jump to navigation

సోనియమ్మకు ఒక లేఖ – Telangana question to Sonia ఫిబ్రవరి 28, 2009

Posted by Telangana Utsav in Congress, elections, Identity, Koya, Polavaram, politics, PRP, SEZ, TDP, Telangana, Telugu (తెలుగు), TRS.
trackback

సోనియమ్మకు ఒక లేఖ
– అల్లం నారాయణ

మీ రాజశేఖర్‌రెడ్డి మీకు ఏం చెప్తున్నడో, ఆ మొయిలీ మీకేమి చెప్తున్నడో, మీరేం వింటున్నరో! అసలు మీకేమన్నా తెలుసో? తెలువదో? అంతా ఆగమాగం. ఇయాలనన్నా తెలంగాణ సంగతి ఏదన్నా మాట్లాడకపోతె.. మీకు కాటన్‌ చీరల సంగతి తప్ప ఏమీ తెలవదని అనుకుంటె అది మా తప్పయితదా! సోనియమ్మా. గింత మోసం జేసినంక, ఇంకా మీకు ఓటేసి మా తెలంగాణ ప్రజలు మళ్లా ఓసారి దగా పడుమంటవా.. మీరే చెప్పాల్నమ్మా…

అమ్మా! సోనియమ్మా! ఉన్నదున్నట్టు, చెలిగేసినట్టు, కడిగేసినట్టు, మొఖం మీద గుద్దినట్టు మాట్లాడే తెలంగాణోన్ని. అమ్మా అని పిలవాలని కూడా లేదు. మనసుల పుట్టెడు రంధిని, కండ్ల కు కడివెడు దుఃఖాన్ని దాచుకుని, మనసులో ఒకటుంచుకుని, పైకి మరొకటి మాట్లాడే రకం కాదు. అయిదేండ్లయింది ఇటు మొఖం చూపిచ్చి. ఏం మొఖం పెట్టుకుని వచ్చినవమ్మా! అని అడగాల్నని ఉన్నది.
ఎవర్నో ఒకర్ని కడగాలనీ ఉన్నది. యాదికున్నదా! అమ్మా. అయిదేండ్ల కిందట తెలంగాణల తిర్గినప్పుడు సెల్లాలు మార్చుకోని, తెలంగాణ మనసు నాకు తెలుసు అని చెప్పిన ముచ్చట. నమ్ముడు మా నరనరాన ఇంకిన ఒక బలహీనత. ‘నమ్మి నానబోస్తె పుచ్చి బుర్రలయినయట’. నిన్ను నమ్మినం. నీతో పాటు తెలంగాణ తెస్తనన్న పాదయాత్రల రాజశేఖర్‌ రెడ్డి నీ నమ్మినం. మీ ఇద్దర్నీ జబ్బల మీద మోసిన, పెగ్గె లు చెప్పిన మా కేసీఆర్‌నూ నమ్మినం. నమ్మి ఓటేసినం. ఏమయింది. ఏది తెలంగాణ.

దిక్కుతోసకుండ, అడివీల పొద్దు గూకినట్టు, వడ్లల్ల పెరుగు కలిపినట్టు, ఆగమాగంగ ఉన్న కాంగ్రెస్‌ పార్టీని మా తెలంగాణ గడ్డకేసింది. ఒడ్డెక్కిచ్చింది. ఏం మిగిలింది మాకు. ఒక్కటడుగుత. ఏమనుకోవద్దమ్మ. అప్పుడు ఎన్కటి కాలంల నలభై ఏండ్ల కిందటి మాట. మీ అత్త ఇందిరా గాంధీ. అమె గిట్లనే చేసింది. మున్నూటా డెబ్భై మంది సోరసోర పోరగాండ్ల ఉసురు తీసింది. ఆ పోరగాండ్ల త్యాగాల నుంచి లేచొచ్చిన చెన్నారెడ్డిని నమ్మిచ్చి బుట్టలేస్కోని ముప్ఫై ఏడేండ్ల కిందట తెలంగాణకు పచ్చి మోసం చేసింది. ఆమె తొవ్వల్నే ఇప్పుడు సోనియమ్మ తయారైంది. కని…ఏ మాట్లాడినవో యాదికున్నదా… అమ్మా. తెలంగాణ ప్రజల మనసులున్న మాట నాకు తెలుసంటివి. ఏమి తెలిసింది మీకు. ఏమనుకోవద్దు గని.

అసలు ఈ అయిదేండ్లల్ల తెలంగాణకు ఏ జరిగిందన్నది కానీ, తెలంగాణ ఏమైపోయిందన్నది కానీ, వై.ఎస్‌ . రాజశేఖర్‌ రెడ్డి ‘కడప’ నిండిన బేరం ఏంచెప్పిండో! మీరేమి విన్నరో? ఆయన ఏమి భాషల చెప్పిండో? మీరేమి భాషల విన్నరో? మాకు ఏ మాత్రం సమఝయిత లేదు. పోలవరం అంటే ఏందో తెలుసా! అమ్మా! ఇయ్యాల్ల ఖమ్మంకు వచ్చి, అన్నెం పున్నెం ఎరుగని ఆ గిరిజనుల తోటి ఆటాడినవ్‌ కదా! ఆళ్ళు.. ఆ గిరిజనులు. పోలవరం కడితే పొరుకపోడై పోతరు.

రెండు లక్షల మంది అడివి నుంచి, పుట్టిన నేల మీది నుంచి, కసరు గాయనుంచి, రేల పాట నుంచి, కొండ కోన నుంచి, అడివి దేవుళ్ళ నుంచి బేదఖల యితరు. అదన్నా ఎవరన్నా చెప్పి ఉంటరంటవా! అయిపాయె. ఒర్రంగ పోలవరం కడ్తనంటడు రాజశేఖర్‌ రెడ్డి. కొసకు మా భద్రాచలం రామునికి, సీతమ్మకు కూడ కొత్తగ నీటి సెర తెచ్చే పోలవరం కడ్తరు. ఇక్కడికచ్చి డ్యాన్సాడ్తరు. ఏమనుకోవాలె మిమ్ముల్ని. ఇగ తెలంగాణ సంగతికొస్తె- ఓట్లప్పుడు మా కేసీఆరూ, మీరూ రాసుక పూసుక తిర్గితిరి. గెలిస్తిరి. ఆయన మంత్రయిపాయె. మీరు రాజ్యానికస్తిరి. రాష్ట్రపతి నోటెంట తెలంగాణ పలికిస్తిరి. ఉమ్మడి ప్రణాళికల తెలంగాణ ఉన్నదంటిరి. ప్రణబ్‌ ముఖర్జీ కమిటీ అంటిరీ మీ అత్తకాణ్నుంచి, ఆ మాటకస్తె మీ తాత కాణ్నుంచి కాంగ్రెస్‌ తీరు ఒక్క టే తీరుగున్నది.

ఆ ప్రణబ్‌ కమిటీకి, అవుననో, కాద నో మీ పార్టీ ఒక్కటంటే ఒక్క కబురు పంపకపోతిరి. ఇన్నేండ్లకు మల్ల ‘చేతులది తీసి మూతిల పెట్టినట్టు’ తెలంగాణకు వచ్చినప్పుడన్నా అడగద్దంటావా…మీ లీడర్లను కడగద్దంటావా! ఆ కడప రెడ్డి పారేనీళ్లను విడ్వకపాయె. గోదావరిల నీళ్లు దీసి, కృష్ణల ఏస్తననవట్టె, కృష్ణల నీళ్లుదీసి పెన్నల ఏస్తననవట్టె. ఒక్క శ్రీరాంసాగర్‌తోటి ఎన్ని కన్నీళ్లు ఆపుకొమ్మంటవ్‌. 12 ప్రాజెక్టులు కడితె అండ్ల రెండు తెలంగాణయని గవర్నరే ఎలాన్‌చేసె. ఇంగ ఏం చెప్పమంటవమ్మా … ఈ నీళ్ల గోస… మా కన్నీళ్ల గోస ఎప్పుడన్నా నీ చెవి దాక వచ్చిందంటవా! జలయజ్ఞం ఏమో కానీ, అవి ఎన్ని కోట్లో అండ్ల తిన్నదెంతో. కట్టిందెంతో… దోచిందెంతో! దాచుకున్న దెంతో! మీకూ… అంటే ఢిల్లీకి కూడా పైకం ముట్టిందంటండ్రు. అది నిజమో! అవద్దమో కానీ.. ఒక్క మాటంటె ఒక్క మాట తెలంగాణ సంగతి మాట్లాడనందుకు మాకూ జరంత అనుమానంగనే ఉన్నది.

రాజశేఖరరెడ్డి గడ్డెక్కినంక మా తెలంగాణంటె ఓసారి నై అంటడు ఓ సారి అయితే ఏందట అంటడు. తెలంగాణంటె.. కోస్తంటడు. కోస్తా అంటె హైదరాబాదంటడు. ఎడ్డెమంటె తెడ్డెమంటడు. ఈ మాట అయిదేండ్ల కిందట్నే అంటే గీ రాజశేఖరెడ్డి ఏడ ఉండెటోడో? మీరు ఏడ ఉండెటోళ్లో…ఒక్కసారి మతికి తెచ్చుకుంటె మంచిది గద సోనియమ్మా! సరే! ఇదొక్కటేనా? హైదరాబాద్‌ను ఒక కొండ సిలువలాగ సుట్టుకున్నడు మీ ముఖ్యమంత్రి వేల ఎకరాల భూములు. రింగురోడ్డై సుట్టుకున్నడు ముఖ్యమంత్రి సాప జుట్టినట్టు హైదరాబాద్‌ భూములు మొత్తం సుట్టేసిండు.

అడగనోనిది పాపం. ఎన్ని కంపనీలో. ఎందరు బంధువులో. గద్దలై వాలిండ్రు హైదరాబాద్‌ మీద. నిజాం కాలం నుంచి కాకులు గద్దలు కొట్టని భూములను ఎవరూ అడుగుపెట్టని భూములను, కోటగోడలసొంటి భూములను పొరకపోడు చేసి తలా ఇంత కట్టబెట్టిండు మీ ముఖ్యమంత్రి. ఏం చెప్పాలమ్మా. ఇంగ ఈ అయిదేండ్లల్ల 610 జీవో అట్టనే ఉండె. మా పోరగండ్లకు ఏండ్ల సంది జరిగిన అన్యాలమే మళ్లా జరిగే! మీకు నమ్మి ఓటేసినందుకు ఈ అయిదేండ్లల్ల మా తెలంగాణ యాభై ఏండ్లల్ల జరగనంత దోపిడి పాలయింది.

పోరుకపోడయింది. ఏగిడిసిన భూతం లెక్కన జన్నెకిడిసిన కోడెల లెక్కన మీ ముఖ్యమంత్రి తెలంగాణను ఆగం బట్టిచ్చిండు. మనుషులను నమ్మెటోళ్లం. మాయామర్మాలు తెలవనోళ్లం. మీ అసోంటోళ్లు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటరని, మీ అత్త ఇందిరాగాంధి మోసం చేసినా.. మంచి మనసుతో మీరు…కూడా అంత ఇగురం, అంత రాజకీయం తెలిసినోళ్లు కాదు కనుక… మా మనసులో మర్మం మీకు ఎరుకైంది కనుక.. ఏదో ఒకటి చెయ్యరా! అనుకున్నం. ఇక్కడ మీ పార్టోళ్లు… తెలంగాణంటె మా సోనియమ్మ నోట్లెకెళ్లి ఊడి పడ్తదని ఇన్నొద్దులూ చెప్తె, నమ్మినం. కని మీ నోట్లెనుంచి ఒక మాట..కూడా తెలంగాణ అని రాకపాయె. మీ పలుకే బంగారమయిపాయె. మా పాపపు సెవులకు మీ పలుకే ఇనపడకపాయె.

ఏం పాపం చేసినమమ్మ మేము. మిమ్మల్ని గెలిపిచ్చుడే మా తప్పా.. ఇంగ మీరు గెలిచి అయిదేండ్లు రాజ్యమేలినంక మా తెలంగాణ ఆగమయిపాయె. మా కేసీఆరు ఇగ ఇప్పుడు చంద్రబాబుతోటి, మా దేవేందర్‌గౌడ్‌ చిరంజీవితోటి తెలంగాణస్తదంటండ్రు. అదొకలొల్లి… ఆగమైపోయినం. మేమే కాదు. ఈ దునియల అరిగోసలుపడే మా తెలంగాణ ప్రజల లెక్కన్నే లోకం మీదున్న బాధలన్నీ పడే మాదిగలను కూడా మీరు గట్లనే మోసం చేస్తిరి. మట్టకు బెల్లం రాసి మాయజేస్తిరి. వర్గీకరణ అంటిరి. పార్లమెంటు మూసుకుంటిరి. మీ నోర్లూ మూసుకుంటిరి.

ఏం పాపం జేసినం మేము. తెలంగాణోళ్లం… ఏం అన్యాయం జేసుకున్నం. మీ రాజశేఖర్‌రెడ్డి మీకు ఏం చెప్తున్నడో, ఆ మొయిలీ మీకేమి చెప్తున్నడో, మీరేం వింటున్నరో! అసలు మీకేమ న్నా తెలుసో? తెలువదో? అంతా ఆగమాగం. ఇయాలన న్నా తెలంగాణ సంగతి ఏదన్నా మాట్లాడకపోతె.. మీకు కాటన్‌ చీరల సంగతి తప్ప ఏమీ తెలవదని అనుకుంటె అది మా తప్పయితదా! సోనియమ్మా. గింత మోసం జేసినంక, ఇంకా మీకు ఓటేసి మా తెలంగాణ ప్రజలు మళ్లా ఓసారి దగా పడుమంటవా.. మీరే చెప్పాల్నమ్మా… మళ్లొక్కసారి మీకు ఓటేసి మా తెలంగాణ అమరవీరుల ఆత్మలకు అన్యాయం చెయ్యలేము. శణార్థి..

source : andhra jyothy  28 feb 2009

ప్రకటనలు

వ్యాఖ్యలు»

No comments yet — be the first.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: