jump to navigation

Derailed legislature in diseased Telugu politics ‘పురా’ణ కాలక్షేపం డిసెంబర్ 7, 2008

Posted by M Bharath Bhushan in Congress, elections, NTPP, politics, TDP, Telangana, Telugu (తెలుగు), TRS.
trackback

‘పురా’ణ కాలక్షేపం
-అల్లం నారాయణ

ఏదో తెలంగాణ బిల్లు పెడ్తారని కానీ, అధిక ధరల మీద, బాబ్లీ మీద, రైతుల రుణాల మీదా, బాంబులు పేలడం మీదా చర్చిస్తారని కానీ ఇంకా నమ్మకం ఉంచుకున్న వాళ్లకు ‘చట్ట సభలు బాతాఖానీ…’ అన్న ఒక వ్యాఖ్యను మరోసారి గుర్తు చేస్తూ…

ఏతావాతా..చివరికి అంతా ఒక ‘ ఆవువ్యాసం’ కథ. ఆవుకు నాలుగు కాళ్లుండును. రెండు చెవులు, రెండు కళ్లు ఉండును. ఆవు పాలిచ్చును. అంతేకదా! అసెంబ్లీలో ఒక ఇద్దరు మహాత్ములు ఉందురు. ఇల్లూరు ఈటపోయినా, కొల్లూరు కోటపోయినా.. ఈ భూ ప్రపంచం మునిగిపోయినా, ముంబయ్‌లో టెర్రరిస్టులు పొరుకపోడు చేసినా, బాంబులుపేలినా, బ్రహ్మాండం బద్దలైనా ఈ ఇద్దరికి మాత్రం తమదైన ప్రపంచం మాత్రమే ఉండును. ఆ ఇద్దరి బాధ ప్రపంచం బాధగా మారును. ఒకాయన ఇప్పుడు రాష్ట్రాన్ని ఏలుతున్న ముఖ్యమంత్రి వై. ఎస్‌.రాజశేఖరరెడ్డి, ఇంకొకాయన తొమ్మిదేళ్లు ఏలిన ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు. ఈ ఇద్దరి చుట్టూ ప్రపంచం తిరుగుతుంది. ఎటుతిరిగినా చివరికి ఈ ఇద్దరున్న అసెంబ్లీలో వారి వారి చరిత్రల పాఠాలను, వారి వారి ఉత్కృష్టతలను, వారి కుటుంబ వివరాలను, అన్నింటినీ అరటి పండు వలిచి చేతిలో పెట్టినట్టు, పూసగుచ్చినట్టు వివరించందే ఎప్పుడు మాత్రం సభ ముగిసిందని. అది టెర్రరిజం అయినా, బాబ్లీ అయినా, బాబ్రీ మసీదయినా.. చివరికి ఆవు పాలిచ్చును. వై.ఎస్‌. రాజశేఖరెడ్డికి అందరు మానవుల్లాగే ఒక తండ్రి ఉండెను. ఆయనను ఎవరో చంపేశారు.

ఆ చంపేసిన వాళ్లను దయతో దైవసమానుడైన, కరుణామయుడైన పూర్తి పరివర్తన చెందిన వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి గారు క్షమించేశారు. వాళ్లను మళ్లీ చంపే ప్రయత్నమూ చెయ్యలేదు. బహుశా పూర్వం పిల్లలకు భారత, రామాయణాలు చెప్పినట్టు, ఆధునిక ఆంధ్రప్రదేశ్‌లో టీవీలు గలవాళ్ల ఇంట్లో ముఖ్యమంత్రి గారి దయార్ద్ర హృదయం గురించి పదహారోసారి విని, చూసి, తరించని వారు కానీ, కొండొకచో ఆయన త్యాగనిరతికి కళ్లు చెమర్చకుండా ఉన్న వాళ్లు కానీ ఉన్నారని అనుకోను. మధ్యలో తమ కుటుంబ గాథా చిత్రాన్ని వై.ఎస్‌. గారు వినిపిస్తున్నప్పుడు సారీ కనిపిస్తున్నప్పుడు కళ్లకు కడ్తున్నప్పుడు ఎవరైనా ఏ ధరలు పెరిగాయనో అవినీతి జరిగిందనో, బాబ్లీతో బతుకు నాశనం అవుతుందనో, తెలంగాణ కావలనో అంటే చిరాకు పడరా…’కూచోవయ్యా కూచో’ అనరా. ఆయన ఎంత తన్మయత్వంతో, మమేకంతో ఎంతో ఆర్ద్రంగా, హృద్యంగా, ‘నా తండ్రిని చంపేసిన వాళ్లను నేను క్షమించాను’ అని, పనిలో పనిగా, ‘చంద్రబాబూ, నా తండ్రిని చంపినవాళ్లను నువ్వు చేరదీశావని’ కొంచెం భావోద్రేకంతో మాట్లాడ్తున్నప్పుడు లేనివీపోనివీ, రానివీ కానివీ, ప్రపంచం పుట్టినప్పటి నుంచీ ఉన్న సమస్యలను ప్రస్తావిస్తే ఇక కోపం రాక ఏమి వస్తుంది.

అందువల్ల అసెంబ్లీ అనగానే, ఆవు వ్యాసంలాగా, తప్పనిసరిగా అది నెల రోజుల సెషన్స్‌ అయినా, అయిదు రోజుల సెషన్స్‌ అయినా పురాణ కాలక్షేపం ఉంటుందని, అది తప్పనిసరై ఆ ఇద్దరికే సంబంధించి ఉంటుందని తెలియనంత అమాయకంగా ఎవరుండమన్నారు ప్రజల్ని. ఇక రెండో నేత విషయం. ఆయన సమస్యలు ఆయనకున్నాయి. అలిపిరిలో ఆయనపై దాడి జరిగింది. దానికి మించి అసెంబ్లీలో రోజూ దాడే. ఇంకేం చేయమంటారు. ఆయన పురాణం ఆయ న ఎత్తుకుంటారు. అనివార్యం. వెనకబడిపోతే కష్టం. అలిపిరిలో దాడి గురించీ కొత్తగా చెప్పేదేమున్నది వేరే ప్రశ్న. ఇక రాజశేఖరరెడ్డి ఫాక్షన్‌ చరిత్ర, ఆయన తండ్రిగారి తత్వగీతం, ఆయన గనులు, ఆస్తులు ఎప్పుడో ఎవరో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన విసిరిన చెప్పుల కథ. హైదరాబాద్‌లో అల్లర్ల కథ. మళ్లీ మరోసారి చంద్రబాబు గారు కొంచెం ఆక్రోశంగానూ, కొంచెం ఉక్రోషంగానూ, కొంచెం కోపంగానూ ప్రకటించేస్తుంటారు. ఆయన చరిత్ర గనులను ఈయన తవ్విపోస్తారు. ఈయన చరిత్రను ఆయన తవ్విపోస్తారు. సభ చాలా ఆనందంగా పదహారోసారి వింటుంది.

సభంటే నా ఉద్దేశంలో సభ్యులని కాదు. ముఖ్యంగా ముచ్చటగా ముద్దుగా, నీటుగా తయారై, మంచి నైరూ కోటేసుకొని కూచుంటారు గదా స్పీకర్‌సార్‌. ఆయన ఈ ఇద్దరి చరిత్రలనూ పదహారోసారి అయినా ముచ్చటగా వింటుంటారు. అది నిజానికి మంచి పాత పాటలలాగా ఆనందంగా ఉంటాయి స్పీకర్‌ సారుకు. ఆయనను మాత్రం ఎందుకు తప్పు పడ్తారు. బాబ్లీ గురించి ఎంతకని మాట్లాడ్తారు ‘కట్టే కొట్టే తెచ్చె’ అవును మహారాష్ట్ర బాబ్లీ కడ్తున్నది. స్పీకర్‌ గారి జిల్లాతో సహా తెలంగాణ జిల్లాలు ఎండిపోతాయి. అయితే.. దాని కన్నా ప్రపంచానికి తెలియాల్సిన విషయాలు, ఆ ఇద్దరు ఎంత వ్యక్తిగత వివరాలతో సహా చెప్తున్నారు. వాళ్లకు ఇచ్చే టైమ్‌ బాబ్లీకి, తెలంగాణకు ఇవ్వమంటే ఎలా? అయినా ఈ ‘కమ్యూనికేషన్‌ రెవల్యూషన్‌’ యుగంలో.. కఠోర సత్యాల గురించి, కఠిన వాస్తవాల గురించి మాట్లాడితే ఆ ‘షో’ ఎవరు చూస్తారు కనుక. కొంత ‘పర్సనల్‌ టచ్‌’ కొంత పాపులర్‌ టింజ్‌ ఉండాలె. స్పీకర్‌ గారిది కళాపోషణ హృదయం.

అర్థం చేసుకోరూ.. అయినా … పిచ్చిగానీ, తెలంగాణ వచ్చేదా? పొయ్యేదా? ఇచ్చేదా? తెచ్చేదా? దాని గురించి చర్చచేస్తాం.. బిల్లుపెడ్తాం అని టైమ్‌ అడిగితే స్పీకర్‌ గారికి చిరాకు రాదా మరి. అదేమన్నా పురాణమా… జీవిత గాథా. రైతుల రుణాలు, ఎరువులు, ధరలు ఎందుకండీ! బాంబులు పేల్తూనే ఉంటాయి. కానీ చరిత్రలు తెలిసేదెట్లా.. మంచి తరుణం మిస్సయితే మళ్లీ మళ్లీ చెప్తారా! అయినా నా పిచ్చి గానీ.. అసెంబ్లీలో ఇంతకంటే ప్రాధాన్యతాంశాలు ఉంటాయని గానీ, ఆ ఇద్దరు మారిపోయి తమ విషయాలు కాకుండా అందరి విషయాలు మాట్లాడ్తారని గానీ ముందుగా అనుకొని, ఈ పురాణమంతా రాయడం నా బుద్ధి తక్కువ కూడా.. ఏదో తెలంగాణ బిల్లు పెడ్తారని కానీ, అధిక ధరల మీద, బాబ్లీ మీద, రైతుల రుణాల మీదా, బాంబులు పేలడం మీదా చర్చిస్తారని కానీ ఇంకా నమ్మకం ఉంచుకున్న వాళ్లకు ‘చట్ట సభలు బాతాఖానీ……’ అన్న ఒక వ్యాఖ్యను మరోసారి గుర్తు చేస్తూ మరచిపోకుండా ఆ ఇద్దరు మళ్లీ చరిత్రను ఓపికగా ఆవిష్కరించినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ…

source : andhra jyothy, 6 Dec 2008

వ్యాఖ్యలు»

No comments yet — be the first.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: