jump to navigation

పరిణతి లోపంతోనే ఈ ప్రమాదం – ఆదిత్య డిసెంబర్ 14, 2009

Posted by Telangana Utsav in agitation, Andhra, Congress, GHMC, Harish, Hyderabad, Identity, JAC, Karimnagar, KCR, Khammam, KTR, Media, MIM, Mulki, politics, PRP, Rahul, Rayalaseema, Sonia, TDP, Telangana, Telugu (తెలుగు), TRS, universities, Uttara Andhra, violence, YSR.
trackback

పరిణతి లోపంతోనే ఈ ప్రమాదం
ఆదిత్య Andhra Jyothi 12 Dec 2009

కాంగ్రెస్‌ కేంద్ర నాయకత్వం ప్రదర్శించిన హడావుడి, అతి గోప్యత తెలంగాణ వాదుల ఆశలపై నీళ్లుచల్లే ప్రమాదకర పరిస్థితికి దారితీస్తున్నది. అలాగని రాష్ట్రం సమైక్యంగా ఉండే పరిస్థితులు కూడా కనిపించడం లేదు. ఎందుకంటే ఇప్పటికే ఆయా ప్రాంత ప్రజల మధ్య విద్వేషాలు ప్రారంభమయ్యాయి. ఈ మొత్తం వ్యవహారంలో మరెన్నో కోణాలు కూడా ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది. రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్‌ ఇలాంటి ప్రమాదకరమైన ఆటలు ఆడడం, వాటి నుంచి బయటపడడానికి దేశానికి ఏళ్లూ పూళ్లూ పట్టడం మొదటినుంచీ ఉన్నదే!

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రక్రియ ప్రారంభిస్తామంటూ బుధవారం అర్ధరాత్రి కేంద్ర హోంమంత్రి చిదంబరం చేసిన చరిత్రాత్మక ప్రకటన రాష్ట్ర వాసులందరికీ తీవ్రమైన మిశ్రమ స్పందనలు కలిగించింది. ఉరుములు లేని పిడుగులా వెలువడిన ఈ నిర్ణయం కోస్తాంధ్ర, రాయలసీమ నాయకులను, ప్రజలను ఆందోళనలో ముంచగా, తెలంగాణ వాదులకు ఆశ్చర్యకరమైన వరంలా మారింది. కేంద్ర ప్రభుత్వం అనూహ్య రీతిలో, ఇంత హఠాత్తుగా తెలంగాణ ఇవ్వాలనే నిర్ణయం తీసుకుంటుందని అటు తెలంగాణ వాదులుగానీ, ఇటు కోస్తా, రాయలసీమ వాసులుగానీ ఎంతమాత్రం ఊహించలేదు.

టి.ఆర్‌.ఎస్‌ అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు 11 రోజుల ఆమరణ నిరాహార దీక్ష, తెలంగాణ ప్రాంతంలో ఉవ్వెత్తున ఎగిసిన ఉద్రిక్త ఉద్యమం పర్యవసానంగానే కేంద్రం ఈ అడుగు వేసినట్టు పైకి అనిపిస్తున్నా, ఇంత పెద్ద నిర్ణయం అంత అర్జంటుగా, ఆషామాషీగా ఎలా తీసుకుంటారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇదంతా ఒక పథకం ప్రకారం సాగిందనే అనుమానాలు బలంగా వ్యక్తమవుతున్నాయి. కేవలం 11 రోజుల కె.సి.ఆర్‌ దీక్ష ఫలితంగానే ఇది జరగలేదని, అంతకుముందే రచించిన వ్యూహంలో ఇదంతా భాగమని విశ్వసనీయ రాజకీయ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

2014 ఎన్నికల తర్వాత రాహుల్‌గాంధీని ప్రధానిని చేయడమే లక్ష్యంగా కదులుతున్న కాంగ్రెస్‌ అధిష్ఠానం, వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి దుర్మరణం తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ బలహీనంగా మారుతున్న సంగతిని, పార్టీపై తన పట్టు పూర్తి స్థాయిలో లేదన్న వాస్తవాన్నీ గుర్తించింది. కొరకరాని కొయ్యలా మారుతున్న వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డిని అదుపు చేయడం, జాతీయ స్థాయిలో విపక్షాలను సమైక్యం చేయగల శక్తి ఉండి, రాష్ట్రంలో పుంజుకుంటున్న ప్రధాన ప్రత్యర్థి తెలుగుదేశాన్ని శాశ్వతంగా నిర్వీర్యం చేయడం అనే రెండు లక్ష్యాలను సాధించడానికి అది తెలంగాణ పావును ముందుకు కదిపింది.

రాష్ట్రాన్ని విభజించడం ద్వారా జగన్‌కు చెందిన సామాజిక వర్గాన్ని బలహీన పరచాలని, తెలుగు దేశానికి రాష్ట్రంలోని రెండు ప్రాంతాల్లోనూ పట్టులేకుండా చేయాలని పథకం రచించింది. అప్పటికే ఎన్నికలలో చావు దెబ్బతిని, అప్రతిష్ఠతో అచేతనావస్థలోకి వెళ్లిన టి.ఆర్‌.ఎస్‌ అధినేత కె. చంద్రశేఖరరావును దీని అమలుకు ఎంచుకుంది. తెలంగాణ సెంటిమెంట్‌ నేపథ్యంగా ఉన్న కె.సి.ఆర్‌.ను బలోపేతం చేసి తెరపైకి తేవడం, ఆ క్రమంలోనే రాష్ట్రాన్ని విభజించడం ద్వారా ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్న తరహాలో అటు జగన్‌ను, ఇటు బాబును దెబ్బతీయాలన్నది అధిష్ఠానం ఎత్తుగడ.

దీని అమలు బాధ్యతను, అహ్మద్‌పటేల్‌, చిదంబరం, ప్రణబ్‌ముఖర్జీ, ఆంటోనీలతో కూడిన మేడమ్‌ సోనియాగాంధీ కోటరీ స్వయం గా చేపట్టింది. ఇందులో అహ్మద్‌పటేల్‌ కీలక పాత్ర పోషించారు. తెలంగాణ సాధన కోసం అప్పటికే ఆమరణ నిరాహార దీక్ష నిర్ణయాన్ని ప్రకటించిన కె.సి.ఆర్‌.తో ఆయన తమ వ్యూహం గురించి వెల్లడించినట్టు తెలిసింది. ఇక తర్వాత పరిణామాలన్నీ ఇందులో భాగమే! అయితే ఈ అవగాహన సంగతి ఇటు ముఖ్యమంత్రికి గానీ, రాష్ట్ర పోలీసు విభాగానికిగానీ తెలియక పోవడంతో మధ్యమధ్యలో కొన్ని అనూహ్య మలుపులు చోటుచేసుకుని, సస్పెన్స్‌ థ్రిల్లర్‌ సినిమాను మరిపించాయి.

వీటిని అధిష్ఠానం ఎప్పటికప్పుడు సరిదిద్దినా, ఆ సంగతి తెలియక ఏకంగా చంద్రశేఖరరావే తీవ్ర ఉత్కంఠకు లోనయ్యారు. ఇక సాధారణ ప్రజానీకం సంగతి చెప్పనక్కర్లేదు. నిరాహార దీక్ష చేపట్టడానికి నవంబరు 29న కరీంనగర్‌లో బయలుదేరి అరెస్టైన కె.సి.ఆర్‌.ను వరంగల్‌కు తరలిస్తామని చెప్పినా, పోలీసులు మాత్రం కె.సి.ఆర్‌.ను మొదట వరంగల్‌కు తీసుకువెళ్లి, వెంటనే అక్కడి నుంచి ఖమ్మం తరలించారు. దీనికి కె.సి.ఆర్‌ వెంటనే అభ్యంతరపెట్టారు. ‘ఖమ్మంకు ఎందుకు?’ అని ఆయన పోలీసు అధికారులను ప్రశ్నించారు. అయితే పోలీసులు ఆయన మాటలను పట్టించుకోకుండా ఖమ్మం తీసుకెళ్లి జైల్లో పెట్టేశారు. దీన్ని శంకించిన కె.సి.ఆర్‌ తనను వరంగల్‌గానీ, హైదరాబాద్‌గానీ తరలించాలని డిమాండ్‌ చేయడం ప్రారంభించారు.

రెండోరోజు పళ్లరసం తీసుకుని దీక్ష విరమించాలని, తర్వాత బెయిల్‌ తీసుకోకుండా జైల్లోనే ఉంటూ బయట ఉద్యమాన్ని నడిపించాలన్నది కె.సి.ఆర్‌ ఆలోచన! తనను ఖమ్మం నుంచి హైదరాబాద్‌ తరలించాలన్న కె.సి.ఆర్‌ విజ్ఞప్తిని పోలీసులు పట్టించుకోకపోవడంతో, కాంగ్రెస్‌ అధిష్ఠానం నుంచి వచ్చిన ఒత్తిడి కారణంగా రాష్ట్ర ప్రభుత్వం కె.సి.ఆర్‌.ను హైదరాబాద్‌ తరలించవలసి వచ్చింది.

‘పళ్ల రసం’ తీసుకునే కార్యక్రమం అనుకున్న ప్రకారమే ముగిసినప్పటికీ, లోగుట్టు తెలియని పోలీసులు ఆ ఘట్టాన్ని కెమెరాలో రికార్డు చేయించి మీడియాకు లీక్‌ చేయడం, కె.సి.ఆర్‌ పళ్లరసం తీసుకున్న తీరు చూసి ప్రజా గాయకుడు గద్దర్‌ తదితరులు తీవ్రంగా స్పందించడం, అప్పటికే ఉస్మానియాలో పోలీసుల ఓవర్‌యాక్షన్‌తో ఆగ్రహంగా ఉన్న విద్యార్థులు ఉద్యమించడంతో కథ అడ్డం తిరిగింది.

దీంతో కె.సి.ఆర్‌ అనివార్యంగా దీక్ష కొనసాగించాల్సిన వాతావరణం ఏర్పడింది. అయితే ఈ పరిస్థితిలో తన దీక్ష ఎలా ముగియబోతున్నది, అందుకు అధిష్ఠానం ఏం చేయబోతున్నది కె.సి.ఆర్‌.కు అంతుబట్టలేదు. ఫలితంగా ఆయన అధిష్ఠానం తనను మోసగించడం లేదు కదా అన్న అనుమానంలో పడిపోయారు. దీంతో దీక్ష విరమణకు ప్రత్యామ్నాయ మార్గాలను టి.ఆర్‌.ఎస్‌ వర్గాలు అన్వేషించడం ప్రారంభించాయి. పళ్లరసం సన్నివేశాన్ని తప్పుబట్టిన గద్దర్‌, విద్యార్థి నాయకులతో టి.ఆర్‌.ఎస్‌ నేతలు రాయబారాలు మొదలుపెట్టారు.

కేంద్రం ఏ నిర్ణయం ప్రకటించకున్నా దీక్ష విరమించగలిగేలా, ‘బయటి సమాజం’ నుంచి ఒత్తిడి వచ్చే విధంగా వాతావరణాన్ని సృష్టించారు. తెలంగాణ ఇచ్చేదాకా పట్టు వీడే ప్రసక్తే లేదన్న కె.సి.ఆర్‌, మరోవైపు కాంగ్రెస్‌ అధిష్ఠానంతో రాయబారాలకు టైమ్‌ తీసుకున్నారు. ఎటుపోయి ఎటు వచ్చినా దీక్షను సుఖాంతం చేసి, కె.సి.ఆర్‌.ను క్షేమంగా బయటకు తీసుకురావడానికే టి.ఆర్‌.ఎస్‌ నేతలు ఇలా రెండు వైపులా మార్గాలను తెరిచి ఉంచారు. ఈ నేపథ్యంలోనే కొంచం ఓపిక పట్టాలని, కథ సుఖాంతమవుతుందని అధిష్ఠానం స్పష్టమైన హామీ ఇవ్వడంతో కె.సి.ఆర్‌ దీక్ష కొనసాగించారు.

ఈ మొత్తం వ్యవహారంలో ముఖ్యమంత్రి రోశయ్యకుగాని, రాష్ట్ర ప్రభుత్వానికిగాని ఏ పాత్రా లేదు. ఏం జరుగుతున్నదో వారికి తెలియదు. అయినా రాష్ట్ర ప్రభుత్వం తనంత తానుగా దీక్ష విరమింపజేయడానికి మధ్యవర్తులను ప్రయోగించడం ప్రారంభించింది. దీనికి కె.సి.ఆర్‌ నుంచి స్పందన లేకపోగా, ‘ఈ వ్యవహారాన్ని మేం చూసుకుంటాం. దీనితో మీకు సంబంధం లేదు. వదిలేయండి’ అని అధిష్ఠానం సంకేతాలు ఇచ్చింది. దీంతో ఇక రాష్ట్ర ప్రభుత్వం చేతులు కట్టేసుకుంది. ఆ తర్వాత బుధవారం రోజు ముఖ్యమంత్రి రోశయ్యకు ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది.

అప్పటికే తెలంగాణ అంశంపై కోర్‌ కమిటీ చర్చల మీద చర్చలు జరపడం మొదలుపెట్టింది. కానీ వీటిలో దేనిలోకీ రోశయ్యను అనుమతించకుండా బయటే కూర్చోబెట్టారు. నిజానికి అప్పటికే రోశయ్య కేంద్ర ప్రభుత్వంతో పాటు అధిష్ఠానానికి కూడా ఒక నోట్‌ పంపారు. ‘సమస్యను మేం గుర్తించాం. మీ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటాం. తదనుగుణంగా చర్యలు తీసుకుంటాం. అందువల్ల దీక్ష విరమించి చర్చలకు రండి’ అని కేసీఆర్‌ను ఏఐసీసీ ఆహ్వానించాలన్నది ఆ నోట్‌ సారాంశం. కానీ ఈ సూచనను అధిష్ఠానం ఎక్క డా పరిగణనలోకి తీసుకున్న దాఖలాలు లేవు.

చిట్టచివరికి అర్ధరాత్రి ప్రధాని సమక్షంలో జరిగిన కోర్‌ కమిటీ సమావేశంలోకి, ఆఖరి నిముషంలో మాత్రం రోశయ్యను పిలిపించారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి ఎలా ఉందని అడిగారు. ఉద్యమం తీవ్ర స్థాయికి చేరిందని, పరిస్థితి చాలా కష్టంగా ఉందని రోశయ్య బదులిచ్చారు. చలో అసెంబ్లీ ర్యాలీలో రెండు మూడు లక్షల మంది పాల్గొనే అవకాశం ఉందని, కనీసం రెండు మూడు వేల మంది చనిపోవచ్చని పేర్కొంటూ ఇంటెలిజెన్స్‌ బ్యూరో ఇచ్చిన నివేదికను చిదంబరం రోశయ్యకు చూపించారు. ‘అయినా మీరేం ఆందోళన చెందకండి. మేం చూసుకుంటాం’ అని భరోసా ఇచ్చిన కేంద్ర నేతలు, హైదరాబాద్‌కు వెళ్లి, కె.సి.ఆర్‌.కు నిమ్మరసం అందజేసి దీక్ష విరమింపజేయాల్సిందిగా రోశయ్యకు సూచించారు. అయితే తానుగా నిమ్మ రసం ఇవ్వడానికి నిరాకరించిన రోశయ్య హైదరాబాద్‌ తిరిగి వచ్చారు. తర్వాత కాసేపటికే, బుధవారం రాత్రి 11.30కి, అంటే సోనియా జన్మదినం మరో అరగంటలో ముగుస్తుందనగా, హోం మంత్రి చిదంబరం ‘తెలంగాణ ప్రకటన’ చేశారు. ఆ వెంటనే ఇంటెలిజెన్స్‌ బ్యూరో కు చెందిన జాయింట్‌ డైరెక్టర్‌ రాజీవ్‌ కపూర్‌, నిమ్స్‌ ఆసుపత్రికి వెళ్లి, హోం మంత్రిత్వ శాఖ తరఫున ఒక ప్రతిని కె.సి.ఆర్‌.కు అందజేశారు.

దాని సారాంశాన్ని చూసిన టి.ఆర్‌.ఎస్‌ నేతల ఆనందానికి అవధులు లేవు. ‘తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రక్రియ ప్రారంభిస్తాం’ అన్న వాక్యం చూసి కె.సి.ఆర్‌ సహా నేతలంతా ఉబ్బితబ్బిబ్బయ్యారు. ప్రజాసంఘాల నేతలందరిని పిలిపించి, అందరూ గ్లాస్‌ అందించేలా జాగ్రత్త వహించి మరీ నిమ్మరసం తాగిన కె.సి.ఆర్‌ దీక్ష విరమించారు. ఇక్కడిదాకా ఉత్కంఠ భరితంగా సాగిన సంఘటనల క్రమం, తెలంగాణ ఏర్పాటు వంటి కీలక నిర్ణయాన్ని అనూహ్య రీతిలో, అర్ధరాత్రి, అర నిముషంలో తేల్చేస్తూ చేసిన ప్రకటనతో, ఆశ్చర్యకరమైన మలుపు తీసుకుంది. సోనియా బర్త్‌డే రోజు ప్రకటన చేయాలన్న ఆత్రం, సాఫీగా సాగాల్సిన వ్యవహారాన్ని రచ్చరచ్చ చేసి అసలుకే మోసం తెచ్చింది.

తమను ఏమాత్రం సంప్రదించకుండా, మాటమాత్రం చెప్పకుండా అధిష్ఠానం ‘ఏకపక్షం’గా వ్యవహరించిన తీరు, కోస్తాంధ్ర, రాయలసీమ నేతల హృదయాలను గాయపరిచింది. అధిష్ఠానం తమ ఆత్మాభిమానాన్ని దెబ్బతీసిందని, అవమాన పరిచిందని వారు భావిస్తున్నారు. అందుకే తిరుగుబావుటా ఎగరేసి మూకుమ్మడి రాజీనామాలకు దిగారు. నమ్మిన బంటు అనుకున్న రోశయ్య కూడా ‘తెలంగాణ ప్రకటన’ తనకు తెలియదని, తన అభిప్రాయాలను ముందే తెలియజేశానని తేల్చి చెప్పేయడం అధిష్ఠానాన్ని మరింత ఇరకాటంలో పెట్టింది.

అధిష్ఠానం నిర్ణయంతో సంబంధం లేకుండా, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు సొంత పంథా ఎంచుకోవడం గతంలో ఎన్నడూ లేదు. నిజానికి కేంద్రం తెలంగాణ ఏర్పాటుకు ఇంత సులువుగా అంగీకరిస్తుందని కె.సి.ఆర్‌.తో సహా ఎవరికీ నమ్మకం లేదు. అందుకే కోస్తాంధ్ర, రాయలసీమ కాంగ్రెస్‌ నేతలు కాస్త ఏమరుపాటుగా, ధీమాగా ఉన్నారు. వారు అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ప్రకటించినా, తీర్మానం పెడితే మద్దతిస్తామని చంద్రబాబు చెప్పినా అది జరగదన్న ధీమాతోనే! ఇటు టి.ఆర్‌.ఎస్‌ నాయకులు కూడా కె.సి.ఆర్‌ దీక్ష విరమణకు వీలుగా ఏదో ఒక ప్రకటన కేంద్రం నుంచే వస్తే అదే పది వేలనుకున్నారు. అయితే రాష్ట్ర విభజనకు కోస్తా, సీమ ప్రజలు అప్పటికే మానసికంగా సిద్ధమై ఉన్నారు.

వారిని కాస్త సన్నద్ధం చేసి, గౌరవ ప్రదంగా సంప్రదింపులు జరిపి, నిర్ణయం ప్రకటించి ఉంటే ప్రస్తుత పరిణామాలు చోటుచేసుకుని ఉండేవి కావు. అలాకాకుండా ఏకపక్షంగా, బాధ్యతారహితంగా కేంద్రం తెలంగాణ ఏర్పాటు ప్రకటన చేసిన తీరుతో కోస్తా, సీమ ప్రాంతాలు షాక్‌ తిన్నాయి. ఫలితమే ఈ సమైక్యాంధ్ర ఉద్యమం! జగన్‌ వర్గాన్ని, చంద్రబాబు పార్టీని నిర్వీర్యం చేయడానికి వ్యూహం పన్నిన అధిష్ఠానం, సొంత నాయకుల నుంచే ఇంత తీవ్ర ప్రతిస్పందన వస్తుందని ఏమాత్రం ఊహించలేదు.

ఒక్క దెబ్బకు రెండు పిట్టలను పడగొట్టేందుకు ప్రయోగించిన బాణం, చుట్టూ తిరిగి తనవైపే రావడంతో అది ఆత్మరక్షణలో పడిపోయింది. తెలంగాణపై ముందుకే వెళితే కోస్తాంధ్ర, సీమ నేతలు రాజీనామాలకు కట్టుబడి ఉండక తప్పదు. అప్పడు రోశయ్య ప్రభుత్వ మనుగడే ప్రమాదంలో పడుతుంది. ఒకవేళ వారి తో రాజీనామాలు ఉపసంహరింపజేయగలిగినా ‘ఆత్మాభిమాన’ నినాదంతో తెలుగుదేశం రాజీనామాలకు కట్టుబడడం ఖాయం. దీనివల్ల కోస్తా, సీమల్లో కాంగ్రెస్‌ రాజకీయంగా భారీ మూల్యం చెల్లించక తప్పదు. అలాగని ప్రత్యేక రాష్ట్రంపై వెనకంజ వేస్తే కాంగ్రెస్‌కు ఉభయభ్రష్టత్వం తప్పదు.

తెలంగాణలోను, ఆంధ్రలోను కూడా చావు దెబ్బ అనివార్యం. ప్రధాన పార్టీలకు పట్టులేని పాతబస్తీని (7 సీట్లు) మినహాయిస్తే, తెలంగాణలో ఉన్న మొత్తం అసెంబ్లీ సీట్లు సుమారు 112. ఇందులో మరో 18 స్థానాలు గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో ఉన్నాయి. కోస్తాంధ్ర, రాయలసీమల్లో కలిపి ఉన్న సీట్లు సుమారు 175! వంద స్థానాలు ముఖ్యమా? 175 సీట్లు ముఖ్యమా? రాజకీయంగా తేల్చుకోవాల్సిన సంకట స్థితి ఇప్పుడు నెలకొంది. నూటా డెబ్బై అయిదే ముఖ్యమని నిర్ధారణకు వచ్చిన తెలుగుదేశం, తెలంగాణపై కర్ర విరగకుండా పాము చావకుండా ఉండే వైఖరిని ఎంచుకుంది.

దీంతో కాంగ్రెస్‌ మరింత ఇబ్బందిలో పడిపోయింది. ఇప్పుడు ఆ పార్టీ కేంద్ర నాయకత్వం ఏ నిర్ణయం తీసుకున్నా నష్ట నివారణ సాధ్యమేనా అన్నది ప్రధాన ప్రశ్న. ఏది ఏమైనా కాంగ్రెస్‌ తనకు తానుగా కొనితెచ్చుకున్న సమస్యలో నిలువునా కూరుకుపోయింది. అది అంతవరకే పరిమితమైతే ఏ ఇబ్బందీ లేదు. కానీ రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్‌ చేసిన పని, రాష్ట్రం, రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకు, ప్రయోజనాలకు ముప్పుగా మారింది. ప్రాంతీయ విద్వేషాలకు బీజం వేసింది.

రాజకీయ ప్రయోజనాల దృష్టితో కాకుండా, రాష్ట్ర ప్రయోజనాల కోణంలో, కొంచం పరిణతితో వ్యవహరించి ఉంటే ఈ దురవస్థ దాపురించేది కాదు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు చేసినా పెద్దగా వ్యతిరేకత వ్యక్తంకాని పరిస్థితులు ఉండడమే కాదు, గత ఎనిమిదేళ్ల ఉద్యమ ఫలితంగా తెలంగాణ వాదుల పట్ల ఇతర ప్రాంతాల ప్రజల్లో కూడా అంతో ఇంతో సానుభూతి ఏర్పడి ఉంది. ఈ నేపథ్యాన్ని అందిపుచ్చుకుని కొంచం సంయమనంతో వ్యవహరించి, జాగ్రత్తగా హ్యాండిల్‌ చేసి ఉంటే తెలంగాణ ఏర్పాటు చేయడం సులువు అయ్యేది.

ఈ ఉద్రిక్తతలు ఏర్పడి ఉండేవే కావు. మొత్తంమీద కాంగ్రెస్‌ కేంద్ర నాయకత్వం ప్రదర్శించిన హడావుడి, అతి గోప్యత తెలంగాణ వాదుల ఆశలపై నీళ్లుచల్లే ప్రమాదకర పరిస్థితికి దారితీస్తున్నది. అలాగని రాష్ట్రం సమైక్యంగా ఉండే పరిస్థితులు కూడా కనిపించడం లేదు. ఎందుకంటే ఇప్పటికే ఆయా ప్రాంత ప్రజల మధ్య విద్వేషాలు ప్రారంభమయ్యాయి. ఈ మొత్తం వ్యవహారంలో మరెన్నో కోణాలు కూడా ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది. రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్‌ ఇలాంటి ప్రమాదకరమైన ఆటలు ఆడడం, వాటి నుంచి బయటపడడానికి దేశానికి ఏళ్లూ పూళ్లూ పట్టడం మొదటినుంచీ ఉన్నదే!

Source: Andhra Jyothy, Dec 12 2009

వ్యాఖ్యలు»

No comments yet — be the first.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / మార్చు )

Connecting to %s

%d bloggers like this: