jump to navigation

అప్పుడూ ఇప్పుడూ… నేను ‘పద్యాల’ భూమయ్యనే! సెప్టెంబర్ 7, 2008

Posted by M Bharath Bhushan in Culture, Poetry & Songs, Telangana People, Telugu (తెలుగు).
trackback

అనుమాండ్ల భూమయ్య, తెలుగు విశ్వవిద్యాలయం వైస్‌ఛాన్సలర్‌

అనుమాండ్ల భూమయ్యగా కన్నా ‘పద్యాల’ భూమయ్యగానే ఆయన చాలామందికి తెలుసు. కాలేజీ క్లాసురూములో ఆయన పద్యాలు రాగయుక్తంగా పాడుతుంటే విద్యార్థులు మైమరచి వింటారని పేరు. పద్యకావ్యంలో భూమయ్య చేసిన కృషి విశిష్టమైనది. సాధారణ జూనియర్‌ లెక్చరర్‌ స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ … కాకతీయ యూనివర్శిటీలో తెలుగు డిపార్ట్‌మెంట్‌ హెడ్‌గా… అనేక సెమినార్లను నిర్వహించడమేగాక పలు పుస్తకాలు రాసిన భూమయ్య ఇటీవలే పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయానికి ఉపకులపతిగా నియమితులయ్యారు. “నా తొమ్మిదవ తరగతిలోనే పద్యాలను రాగయుక్తంగా పాడటం అనే విద్య మా మాస్టారి ద్వారా అబ్బింది. అప్పట్నించే ‘పద్యాల’ భూమయ్య అని పిలిచేవారు. పెద్దయ్యాక నేను పద్యాలు రాస్తూ అదేపేరును కొనసాగించడం నా అదృష్టం”

నేను పుట్టి పెరిగింది కరీంనగర్‌ జిల్లాలోని మారుమూల గ్రామమైన వెదురుగట్ట. తల్లిపేరు శాంతమ్మ. తండ్రి లస్మయ్య. నలుగురు మగ సంతానంలో నేను మూడోవాడిని. మా నాన్న ఓ వైపు వ్యవసాయం చూసుకుంటూనే మరోవైపు నేత పని చేసేవాడు. అన్నలిద్దరూ పెద్దగా చదువుకోలేదు. ఒక అన్న వ్యవసాయం పనిలో, మరో అన్న నేత పనిలో నాన్నకు సాయపడేవారు. నా విషయానికొస్తే ‘ఫెయిల్‌ కానంత వరకు చదువుకుంటూ పో … ఫెయిల్‌ అయితే చదువు గిదువు బంద్‌’ అని నాన్న హెచ్చరించాడు. ఈ మాటలు చిన్నతనంలోనే నాలో ఏదో తెలియని భయాన్ని ఏర్పరిచాయి. అప్పటికే మా అన్న ఆరవ తరగతిలో ఫెయిలైతే చదువు మాన్పించేసి పొలం పనులకు పంపించాడు మా నాన్న. దీంతో నా చదువు సక్రమంగా సాగాలంటే ఫెయిల్‌ కాకుండా చదవడమొక్కటే మార్గంగా కనిపించింది. చొప్పదండి జడ్పీ స్కూలులో ఎక్కడా ఫెయిలవకుండా జాగ్రత్తగా చదువుకుంటూ వెళుతున్నపుడు హఠాత్తుగా నా జీవితం ఊహించని మలుపు తిరిగింది.

పదవ తరగతి వేసవి సెలవుల్లో (1965) నాకు పెళ్లయింది. అప్పుడు నా వయసు 15 సంవత్సరాలు. నా భార్య అనంతలక్ష్మికి తొమ్మిది, పది సంవత్సరాలుంటాయేమో. ఈ పెళ్లి జరగడానికి ఒక కథ ఉంది. నేత పని కోసం మా నాన్నకు నూలు ఇచ్చే మాస్టర్‌ వీవర్‌ ఉండేవారు. ఆయన తన అన్న కూతుళ్లకు తొందరగా పెళ్లిళ్లు అవుతున్నాయనే కారణంగా తన కూతురికి కూడా వెంటనే పెళ్లి చేయాలనుకున్నాడు. ఈ విషయం మా నాన్నతో చెప్పాడు. ‘పిలిచి పిల్లనిస్తే చేసుకోవడానికేం’ అంటూ నేను వద్దని మొత్తుకున్నా వినకుండా ఆరోజుల్లో నాకు పెళ్లి చేశారు. అయినా నా చదువు ఆగలేదు. మా అన్నలు మేనరికపు వివాహాలు చేసుకోవడం కూడా నా విద్యాభ్యాసం ఆగకుండా సాగడానికి ఒకవిధంగా కలిసొచ్చిన అంశం. మా వదినలు నన్ను పరాయివాడిలా చూడలేదు. నా చదువుకు అడ్డుచెప్పలేదు.

కరీంనగర్‌లో పి.యు.సి. అయిపోయాక బి.ఎస్సీ కోసం జగిత్యాల కాలేజీలో చేరాను. మొదటి సంవత్సరం చదువుతుండగానే అంటే 1968లో జై తెలంగాణ ఉద్యమం మొదలైంది. ఇంకేం…ఊ అంటే బంద్‌, ఆ అంటే బంద్‌. కాలేజీలో క్లాసులుండేవి కావు. మా కాలేజీలో ప్రసిద్ధ సాహితీవేత్త కోవెల సంపత్కుమారాచార్యులు తెలుగు లెక్చరర్‌గా పనిచేసేవారు. ఆయన ఇంటికి తరచూ వెళ్తుండేవాణ్ణి. ఆయన ద్వారా నాకు తెలుగు సాహిత్యంపై శ్రద్ధ పెరిగింది. ఆయన దగ్గరే సాహిత్యగ్రంథాలు చదవడం అలవాటైంది. బిఎస్సీ చదివే నేను ప్రత్యేక తెలంగాణ ఆందోళన పుణ్యమా అని తెలుగు సాహిత్యం వైపు దృష్టి సారించడం నా జీవితంలో ముఖ్యమైన మలుపు.

బిఎస్సీలో బొటాబొటి మార్కులతో పాసైన నేను ఉస్మానియా యూనివర్శిటీలో ఎం.ఎ తెలుగు కోసం చేరాను. దివాకర్ల వెంకటావధానిగారు, సి.నారాయణరెడ్డి గార్లు నాకు అప్పట్లో గురువులు. విశ్వనాథ సత్యనారాయణ ‘భ్రష్ఠయోగి’ కావ్యాన్ని జువ్వాడి గౌతమరావుకు అంకితం ఇచ్చినపుడు ఆ సభలో భ్రష్ఠయోగిలోని కొన్ని పద్యాలను నన్ను రాగయుక్తంగా పాడాల్సిందిగా కోరారు. నేను విశ్వనాథ వారి సమక్షంలోనే ఆ పద్యాలను రాగయుక్తంగా ఆలపించాను. అవి విని ఆయన ‘కోకిల కంఠం’ అంటూ నన్ను బాగా మెచ్చుకున్నారు. ఈ మెప్పు నన్ను పద్యసాహిత్యం వైపు మరింత ఉత్సాహంతో నడిపించింది. అందుకే నేను రాసిన ‘వేయిపడగలు- ఆధునిక ఇతిహాసం’ పుస్తకాన్ని విశ్వనాథవారికే అంకితమిచ్చాను.

పద్యాలను రాగయుక్తంగా పాడటానికి నాకు ప్రేరణనిచ్చింది తొమ్మిదవ తరగతిలో భూంరెడ్డి సార్‌. ఆయన పద్యాలను రాగయుక్తంగా పాడుతుంటే మైమరచి వినేవాణ్ణి. పుస్తకంలోని పద్యాలను ఆ విధంగా పాడి వినిపించేవారిని నేను అప్పటిదాకా ఎవరినీ చూడలేదు. స్కూల్లో ఏదైనా కార్యక్రమం జరిగినప్పుడు అన్ని తరగతుల పిల్లలను చెట్లకిందకి తీసుకొచ్చేవారు. పిల్లలు అల్లరి చేయకుండా ఉండేందుకు నన్ను పద్యాలు చెప్పమనేవారు. నేను కూడా మా భూంరెడ్డి సార్‌లాగే రాగం అందుకుని పద్యాలు పాడేవాణ్ణి. దాంతో నన్ను అందరూ ‘పద్యాల భూమయ్య’గా పిలిచేవారు. భూమయ్య అంటే ఎవరికీ తెలిసేది కాదుగానీ పద్యాల భూమయ్య అంటే అందరికీ తెలిసేది. చివరికి మా అత్తగారి ఊళ్లో కూడా అదే పేరుతో నన్ను పిలిచేవారు. ఈ పేరే నాకు తెలియకుండానే నా జీవితాన్ని మలుపు తిప్పిందని నేను ఎం.ఎ. చదువుతున్నప్పుడుగానీ నాకు అర్థం కాలేదు.

ఎం.ఎ అయిపోగానే వరంగల్‌లోని ఎల్‌.బి.కాలేజీలో తెలుగు జూనియర్‌ లెక్చరర్‌గా కెరీర్‌ ఆరంభించాను. మరోవైపు ఎం.ఫిల్‌ కూడా చేశాను. 1980లో కాకతీయ యూనివర్శిటీలో పి.హెచ్‌.డి.పూర్తిచేశాను. 83లో అదే యూనివర్శిటీలో రీడర్‌గా, ఆ తర్వాత ప్రొఫెసర్‌గా పనిచేశాను. పద్యసాహిత్యంలో విశేష కృషి చేయడమేగాక, ‘అష్టాదశ పురాణాల’ మీద సెమినార్‌ నిర్వహించి దానిని పుస్తకరూపంలోకి తెచ్చాను. ఇది ఏ యూనివర్శిటీ చేయనటువంటి పని అని చాలామంది ప్రశంసించారు. తెలుగు శాఖాధిపతిగా పనిచేసేప్పుడు కూడా తరచూ సెమినార్లు నిర్వహించేవాడిని. సంప్రదాయ కావ్యాల మీద ఇరవై సెమినార్లదాకా చేశాను. 1994లో నేను రాసిన ‘వేయి నదుల వెలుగు’ పద్యకావ్యం నా కెరీర్‌ను మలుపు తిప్పింది. ఈ పుస్తకం నాకు అపరిమితమైన పేరుప్రఖ్యాతులను తీసుకొచ్చింది. 92,93,94 సంవత్సరాల్లో వచ్చిన పద్యకావ్యాలలో ఉత్తమమైనదిగా గరికపాటి సాహిత్యపురస్కారం అందుకోవడమేగాక, తెలుగు విశ్వవిద్యాలయం అవార్డు కూడా లభించింది. ఇదే ఉత్సాహంతో వరుసగా పుస్తకాలు వేయడం మొదలెట్టాను. ‘ఆద్యుడు కట్టమంచి’, ‘మాలపల్లి’, ‘గోల్కొండ కవుల సంచిక…తెలంగాణ భావ విపంచిక’…ఇలా పుస్తకాల మీదనే పుస్తకాలు రాసే సంస్కృతిని మొదలెట్టాను. ‘గోల్కొండ కవుల వేదిక’ అనేది తెలంగాణ కవుల మొదటి సంకలనంగా చెప్పుకోవచ్చు. ‘అగ్రి వృక్షం’, ‘చలువ పందిరి’, ‘ఆంధ్రపురాణం’… ఇలా ఇప్పటిదాకా 22 పుస్తకాలు రాశాను.

ఇవన్నీ ఒకెత్తయితే కాకతీయ యూనివర్శిటీ పరిధిలోని అన్ని అఫిలియేటెడ్‌ కాలేజీల నుంచి 31మంది విద్యార్థులతో ‘తెలుగు నందనం’ సెమినార్‌ నిర్వహించడం మరో ఎత్తు. పొయెట్రీ, డ్రామా వంటి నాలుగు సెషన్స్‌ నిర్వహించి దాన్ని పుస్తకంగా తీసుకొచ్చాను. ఇది క్యాంపస్‌లో ఎంతో చైతన్యాన్ని తీసుకొచ్చింది. ఇప్పటికి కూడా ఈ సంప్రదాయం యూనివర్శిటీలో కొనసాగడం విశేషం. ఇలాంటి అనేక సెమినార్లు నేను ఇతరుల నుంచి కొంత నేర్చుకోవడానికి, నేర్చుకున్నదాన్ని సమగ్రంగా వివరించడానికి తోడ్పడి నా కెరీర్‌ చక్కని మలుపులు తిరగడానికి దోహద పడ్డాయి. క్లాసురూములో పద్యకావ్యాలను విద్యార్థులకు అర్థమయ్యేలా రాగయుక్తంగా వివరించడమే కాదు వారితో సంభాషణాత్మకంగా ఉండేలా పుస్తకాలు రాయడం కూడా నాకు తెలుగు సాహిత్యంలో స్థానాన్ని కల్పించాయి. ఈ సీరిస్‌లో భాగంగానే ‘నాయనితో కాసేపు’, ‘ఆధునిక కవిత్వంలో దాంపత్యం’, ‘గోల్కొండ కవుల సంచిక’ వంటి పుస్తకాలను రచించాను. ఈ పద్ధతిని చూసి ఆచార్య చేకూరి రామారావుగారు ‘ఇది భౌమ మార్గం’ (డౌన్‌ టు ఎర్త్‌) అన్నారు. పద్యకావ్యాలను సామాన్యులకు అర్థమయ్యేలా రచించానని అలా అన్నారు.

చిన్నప్పటి నుంచి కూడా నేనెప్పుడూ ఓ గోల్‌ అంటూ పెట్టుకుని చదువుకోలేదు. ఓ విధంగా చెప్పాలంటే లక్ష్యం లేకుండా సాగిన చదువు నాది. అయినప్పటికీ ఏ పనినైనా మనసు పెట్టి చేయడం నేర్చుకున్నాను. నా పని నేను చేసుకుంటూ వెళ్తుంటే… ఫలితాలు వాటంతట అవే వచ్చాయి. విమర్శ, కవిత్వం, బోధన ఏకకాలంలో సాగిన నా కెరీర్‌ చివరి అంకంలో ‘తెలుగు విశ్వవిద్యాలయా’నికి వైస్‌ఛాన్సలర్‌ను కావడం నా జీవితానికే ఊహించని టర్నింగ్‌ పాయింట్‌. ఓ మామూలు కాలేజీ లెక్చరర్‌గా మొదలైన నా జీవితం అనేక మలుపులు తిరిగి చివరికి ఒక యూనివర్శిటీకి వైస్‌ఛాన్సలర్‌ను కావడం నా కష్టం, అధ్యయనానికి లభించిన గౌరవంగా భావిస్తున్నాను. ఫలితాలను ఆశించకుండా నమ్ముకున్న పనిని చిత్తశుద్ధితో చేస్తే ఎవరికైనా ఇలాంటి ప్రతిఫలమే లభిస్తుందేమో. ఇందుకు నా జీవితమే చక్కని ఉదాహరణ.

-చల్లా శ్రీనివాస్‌

source : aandhra jyothy sunday edition 7 sep 2008

వ్యాఖ్యలు»

No comments yet — be the first.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: