jump to navigation

కేసీఆర్‌ చెరలో తెలంగాణ Telangana privatised by KCR & Family Ltd మార్చి 28, 2009

Posted by M Bharath Bhushan in Essays, Identity, politics, TDP, Telangana, Telugu (తెలుగు), TRS.
trackback

కేసీఆర్‌ చెరలో తెలంగాణ
– ఆదిత్య

ఇప్పుడు తెలంగాణవాదం అనేది తెలంగాణ ప్రజల కోసం కాకుండా, ‘కేసీఆర్‌ చేత, కేసీఆర్‌ వలన, కేసీఆర్‌ కోసం’గా మారింది. ఆయన పుణ్యాన ఇప్పుడు తెలంగాణవాదమనేది ప్రజల ఆకాంక్షగా కాకుండా ఓట్లు- సీట్ల లెక్కగా, రాజకీయ పార్టీల మధ్య బేరసారాల వస్తువుగా మారింది.

తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఎంతో తెలివైనవారు. మంచి భాషతో, తెలంగాణ మాండలికం నిండిన యాసతో జనాన్ని ముగ్ధుల్ని చేయగల మాటల మాంత్రికుడు. రాజకీయ వ్యూహరచనా దురంధరుడు. ఎన్నిసార్లు దెబ్బతిన్నా, సహజ సిద్ధమైన నేర్పరితనంతో మళ్లీ లేచి నిలబడగలిగిన సమర్థుడు, అదృష్టవంతుడు. అందువల్లే తెలంగాణవాదాన్ని కేసీఆర్‌ గతంలో ఎవరికీ సాధ్యంకాని రీతి లో, ఇంతలా ఇంత సుదీర్ఘ కాలం ఒడిసిపట్టగలిగారు. అయితే అన్ని రోజులూ మనవి కావన్నట్టు రాజకీయాల్లోనూ అదృష్టం ఎప్పుడూ ఏకపక్షంగా ఉండదు. గడుసరి రాజకీయాలు కాలం కలసి వచ్చినపుడు బాగానే ఉంటాయి. తమకు ఎదురేలేదన్న భ్రమను కలిగిస్తాయి. కానీ వికటిస్తే అవి దీర్ఘకాలంలో చేసే నష్టం అంతాఇంతా కాదు. గడుసరి తనంతో వ్యవహరించే నాయకుడే కాదు; అతను చేపట్టిన ఎజెండా, ఆశ్రయించిన నేతలు, అవతరించిన పార్టీ అన్నీ ఇబ్బందుల్లో పడతాయి.

ప్రస్తుతం కేసీఆర్‌, ఆయన చేపట్టిన తెలంగాణవాదం పరిస్థితి ఇదే. అతి సంక్లిష్టమైన అన్ని అంశాలతో ఏకకాలంలో గేమ్‌ ఆడడం కేసీఆర్‌కు మాత్రమే సాధ్యమైన జాదూ! ఆయన ఎంత సమర్థుడంటే తెలంగాణవాదంతో, మిత్రపక్షాలతో, మీడియాతో ఒకేసమయంలో ఆటాడగలరు. అందునా… ఒకదానితో మరొకదానికి ముడిపెట్టి… తన ప్రయోజనాలు సాధించుకోగలరు. తెలంగాణ వాదాన్ని ఓట్లుగా చూపించి, మీడియాలో వార్తలు/ లీకులు రాయించి, మిత్రపక్షాలతో బేరాలు జరపడం ఆయనకు మాత్రమే చేతనైన కళ. తెలంగాణవాదం విషయంలో ఒకప్పుడు చంద్రబాబు అందరితో ఆడుకున్నారు. ఇక కేసీఆర్‌తో ముఖ్యమంత్రి వైఎస్‌ ఒక ఆటాడుకుంటే, ఇప్పుడు కేసీఆర్‌ తనవంతుగా చంద్రబాబుతో ఆడుకుంటున్నారు. ‘రోజు మొత్తంలో కేసీఆర్‌ గంటసేపు మాత్రమే ఆలోచిస్తారు. మిగతా నేతల్లా రోజంతా ఆలోచిస్తే పరిస్థితి ఇంకెట్లా ఉండేదో!’ ఇది ఇటీవల ఒక మిత్రుడు భయంతో చేసిన వ్యాఖ్య. ఈ అభిప్రాయం ప్రస్తుత పరిణామాలకు అతికినట్టు సరిపోతుంది. మహాకూటమితో పొత్తు, సీట్ల సర్దుబాటు విషయంలో కేసీఆర్‌ అనుసరిస్తున్న వైఖరి,

వ్యవహరిస్తున్న తీరు మిత్రపక్షాలకు చికాకు కలిగించడంతో పాటు సొంతపార్టీ టీఆర్‌ఎస్‌లోనూ అసహనానికి కారణమవుతోంది. గత కొన్ని దశాబ్దాలుగా తెలంగాణ వాసుల ఆకాంక్షల రూపంలో నిక్షిప్తమై ఉన్న తెలంగాణా వాదాన్ని, రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్‌ కెలుకుతూ వచ్చింది. చీమల పుట్టలో పాము దూరి ఆక్రమించినట్టుగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడల్లా తెలంగాణ జెండా పట్టుకోవడం మొదలుపెట్టింది. అలా తెలంగాణవాదం రాజకీయ అంశంగా స్థిరపడిపోయింది. దీనికి భిన్నంగా, కొందరు తెలంగాణ విద్యావంతులు, మేధావులు 2001 కి ముందు సమాంతర తెలంగాణ ఉద్యమానికి పెద్దఎత్తున రంగం సిద్ధం చేశారు. ఈ తరుణంలో తెలుగుదేశంతో సరిపడక బయటకు వచ్చిన కేసీఆర్‌, 2001లో టీఆర్‌ఎస్‌ను స్థాపించి తెలంగాణవాదాన్ని తన చేతుల్లోకి తీసుకున్నారు. క్రమంగా దాన్నొక రాజకీయ ఉద్యమ స్థాయికి తీసుకువచ్చారు. తెలంగాణవాదం, నినాదం కేసీఆర్‌ ఒక్కరిదేమీ కాకపోయినా, తెలంగాణకు ఆయనే పర్యాయపదంగా నిలిచారు. ఇందు కు కేసీఆర్‌ కృషికన్నా, కలసివచ్చిన ఇతరత్రా పరిణామాలే ఎక్కువ కారణమంటే అతిశయోక్తి కాదు.

కేసీఆర్‌ జెండా ఎత్తుకున్న తర్వాత ఈ ఆరేడేళ్లలో తెలంగాణవాదం అనేక ఆటుపోట్లు ఎదుర్కొంది. ఉద్య మం ఉడిగిపోయింది అనుకున్న, అనిపించిన ప్రతి సందర్భంలోనూ ఏదోఒకటి, ఎవరో ఒకరు దాన్ని నిలబెడుతూ వస్తున్నా రు. అయితే ఆ ఖ్యాతి కేసీఆర్‌ ఖాతాలో జమవుతూ రావడం విశే షం, విషాదం కూడా! ‘ఇదిగో తెలంగాణ, అదిగో తెలంగాణ, సోనియా దేవత చూస్తోంది, కాంగ్రెస్‌ ఇస్తోంది’ అంటూ గడువుమీద గడువు పెట్టి మూడేళ్లు కాలక్షేపం చేసిన కేసీఆర్‌, కాంగ్రెస్‌ తో తెగదెంపుల తర్వాత ఏం చేయాలో తెలియని అయోమయ స్థితిలో పడిపోయారు. ఆ సమయంలో ‘చేతనైతే మళ్లీ గెలువు’ అని కాంగ్రెస్‌ నేత ఎం.సత్యనారాయణరావు, అప్పటి పీసీసీ అధ్యక్షుడు కేశవరావు విసిరిన సవాల్‌ కేసీఆర్‌కు చిమ్మచీకట్లో చిరుదీపంలా కనిపించింది. దాన్ని అందిపుచ్చుకున్న కేసీఆర్‌ కరీంనగర్‌ ఎంపీ సీటుకు రాజీనామా చేసి, (2006) ఉప ఎన్నికలో రెండున్నర లక్షల భారీ మెజారిటీతో గెలిచారు.

దీంతో శిఖరస్థాయికి వెళ్లిన తెలంగాణవాదం… కేసీఆర్‌ తీసుకున్న అనాలోచి త, దుందుడుకు నిర్ణయంతో… గత ఏడాది (2008 మే) ఉప ఎన్నికలతో పతనావస్థకు చేరింది. మళ్లీ ఒక అయోమయం, అసహాయత. ఈ తరుణంలో చంద్రబాబు తెలుగుదేశం, ‘కారణాలేమైనప్పటికీ’ ప్రత్యేక తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడంతోపాటు, టీఆర్‌ఎస్‌కు స్నేహహస్తం సాచింది. కాంగ్రెస్‌తో చెడిన నేపథ్యంలో ఎటుపోవాలో తెలియని కేసీఆర్‌ కు టీడీపీ ఆహ్వానం రూపంలో అదృష్టం మళ్లీ తలుపుతట్టింది. అప్పటికి టీడీపీదే పైచేయి. పొత్తు కావాలంటే దాని మాటకు కట్టుబడి ఉండక తప్పని పరిస్థితి కేసీఆర్‌ది. ఈ తరుణంలో ప్రజారాజ్యం పార్టీ రూపంలో కేసీఆర్‌కు మరో అవకాశం అందివచ్చింది. పీఆర్పీ రాకతో, తెలంగాణలో టీఆర్‌ఎస్‌ ప్రభావం, ఓటుబ్యాంకు ఎంత (ఉప ఎన్నికలు ముగిసి అప్పటికి కొద్దిరోజులే అయింది) అన్న మీమాంసతో సంబంధం లేకుండా టీఆర్‌ఎస్‌ ఒక ట్రంప్‌కార్డులా మారిపోయింది.

రెండు ప్రాంతీయ పార్టీల ఉబలాటం నడుమ దానికి డిమాండ్‌ పెరిగింది. లోపాయికారీగా టీడీపీతో అప్పటికే పొత్తు ఖరారు చేసుకున్న కేసీఆర్‌, ఆవిషయాన్ని దాచి, మధ్యలో వచ్చిన పీఆర్పీతో మంతనాలు మొదలుపెట్టారు. దీన్ని అడ్డుపెట్టుకుని టీడీపీతో బేరసారాల శక్తిని పెంచుకున్నారు. కన్యాశుల్కంలో మధురవాణి మంచంకింద రామప్పపంతుల్ని, గిరీశా న్ని ఏకకాలంలో దాచి నాటకమాడినట్టు… కేసీఆర్‌ టీడీపీ, పీఆర్పీలతో వ్యవహారం నడిపారు. అయినా రోజులు ఆయనవి కనక అనుకున్నట్టు సాగిపోయింది. నిజంగా, నిష్పాక్షికంగా చెప్పాలంటే తెలంగాణ నినాదం కేసీఆర్‌ది కాదు. ఆయన దాన్ని ఒడుపుగా అందిపుచ్చుకున్నారం తే! దానికి తన చతురతను జోడించి, రాజకీయ లాబీయింగ్‌ ద్వారా తెలంగాణ అన్న పంథా ఎంచుకున్నారు. కానీ తెలంగాణ కోసం గొంతెత్తినవారు ఎందరో ఉండగా, వారెవర్నీ కలుపుకొని పోలేదు. ఎక్కడా పూర్తిస్థాయి ఉద్యమ నిర్మాణం జరగలేదు.

అట్టడుగు స్థాయి నుంచి పునాదులు వేయలేదు. చివరికి రాజకీయ పార్టీ నిర్మాణం సైతం సరిగా జరగలేదు. కేసీఆర్‌ వ్యవహారమంతా మీటింగ్‌ టు మీటింగ్‌… డెడ్‌లైన్‌ టు డెడ్‌లైన్‌! అందువల్లే తెలంగాణలో పది జిల్లాలున్నా, ఇవాల్టికీ టీఆర్‌ఎస్‌ ప్రాభవం ఉత్తర తెలంగాణకే పరిమితం. ఒంటరిగా బరిలోకి దిగితే పట్టుమని పదిసీట్లైనా కచ్చితంగా గెలవగలదని చెప్పలేని దుస్థితి. ఒక్కమాటలో చెప్పాలంటే తెలంగాణవాదానికి కేసీఆర్‌ చేసిన సాయంకన్నా, దానిద్వారా ఆయన పొందిన ప్రయోజనమే ఎక్కువ. దీన్ని ఎండగట్టే, ఎత్తిచూపే బలమైన ప్రత్యామ్నాయ శక్తులు కరవయ్యాయి. ఆ ధీమాతోనే కేసీఆర్‌ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. పార్టీలో ఇసుమంతైనా ప్రజాస్వామ్యానికి తావులేకుండా నియంతృత్వ పోకడలు పోతున్నా, కేసీఆర్‌ చెల్లుబాటు కావడానికి అసలు కారణం ఆయన గొప్పతనం కాదు.

అది తెలంగాణ వాదం ఇస్తున్న బలం. తెలంగాణ ప్రజల్లో ఉన్న ఆకాంక్షల, ఆశల బలం. దాన్ని తన బలం అనుకుంటున్న కేసీఆర్‌ భ్రమ తాజాగా పరాకాష్ఠకు చేరింది. టీడీపీతో పొత్తు చర్చల్లో కనిపిస్తున్నది ఇదే. కాలికేస్తే మెడకు, మెడకేస్తే కాలికేయడం మాత్రమే కాకుండా, చీటికిమాటికి కూటమి నుంచి విడిపోతున్నట్టు ప్రసార సాధనాలకు లీకులు ఇవ్వడం ద్వారా కేసీఆర్‌ టీడీపీతో ఒక రౌండ్‌లో ఆడుకున్నారు. పొత్తుకోసం టీడీపీ పాకులాటను బలహీనతగా భావించారు. అయితే కేసీఆర్‌ గమనించని విషయం ఒకటుంది. వ్యాపారంలో, రాజకీయంలో విశ్వసనీయత చాలా ముఖ్యం. వ్యాపారంగా మారిన నేటి రాజకీయంలో విశ్వసనీయత అవసరాన్ని వేరే వివరించనక్కర్లేదు. ఒకసారి విశ్వసనీయతను కోల్పోతే మళ్లీ సాధించడం చాలా కష్టం. తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని పరిపాలించిన చంద్రబాబే ఇందుకు సజీవ తార్కాణం. విశ్వసనీయతను కోల్పోవడం వల్లే, చంద్రబాబు ఇప్పటికీ పూర్వవైభవం సాధించలేకపోతున్నారు.

కాలం తనదైనపుడు చంద్రబాబు కూడా ప్రస్తుతం కేసీఆర్‌లాగే ఎంతో అహంకార పూరితంగా వ్యవహరించి సహచర పార్టీలను దారుణంగా అవమానించారు. అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేదన్న సాంకేతిక కారణంతో జాతీయ పార్టీ అయిన సీపీఐని అఖిలపక్ష సమావేశాలకు పిలవడం మానేశారు. ఇప్పుడు అదే చంద్రబాబు టీడీపీని నిలబెట్టుకోవడానికి, సీపీఐ రాష్ట్ర, జాతీ య నేతల వద్ద ఎన్నో అవమానాల ను దిగమింగి, పొత్తు కోసం చేయిసాచాల్సిన పరిస్థితి. నాటి చంద్రబాబులాగే నేడు కేసీఆర్‌ కూడా చెలరే గిపోతున్నారు. తెలంగాణకు తాను తప్ప దిక్కులేదన్న రీతిలో ఆయన వ్యవహారశైలి ఉంది. తనను, తన పార్టీని గెలిపించడం ఓటర్ల బాధ్యత అన్నట్టుగా ప్రవర్తిస్తున్నా రు. ‘సీట్ల’ను వేటాడుతూ మృగయావినోదం అనుభవిస్తున్నా రు. అయితే ఈ క్రమంలో ఒక రాజకీయ నాయకుడిగా విశ్వసనీయతను పూర్తిగా కోల్పోయిన సంగతిని కేసీఆర్‌ గుర్తించడం లేదు.

‘ఏ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? ఏ సీటును ఎందు కు కోరుతున్నారు? ఏ టికెట్‌ను ఎవరికి, ఎందుకిచ్చారు?’ అనే అంశాలపై మిత్రపక్షాలతో పాటు సొంతపార్టీ నేతలు, చివరికి కిందిస్థాయి కార్యకర్తలు సైతం కేసీఆర్‌ను శంకిస్తున్నారంటే, అందుకు కారణం ఆయన విశ్వసనీయతను కోల్పోవడమే! సికింద్రాబాద్‌ లోక్‌సభ అభ్యర్థి విషయంలో ‘తెలంగాణ భవన్‌’ లో కార్యకర్తలు ప్రదర్శించిన ఆగ్రహం, చేసిన ఆరోపణలు ఈ విశ్వాస రాహిత్యానికి తాజా ఉదాహరణ! 2006 లో రెండున్నర లక్షలతో గెలిపించిన ఓటర్లు, 2008లో 15 వేల మెజారిటీ మాత్ర మే ఇచ్చారంటే అందుకు కారణం కేసీఆర్‌ విశ్వసనీయత కోల్పోవడమే! ఇప్పుడు తెలంగాణవాదం అనేది తెలంగాణ ప్రజల కోసం కాకుండా, ‘కేసీఆర్‌ చేత, కేసీఆర్‌ వలన, కేసీఆర్‌ కోసం’గా మారింది. ఆయన పుణ్యాన ఇప్పుడు తెలంగాణవాదమనేది ప్రజల ఆకాంక్షగా కాకుండా ఓట్లు- సీట్ల లెక్కగా, రాజకీయ పార్టీల మధ్య బేరసారాల వస్తువుగా మారింది.

చెన్నారెడ్డి చేపట్టిననాడు తెలంగాణ ఉద్యమం ఉప్పెనలా ఎగసి, చప్పున ఆరిపోయింది. అందుకు భిన్నంగా ఇప్పుడు ఆరేళ్లుగా ఆరకుండా వెలుగుతోంది. ప్రత్యేక రాష్ట్రం కావాలన్న ఆకాంక్షల తీవ్రతలో నాటికీ, నేటికీ ఏమీ తేడాలేదు. కానీ మారిన కాలంతోపాటే ప్రజల ఆలోచనా మారింది. అప్పుడది భావోద్వేగ ఉద్యమం. నేడు ఆలోచన తో కూడిన ఉద్యమం. గమ్యం సుస్పష్టం. చేరుకోవాలన్న పట్టుదల అపారం. వేచి చూసే ఓపికా ఉంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలని బలంగా కోరుకుంటున్నవారు, అందుకోసం కష్టపడ్డవారు ఎందరో ఉన్నారు. అయితే ఇప్పుడు వారిదొక నిస్సహాయ స్థితి. కేసీఆర్‌ చేతిలో తెలంగాణ ఉద్యమం బతుకుతుందో, లేదో చెప్పలేని అసహాయత వారిది. తెలంగాణ నినాదం ఇప్పుడు కేసీఆర్‌ చెరలో ఉంది. ఆయనకు పాడియావుగా మారింది. ఒక శక్తిమంతమైన నినాదం తగని వ్యక్తి చేతిలో పావుగా మారిందని భావించే పరిస్థితి రావడం విషాదం!

source : andhra jyothy 28 mar 09

వ్యాఖ్యలు»

No comments yet — be the first.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: