jump to navigation

ఉరికిచ్చి … ఉరికిచ్చి … No Sale of Telangana మార్చి 28, 2009

Posted by M Bharath Bhushan in Congress, Culture, elections, Identity, politics, TDP, Telangana, Telugu (తెలుగు), TRS.
trackback

ఉరికిచ్చి… ఉరికిచ్చి…
-అల్లం నారాయణ

ఆ మంట, ఈ మంట ‘ఉరికిపిచ్చి… ఉరికిపిచ్చి’… ఇదేదో… అల్‌జైదీ లెవెల్‌ వ్యవహారంలా అందరికీ అనిపించి ఉండకపోవచ్చు. కానీ… ఏక పక్షంగా ఒక భావోద్వేగ ఉద్యమంతో ఆడుకుంటున్న వాళ్లను ఇట్లా కనీసం ప్రతిఘటించినప్పుడు అనుభవించే ఒక ఆక్రోశం నుంచి దీన్ని చూడవలసి ఉన్నది.

తెలంగాణ భవన్‌లో సికింద్రాబాద్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా ఎంపికైన వెంకటరెడ్డిని ‘ఉరికిచ్చి…ఉరికిచ్చి’ కొట్టిండ్లు. టీవీలో చెబుతున్న ఆ పిలగా ని మాటలు ఎంత బలమైనవో చాలా మందికి తెలియవు. తెలంగాణ పలుకుబడి నుడికారం ,స్థానికీయ పదాల సొగసు, సూటిగా తుపాకి గుండులా తాకే పోటెత్తిన మాటలు ఎంత శక్తివంతంగా ఉంటాయో! ముచ్చటేస్తుంది. అట్లాగే ‘గెదిమి గెదిమి’ కొట్టిండ్రని కూడా అంటరు. అయినా రాజకీయ రగడలో భాషవేట ఎందుకు గానీ… కొందరు ఏడుస్తున్నరు. కొందరు నవ్వుతున్నరు. కొందరు కోట్ల మదంతో కొనగోట మీసం మెలిపెడ్తున్నరు.

అన్ని పార్టీల్లోనూ ఇప్పుడు ‘కొన్న వాడిదే టికెట్‌’ హవా నడుస్తున్నది. కోట్లున్న వాడు టికెట్‌ కొనుక్కుంటడు. అప్పుడు దున్నేవాడిదే భూమి అనే వోడు మూలన్నే ఉంట డు. అందుకే మంట పుట్టి తెలంగాణ భవన్‌లో ‘పవర్‌’ చూపి ఉరికిచ్చి, ఉరికిచ్చి (గెదిమి గెదిమి) కొట్టి ఉంటారు. ఇది సరే… తీసుకున్న వాడి సంగతేమి టి? ఎవరు తీసుకున్నట్టు… భవిష్యత్‌లో వాళ్ళను కూడా గెదుముతారా! ఉరికిస్తారా! తెలంగాణ కదా! ఈ చైతన్యం మూలాలు ఇక్కడి ఉద్యమ స్వభావం లో ఉండవచ్చు. యాభై ఏండ్లుపై బడిన మోసం ఇక వశం కాని అసహనం నుంచి ప్రజ్వరిల్లిన ఆగ్రహం కావచ్చు. ఏండ్ల తరబడి తెలంగాణ జెండా మోసి, నిద్ర కాసి, ఎగిరి, దుమికి అధినేత ‘కారు’ కూతలే విప్లవ శంఖారావాలనుకుని, అధినేత పరాకుగా మాట్లాడినా, చిరాకుగా మాట్లాడినా, అర్ధరాత్రో, అపరాత్రో ఆవేశంతో మాట్లాడినా, ‘బిందాస్‌’ అనుకుని తోచిన కాడికి ఉన్న కాడికి ఖర్చు పెట్టుకుని ఇగ ఇట్లనే ‘తెలంగాణ’ వస్తదని ‘నమ్మినాన బోస్తె పుచ్చి బుర్రలయిన’ ఒక దిగ్భ్రాంతి నుంచి కోపం రావొచ్చు.

అటు తెలంగాణ ఇచ్చుడు మా పద్ధతే కాదు, అని రాఘవులు ‘సుత్తి’ కొట్టి మరీ చెబుతున్నా, ఇటు చంద్రబాబు గత చరిత్ర మీద ఏ మాత్రం నమ్మకం లేకున్నా… ఏందో… ఎట్లనో అట్ల… రాజకీయమో , రంకో ఏదైతేనేమి తెలంగాణ వస్తే చాలు అనుకుని భంగపడ్డ ఆక్రోశం కావొచ్చు. ఇతర పార్టీల్లో ఇట్లా ఉరికిచ్చి కొట్టుడు లేదు. వాళ్ళు టికెట్లు రాకపోతే గొడగొడ ఏడుస్తున్నరు. కనీళ్ళు తుడ్చుకుంటున్నరు. చెట్టెక్కి , పుట్టెక్కి బెదిరిస్తున్నరు. కిరో’సీన్‌’లు సృష్టిస్తున్నరు. నిరాహార దీక్షలు చేస్తున్నరు. ఉప్పిడి ఉపాసం ఉండి ఇంత అన్యాయమా? అని ఆక్రోశిస్తున్నరు. కానీ ఒక్క తెలంగాణ వాళ్ళు ఇట్లాంటి ‘ఉరికిచ్చే’ కార్యక్రమం ఎందుకు పెట్టుకున్నట్టు? ఇది కొనసాగుతుందా? ముందు ముందు ఎవరిని ఉరికిస్తారన్నది ఇక్కడ అసలు విషయం. అంతేనా? ఈ చైతన్యం ఎక్కడిది. తెలంగాణ కోసం బొండిగ కోసుకుంటానన్న మాటలు నమ్మిండ్రు. తెలంగాణకు ద్రోహం చేస్తే రాళ్ళతోటి కొట్టుండ్రి అన్న మాటలూ ఆలకించిండ్రు. నమ్మిండ్రు. ఇక్కడు న్న కొడుకులను కాదని, అమ్రికాలున్న కొడుకును పిలిపిచ్చుకున్నా నమ్మిం డ్రు. అల్లుని కో పీట ,కొడుక్కో పీట కుదిరితే కూతురికో ‘కానుక’ అన్నట్టు హవా… నడిచింది.

కొన్నాళ్ళు కనబడరు. కొన్నాళ్లు వినపడరు. కొన్నాళ్లు ఢిల్లీలుంటరు. ఎప్పుడో సుక్క దెగిపడ్డట్టు వచ్చినాక పెద్ద పెద్ద మాటలు మాట్లాడ్త డు. మాటల కోటలు కడ్తడు. మాటలు కోటలు దాటినాంక , కాళ్ళు మాత్రం తంగెళ్ళు దాటయన్న సంగతీ తెలిసినాక ఇట్లాంటి మాట ఒకటి రగిలి ఉంటుంది. రాళ్ళతో కొట్టమని ‘నేత’ స్వయంగా ఇచ్చిన పిలుపు మంత్రం ఊరికే పోదు. అది పని చేస్తుంది. ఆ చైతన్యం కూడా ఊరికే పోదు. అదీ పని చేస్తుంది. బహుశ అందుకే అన్ని పార్టీలలో ఏడుస్తూ , తూడుస్తూ , ముక్కు తూ, మూలుగుతూంటే , తెలంగాణలో భంగపడ్డవాళ్ళు మాత్రం ఇట్లా ఉరికిచ్చి,ఉరికిచ్చి కొట్టుడు ఆ చైతన్యం తోనే. ఇది కొనసాగితే… తెలంగాణ మీద మళ్ళీ ఆశలు పెట్టుకోవచ్చు. బుష్‌ మీద అల్‌ జైదీ బూటు విసిరింది ప్రపం చం వార్త అయింది. అదొక తిరుగు ‘బూటు’ ప్రతీక అయ్యింది. ఇక్కడ ఉరికి పిచ్చి కొట్టిన వాడికి కూడా అల్‌జైదీ అంత ఖదర్‌ ఇవ్వాలని నా విన్నపం.

అక్క డ బుష్‌ ఉంటే… ఇక్కడ అధినాథుడు లేడు కానీ ఆయన వద్ద పది కోట్లిచ్చి టిక్కెట్‌ కొనుక్కున్న అర్భకుడు ఉన్నడు. ఎవరు దొరికితే వాళ్లు. బహుశా అందుకే ఆ మంట, ఈ మంట ‘ఉరికిపిచ్చి… ఉరికిపిచ్చి’… ఇదేదో… అల్‌జైదీ లెవెల్‌ వ్యవహారంలా అందరికీ అనిపించి ఉండకపోవచ్చు. కానీ… ఏక పక్షంగా ఒక భావోద్వేగ ఉద్యమంతో ఆడుకుంటు న్న వాళ్లను ఇట్లా కనీసం ప్రతిఘటించినప్పుడు అనుభవించే ఒక ఆక్రోశం నుంచి దీన్ని చూడవలసి ఉన్నది. బారాఖూన్‌మాఫ్‌ అన్నట్టుగా ‘టేకిట్‌ ఫర్‌ గ్రాంటెడ్‌’ అన్నట్టుగా తెలంగాణ వాదానికి పాతరేసి ప్రవర్తిస్తున్న తీరుపై ఇదొక ధర్మాగ్రహం. అందువల్ల ఆల్‌జైదీకి జై.. తెలంగాణ భవన్‌ల పదికోట్లిచ్చి టికెట్‌ కొనుక్కున్న వాళ్లను తరిమి కొట్టిన ఎవరో ఒకరు అతనికీ జై…జై.. నిజానికి ధూమ్‌ధామ్‌లకు, పోరాట పాటలకు, ఉద్యమం చెమట చుక్కల కు ఇప్పుడు తెలివిడి వచ్చి ఇదేందని? ప్రశ్నిస్తున్నరు.

కానీ, ఇది సిద్ధాంతకర్తల కు, సిద్ధాంతులకు తెలంగాణ కోరుకుంటున్న సర్వ జనాలకు, అర్థం కాలేదా? ఈ ఏకపక్ష, తోచిన రీతి నిర్ణయాలు, అమ్ముకోవడాలు, కొనడాలూ తెలంగాణ తేలేవని తెలియదా? ఇదేనా తెలంగాణ వాదం అంటే… త్యాగాల, కన్నీళ్ల, కొన్నెత్తుటి మరణాల, అమరుల, రోదనల, వేదనల, దగాపడ్డ తెలంగాణ ఎంతటి పవిత్రమైంది. ఎంతటి పౌరుషమైంది. చివరికి ఎవరి చేతుల్లో ఎలాం టి దుస్థితిలో ఉంది. తెలియదా? అందుకే నిరసన గళం వినిపిస్తున్న రసమయి బాలకృష్ణ కన్నా… నడి తెలంగాణ భవన్‌లో ఉరికిచ్చి కొట్టినవాడే నేటిహీరో.. ఇచ్చిన వాళ్లు…తీసుకున్న వాళ్లు, కొన్నవాళ్లు, అమ్మినవాళ్లు.. భవిష్యత్‌ చిత్రపటంలో ఈ ‘ఉరికిచ్చుడు’ పీడకలలు కనే రోజొకటి వస్తుంది… జాగ్రత్త… ఒక సామాన్యుడు… జంగయ్యతత్వం…

‘బ్రహ్మంగారు….సమాధిలోకి వెళ్లేందుకు…సిద్ధప్పను పూలు తెమ్మన్నడు… బ్రహ్మంగారి సమాధి మాటేమోకానీ… సిద్ధప్ప పూలకుపోయి కీకారణ్యంలో కాడుపడి కాటగలిసిపోయిండు’. తెలంగాణ తెమ్మన్న వాళ్లు…అధికారంలోకి రావాలనుకున్న ఇతర కుటుంబాలు… చంద్రబాబు, ఆయన బామ్మర్దులు, కొడుకులు, అల్లుళ్లు, రాజశేఖర్‌రెడ్డి, ఆయన కొడుకు, కేసీఆరూ ఆయన కొడు కు, అల్లుడు, చిరంజీవి ఆయన బామ్మర్ది, తమ్ముళ్లు, అధికార సమాధిలోకి వెళ్లడానికి ఎందరు సిద్ధప్పలను పూలు ఏరుకరమ్మంటున్నరో? శేషప్రశ్న… ఎందరు సిద్ధప్పలు కాటగలుస్తున్నరో? అసలు ప్రశ్న.
source : aandhrajyothy 28 mar 09

ప్రకటనలు

వ్యాఖ్యలు»

No comments yet — be the first.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: