jump to navigation

మేల్కోవాల్సిన కాలం – politics without people? మార్చి 16, 2009

Posted by M Bharath Bhushan in Congress, elections, Identity, PRP, SEZ, TDP, Telangana, Telugu (తెలుగు), TRS.
trackback

మేల్కోవాల్సిన కాలం
– అల్లం నారాయణ

తెలంగాణ, మాదిగ దండోరా ఉద్యమాల విషయంలో ఆయా ఉద్యమాల లొసుగులు, లోపాలు, అవగాహనల్లో కూడా ఏర్పడుతున్న సర్దుబాటు, వెసులుబాటు ధోరణులు ప్రమాదకరం కాదా? ఈ హెచ్చరిక ఇప్పటి అవసరం కాదా? అందుకే మిత్రులారా! బహు పరాక్‌… పరాజితులవుతున్న వారిప్పుడు మేల్కొనవలసి ఉన్నది. పారా హుషార్‌.

అప్పటి దాకా ప్రజాస్వామ్య ముఖందాల్చిన ఏలిక, అప్పటి దాకా సాధుజీవిగా కనపడిన ఏలిక, అప్పటిదాకా సకల జనావళి ఆశలు, ఆకాంక్షల ప్రతినిధిగా కనపడిన ఏలిక ఆ తర్వాత ఎందుకు? అసలు రూపంలోకి మారతాడు. ఓట్లు కొల్లగొట్టడానికి, ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి అలవికాని అనేక వాగ్దానాలు చేసే ఏలిక, స్వయం అంగీకారం కాని, స్వభావ విరుద్ధ హామీలను ఇచ్చే ఏలిక, సాధుజంతువులా తలపించే ఏలిక అనంతరం నియంత రూపంలోకి మారడానికి ప్రత్యేక కారణాలుండవా? చంద్రబాబు అయినా, వై.ఎస్‌. రాజశేఖర్‌రెడ్డి అయినా ఎన్నికల ముందు స్వభావాలకు, అనంతరం స్వభావాలకు ప్రతిరూపాలు.

ఒకేలాగా అచ్చుగుద్దినట్టుగా ఎన్నికల ముందు ఒక విధంగా, ఎన్నికల అనంతరం మరో విధంగా వ్యవహరించడానికి, ప్రతి అయిదేళ్లకోసారి ఈ తంతు జరగడానికి, ఒక పాత్ర తర్వాత, మరొకరు పాత్ర పోషించడానికి గల కారణాలు బహుశా కమ్యూనిస్టు మేధావులకు అర్థం కావడం లేదేమోకానీ, ‘ఓటు దాటినంక బోడిమల్లన్న’ అనేది ఇప్పుడు సామాన్య జగమెరిగిన సత్యమే. అధికారం ప్రారంభాన, అధికారాంతాన చంద్రబాబు, వై.ఎస్‌లకు అనేక సాపత్యాలు చూపవచ్చు. కనుక ఏలికలు ఇట్లాగే ఉంటారన్న దగ్గర ప్రారంభమవుతే ముందుగా భ్రమలు తొలిగే అవకాశం ఉంది. అవి ప్రజాస్వామ్య ఆకాంక్షలు, ఉద్యమాలు, డిమాండ్లు కావొచ్చు, రోజువారీగా జనం ఎదుర్కునే జీవన్మరణ సమస్యలు కావొచ్చు. సంక్షేమ రాజ్యాల్లో అందని సంక్షే మం కావొచ్చు. కడుపు మండే ప్రతి సమస్యకూ జనబాహుళ్యం ప్రతిస్పందన కావొచ్చు.

ఏలికలు ఎన్నికలు దాటేదాకా అనుసరించే ధోరణి, ఆ తర్వాతి ఆధిపత్యానికి మూలాలు మరెక్కడో ఉంటాయన్న స్పృహ లోపించడమే ఇప్పటి సమస్య. ఒకవైపు జాతులు, జెండర్లు, ప్రాంతా లు, అస్తిత్వాల మధ్య పెరుగుతున్న అసమానతలు, అవి ముందుకు తెస్తున్న ఆకాంక్షలు, మరోవంక ధనవంతులకు ఆర్థిక మాంద్యం దినాల్లో బెయిల్‌అవుట్లు, సెజ్‌ల పేరిట కేంద్రీకృత అధికారాన్ని కట్టబెట్టేందుకు భూములు అప్పగించడం, పన్నురాయితీలు కల్పించడం, ప్రభుత్వాలు స్వయంగా దళారీ పాత్ర పోషించడం అనే రెండు విరుద్ధాంశాల ప్రతిఫలనమే ఇప్పటి సమాజం. సహజంగానే ఏలిక ప్రజల న్యాయబద్ధమైన ప్రజాస్వామిక ఆకాంక్షల పట్ల ఉదారంగా వ్యవహరించినట్టు కనబడడం ఒక అనివార్యత.

ఆ విధంగా ఈ ఆకాంక్షలను ప్రతిబింబించే కార్మికుల, గ్రామీణ శ్రామికులపై ఈ పార్టీలు ఉదారముఖంతో సాధుజీవి ముఖంతో కొండొకచో ఆధునిక ‘మైసయ్య’ల రూపంతో, మోసకారి వాగ్దానాలు చేసి సంపాదిస్తున్నదే ఆధిపత్యం. అయితే ఈ రూపం అసలుది కాదు. వారి అసలు రూపం అనంతర పరిణామాల్లో, ఈ ఆధిపత్యాన్ని సంపన్నుల సేవల కోసం ఉపయోగించడం అనేది అది వారి వర్గాల స్వభావం మాత్రమే. అదే సమయంలో సహజంగానే జనాకర్షక పథకాలు మాత్రమే కొనసాగిస్తూ, పేదలకు న్యాయంగా అందాల్సిన సామాజిక సంక్షేమ సేవలను కునారిల్లజేయడం, సబ్సిడీల భారం పేరిట చివరికి వారికి అందాల్సిన ఏ సేవలూ అందకపోవడం అందువల్ల ఏర్పడే ఘర్షణ ఇప్పటి సామాజిక సందర్భం.

ఉదార పార్టీలుగా ప్రజలను మోసం చేసి అధికారం సాధించదలుచుకున్న అన్ని రాజకీయ పక్షాలూ.. ప్రజలను వారి శ్రమశక్తి ఆధారిత వనరులపై ఆధారపడకుండా చేయడం, తాము దయతలంచి ఇచ్చే ఆకర్షక పథకాలపై ఆధారపడి బతికేలా చేయడం అనేది ఆధునిక తంత్రం. అంటే ప్రభుత్వాలు సంక్షేమ రాజ్యంలో కల్పించాల్సిన రాజ్యాంగపరమైన సంక్షేమాలను కూడా చివరికి, ఇదే ప్రభుత్వ సొమ్ముతో ఒక దాత (ప్రభుత్వాధినేత) ఇచ్చేలా, ప్రజలు పుచ్చుకునే భిక్షగాళ్లుగా తయారు చెయ్యడం ఇందులో అసలు కిటుకు. అయితే ఈ సమస్య ఇట్లా ఉన్నప్పుడు… జరగాల్సిన ప్రతిఘటన కానీ, అనివార్యంగా రావాల్సిన పోరాటాలు, కొత్తరూపాలు కానీ, ప్రత్యామ్నాయాలు కానీ దరిదాపు శూన్యం కావడమనేది, ప్రపంచీకరణ నేపథ్యంలో రాజ్యం, రాజ్యాధినేతల కొత్త రూపం, కొత్త తరహాలు వాటిపై తగిన చైతన్య స్థాయి ఏర్పరచడానికి, భావజాల వ్యాప్తి జరగడం లేదనేది ఇప్పటి సమస్య.

వై.ఎస్‌. రాజశేఖర్‌ రెడ్డి నక్సలైట్లు, ప్రత్యేక తెలంగాణ, మాదిగల వర్గీకరణ అనే ప్రజాస్వామిక ఆకాంక్షలు, ఉద్యమాలు, డిమాండ్ల విషయంలో అంగీకరించి మోసం చెయ్యడం వెనుక ఇదే అసలు స్వరూపం ఉంది. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు, ముఖ్యంగా అధికారాంతంబున నక్సలైట్లతో చర్చకు అంగీకరించక పోవడానికి, తెలంగాణ పదం ఉచ్ఛరించకుండా జాగ్రత్త పడడానికి, ఏ ఇజమూ లేదని, సంస్కరణలే ఈ ప్రపంచానికి పరమావధి అని ఒక నియంతలాగా నమ్మడానికి కారణం ఇదే. ఇప్పుడు రాజశేఖర్‌ రెడ్డి నియంతలా వ్యవహరించడానికి, చంద్రబాబు ఉదారవాద రాజకీయ నేతగా అవతరించడానికి, చిరంజీవి నక్సలైట్ల చర్చలు, తెలంగాణ, మాదిగ వర్గీకరణ అంశాలలో సన్నాయి నొక్కులతో అయినా సానుకూలంగా మాట్లాడడానికి అధికారం పొందడమే పరమావధి.

అధికారం వచ్చాక వీళ్ళంతా వేరే విధంగా ఉంటారని ఆశపడి భంగపడడం ప్రజా ఉద్యమాలు నిర్వహిస్తున్నామని, వాటికి మార్గదర్శకులుగా, నిర్దేశకులుగా, నాయకులుగా ఉంటున్నామని అనుకుంటున్న వారికి సబబు కాదు. శోభ నివ్వదు. చంద్రబాబు కన్నా నాలుగాకులు ఎక్కువ చదివిన వై.ఎస్‌. ఫ్యాక్షన్‌ రాజకీయాలను రాష్ట్రీకరించడం, మోసగించడాన్ని ప్రభుత్వీకరించడం ఈ అయిదేళ్లు మారిన పరిస్థితుల వల్లనే. వచ్చే ఐదేళ్ళకు వచ్చే నేత ఇంతకంటే తెలివిగా ‘డిజైన్‌’లు రూపొందించుకోవాల్సిందే? అట్లాని రాజశేఖర్‌రెడ్డిని ఉపేక్షిస్తే ఒక పరాకాష్ఠ నుంచి పతనావస్థకు దారి తీసేది నిజమే.

మరి ఉద్యమాల మాటేమిటి? ఇక్కడే అసలు సమస్య. ఉద్యమాలు వాటి స్వభావం కోల్పోవడం వల్ల ఈ భంగపడి అంగలార్చే స్థితి ఒకటి దాపురించడం లేదా? తెలంగాణ ఉద్యమాన్ని ఒక రాజకీయ పార్టీ (ఆధిపత్య రాజకీయ పార్టీల అన్ని స్వభావాలు ఉన్న పార్టీ) హైజాక్‌ చేసి ఉపయోగించుకోవడంలో, మాదిగ ఉద్యమం అయితే అడుక్కోవడం లేదా కడుపు మండి అసెంబ్లీ ఎక్కడానికి మించి సృజనాత్మకత భిన్న పోరాట చైతన్యం ప్రదర్శించకపోవడంలో ఉన్న లొసుగులను ఎవరూ మాట్లాడ్డం లేదెందుకు? సమ్మెలు, ఆందోళనలు నామమాత్రంగా జరిపినా, ఏ ప్రజా పోరాట రూపాలు చేపట్టినా తీవ్ర అసహనం, అణచివేత ప్రదర్శించే పాలకుల కాలం ఇది.

మరో వైపు ప్రతిఘటనా ఉద్యమాలు పలచనవుతున్న కాలం కూడా ఇదే. ఒకరి ఉద్యమాలకు మరొకరు దన్నుగా ఉండే ఉమ్మడితనం కూడా కనబడని కాలం ఇది. నిజమే కావచ్చు. కానీ, తెలంగాణ, మాదిగ దండోరా ఉద్యమాల విషయంలో ఆయా ఉద్యమాల లొసుగులు, లోపాలు, అవగాహనల్లో కూడా ఏర్పడుతున్న సర్దుబాటు, వెసులుబాటు ధోరణులు ప్రమాదకరం కాదా? ఈ హెచ్చరిక ఇప్పటి అవసరం కాదా? అందుకే మిత్రులారా! బహు పరాక్‌… పరాజితులవుతున్న వారిప్పుడు మేల్కొనవలసి ఉన్నది. పారా హుషార్‌.

source : andhra jyothy, 7 march 2009

ప్రకటనలు

వ్యాఖ్యలు»

No comments yet — be the first.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: