jump to navigation

కేసీఆర్‌ను అధిగమించిన ఉద్యమం Unexpected twists in Telangana agitation డిసెంబర్ 6, 2009

Posted by Telangana Utsav in 1969, agitation, Articles, bandh, BJP, compromise, Congress, Hyderabad, Identity, Kakatiya, Karimnagar, KCR, Khammam, livelihoods, Mulki, Osmania, politics, Sonia, Telangana, Telugu (తెలుగు), TRS, universities, Warangal.
trackback

కేసీఆర్‌ను అధిగమించిన ఉద్యమం
-ఆదిత్య

ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలోకి విద్యార్థులను రప్పించడంలో కె.సి.ఆర్‌ కృషి ఉందో లేదో తెలియదుగాని, ఇప్పుడు ఉద్యమం మాత్రం దాదాపుగా ఆయన చేయి దాటి, విద్యార్థుల నాయకత్వంలోకి వెళ్లిపోతోందని భావించవచ్చు. ప్రస్తుతం జిల్లాల్లో జరుగుతున్న ఆందోళనల్లో టి.ఆర్‌.ఎస్ శ్రేణుల కన్నా విద్యార్థుల సందడే ఎక్కువగా కనిపిస్తుండడం దీనికి సూచిక.

పులి మీద స్వారీ చేయాలనుకోవడం సాహసోపేతంగానే ఉంటుంది. అయితే అందుకు పులి మీదకు లంఘించి కూర్చోవడం మాత్రమే తెలిస్తే చాలదు. తర్వాత సురక్షితంగా కిందకు దిగి వెళ్లడం ఎలాగో కూడా ముందే నేర్చుకోవాలి. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమించిన టి.ఆర్‌.ఎస్ అధ్యక్షుడు కె. చంద్రశేఖర్‌రావు ఈపాటికే తెలుసుకుని ఉండాల్సిన నిజమిది. ప్రత్యేక రాష్ట్ర సాధన పేరుతో ఇప్పటిదాకా అనేక ఆసక్తికర విన్యాసాలు ప్రదర్శించిన కె.సి.ఆర్‌, పోయిన ప్రాభవాన్ని మళ్లీ సాధించడానికి ఆమరణ దీక్షను తాజా అస్త్రంగా ప్రయోగించారు.

దీని నుంచి ఆయన ఆకాంక్షించిన ప్రయోజనాలు కొన్ని కొంతవరకు నెరవేరినా, అసలు ఏ మాత్రం ఆశించని, ఎన్నడూ ఊహించని ఉపద్రవాలు కూడా అమాంతం ముంచుకొచ్చాయి. గత ఎన్నికల తర్వాత కుదేలైన టి.ఆర్‌.ఎస్‌ బలాన్ని, పాతాళానికి పడిపోయిన తన ప్రతిష్ఠను ఈ దీక్ష ద్వారా కె.సి.ఆర్‌ కొంతమేర పునరుద్ధరించుకోగలిగారు. బలమైన నాయకుడిగా, వార్తల్లో వ్యక్తిగా మళ్లీ నిలవగలిగారు. అంతేకాదు, తెలంగాణ సెంటిమెంట్‌ లేనేలేదని ఎన్నికల తర్వాత పలు పార్టీలు చేసుకున్న నిర్ధారణ తాజా పరిణామాలతో దూదిపింజలా తేలిపోయింది.

ప్రత్యేక తెలంగాణ భావన ఏ మాత్రం చల్లారలేదని, అది జనం మనసుల్లో నివురుగప్పిన నిప్పులా రగులుతూనే ఉందని తేటతెల్లమైంది. ఇంతవరకు కె.సి.ఆర్ అనుకున్నది అనుకున్నట్టే, ఆయనకు అనుకూలంగానే జరిగిందని భావించినా, ఆ తర్వాతి పరిణామాలు మాత్రం ఆయనకు మింగుడు పడనివే! ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలోకి విద్యార్థులను రప్పించడంలో కె.సి.ఆర్ కృషి ఉందో లేదో తెలియదుగాని, ఇప్పుడు ఉద్యమం మాత్రం దాదాపుగా ఆయన చేయి దాటి, విద్యార్థుల నాయకత్వంలోకి వెళ్లిపోతోందని భావించవచ్చు.

ప్రస్తుతం జిల్లాల్లో జరుగుతున్న ఆందోళనల్లో టి.ఆర్‌.ఎస్‌ శ్రేణుల కన్నా విద్యార్థుల సందడే ఎక్కువగా కనిపిస్తుండడం దీనికి సూచిక. ఎనిమిదేళ్ల పాటు తాను అనుకున్నది వేదంగా ప్రత్యేక పోరాటాన్ని నిర్వహించిన కె.సి.ఆర్‌ కూడా ఇప్పుడు విద్యార్థుల మాట వినక తప్పని పరిస్థితి ఎదుర్కొంటున్నారు. టి.ఆర్‌.ఎస్ వ్యూహకర్తలు లోపాయకారీగా చెబుతున్న వివరాల ప్రకారం, ఉస్మానియాలో విద్యార్థులపై పోలీసులు విచక్షణ రహితంగా లాఠీచార్జి చేయడం నేపథ్యంలో విద్యార్థుల భవిష్యత్తును, ఉద్యమం హింసా మార్గం పట్టడాన్ని కారణాలుగా చూపిస్తూ దీక్ష విరమించాలని కె.సి.ఆర్‌ భావించారు.

హింస చెలరేగిన వెంటనే కాంగ్రెస్‌ పార్టీలోని తెలంగాణ ప్రముఖుడొకరు, ప్రభుత్వం తరఫున కె.సి.ఆర్‌ తో రహస్య చర్చలు జరిపారు. ఖమ్మంలో ఉన్న కె.సి.ఆర్‌.కు ఫోన్‌ చేసి, ‘విధ్వంస నివారణ’ పేరు మీద దీక్ష విరమించుకోవాలని, చర్చలకు రావాలని సలహా ఇచ్చారు. కె.సి.ఆర్ సన్నిహితులూ ఇందుకు సమ్మతించి హుటాహుటిన ఖమ్మం పయనమయ్యారు. ముఖ్యులైన కుటుంబ సభ్యుల సమక్షంలోనే ఖమ్మంలో కె.సి.ఆర్ పళ్ల రసం తీసుకున్నారు. ఆ మరుసటి రోజు, అధికారికంగా మీడియా సమావేశం నిర్వహించి, స్వయంగా దీక్ష విరమణను ప్రకటించాలని కె.సి.ఆర్‌ భావించారు.

అయితే ఈలోపే పళ్లరసం తాగిన క్లిప్పింగుల్ని పోలీసులు కావాలని లీక్‌ చేయడం, అవి టెలివిజన్‌ చానెళ్లలో విస్తృతంగా ప్రసారం అవడం క్షణాల్లో జరిగిపోయింది. అంతే అనూహ్యంగా విద్యార్థులు కె.సి.ఆర్ చర్యను తీవ్రంగా ప్రతిఘటించారు. ఉద్యమ ద్రోహిగా పేర్కొంటూ శవయాత్రలు నిర్వహించారు. ఇటు టి.ఆర్‌.ఎస్‌.లో ని కుటుంబేతర నాయకులు కూడా ఆయన చర్యను తీవ్రంగా తప్పుబట్టారు. ‘ఎవరిని అడిగి పళ్ల రసం తాగారు? ఏ మొహం పెట్టుకుని మేం జనం ముందుకు వెళ్లాలి?’ అని ఆ పార్టీ శాసనసభా పక్షంలో కీలక పాత్ర పోషిస్తున్న నాయకుడొకరు కె.సి.ఆర్ ను నేరుగానే నిలదీసినట్టు తెలిసింది.

ఇలా విద్యార్థులు, పార్టీ నేతలు, ప్రజల్లో వ్యక్తమైన ప్రతిస్పందనను గమనించిన కె.సి.ఆర్‌ తెలంగాణ నినాదం శాశ్వతంగా తన చేజారే ప్రమాదముందని అర్థం చేసుకుని, ప్రాప్తకాలజ్ఞత ప్రదర్శించి, నెపాన్ని పోలీసులపైకి నెట్టి, అనివార్య పరిస్థితిలో దీక్ష కొనసాగింపునకు నిర్ణయించుకున్నారు. నిజానికి దీక్షకు ఈ స్థాయిలో ప్రతిస్పందన వస్తుందనిగాని, పర్యవసానాలు ఇలా ఉంటాయనిగాని, విద్యార్థులు ఈ స్థాయిలో ఉద్యమిస్తారనిగాని కె.సి.ఆర్‌ ఎంతమాత్రం ఊహించి ఉండరు. అసలు ఆయనను దీక్షకు ముందే అరెస్టు చేయకుండా, కనీసం ఒకరోజైనా కూర్చోనిస్తే పరిస్థితి ఈ మలుపు తీసుకునేది కాదని, అసలే బి.పి, షుగర్‌ పేషెంట్‌ అయిన ఆయన తనంతతానుగా దిగివచ్చే వారన్నది ఆయన గురించి బాగా తెలిసిన కొందరు, గతానుభవాలను ఉటంకిస్తూ వ్యక్తంచేస్తున్న అభిప్రాయం.

అలా కాకుండా పోలీసులు ముందే అరెస్టు చేయడంతో ఆయన తనదైన శైలిలో హడావుడి చేయడానికి అవకాశం కలిగింది. అయితే ఇందులో అన్నింటికన్నా ముఖ్యమైనది ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులపై విచక్షణ రహితంగా జరిగిన లాఠీచార్జి! సున్నితమైన, సమస్యాత్మకమైన ప్రాంతమని తెలిసి కూడా, దుందుడుకుగా వ్యవహరించడం ద్వారా పోలీసులు క్యాంపస్‌లో చదువుకునే విద్యార్థులను రోడ్ల మీదకు రప్పించారు. ఫలితంగా విద్యార్థులు తామే ఉద్యమ నాయకత్వా న్ని చేపట్టడానికి సిద్ధపడ్డారు.

ఈ పరిణామం టి.ఆర్‌.ఎస్‌.కు ఏ మాత్రం మింగుడు పడడం లేదు. విద్యార్థులను ‘ఇన్‌వాల్వ్‌’ చేయడంపై టి.ఆర్‌.ఎస్‌.లో కీలక పాత్ర పోషిస్తున్న ఇద్దరు యువ నేతలు వాదులాడుకున్నట్టు సమాచారం. ‘ఇదంతా కావాలని నువ్వే చేయించావు’ అని కె.సి.ఆర్‌.కు అత్యంత సన్నిహితంగా ఉండే ఒక యువ నేత తప్పుబట్టగా, తనకు ఏ సంబంధమూ లేదని మొదటినుంచీ పార్టీలో చక్రం తిప్పుతున్న మరో యువ నేత తప్పించుకున్నట్టు చెబుతున్నారు. ఇప్పటిదాకా జరిగింది సరే, ఇక ముందు ఏం జరగబోతోందన్నది కీలక ప్రశ్న. ఉద్యమ నిర్వహణకు విద్యార్థి సంఘాలు సంయుక్త కార్యాచరణ సంఘం (జె.ఎ.సి)గా ఏర్పడ్డాయి. నిజానికి ఇదొక ఆసక్తికర, ప్రశంసాకర సన్నివేశం.

గత కొన్నేళ్లుగా సామాజిక అంశాలతో సంబంధం కోల్పోయి, కేవలం కెరీర్‌ ఆధారిత మార్కెట్‌ ఎకానమీలో ఉద్యోగాల వేటపైనే దృష్టిని పరిమితం చేసిన విద్యార్థి లోకం ఒక రాజకీయ, సామాజిక అంశంపై ఈ స్థాయిలో ఉద్యమానికి సిద్ధపడడం ఆహ్వానించదగినది. ఒక ప్రాంత ప్రజల మనోభావాలకు సంబంధించిన అంశం పై సి.పి.ఐ (ఎంఎల్‌) అనుబంధమైన పి.డి.ఎస్‌.యు మొదలుకుని, బి.జె.పి అనుబంధమైన ఎ.బి.వి.పి దాకా, విభిన్న రాజకీయ పార్టీలకు చెందిన విద్యార్థి సంఘాలు ఒక్కతాటిపైకి రావ డం అనూహ్య పరిణామం. ఇది ఆ అంశానికి ఉన్న విస్తృత ఆమోదనీయతను సూచించడమే కాదు, విద్యార్థి లోకంలో వచ్చిన గుణాత్మకమైన మార్పును కూడా తెలియజేస్తున్నది.

ఇంతకుముందు ఈ అంశానికి సారథ్యం వహించిన రాజకీయ నాయకత్వం ‘నిర్బంధం’లో ఉన్న నేపథ్యంలో, ప్రస్తుత విద్యార్థి ఉద్యమం ఒక వ్యవస్థీకృత శక్తిగా మారడానికి కొంత సమయం పడుతుంది. ఇందుకోసం విద్యార్థి ఉద్యమానికి బలమైన నాయకత్వం మరో రాజకీయ శక్తి నుంచి అయినా రావాలి, లేదా విద్యార్థి లోకం తనంత తానుగా అయినా పరిపక్వ నాయకత్వంగా ఆవిర్భవించాలి. విద్యార్థులు తమంత తాముగా రాజకీయ ఉద్యమాలు నిర్వహించలేరని ఏమీ లేదు. అసోంలో ఆసు ఆధ్వర్యంలో విద్యార్థులు ఇలాగే ఉద్యమించి, తామే నాయకత్వంగా ఎదిగి, తర్వాత రాజకీయ శక్తిగా మారిన అనుభవం ఉంది.

అయితే ఇది జరిగేదాకా విద్యార్థి సంఘాలను తమవైపు ఆకర్షించడానికి, విభజించి పాలించడానికి ఇతరత్రా రాజకీయ పార్టీలు, శక్తులు ప్రయత్నిస్తూనే ఉంటాయి. ఈ యత్నాలను విద్యార్థి సంఘాలు ఎంతవరకు తట్టుకుంటాయి? విద్యావకాశాలు, ఉద్యోగాలకు తీవ్రమైన పోటీ నెలకొన్న ప్రస్తుత సంస్కరణల యుగంలో విద్యార్థులు త్యాగాలకు ఎంతవరకు సిద్ధపడతారు? అన్నవి కీలకమైన అంశాలు. క్యాంపస్‌లో పోలీసుల దౌర్జన్యం కారణంగా ఉద్యమంలోకి దూకిన విద్యార్థులు, దానికి జవాబుగా మిలిటెంట్‌ తరహాలోనే స్పందించారు. తమకు తోచిన మార్గంలో ఉద్యమాన్ని నడిపిస్తూనే, పేర్లను మార్చడం వంటి కొన్ని సృజనాత్మక ఎత్తుగడలనూ అనుసరిస్తున్నారు.

గతంలో తెలంగాణ ఉద్యమ పార్టీ పెట్టినపుడు దేవేందర్‌గౌడ్‌ కూడా ఇదే తరహా ఎత్తుగడలు అనుసరించారు. అయితే అప్పటికి ఇప్పటికి ఒక తేడా ఉంది. పూర్వాపరాలు, చారిత్రక నేపథ్యాలు తెలియకపోవడం వల్ల కావచ్చు, విద్యార్థులు ఆంధ్రా అన్న పదమే కనబడకూడదన్నట్టుగా సంస్థల పేర్లను మారుస్తున్నారు. చివరికి తెలంగాణ ఉద్యమానికి ఆలంబనగా ఉన్న పత్రికల పేర్లను కూడా మారుస్తుండడం విచిత్రం! విద్యార్థులలోని అవగాహనా రాహిత్యాన్ని ఇది పట్టి ఇస్తుండగా, ఇదే అదనుగా ఉద్యమాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడానికి ఇతర శక్తులు వేటికవే ఆలోచిస్తున్నాయి.

గతంలో కె.సి.ఆర్‌ ను వ్యతిరేకించిన, కొద్దికాలంగా వార్తల్లోకి రాకుండా స్తబ్దంగా ఉన్న మందకృష్ణ మాదిగ అకస్మాత్తుగా కేసీఆర్‌కు మద్దతుగా రంగంలోకి రావడం ఆశ్చర్యకర పరిణామం. అలాగే గతంలో ప్రత్యేక తెలంగాణను వ్యతిరేకించి, ఇటీవలే మద్దతు ప్రకటించిన న్యూ డెమొక్రసీ వర్గం కూడా తొలిసారి తనకు లభించిన అవకాశాన్ని వాడుకోవడానికి ప్రయత్నిస్తున్నది. వీళ్లే కాకుండా పాలక పార్టీ రాజకీయాల్లో గత వైభవ సాధన కోసం ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న సీనియర్లు, వర్గ ప్రయోజనాలు సాధించడానికి తొందరపడుతున్న జూనియర్లు కూడా ఎవరికి వారు అవకాశం కోసం తాపత్రయపడుతున్నారు.

ఎవరికి పుట్టిన బిడ్డరా వెక్కివెక్కి ఏడుస్తున్నది అన్నట్టు, ప్రజలు జీవన్మరణ సమస్యగా భావిస్తున్న, విద్యార్థులు తమ భవిష్యత్తును పణంగా పెట్టి భుజానికి ఎత్తుకున్న తెలంగాణ నినాదం ఇప్పుడు అనేకమంది దృష్టిలో ప్రయోజనాలు నెరవేర్చే ఆట వస్తువు! తెలంగాణ కావాలనుకుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న వారు, ఒక్క దెబ్బకు రెండు పిట్టలన్నట్టు ప్రత్యేక రాష్ట్ర సాధనతోపాటు కొందరి భవిష్యత్తును దెబ్బతీయాలని అనుకుంటున్నవారు, తెలంగాణ ఏర్పడవద్దని బలంగా వాంఛిస్తున్నవారు, తెలంగాణ పేరుతో పబ్బం గడుపుకోవాలని భావిస్తున్నవారు, ప్రస్తుత సర్కారును ఇబ్బందుల్లోకి నెట్టి అభాసుపాలుజేయాలని చూస్తున్నవారు, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే తమకే ఎక్కువ ప్రయోజనం అని ఊహిస్తున్నవారు…అందరూ ఇప్పుడు ‘ఉద్యమం’లో సీరియస్‌గా ఇన్‌వాల్వ్‌ ఆయ్యారు.

‘దీక్షలో ఉన్న కె.సి.ఆర్‌’ను చూపిస్తూ, ఎవరి లెక్కలు వారు వేసుకుంటున్నారు. అందుకే విద్యార్థి నాయకత్వం జాగ్రత్తగా ఉండాలనేది! ప్రజలు, విద్యార్థులు, ఉద్యోగులు, వివిధ వర్గాల నుంచి ప్రత్యేక తెలంగాణకు లభిస్తున్న మద్దతు చూస్తుంటే ఒకటి అనిపిస్తున్నది. రాజకీయ సారథ్యానికి బదులు విశ్వసనీయ నాయకత్వం కనుక ఉండిఉండే తెలంగాణ ఉద్యమం ఏనాడో ఇంతకుమించి ఉధృతమై ఉండేదని! ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుపై నిర్ణయం తీసుకునే అధికారమున్న కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెస్‌ హైకమాండ్‌ రాష్ట్రంలో పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నాయి. కె.సి.ఆర్ దీక్ష చేపట్టిన ‘టైమింగ్‌’ను, దాని వెనక కారణాలను, ఈ వ్యవహారంలో ఎవరెవరికి ఏమేం ప్రయోజనాలున్నాయన్న దాన్ని కూడా అధిష్ఠానం జాగ్రత్తగా విశ్లేషిస్తున్నట్టు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

వై.ఎస్‌ రాజశేఖరరెడ్డి వంటి కరడుగట్టిన సమైక్యవాది ఉండగా, సాధ్యం కాదని తెలిసీ రాజకీయ లాబీయింగ్‌ను మార్గంగా ఎంచుకున్న కె.సి.ఆర్‌, రోశయ్యలాంటి మెతక మనిషి ముఖ్యమంత్రి అయ్యాక, లాబీయింగ్‌ ఫలించే అవకాశముందని తెలిసీ, పోరాటానికి సిద్ధపడడం తప్పుడు వ్యూహమా? లేక దీని వెనక ఎవరి హస్తమైనా ఉందా? అన్నది కూడా ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఇంత ఉద్యమం చేపట్టినా అంతిమంగా తెలంగాణ సాధనకు లాబీయింగ్‌ చేయడం, కాంగ్రెస్‌ హైకమాండ్‌ను ప్రసన్నం చేసుకోవడం తప్పదని రాజకీయ పరిణామాలు రుజువు చేస్తున్నాయి. ఛత్తీస్‌గఢ్‌ అనుభవం దృష్ట్యా కేంద్ర ప్రభుత్వంలో ని ముఖ్యులు కూడా ‘తెలంగాణ రాష్ట్రం’ పట్ల అంత సుముఖంగా లేరని రాష్ట్రానికే చెందిన ఒక యువ ఎంపీ అన్నారు.

మహాఅయితే ప్రత్యేక ప్యాకేజీతోనో, లేదా ఇతరత్రా ఒప్పందంతోనో సరిపెట్టవచ్చన్నది ఒక అంచనా. ‘ఆంధ్రప్రదేశ్‌లో ఆరు సూత్రాల పథకం అమలు కాలేదా?’ అని కేంద్ర ప్రభుత్వ భద్రతా సలహాదారు ఎం.కె నారాయణన్‌ తనను కలసిన ఎంపీలతో అనడం, ఢిల్లీలో ముఖ్యమంత్రి రోశయ్య కూడా ఆరు సూత్రాల పథకాన్ని ప్రముఖంగా ప్రస్తావించడం గమనార్హం! మొత్తానికి తెలంగాణ ఉద్యమం ఒకదశ దాటి ముందుకు పోవడానికిగాని, టి.ఆర్‌.ఎస్. పూర్తి పట్టు సాధించడానికిగాని కాంగ్రెస్‌ హైకమాండ్‌ అనుమతించక పోవచ్చని భావిస్తున్నారు.

అభిమన్యుడికి పద్మవ్యూహం లోపలికి వెళ్లడం తప్ప బయటకు రావడం తెలియని రీతిలో, కె.సి.ఆర్‌ దీక్షనైతే మొదలుపెట్టారుగాని, దాన్ని విరమించడం ఎలాగో తెలియని ఒక విచిత్ర సంకట స్థితిని ఎదుర్కొంటున్నారు. అదే సమయంలో ‘కె.సి.ఆర్‌.కు ఏమైతేనేం? తెలంగాణ వస్తే చాలు’ అన్న రీతిలో కొందరు ఆయనపై సానుభూతి కురిపిస్తూనే, పావులు కదుపుతుండగా, తమ ‘లెక్క’ కుదిరితే చాలన్న పద్ధతిలో మరికొందరు ఎత్తులు వేస్తున్నారు. తెలంగాణ కోసం అంటూ ఇప్పటిదాకా పలువురి వలలో పడిన కె.సి.ఆర్ ఇప్పుడు మొట్టమొదటిసారి తెలంగాణ శక్తుల చేతిలో పడ్డారు.

ఉద్యమాన్ని తన నుంచి హైజాక్‌ చేశారనే భావనలో ఉన్న కె.సి.ఆర్ ప్రస్తుతం ముందు నుయ్యి, వెనక గొయ్యిలాంటి పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఏమీ సాధించకుండా దీక్ష విరమిస్తే, ఉద్యమ ద్రోహిగా ముద్రపడి తెలంగాణ నినాదం పూర్తిగా చేజారడం ఖాయం. దీక్ష కొనసాగించాలంటే, కనుచూపు మేరలో పరిష్కారం కానరాని స్థితిలో ఇలా ఎంతకాలం గడపాలి? ఉద్యమ నాయకత్వమే తన చేతుల్లోంచి వెళ్లిపోతున్నపుడు ఎందుకు దీక్షలో ఉండాలి? అన్నవి ఇప్పుడు ఆయన ముందున్న ప్రశ్నలు.

మరోవైపు ఆయన ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. అటు కె.సి.ఆర్‌ ‘ఢిల్లీ నుంచి పిలుపు’ను కోరుకుంటున్నారు. అయితే గతంలో ఒక సందర్భంలో కె.సి.ఆర్‌ సోనియాను, ఆమె సన్నిహితులను తీవ్రంగా దూషించారని, ఇది తెలిసి ఆమె చాలా ఆగ్రహించారని, అందువల్ల అధిష్ఠానం పిలుపు రావడం అనుమానమేనని అంటున్నారు. ఈ నేపథ్యంలో కె.సి.ఆర్ కోరుకుంటున్నట్టు నిమ్స్‌ నుంచి జైత్రయాత్ర జరగడం సాధ్యం కాకపోవచ్చు. ఆయన హెచ్చరించినట్టు శవయాత్ర జరగడానికీ ప్రభుత్వం అనుమతించదు!!

source:andhra jyothy 5th Dec 09

వ్యాఖ్యలు»

No comments yet — be the first.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / మార్చు )

Connecting to %s

%d bloggers like this: