jump to navigation

Telangana State- So Near Yet So Far నవంబర్ 26, 2008

Posted by M Bharath Bhushan in Congress, elections, NTPP, politics, TDP, Telangana, Telugu (తెలుగు), TRS.
trackback

తెలంగాణ ఇంకెంత దూరం?
-ఎ.కృష్ణారావు


ఇప్పుడిక తెలంగాణ కేవలం టిఆర్ఎస్కు సంబంధించిన అంశం కాదు. మిగతా పార్టీలు కూడా ఎజెండాను చేపట్టాయి. ఇక కాంగ్రెస్మాత్రమే ఒక నిర్దిష్టమైన ప్రకటనతో ముందుకు రావలసి ఉంది. కాంగ్రెస్అధిష్ఠానం తీసుకునే నిర్ణయం గురించి వైఎస్కు ఎక్కువ తెలుసా, కెసిఆర్కు ఎక్కువ తెలుసా అనేది కొద్ది రోజుల్లో తేలనుంది.

తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు గత నాలుగున్నరేళ్లుగా చెబుతున్న మాటలు వింటుంటే తెలంగాణ రాష్ట్రం ఈ పాటికి లెక్కలేనన్ని సార్లు ఏర్పడే ఉండాలి. ఆయన మాట్లాడుతున్న కొద్దీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు మరింత దూరం కావడమే కాని సమీపం అయ్యే అవకాశాలు కనపడడం లేదు.

2004 ఎన్నికల్లో విజయం సాధించిన నాటినుంచీ టిఆర్‌ఎస్‌ అధినేత తెలంగాణ రేపో మాపో వస్తున్నట్లు మాట్లాడుతున్నారు. కనీస ఉమ్మడి కార్యక్రమంలో తెలంగాణ అంశాన్ని పేర్కొనడం, రాష్ట్రపతి అబ్దుల్‌ కలామ్‌ ఉభయ సభలనుద్దేశించి చేసిన ప్రసంగంలో తెలంగాణ అంశాన్ని ప్రస్తావించడంతో కెసిఆర్‌ ఎంతో ఉప్పొంగిపోయారు. ఆరునెలల్లో తెలంగాణ వస్తుందని చెప్పారు. ఒక ఏడాది తన జన్మదినం రోజు కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ టెలిఫోన్‌ చేసి శుభాకాంక్షలు తెలుపగానే ఆయన సంతోషానికి పట్టపగ్గాలు లేవు.

తెలంగాణ ఆమె ఇచ్చేసినట్లేనని ఊరందర్నీ పిలిచి మరీ చెప్పారు. కానీ ఎక్కడా ఉలుకూ పలుకూ వినపడకపోవడంతో యుపిఏలో భాగస్వామ్య పార్టీలన్నీ ఒక ఒత్తిడి గ్రూప్‌గా మారి తమ సమస్యలపై డిమాండ్‌ చేసేందుకు కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నాయని ప్రకటించారు. కాని ఆ వెంటనే యుపిఏ మిత్రపక్షాలు ఈ విషయం ఖండించాయి. చివరకు తెలంగాణకోసం రోజంతా నిరాహార దీక్ష జరిపి యుపిఏ నుంచి వైదొలగవలసి వచ్చింది. అప్పటినుంచీ ఇప్పటివరకూ యుపిఏతో కానీ కాంగ్రెస్‌తో కానీ ఆయనకు సంబంధాలు లేవు. ఇక కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీతో సహా రాష్ట్ర నేతలవరకూ ఆయన విమర్శించని కాంగ్రెస్‌ నాయకుడంటూ లేరు. చివరకు రెండవ సారి జరిగిన రాజీనామాల ప్రహసనం తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్‌ పార్టీతో ఎన్నికల్లోనే నేరుగా ఢీకొన్నారు. 2004 ఎన్నికలతో పోలిస్తే ఆయన రెండు లోక్‌సభ సీట్లు, 11 అసెంబ్లీ సీట్లు కోల్పోయారు.

కాంగ్రెస్‌ మూలంగా ఎంతో నష్టం చెందినప్పటికీ ఆయనకు ఆ పార్టీపై ప్రేమ ఇంకా పోయినట్లు లేదు. తెలంగాణ విషయంలో కాంగ్రెస్‌ అధిష్ఠానం సానుకూల నిర్ణయం తీసుకుంటుందనే ఆత్మ విశ్వాసం తెలంగాణ కాంగ్రెస్‌ నేతల్లో కంటే కెసిఆర్‌కే ఎక్కువగా ఉన్నట్లు కనపడుతోంది. ‘అయిపోయింది బ్రదర్‌, సోనియాగాంధీ తెలంగాణకు అనుకూలంగా నిర్ణ యం తీసుకున్నారు. అసెంబ్లీలో తీర్మానం, పార్లమెంట్‌లో బిల్లు పెట్టడం ఖాయం. అంతా డిసెంబర్‌ చివరికల్లా పూర్తవుతుంది. ఎన్నికల తర్వాత ఆంధ్రా ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి వేర్వేరుగా ప్రమాణ స్వీకారం చేస్తారు.’ అని కెసిఆర్‌ ప్రకటించిన తీరు చూసి కాంగ్రెస్‌ నేతలు, పత్రికా ప్రతినిధులు సైతం నివ్వెరపోయారు. ఢిల్లీకి అడపా దడపా వచ్చే పిసిసి అధ్యక్షుడు డి. శ్రీనివాస్‌ సైతం ఇంత ధీమా ఏనాడూ వ్యక్తం చేయలేదు. కాని కెసిఆర్‌ ప్రకటన విన్న తర్వాత తెలంగాణ కాంగ్రెస్‌ నేతలకు సైతం ఆత్మ విశ్వాసం వచ్చిందనడంలో అతిశయోక్తి లేదు.

ఏమైనా కెసిఆర్‌ ఆశాజీవి అనడంలో సందేహం లేదు. ఆశాజీవి తన ఆశలతో తనను తాను మాత్రమే కాక ఇతరులు కూడా పుంజుకునేలా చేస్తాడు. ఎన్ని ఢక్కామొక్కీలు తిన్నా, ఎదురు దెబ్బలు ఎదుర్కొన్నా, కెసిఆర్‌ గత నాలుగున్నరేళ్లుగా తెలంగాణ అంశాన్ని ఏదో రకంగా సజీవంగా ఉంచడంలో కృతకృత్యుడయ్యారు. తెలంగాణ ప్రయోగంలో కెసిఆర్‌ విజయవంతం అయ్యాక, టిఆర్‌ఎస్‌తో పొత్తు ఏర్పరచుకొని కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ అంశం నిత్యం చర్చనీయాంశం అయ్యింది. ఈ ఘనత కెసిఆర్‌కు దక్కిందనడం కూడా సత్యదూరం కాదు. పత్రికల్లో, టెలివిజన్‌ ఛానల్లో రాజకీయ నాయకుల వ్యాఖ్యల్లో తెలంగాణ అన్న పదం దొర్లని రోజంటూ లేదు. కెసిఆర్‌ ప్రయోగం విజయవంతం అయిన తర్వాతనే ఆయన బాణీని విజయశాంతి, దేవేందర్‌ గౌడ్‌ అందుకునే ప్రయత్నం చేశారు. ఎవరు వచ్చినా కెసిఆర్‌ తెలంగాణకు ప్రధాన రాజకీయ వాణిగా ఉండిపోయారు.

తెలంగాణ కళాకారులు, మేధావులు ఉత్సాహంగా పనిచేసేందుకు ముందుకు వచ్చారు. ఆయన పనితీరుపై ఎన్ని విమర్శలు వచ్చినా, ఎందరు లోపాలు ఎత్తి చూపినా, మరెందరో దూరమైనా కెసిఆర్‌ శైలిలో మార్పు లేదు. ఆయన మాట్లాడే ధోరణిలో తేడా లేదు. టిఆర్‌ఎస్‌ నిర్దిష్టంగా ఒక వ్యవస్థీకృత రూపంగా బలపడి, ప్రజల్లోకి చొచ్చుకుపోయి, ఉధృతంగా ఉద్యమాలు చేపట్టకపోయినా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మరుగునపడలేదు సరికదా రాజకీయాల్లో అదొక నిర్ణాయక అంశంగా మారింది. ఉప ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ భంగపడడాన్ని పెద్ద విషయంగా మిగతా పార్టీలు భావించడం లేదు. జాతీయ స్థాయిలో బిజె పి పూర్తిగా తెలంగాణకు అనుకూలంగా మారింది. వామపక్షాలు కూడా తెలంగాణ అంశాన్ని భుజాన వేసుకునేందుకు సిద్ధపడ్డాయి. టిడిపి తెలంగాణ రాష్ట్రానికి అనుకూలంగా ప్రణబ్‌ కమిటీకి నివేదిక సమర్పించడం గుర్తించదగ్గ పరిణామం. కొత్తగా ఏర్పడ్డ ప్రజారాజ్యం కూడా తెలంగాణ రాష్ట్రానికి సానుకూలత ప్రకటించింది. ఇప్పుడిక తెలంగాణ కేవలం తెలంగాణ రాష్ట్ర సమితికి సంబంధించిన అంశం కాదు. మిగతా పార్టీలు కూడా ఈ ఎజెండాను చేపట్టాయి.

ఇక కాంగ్రెస్‌ మాత్రమే ఒక నిర్దిష్టమైన ప్రకటనతో ముందుకు రావలసి ఉంది. కాంగ్రెస్‌ కూడా ఈ విషయంపై పునరాలోచించడం లేదనడానికి వీలు లేదు. ఎన్నికల ముందు తెలంగాణ గురించి మాట్లాడినందువల్ల టిడిపి నిర్ణయాన్ని సీరియస్‌గా తీసుకోలేమని ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి వీర ప్ప మొయిలీ అన్నప్పటికీ తెలుగుదేశం నిర్ణ యం తర్వాతే కాంగ్రెస్‌ అధిష్ఠాన వర్గం వైఖరిలో మార్పు వచ్చిందనడంలో సందేహం లేదు. 2004 ఎన్నికల్లో కూడా ఎన్నికల ముందే తెలంగాణ అంశాన్ని కాంగ్రెస్‌ భుజాన వేసుకుంది కదా? అప్పుడు తెలంగాణ గురించి కాంగ్రెస్‌ ముందుగానే మోసం చేయాలని నిర్ణయించుకున్నట్లు వీరప్ప మొయిలీ మాటలను బట్టి అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. రాజకీయాల్లో ఉన్నప్పుడు తెలంగాణతో సహా అన్ని అంశాలను రాజకీయ పార్టీలు తమకు అనుకూలంగా ఉపయోగించుకోవాలనుకోవడంలో తప్పేమీ లేదు. కాంగ్రెస్‌కు ఇప్పుడు తెలంగాణ ఒక రాజకీయాంశం కాదని అనుకుంటే అది వేరే సంగతి. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ కేంద్రంలో మళ్లీ యుపిఏ అధికారంలోకి రావాలని కాంగ్రెస్‌ అ«ధ్యక్షురాలు భావిస్తున్నారు.

సాధ్యమైనంత మేరకు పొత్తులు పెట్టుకుని యుపిఏను బలోపేతం చేయాలని ఆమె ఉద్దేశం. గత ఎన్నికల్లో పొత్తులు బలంగా లేనందువల్లనే ఎన్‌డిఏ అధికారంలోకి రాలేకపోయిన విషయం ఆమెకు తెలుసు. పొత్తుల విషయంలో తాము తక్కువ అంచనా వేసినందువల్లనే అధికారంలోకి రాలేకపోయామని బిజెపి అగ్రనేత అద్వానీ తన ఆత్మకథలో సైతం అంగీకరించారు. రాష్ట్రానికి సంబంధించి కాంగ్రెస్‌ పొత్తు ఏర్పర్చుకోదగ్గ ప్రధాన పార్టీ టిఆర్‌ఎస్‌ మాత్రమే. ఆ పార్టీతో పొత్తు ఏర్పర్చుకోవాలంటే తెలంగాణపై నిర్దిష్ట చర్యలు తీసుకోవాలి. ఈ విషయంపై కాంగ్రెస్‌లో తర్జన భర్జనలు జరుగుతున్నాయి. ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డిని ఒక సారి ఢిల్లీ పిలిచి ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌, కాంగ్రె స్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఇతర కోర్‌ కమిటీ సభ్యులు చర్చించారు.

మళ్లీ తాజాగా ఈ విషయం చర్చించేందుకు ముఖ్యమంత్రి మంగళవారం ఢిల్లీ వచ్చారు. గత ఎన్నికలతో పోలిస్తే వైఎస్‌ ఈ సారి కాంగ్రెస్‌ విధాన నిర్ణయంలో కీలక పాత్ర పోషించనున్నారు. తెలంగాణపై నిర్ణయం తీసుకుంటే తలెత్తే సమస్యల గురించి ఇప్పటికే ఆయన అధిష్ఠానానికి వివరించారు. తెలంగాణపై నిర్దిష్టమైన నిర్ణయం తీసుకోకపోయినా, టిఆర్‌ఎస్‌తో పొత్తు ఏర్పర్చుకోకపోయినా కాంగ్రెస్‌ విజయానికి ఢోకా ఉండదనేది ఆయన ఆత్మ విశ్వాసం. కాంగ్రెస్‌ అధిష్ఠానం తీసుకునే నిర్ణయం గురించి వైఎస్‌కు ఎక్కువ తెలుసా, కెసిఆర్‌కు ఎక్కువ తెలుసా అనేది కొద్ది రోజుల్లో తేలనుంది.

(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)

source : andhra jyothy 25 Nov 2008

ప్రకటనలు

వ్యాఖ్యలు»

No comments yet — be the first.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: