jump to navigation

న్యాయమైన పోరాటమేదో ప్రజలే గ్రహించాలి డిసెంబర్ 14, 2009

Posted by Telangana Utsav in Culture, Economy, Hyderabad, Identity, Mulki, politics, Rayalaseema, Telangana, Telugu, Telugu (తెలుగు), universities, Uttara Andhra.
trackback

న్యాయమైన పోరాటమేదో ప్రజలే గ్రహించాలి

తెలంగాణ ఉద్యమంపై, స్థానికతా అస్తిత్వ ఉద్యమాలపై మీ అభిప్రాయమేమిటని కోస్తా, రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల సాహిత్యకారులను అడగడం జరిగింది. వారు చెప్పిన అభిప్రాయాల్ని యధాతథంగా అందిస్తున్నాం. తెలంగాణ అవసరమేనని కొందరు, ప్రత్యేక రాయలసీమ ఏర్పడాలని కొందరు, కళింగాంధ్ర వెనుకబాటుని ప్రస్తావిస్తూ కొందరు సమాధానమిచ్చారు. మొత్తంగా సమైక్యాంధ్రను అధికులు ఒప్పుకోవడం లేదు…

సీమ ప్రజలు సమైక్యాంధ్రను తిరస్కరించాలి
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్రం నుంచి సానుకూల సంకేతాలు రావడం అనేది తెలంగాణ విద్యార్థులు, బుద్ధిజీవులు, ఉద్యోగులు, కవులు, రచయితలు సాధించిన ఒక నైతిక విజయం. అలాగే ప్రత్యేక రాష్ట్రం పూర్తి స్థాయిలో సాకారం కావడానికి తెలంగాణ ప్రజలు చాలా విజిలెన్స్‌తో ఉండాల్సిన అవసరముంది. దానికి తెలంగాణేతర ప్రాంతాల ప్రజాస్వామికవాదులు కూడా కృషి చేయాలి. సమైక్యాంధ్ర పేరుతో స్పాన్సర్డ్‌ మూవ్‌మెంట్‌ ఒకటి రంగంమీదికి వచ్చింది.

ఇది ఒక పోటీ ఉద్యమం కూడా. కోస్తా, రాయలసీమ అగ్రకుల, సంపన్న పాలకవర్గాలు దీన్ని తీసుకొచ్చారు. దీని వెనుక కాంగ్రెస్‌ పార్టీలోని అంతర్గత కలహాలు ముఖ్యంగా ఓ వర్గం ప్రమేయం ఉందని ఊహించడం పెద్ద కష్టమేం కాదు. ఒకరకంగా చెప్పాలంటే కోస్తా, రాయలసీమ పెట్టుబడి నడిపిస్తున్న ఉద్యమం ఇది. సమైక్యాంధ్ర పేరుతో తెలంగాణను, రాయలసీమను శాశ్వత బందీలుగా ఉంచే కుట్ర ఇది. కాబట్టి రాయలసీమ ప్రజలు సమైక్యాంధ్ర నినాదాన్ని, గ్రేటర్‌ రాయలసీమ నినాదాన్ని కూడా తిరస్కరించాల్సి ఉంది.

ప్రకాశం, నెల్లూరు, బళ్లారి జిల్లాల్ని సీమలో కలుపుకోవాలనేది ఒక కబ్జా సంస్కృతి. సాపేక్షంగా అభివృద్ధి చెందిన నెల్లూరు జిల్లాను సీమలో కలుపుకోవడంవల్ల సీమ ప్రజల అవకాశాలు కొల్లగొట్టబడతాయి.. తమ అస్తిత్వానికి, ఆత్మగౌరవానికి భంగం కలిగిందనుకున్నప్పుడు ప్రత్యేక రాష్ట్రం కోరుకునే హక్కు ఏ ప్రాంతంవారికైనా ఉంటుంది. పెట్టుబడి సృష్టించిన సమైక్యాంధ్ర అనే మాయాజాలాన్ని ఛేదించడానికి రచయితలు, బుద్ధిజీవులు, ప్రజాస్వామికవాదులు వాస్తవాల్ని ప్రజలముందు ఉంచాలి. హేతుబద్ధమైన వాదనలను ప్రజలకు అందించాలి.
– పాణి, కర్నూలు

ప్రత్యేక రాష్ట్రం ఫెడరల్‌ స్ఫూర్తి
తెలంగాణ, విదర్భ ప్రాంతాల సాంస్కృతిక భౌగోళిక జీవావరణాలు విలక్షణమైనవి. వాటిని ప్రత్యేక రాష్ట్రాలుగా గుర్తించడం సమంజసమే. అది ఫెడరల్‌ స్ఫూర్తి కూడా. స్థానికతకి అస్తిత్వ ఉద్యమాలకి భేదం ఉంది. అస్తిత్వ ఉద్యమం లేదా ఆకాంక్ష ప్రధానంగా అభివృద్ధి ఆత్మగౌరవానికి సంబంధించినవి. సంక్షేమ ప్రజాస్వామ్యంలో వాటిని సాధించడం కష్టం కాదు. నిజానికి ఇప్పటికే రాజ్యాంగ, చట్టపరమైన భద్రత, హక్కులు లభించాయి. మూలాల్లోకి వెళ్లడం చారిత్రికంగా సమర్ధించుకోవడంలో అవగాహనా స్పష్టత ఉండడం లేదు.

జీవావరణ వ్యవస్థల వల్ల జీవికా నిర్వహణ తద్వారా జీవన విధానం ఏర్పడ్డాయి. భిన్న ప్రాంతాల్లో భిన్న పద్ధతుల్లో అట్లా పరిణమించింది. ప్రతీ వృత్తివర్గం ఒక స్వయం పోషక సమూహం. అట్లా భిన్న సమూహాలకి ప్రత్యేక సామాజిక సాంస్కృతిక మత వైద్య సంబంధమైన వ్యవస్థలుండేవి. వర్తమాన సమస్యల్ని గతానికి ముడిపెట్టడం చారిత్రిక దృష్టి అవదు. వృత్తివర్గాలు విచ్ఛిన్నం కావడం సహజ పరిణామం. ఆధునిక సమాజంలో స్థానం, భద్రతల కోసం ఉద్యమించడం సహజం. ఘర్షణ కూడా సహజమే. భద్రతని అభివృద్ధిని రాజ్యాధికారంతోనే పొందాలనుకోవడం పొరపాటు. మనందరం ఒక విస్తృత ఆధునిక ప్రజాస్వామిక సమాజంలో పౌరులుగా మారుతున్న క్రమం లో జరిగే సర్దుబాట్లే ఇవన్నీ.

ద్వేషం ఏ సమాజాన్నీ నిర్మించలేదు. విద్య చేస్తుందది. తెలంగాణలోనే తొలి తెలుగు సమాజానికి బీజావాపం జరిగిందని అనుకుంటున్నాను. గడచిన పాతికేళ్లల్లో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందింది. ప్రత్యేక తెలంగాణ సమంజసమే అయినా అది ఒక మహా వైఫల్యానికి సూచిక కూడా అవుతుంది. కారణం ఎవరైనా కావచ్చు. రాజనీతి తెలియని రాజకీయాల నిర్వాకం. బళ్లారీ మద్రాసుల్ని వదిలేసిన స్వార్థపరులు గొప్ప పదవులు అలంకరించారు. రాష్ట్రాల గురించి మాట్లాడే హక్కు మనకు లేదు. ప్రకాశం గారికీ పొట్టిశ్రీరాములు గారికి కూడా మద్రాసులోనే వెన్నుపోటు పడింది.
– తల్లావజల పతంజలిశాస్త్రి, రాజమండ్రి

ప్రాంతీయ దురభిమానంగా మారకూడదు
మనదేశంలో దాదాపు 50 ఏళ్ల క్రితం తమిళనాట ఈ ప్రాంతీయ అభిమానంతో ప్రారంభమైన ద్రవిడ కజగం, అది చీలి ద్రవిడ మున్నేట్ర కజగం, అది చీలి ఎఐడిఎంకె వగైరా వగైరాలు ఈ దేశంలో ప్రాంతీయ ఉద్యమాలకు అంకురార్పణ చేశాయని చెప్పవచ్చు. ఆ తర్వాత కాలంలో దేశంలో ప్రాంతీయ శక్తులు బలపడి జాతీయ శక్తులు బలహీనపడి అనేక రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలు ఉద్భవించడం చూశాం. అస్సాంలో గణతంత్ర పరిషత్‌, ఆంధ్ర దేశంలో తెలుగుదేశం ఇంక ఉత్తరాదిన దక్షిణాదిన అనేక ప్రాంతీయ శక్తులు బలపడడం గమనించాం.

ప్రాంతీయ అభిమానం ఒక మోతాదులో ఉండవలసిందే. కాని దానికి పరిమితులున్నాయి. ప్రాంతీయ అభిమానం ప్రాంతీయ దురభిమానంగా పరిణమించడం ఇతర ప్రాంతం ప్రజల పట్ల అసహనంగా పరిణమించడం మనం చూస్తున్నాం. ప్రాంతీయ రాజకీయ శక్తులకు మూలాలు సహజంగా బలంగా ఉంటాయి. ప్రాంతీయ పార్టీల వల్ల కేంద్రంలో ఖిచిడీ ప్రభుత్వాలు ఏర్పడడం శోచనీయం. మరీ శివసేన, నవ నిర్మాణ సేన లాంటివి బలపడడం అవాంఛనీయం. తెలంగాణ ఉద్య మం వేర్పాటువాదంగా పరిణమించి నేటి ఈ ఉద్రిక్తతలకు దారితీయడం బాధాకర మైన పరిణామం. నా వంటి పాతకాలపు విలువలను గౌరవించేవాళ్లకు ఈ పరిణామాలు బాధ కలిగిస్తున్నాయి.
– పెద్దిభొట్ల సుబ్బరామయ్య, గుంటూరు

ఉద్యమాన్ని ఓడించలేరు
తెలంగాణ, రాయలసీమ, ఉత్తరాంధ్ర- ప్రాం తాలు వివిధ కారణాలరీత్యా తీవ్ర నిర్లక్ష్యానికి గురై వెనుకబడ్డ ప్రాంతాలుగా మిగిలాయి. ఇవి తమ ప్రాంత అభివృద్ధికి తమ ప్రాంత వనరులు, సంపదలు సంరక్షణకు ఇప్పుడు పోరాట చైతన్యా న్ని వ్యక్తపరుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతీయ పోరాటాలను ఆహ్వానించాల్సిందే. ఐతే తెలంగాణ ప్రాంతానికి మిగిలిన ప్రాంతాల కంటే ఒక భిన్నమైన కోణముంది.

అదేమంటే తెలంగాణ ప్రాంతీయులు ఆర్థిక పరంగా, రాజకీయపరంగా ఏమోగాని సాంస్కృతికపరంగా సామాజికపరం గా ఏనాడూ ఆంధ్రులతో అనుసంధానం కాలేకపోయారు. ఆంధ్ర అనేది పరా యి నేల అనిపించింది వారికి. గనుకనే తమదైన సొంత నేల కోసం తెలంగాణీయులు మళ్లీ మళ్లీ పోరాడుతున్న చరిత్ర కన్పిస్తున్నది. తెలంగాణ రాష్ట్ర సమితిని ఓడించవచ్చునేమోగాని తెలంగాణ రాష్ట్రం కోసం మళ్లీ మళ్లీ జరిగే ఉద్యమాన్ని ఓడించలేరు. తెలంగాణ ప్రజలు విజయం సాధించగలరు.
– అట్టాడ అప్పల్నాయుడు, శ్రీకాకుళం

ప్రజల మద్దతే తెలంగాణకు బలం

పూర్వం ఒక రాష్ట్రంగా ఉండి ప్రత్యేక చరిత్ర, సంస్కృతి కలిగినది తెలంగాణ. వారు ఆశించిన ఆకాంక్షలూ ఒప్పందాలు సమైక్యంలో ఇన్ని దశాబ్దాలుగా నెరవేరనందున తిరిగి వేర్పాటుకి డిమాండ్‌ చేయడం అనివార్యమైంది. ప్రజల మేధావుల మద్దతు తెలంగాణకు బలం. మా కళింగాంధ్ర నాయకులకు కనీస ప్రాంతీయ స్పృహ లేకపోవడం మా దురదృష్టం.

గ్లోబలైజేషన్‌ వేళ్లుతన్ని ఊడలు దిగిన నేటి విధ్వంసకర పరిస్థితుల్లో ఏ సరిహద్దుల్లో నివసిస్తే మాత్రం సామాన్యుడి బ్రతుక్కి భరోసా ఉంటుంది? మా కళింగాంధ్ర ప్రాంతంతో సహా వెనకబడ్డ ఏ ప్రాంతంలోనైనా సన్నకారు మనుషులకు సొంత మట్టే లేదు. పొట్ట పట్టుకుని పోయినవాళ్లు చెట్టొక పిట్టైపోయారు. ఉన్నవాళ్లు సొంత పొలాల్లో పాలేర్లుగా బతుకీడుస్తున్నారు. మన పాలకుల, నాయకుల మోసాల పాలబడకుండా సామాన్యుడికి వెన్నుదన్నుగా నిలవడమే సాహిత్యకారులుగా మన కర్తవ్యం.
– జి.ఎస్‌.చలం, విజయనగరం

అసలు అర్థాన్ని మరిచిపోయి…
అస్తిత్వ ఉద్యమాలు కమ్యూనిస్టు రాజ్యాల పతనం తర్వాత ప్రారంభమయ్యాయి. వీటి లక్ష్యం ఏదో ఒక పేరుతో ఐక్యత ఐతే పర్వాలేదు. కాని ఇందులో కొన్ని ఉద్యమాలు అస్తి త్వ వాదానికి అసలు అర్థాన్ని మరిచిపోయి సాగుతున్నాయి. ముఖ్యంగా అస్తిత్వం అంటే ఐరోపియన్‌ తాత్విక దృక్పథంలో సమాజ పరిణామాల్లో వ్యక్తి పాత్ర ఉందని వ్యక్తి ప్రయత్నాలు చేయడమే అస్తిత్వ ఉద్యమాలు.
– వివినమూర్తి, తూర్పు గోదావరి

ప్రజల ఆకాంక్షా? నాయకుల స్వార్థమా?

తెలంగాణతో పోలిస్తే రాయలసీమ అభివృద్ధి విషయంలో మరింత వెనుకబడిన ప్రాంతం. మా అనంతపురమైతే మరీ ఘోరం. ఇప్పటికీ 8 శాతం మించి సాగునీరు లేదు ఇక్కడ. అయినా ఆశ్చర్యంగా ఇప్పటికీ ఏ ఉద్యమమూ పుట్టుకు రాలేదు ఈ ప్రాంతంలో. ఇక్కడ ప్రాంతీయ స్పృహేగానీ ప్రాంతీయవాద స్పృహ లేదు. తెలంగాణ అలా కాదు. దానికి సుదీర్ఘ పోరాట చరిత్ర ఉంది. తెలంగాణ వెనుకబాటుతనం, అణచివేత కారణంగానే అక్కడ గొప్ప సాహిత్యం, పాట పుట్టుకొచ్చింది. అది కాదనలేని సత్యం. తిరుగులేని సాక్ష్యం.

అయితే ప్రత్యేకవాదం ప్రజల ఆకాంక్షల నుండి పొంగుతూ వస్తున్నదా? రాజకీయ నాయకుల స్వార్థ ప్రయోజనాల నుండి కొనసాగుతూ వస్తున్నదా? ఇక్కడ ఉన్న మేము స్పష్టంగా తేల్చుకోలేకపోతున్నాం. సమైక్యత అయినా విడిపోవడమైనా రాజకీయ కుట్రల కారణంగా, ‘నీతులు రెండు నాల్కలు సాచే నిర్హేతుక కృపా సర్పాల’ కారణంగా జరుగకూడదనే మేము కోరుకుంటున్నాం. ఏ అస్తిత్వ ఉద్యమమైనా ప్రజల అభివృద్ధి లక్ష్యంగా ఉండాలి. బడా పెట్టుబడిదారుల, రాజకీయ నాయకుల స్వార్థ ప్రయోజనాల లక్ష్యాలకు అస్తిత్వ ఉద్యమాలు, అమాయకమైన ప్రజలు బలి కాకూడదు.
– సింగమనేని నారాయణ, అనంతపురం

సమైక్యాంధ్ర ఉద్యమకారులారా!
2004 ఎన్నికల్లోనూ 2009 ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌, టిడిపిలు తెలంగాణ రాష్ట్ర సమితి(టిఆర్‌ఎస్‌)తో అంటకాగినాయి. ప్రజారాజ్యం పార్టీ సామాజిక తెలంగాణను ముందు కు తెచ్చింది. కాబట్టి ఈనాడు పార్టీల ఎమ్మెల్యేలకు, ఈ మూడు పార్టీలకు ఓట్లు వేసిన ఉద్యమకారులకు ఈ పొద్దు సమైక్యాంధ్ర కోసం నినదించే నైతిక హక్కు లేదు. ప్రత్యేక తెలంగాణకు ఏదో ఒక రూపంలో ఆమోదం తెలిసిన ఈ మూడు పార్టీలకు ఓటు వెయ్యనివాళ్లు తమలోనూ ఎంత శాతం మంది ఉంటారో సమైక్యాంధ్ర ఉద్యమకారులు తమ అంతరాత్మల్లోకి తొంగి చూసుకుంటే మంచిది.

ఉద్యమకారులారా! కాంగ్రెస్‌ అధిష్ఠానం ఏకపక్ష ప్రకటనలోని (నిర్ణయం కాదు) రాజకీయ దురాశను గుర్తించండి. ఆత్మగౌరవం సాకుతో రాజీనామాలు చేసిన ఎమ్మెల్యేల వెనుక వారి హైదరాబాదు వ్యాపారాలను పసిగట్టండి. తమ రాజీనామాల ద్వారా టిడిపి ఎమ్మెల్యేలు, కాంగ్రెస్‌లోని రెడ్ల వర్గపు ఎమ్మెల్యేలు మధ్యంతర ఎన్నికల కోసం కలలు గనే మోసపూరిత వ్యూహాన్ని భగ్నం చేయండి. తమను సంప్రదించనంత మాత్రాన ప్రత్యేక తెలంగాణ బిల్లు కాస్తా సమైక్యాంధ్రగా ఎట్లా మారిందో ఆ ఎమ్మెల్యేల గార్లనే కొంచెం వివరించమనండి.

సమైక్యాం ధ్ర నినాదంలో హుందాతనం లేదు. ఓట్లేసిన ఏ ప్రాం తంవారి యొక్క ప్రజల నిజాయితీ అంతకన్నా లేదు. సమైక్యాంధ్ర వద్దు విశాలాంధ్ర నాలుగు రాష్ట్రాలుగా విడిపోవడమే ముద్దు. నాలుగు ప్రాంతాల భాషా యాసల్ని పలుకుబడిని పబ్బాలనీ చారిత్రక నేపథ్యాల్ని కాపాడుకుని తెలుగు జాతి సంస్కృతిని మరింత విస్తృతం చేసుకుందాం. సమైక్యాంధ్ర అనే గిడిసబారిన వర్తక సంస్కృతిని విదిలించేసుకుని మనం నలుగురూ మన కాళ్లమీద నిలబడదాం. ‘నేను రాయలసీమకు జై! నీవు కోస్తా ఆంధ్రకు జై! నీవు ఉత్తరాంధ్రకు జై! మరి నీవు చివరగా తెలంగాణకు జై!’
– స్వామి, అనంతపురం

దశ, దిశ తెలుగు భాషే
9 రాత్రి అదీ అర్థరాత్రి వెలువడిన ప్రకటనే ఒక కుతంత్రపు ప్రకటన. బూటకపు చిదంబర రహస్యం. దీక్షని విరమింపజేయటానికి చేసిన బూటకపు ప్రకటన. అర్థరాత్రికుతంత్రం. సమైక్యత అనేది వాదమూ కాదు, వివాదమూ కాదు, నినాదమూ కాదు. అది సమత, మమత, వినుతి. ఆంధ్రప్రదేశ్‌ ఓ అమెరికా ఓ ఇంగ్లాండు దేశాలు కావు- డివైడెడ్‌ బై ది సేమ్‌ లాంగ్వెజ్‌- అనుకోటానికి. తెలుగుని మూడు ముక్కలు చేస్తే ఆ తర్వాత మరిన్ని ముక్కలవుతుంది? రాజకీయులు వద్దు రాష్ట్రాంగం రాజ్యాంగం ప్రకారం పరిపాలింపబడాలి. హైదరాబాద్‌ ఉమ్మడి ఆస్తి. ఆ ఆస్తిని దోచుకొనేవాళ్ల నించీ దాచుకొనేవాళ్ల నించీ రక్షించండి. ఈ పక్షంలో నేను విపక్షాలనూ నమ్మలేను. ప్రతీప శక్తుల వలలోకి ఇరుక్కోవద్దు.

కాళోజీ, వరవరరావు, గద్దర్‌లు కేవలం ఆదర్శవాదులు. దశ, దిశ తెలుగు భాషే నిర్దేశిస్తుంది. ఓలీ సోయింకా నాటకం ‘ది రోడ్‌’లో మాటిమాటికీ రోడ్‌సైన్లని మార్చేస్తూంటాడో ప్రొఫెసర్‌, సండే ప్రీస్టు రెండూ ఒకడే అయిన కుహనాశీలి! నిరాహార ఆమరణ దీక్షలెవరూ చెయ్యనక్కర లేదు. సమగ్రమూ ప్రత్యేకమూ అని ప్లెబిసైట్‌ పెట్తే సమస్య తీరిపోతుంది. పైనించి వచ్చే నిర్దేశిత తీర్మానాలు తీర్చవు. బెదిరించే రాజీనామాలు తీర్చవు. అన్నదమ్ముల్లా విడిపోటానికి ఇది ఏదో ఒకే ఒక కుటుంబాస్తి కాదు. చరిత్రకూ భాషకూ ఉన్న ఉమ్మడి ఆస్తి.
– ‘మో’, విజయవాడ

సంఘీభావం కూడగట్టాలి
తెలంగాణ పోరాట సాహిత్యం నుండి, సంస్కృతి నుండి స్ఫూర్తి పొందిన రచయితగా నాకు ఇప్పటి తెలంగాణ అస్తిత్వ పోరాటం పట్ల పూర్తి సానుభూతి ఉంది. ఏ ఆర్థిక అసమానతలు ఈ పరిస్థితికి దారి తీశాయో వాటికి కారణం పాలక పక్షాల దోషాలే. ఇప్పటి తెలంగాణవాదం, సమైక్యతావాదాల నాయకుల ఆలోచనా సరళిలోనూ లోపాలున్నాయని నాకనిపిస్తుంది. అయితే తెలంగాణ ప్రజల ఆకాంక్షలు ఏ విధంగా నెరవేరినా నేను సంతోషిస్తాను. తెలంగాణవాదంలోని ఒక అతివాద ధోరణి మొత్తంగా కోస్తా ఆంధ్ర ప్రాంతం మీద విద్రోహ ముద్ర వేసింది.

సాహిత్యరంగంలోనూ కొంతమందిలో ఈ విరోధ వైఖరి కనపడుతుంది. సాహిత్యరంగానికి, రాజకీయ రంగానికి ఉండాల్సిన వ్యత్యాసాన్ని మనం గమనించాలి. ఈ అతివాద ధోరణి వలన తక్కిన ప్రాంతాల నుంచి ఒక వ్యతిరేక దృక్పథం ఏర్పడడానికి కొంత దారి తీసింది. ఇప్పటికైనా అన్ని ప్రాంతాల నుంచి తెలంగాణ ఆశయం పట్ల సంఘీభావం కూడగట్టే ప్రయత్నం చేస్తే మంచిది.
– పాపినేని శివశంకర్‌, గుంటూరు

రాజకీయాలకు, ప్రజలకు ఉన్న బంధం తెగిపోయింది

అసమానతలతో బాధపడుతున్న ఒక జాతిగాని, కులంగాని, ప్రాంతంగాని, మనిషిగాని ప్రతిఘటన చెయ్యడం ఒక గతితార్కిక సత్యం. ఈ సత్యంలోనించే అస్తిత్వ ఉద్యమాలు ప్రారంభమైనై. తెలంగాణ అస్తిత్వవాద ఉద్యమం చాలా ఏళ్ల నించి కొనసాగుతూ వస్తున్నదే. ప్రజల సహజ ప్రేరణలోంచి వచ్చిన ఈ ఉద్యమంలోంచి, సాహిత్యోద్యమం విస్తరించి, మరుగునపడిన భాషా సాహిత్యాన్ని గూర్చి కనీ వినీ ఎరుగనంతటి పరిశోధనలకి దారి తియ్య డం, కథా కవితాది ప్రక్రియలు అపూర్వమైన మౌలికతను సృష్టించడం ఒక చారిత్రిక పరిణామం.

ఇది ఉద్యమంవల్ల జరిగిన సాంస్కృతిక వికాసం. అయితే, రాజకీయాలకు, ప్రజలకు ఉన్న బంధం తెగిపోయి చాలాకాలమైంది. ఏ ఉద్యమమైనా అది పదవీ రాజకీయాల్లోకి వెళ్తే, ఇక ఆ వక్రమార్గాల్ని నిర్వచించడం ఎవరికీ సాధ్యం కాదు. ప్రత్యేకవాదులుగాని, సమైక్యవాదులుగాని ‘మేము బహుళ జాతుల్ని అడ్డుకుంటాం. ప్రపంచబ్యాంకు ఆదేశాల్ని ధిక్కరిస్తాం.

మా సంస్కృతిని కాపాడుకుంటాం’ అనే వాగ్దానాన్ని యివ్వకపోయిన తర్వాత, పదవులు, పెట్టుబడులు చేతులు మారడం తప్ప, పాలనా సూత్రాల్ని మార్చగలరా? ప్రత్యేక సంస్కృతుల్ని కాపాడుకోగలరా? వర్గ దృష్టి ప్రధానం కాకుండా, ఉన్న వ్యవస్థనే ఉంచదలచినప్పుడు ప్రయోజనమేముంది? అందర్నీ చదును చెయ్యడానికి అమెరికా బుల్‌డోజరు ఎలాగూ ఉంది. అన్నివిధాలా ప్రజల సమానతా ఆకాంక్షలు నెరవేరినప్పుడే ఏ ఉద్యమానికైనా సత్ఫలితం వస్తుంది. వేరైనా, కలిసి ఉన్నా, ఆ లక్ష్యం కోసమే అందరూ కృషి చెయ్యవలసి ఉంది.
– అద్దేపల్లి రామమోహనరావు, తూర్పు గోదావరి

తమ భూమ్మీదే దోపిడీకి గురౌతూ..
చేసుకున్న ఒప్పందాల ప్రకారం హక్కుగా రావలసింది రానప్పుడు పొందాల్సిన భాగా లు పొందనప్పుడు తమ భూభాగంలోనే దోపిడీకి గురౌతున్నప్పుడు ఎవరైనా కొట్లాడాల్సిం దే. తెలంగాణ ఇవ్వడం ఇవ్వకపోవడం అనేది రాజకీయ జూదంగా మారినపుడు ఉద్యమించాల్సింది రాష్ట్ర ఏర్పాటులో భాగస్వాములు కావాల్సింది ప్రజలే. రాష్ట్రాన్ని ప్రజలపరం చేయాల్సిన బాధ్యత ఉద్యమకారులపైనే ఉంటుంది.

తరతరాలుగా కొనసాగుతున్న అణచివేతలను వ్యక్తం చేయడానికి అనుభవించిన అనుభవిస్తున్న బాధాగాధలకు రూపం ఇవ్వడానికి సమాన హక్కులు సాధించుకోవడానికి అస్తిత్వ ఉద్యమాలు బలమైన సాధనాలు. ఐతే ప్రపంచీకరణ నేపథ్యంలో ఈ ఉద్యమాలు స్వార్థపరుల చేతుల్లోకి పోకుండా వ్యక్తులకే పరిమితం కాకుండా కెరీరిస్టు ధోరణిలోకి జారిపోకుండా కొనసాగిస్తేనే ఉద్యమ ఫలాలు సామాన్యులకు చేరతాయి.
– మంచికంటి, ప్రకాశం

అడ్డుకోవడం సమంజసం కాదు
తెలంగాణవాసులు తమకు ప్రత్యేక రాష్ట్రం కావాలని కోరుకోవడమన్నది ఇవాళ కొత్తేమీ కాదు. వందలమందిని బలిపెట్టి నెత్తురోడుతూ కన్నీరు కారుస్తూ ఇవ్వాళ్టికీ విముక్తి కోరుతూ నిలుచున్న తెలంగాణ తల్లి 500 దశాబ్దాల పురాతనమైనది. అక్కడ జరిగిన అనంతమైన వివక్ష, నిర్లక్ష్యం, దోపిడీల గురించి మాట్లాడుకోవలసి వస్తే అదో పెద్ద చరిత్ర. ఇన్నేళ్లకి ఒక చిన్న కదలిక వస్తే దాన్ని అడ్డుకోవడం సమంజసమైంది కాదు.

ఉమ్మడి కుటుంబం, సమైక్యంగా ఉండగలగడం మంచిదే, ఆశించవలసిందే అయినా ప్రజాస్వామికంగా కలిసి ఉండలేనప్పుడు విడిపోదామని కోరుకుంటున్న అన్నదమ్ముల్ని విడిపోనివ్వడమే మంచిది. ఆస్తుల్ని కాపాడుకోవడం కోసమో మరో రకమైన ప్రయోజనాలకోసమో అమాయక ప్రజల్ని రెచ్చగొట్టడం ప్రాంతీయ విద్వేషాల్ని రేపడం పెద్దలు, మేధావులు చేయవలసినపనికాదు. అట్టుడుకుతోన్న ఆంధ్రప్రదేశ్‌ని అంతా చూస్తున్నారు.. గమనించండి.
– వి.ప్రతిమ, నెల్లూరు

సంపన్నులు చిచ్చుపెడుతున్నారు
ఏళ్ళ తరబడి సాగుతున్న ఒక ప్రజా ఉద్యమ చివరి ఘట్టం రాజకీయుల చేతుల్లో ఎట్లా మలుపులు తిరుగుతున్నదో ఇవాళ కళ్లముందు కదలాడుతోంది. పోగేసిన సంపదల్ని కాపాడుకోవడానికి సంపన్న రాజకీయాలు ప్రాంతాల మధ్య ప్రజల మధ్య విద్వేషాగ్నుల్ని ఎట్లా రగిలిస్తారో ఇవాళ దృగ్గోచరమవుతోంది. వెనుకబడిన ప్రాం తాల అభివృద్ధి దిశగా జరగాల్సిన ఒక చర్చ, ఒక ప్రస్థానం దారి తప్పి కుట్ర రాజకీయాల వైపు మళ్లటం ఇవాళ్టి మేధోతనం. అణగారిన ప్రజల ఆకాంక్షల్ని ఏళ్ల తరబడి వివక్షకు గురైన ప్రాంత ప్రజల ఆక్రోశాన్ని ఆత్మ బలిదానాల్ని చులకన చేసి మాట్లాడ్డం, చీపురుపుల్లలా చూడటం ఇవాళ్టి రాజకీయం.

రాయలసీమ కావొచ్చు- ప్రకాశం, నెల్లూరు, పల్నాడు బెట్ట ప్రాంతాలు కావొచ్చు- అభివృద్ధికి దూరమై ఇవాళ్టికీ మంచినీళ్లు కూడా అందని ప్రాంతం ఏదైనా ఏదో ఒక ఉద్యమ విజయాన్ని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు పోవాల్సిందే. అట్లా జరిగితే తమ సంపదకి ప్రమాదమనుకునే సంపన్న రాజకీయాలు, సరైన స్పష్టత, అవగాహన లేని రాజకీయ నాయకు లు ఇవాళ ప్రాంతీయ ఉద్యమాల్ని వెనుకపట్టు పట్టించడానికి ప్రాంతాల మధ్య ప్రజల మధ్య చిచ్చును రగిలిస్తున్నారు. ఇప్పుడు కాకపోయినా ఇంకాసేపట్లోనైనా ఈ చిచ్చును ప్రజలే ఆర్పుతారు. వ్యక్తిగాని- సమాజంగాని- ప్రాంతంగాని- అణచబడ్డ వెనుకబడ్డ జాతి ఏదైనా గాని- ఎప్పటికైనాగాని తలెత్తుకు నిలబడాలనే తపన పడతారు.
– కాట్రగడ్డ దయానంద్‌, ఒంగోలు

ప్రజల న్యాయమైన ఆకాంక్ష
స్థానిక అస్తిత్వ ఉద్యమాలకి తెలంగాణ ఉద్యమం ఒక ప్రత్యేక సందర్భం. గత 50 సంవత్సరాలకుపైగా తెలంగాణ ఉద్యమం ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నప్పటికీ బలహీనం కాలేదు అంటే అది తెలంగాణ ప్రజల న్యాయమైన ప్రజాస్వామిక ఆకాంక్షగా గుర్తించాలి. తెలంగాణ ఉనికికి ఆత్మగౌరవానికి సమైక్యాంధ్ర భావన విఘాతం కలిగిస్తున్నప్పుడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ప్రజాస్వామికవాదులందరూ స్వాగతించాలి.

స్థానికులు ఏ ప్రాతిపదిక మీద ఐడెంటిటీ పొందుతారో దానికి సంబంధించిన అధికారం, వనరులు, సంస్కృతి స్థానికుల నిర్వహణలోనే ఉండాలి. నిర్ణయాధికారం స్థానికులకే ఉండాలి. దీనికి ఎక్కడ ఉల్లంఘన జరుగుతుందో అక్కడ ప్రాంతీయ అస్తిత్వ ఉద్యమాలు ఊపిరి పోసుకుంటాయి. ఈ ఉద్యమాలకి ప్రాంతీయ విద్వేషాలే మూలం అనుకోవడం పొరపాటు. భారత రాజ్యాంగం వ్యక్తులకు ఆమోదించిన రాజకీయ, ఆర్థిక, పౌర, సాంస్కృతిక హక్కుల్ని ఈ ఉద్యమాలు తిరస్కరించవు.
– కె.ఎన్‌.మల్లీశ్వరి, విశాఖపట్నం

ప్రజా జీవితంతో పరాచికం

ఇది సంకుచితమైన ఆలోచనలు సృష్టించిన సంక్షోభం. ప్రజాస్వామ్యాన్ని ఎవరికి వారు తమ పాకెట్‌ సైజులకు అనుకూలంగా తరుక్కుంటూ వెళ్ళటంవల్ల తలయెత్తిన విచిత్ర విషాదం. స్వార్థం, సంకుచితత్వాల రాక్షస రతి లో ఆకారం ధరించిన వికృత శిశువే పెటీ పేట్రియాటిజం. విలువల పతనాన్ని ఏ మాత్రం పట్టించుకోకపోవడం వల్ల దేశ రాజకీయ తనువు మీద పుట్టిన రాచపుండు ప్రాంతీయవాదం. ఒక ప్రాంతీయవాదం మరో ప్రాంతీయవాదానికి ప్రాణం పోసింది. ఒక ఆధిపత్య ధోరణి మరో ఆధిపత్య ధోరణికి మార్గం సుగమం చేసింది. భవిష్యత్తులో ఇది మరిన్ని ప్రాంతీయ దురభిమానాలకు, కుల ఆధిపత్యాలకు, వీధి పోరాటాలకు దారితీయదనే హామీ ఎక్కడా ఏమీలేదు.

వాదాలకు, సంవాదాలకు స్థానం కల్పించకుండా చెలరేగిన వివాదమిది. తాము అన్యాయానికి గురవుతున్నామన్న భావనని తెలంగాణ ప్రజల మనస్సుల్లోంచి తొలగించే ప్రయత్నం అసలు ఏమాత్రం జరగకపోవడం విడ్డూరం. ఒక భాష, ఒక సభ్యత, ఒక సంస్కృతి, ఒక చరిత్ర కలిగిన మనం ఒక జాతిగా మనలేకపోవడం నిజంగానే విషాదం. అరవై సంవత్సరాలు ఒక జాతి చరిత్రలో చాలా అల్పమైన అవధి. నిజానికి ఆంధ్రప్రదేశ్‌ సమైక్యంగా కొనసాగాలా లేక విడిపోవాలా అనే నిర్ణయం ముందుగా జరగవలసింది నిండు ప్రాణాలున్న కోట్లాదిమంది ఆంధ్రప్రదేశ్‌ ప్రజల హృదయాల్లో, మనోమస్తిష్కాల్లో. అధికార రాజకీయ రంగం ప్రజా జీవితంతో పరాచికం ఆడుతున్న సందర్భం ఇది.

రాజ్యాంగం మీదా, రాజకీయ వ్యవస్థ మీదా, మరీ ముఖ్యంగా ప్రజల మీదా ఏ మాత్రం గౌరవం, విశ్వాసం లేని నాయకుల నుంచి కూడా సమాజం విముక్తిని సాధించాల్సిన సమయం ఆసన్నమయింది. ఆదర్శాలు, విలువల విషయంలో బేరసారాలు వినాశనం దిశగా తప్ప మరో మార్గాన్ని సూచించలేవు. ముమ్మాటికీ ఇది ఉమ్మడి సంక్షోభం. ఉమ్మడిగానే మనం దీన్ని ఎదుర్కోవాలి. ఆగ్రహావేశాలకు అతీతంగా వ్యవహరించాలి. ఎంతటా దారుణమైన సమయాన్నయినా, సందర్భాన్నయినా సరే మనలోని మంచిని మేల్కొల్పటం ద్వారా మాత్రమే దృఢంగా ఎదుర్కొనగలం. నిజమయిన న్యాయాన్ని సమాజానికి అందించగలం. అంతిమంగా మనలోని వివేకమే మన అందరి మధ్యా నమ్మకమైన నేస్తంగా నిలవగలదనే సత్యాన్ని అర్థం చేసుకోగలం.
– ఖాదర్‌ మొహియుద్దీన్‌, కృష్ణా

రాయలసీమ ఉద్యమం అవసరమే

అన్ని ప్రాంతాలు సమంగా అభివృద్ధి చెందినప్పుడు ప్రాంతీయ ఉనికి ఉద్యమాలు అవసరం లేదు. అయితే ఒక ప్రాంతం అభివృద్ధి చెంది మరో ప్రాంతం వెనకబడి ఉంటే, వివక్షకు గురవుతుంటే ప్రాంతీయ ప్రాధాన్యతా ఉద్యమాలు అవసరమే. అయితే ఆంధ్రప్రదేశ్‌లో రాయలసీమ, కళింగాంధ్ర ప్రాంతాలు కూడా చాలా వెనుకబడి ఉన్నాయి. వాటి గురించి పట్టించుకునేవారే లేరు. భాషాప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడినప్పుడు తీసుకున్న నిర్ణయాల్లో రాయలసీమకు అన్ని ప్రాంతాలకంటే ఎక్కువ అన్యాయం జరిగింది.

ఈ నేపథ్యంలో ప్రత్యేక రాయలసీమ ఉద్యమం కూడా అవసరమే. రాష్ట్రాన్ని ముక్కలు చేయాలనుకున్నప్పుడు మిగిలిన ప్రాంతాలకంటే ముందు రాయలసీమను ప్రత్యేక రాష్ట్రంగా చేయడం ఎంతైనా అవసరం. ప్రపంచానికి అన్నం పెట్టే రైతులు అన్నంకోసం ఆత్మహత్యలు చేసుకోవడం ప్రపంచంలో ఒక్క రాయలసీమలోనే కనిపిస్తుంది. ఈ సందర్భంలో రాయలసీమ రాష్ట్రం రావలసిన అవసరం తెలంగాణతోపాటు ఉంది.
– వి.ఆర్‌.రాసాని, చిత్తూరు

ఎగుడుదిగుడులున్నాయని వేళ్లు నరుక్కున్నట్లే

వేర్పాటువాదం మీద దృష్టి పెట్టిన్నాటి నుండే తెలంగాణలో అక్షరాస్యత స్వయం సమృద్ధి సాధించడం మీద దృష్టి పెట్టి ఉంటే ఇవాళ్టి వెనుకబాటుతనం ఉండేది కాదు. రాష్ట్రాలు విడిపోతే నాయకులు, స్కాంలు, స్విస్‌బ్యాంకు అకౌంట్లు పెరగడమే గాని ఇవాళ్టి పరిస్థితుల్ని బట్టి చూస్తే నిజంగా వెనుకబడి న ప్రాంతాలకు వేర్పాటువాద ఫలాలు ఎంతవరకు అందుతాయన్నది ప్రశ్నార్థకమే. ప్రత్యేక రాష్ట్రం ఫలం అట్టడుగు స్థాయి వరకు అందించగలమని ఖచ్చితమైన నమ్మకం లేనప్పుడు ప్రత్యేక రాష్ట్రం పొందడం ఎగుడుదిగుడులున్నాయని వేళ్లు నరుక్కున్నట్లే అవుతుంది.
-పాటిబండ్ల రజని, కృష్ణా

ఇంటర్వ్యూలు: స్కైబాబ

source : aandhra jyothy 14 dec 09

ప్రకటనలు

వ్యాఖ్యలు»

No comments yet — be the first.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: