైంది. కాంగ్రేసు మోసపూరిత వాగ్దానాల వెల్లువను ఆపలేక పోయింది. ఇవన్నీ చెప్పేది ఒకటే- దయతో ఇస్తే తీసుకొనేది కాదు మన స్వరాష్ట్రం, దోపిడిని కరుణతో వొదిలి ఎల్లిపోరు దోపిడీదారులు అనేదే కాళోజి వీర తెలంగాణ వేరు తెలంగాణ స్ఫూర్తి.

“వీర తెలంగాణము వైనంతో భారత పౌరుని ధీధైర్యముతో
ప్రజావాణి నా గొడవ మిన్న ‘ప్రజా’ ప్రకటన చేస్తున్నది” (కాళోజి)

ఆంధ్ర ప్రాంత దోపిడి ఆధిపత్యానికి వ్యతిరేకంగ ప్రజలు ఎత్తుకొన్న తిరుగుబాటు జెండాను ఈమధ్య ఈ ప్రాంతం ఆ ప్రాంతమన్న తేడాలు లేకుండా రాష్ట్రం లోని అన్ని ప్రాంతాల్లోని పార్టీలూ తెలంగాణ వాదాన్ని వాడుకున్నాయి. ఐనా ఎవరైనా తెలంగాణ వాదం ప్రజల్లో అంతగా లేదు అంటే ఎందుకులేదంటూ ఏ పార్టీ నోరు విప్పదు. ఈ వాదాన్ని అడ్డుపెట్టుకొని లాభం పొందిన వాళ్ళమే కదా అని ఒక్కరూ అనరు. నిజాన్ని ఒప్పుకుంటే సమస్యను పరిష్కరించవలసి వస్తుందని భయం. అంటే ఈ సమస్యకు శుభం పలకాలనే ఉద్దేశ్యం ఏ పార్టీకి లేదనేది స్పష్టం.

అయితే ఇదంతా ఆంధ్రా ప్రయోజనాలకు కొమ్ముకాసే పార్టీల దుర్నీతి వల్లనే వాళ్ళ దోపిడి కొనసాగుతుందా? ఆంధ్రా వాళ్ళ దోపిడి ఆదిపథ్య కుట్రలను వ్యతిరేకించే వ్యూహంలో కూడా లోపాలున్నాయా అనే ప్రశ్న తెలంగాణ ప్రజలు వేసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.

అంధ్రా వలసపాలకులు తెలంగాణా ప్రజల్ని దోచుకుంటున్నారంటే, ఇదంతా తెలంగాణా ప్రజలకు తెలియకుండా రాత్రికి రాత్రి జరిగిపోయిందేమీ కాదు. మన ప్రాంతాన్ని దోచుకొనే ఆర్థిక దోపిడీ సంబంధాలు ఆధిపత్య విధానాలకు మొత్తంగా పాలనా వ్యవస్థను వారికి అనుకూలంగా శాసించే విధంగా మారడమేకాక మన దైనందిన జీవితాల్లోకి జొరబడి మన భాషను కట్టూ బొట్టును ఉనికిని చిద్రంచేసే స్థాయికి ఎలా ఎదిగింది? వ్యాపారానికొచ్చి దేశాన్నే కబళించే మహమ్మారిగా మారిన బ్రిటిష్ వాడిగా ఎలా రూపాంతరం చెందిందో, ఆలోచించాలి. అంతేకాక వారి దోపిడి మూలాలకున్న అన్ని రూపాలను గుర్తించాలి, ప్రశ్నించాలి, అంతం చేయాలి. అలాంటి ప్రయత్నం ప్రస్తుత ఉద్యమంలో ఏ మేరకున్నది, ఎందుకు ఆశించినంతగా లేదు అని కూడా సూటిగా ప్రశ్నించాలి. అలా ప్రశ్నించడము, తెలుసుకొన్న అన్యాయాన్ని రాజీలేకుండా, ఎలాంటి మినహాయింపులు లేకుండా, కూకటివేళ్ళతో పెకిలించడమే కాళోజి స్పూర్థి. ఆ స్పూర్థి ప్రస్తుత ఉద్యమంలో ఏ మేరకున్నది, ఎంత నిలకడగా ఉన్నదో పరిశీలించుకోవడము అవసరం. దోపిడీ ప్రయోజనాలకు కొమ్ముగాసే పార్టీల మోసాల్లో భాగంగ ఒక డెడ్లాక్ నుంచి ఇంకొక డెడ్లాక్లో చిక్కుకోవడమనే విషమ స్థితినుంచి ఉద్యమం బయటపడేందుకు ఈ విశ్లేషణ సహకరిస్తుంది.

హైదరాబాదు మావల్లే అభివృద్ది చెందిందనీ, అది మాకే ఇవ్వాలి లేదా నష్టపరిహారమివ్వాలనే ప్రస్తావన ఎక్కడినుంచొచ్చింది? సినిమాల్లో, బయటా బహిరంగంగా తెలంగాణా భాషని అవమానిస్తున్నాంటే అది ఎవరిచ్చిన అలుసు? అలాంటి ఆధిపత్య ధోరణులను వారి దోపిడీ వ్యాపారాలను తెలంగాణా ప్రజలు వ్యతిరేకిస్తే, అలాంటి సినిమాలను చూడకపోతే ఎవరైనా అలాంటి సాహసం చేస్తారా? ఒక్క తెలంగాణా వాడైనా ఆంధ్రా ప్రాంతంలో ఉండగలుగుతాడా అంటే దానికి కారణం తెలంగాణా వాళ్ళు పిరికివాళ్ళనా? లేక ఆంధ్రావాళ్ళు మనల్ని అక్కడకి రానివ్వలేదనా? ఖచ్చితంగా రెండోదే.

తెలంగాణ వాళ్ళు ఎవరినయినా రానిచ్చారు. ఎంతోకాలంగా అనేక జాతులవాళ్ళు, అనేక ప్రాంతాల వాళ్ళు, అనేక భాషల వాళ్ళు ఉన్నారు. తెలంగాణ సమాజంలో ఎన్నెన్నొ మార్పులొచ్చినా వీరెవ్వరు మాకు అన్యాయం జరిగిందనిగాని, మావల్లనే తెలంగాణ అభివృద్ది జరిగినదని గాని అనలేదు. నిజాం పాలన కూలిపోయి 1948 లో హైదరాబాదు స్వరాష్ట్రం ఏర్పడినప్పుడు, 1956 లో విశాలాంధ్రలొ కలిసినప్పుడూ వీరెవ్వరు ఎదో నష్టపోయామని అరవలేదు. వాళ్ళని సంప్రదించో వాళ్ళ అనుమతితోనో మాత్రమే తెలంగాణ చరిత్ర మారాలని లొల్లి చేయలేదు. అతిథులుగా వొచ్చి అన్నం పెట్టిన ప్రాంతాన్ని నమ్ముకొని ఇక్కడే ఉండిపోయినా, ఆస్తులుగడించినా మర్యాదను మరవలేదు, ఆధిపత్యం కోసం ఎగబడి ఇసుంట రమ్మంటే ఇల్లంతా నాదని కయ్యానికి దిగలేదు. అందుకే రొచ్చు జరగలేదు. కష్ట సుఖాల్లో, మారుతున్న చరిత్రలో భాగస్వాములయ్యారు, పండగల్లో పబ్బాల్లో స్థానికులతో ఒక్కటైనారు, ఇక్కడుంటూ ఇక్కడి క్షేమాన్ని కోరారు. ఇక్కడ సంపాదించిన దానితో సొంత ఊర్లకుపోయి అక్కడ పండగలు చేసుకోలేదు.

ఇప్పటికైనా తనకుమాలిన ధర్మం లాంటి అనవసరపు మర్యాదలకు స్వస్తి చెప్పి సహాయనిరాకరణతో చాలాసమస్యలను పరిష్కరించుకోవచ్చు. అంతేకాని మనని అవమానపర్చే భాషను, మనవాళ్ళ పొట్టలౌకొట్టే వ్యాపారాలను, మనను కించపర్చే పత్రికలను సినిమాలను మనం తలకెత్తుకొని ఆదరించుకుంటూ, ప్లీజ్ మమ్మల్మొదిలేయండని ప్రాదేయపడితే పోడానికి ఎవడైనా పిచ్చివాడా?

తెలంగాణను వదలాల్సిన అవసరం ఆధిపత్యవాదులకు తెలంగాణ ప్రజలే కలిగించాలి. ఇందుకు ఏం చెయ్యాలో ఏ రాజకీయ పార్టీలు ప్రజలకు చెప్పొచ్చు, చెప్పకపోవచ్చు, చెప్పినా చెప్పకపోయినా చెయ్యాల్సింది మాత్రం ప్రజలే. అమాయకత్వంవల్లనో, లేదా ఆ! మనకెందుకులే అనే తప్పించుకునే మనస్తత్వంతోనో, తప్పును చాలా కన్యీనియెంట్ గా ఇంకొకరిమీదికి తోసే మనస్తత్వంతోనో, ఇంకా దానికొక మంచితనమనే ముసుగేసుకుని అన్యాయాన్ని సహిస్తూ ఉంటే మొన్న దొరలు, నిన్న నిజాం, ఈ రోజు ఆంధ్రా వలస పాలకులు, రేపు ఇంకెవరో? ఎవరైనా దోచుకోవడానికి చాలా హాయిగా తయారవుతారు. అందుకే తెలంగాణా ప్రజలందరూ ఇప్పటికైనా తమ కర్తవ్యం తెలుసుకుంటే వాళ్ళనెవరూ మోసం చేయలేరు.

అంతేకాదు భాషాపరంగా, చేష్టల పరంగా తెలంగాణ పరువు తీయడాన్ని నిరసించాలి. “బాంచన్ కాల్మొక్త” అనేదే తెలంగాణ సంస్కృతి అయినట్టు అడ్డమయిన వాళ్ళ కాళ్ళు పట్టుకొని తెలంగాణ ఇజ్జత్ ను తీసుకోవద్దు. ప్రత్యేక రాష్ట్రాన్ని అడుక్కోవడం వల్ల లాభం లేదు. పైగా ప్రత్యేక రాష్ట్రం అడుక్కుంటే వచ్చేది కాదు. పోరాడి తీసుకోవాలి. పోరాటమంటే ప్రాణాలు తీసుకోవటమో, ప్రాణాలు తీయటమో ఎంతమాత్రం కాదు. వాళ్ళ మీద వీళ్ళ మీద దాడి చేయడం అంతకన్నా కాదు.

తెలంగాణ వచ్చేస్తనే ఉంది కదా ఇప్పుడు మనమేమి చేయాల్సిన అవసరం లేదనుకుంటే అంతకంటే తెలివితక్కువతనం ఉండదు. ప్రత్యేక రాష్ట్రం రావడంతోనే సమస్యలు తీరవు. కాకపోతే సమస్యలు తీరే అవకాశమేర్పడుతుంది. ప్రత్యేక రాష్ట్రం రేపే ఏర్పడినా పరాయి ప్రాంతాల దోపిడీ ఆధిపత్యాలనుంచి ప్రజలు విముక్తి పొందాల్సిన కార్యక్రమం స్పష్టమైన పథకంతో అమలు చేయాల్సిందే, ప్రజలనందరిని అందులో భాగస్వాములను చేసే నిర్దిష్ట ప్రణాళికలు ధృక్పథాలు రూపొందించే ప్రక్రియ ఇంకా ప్రారంభం కావల్సే ఉన్నది.

“దోపిడి జేసే ప్రాంతేతరులను
దూరము దాకా తన్ని తీరుతం
ప్రాంతం వాడే దోపిడీ జేస్తే
ప్రాణం తోనే పాతర వేస్తం
దోస్తుగ ఉండే వారితో మేమును
దోస్తే చేస్తం ప్రాణం ఇస్తం”. (కాళోజి)

స్వరాష్ట్ర సాధన, స్వపరిపాలన దిశలో పయనానికి ఆంధ్ర ఆధిపత్య వ్యాపారాల బహిష్కరణతో పునాదులువేద్దాం!

ప్రకటనలు

వ్యాఖ్యలు»

No comments yet — be the first.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: