jump to navigation

Ekka Yadagiri Rao – Sculpture in History జూలై 27, 2008

Posted by Telangana Utsav in Art, Articles, Culture, Hyderabad, Telangana, Telugu (తెలుగు).
trackback

గెలుపు మలుపుల దారి చూపే కొత్త శీర్షిక ఓపెన్‌ హార్ట్‌
ఆ స్థూపాన్ని చూస్తే నేనే ఇంతపని చేశానా అనిపిస్తుంది
ప్రసిద్ధ శిల్పి ఎక్కా యాదగిరిరావు

అసెంబ్లీ ముందున్న గన్‌పార్క్‌లోని ‘తెలంగాణ అమరవీరుల స్థూపం’ తెలంగాణ సాయుధపోరాటానికి నిలువెత్తు సాక్షిగా గంభీరంగా కనిపిస్తుంది. ఆ స్ధూపాన్ని చెక్కిన శిల్పి ఎక్కా యాదగిరి రావు. భారతావనికి స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత అంటే 20వ శతాబ్దంలో ఆధునిక శిల్పకళలో తెలుగువాడి సత్తాను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో చాటిన ఒకే ఒక్కడాయన. ఆయన రూపొందించిన ‘మిథున’ లోహ శిల్పం ప్రసిద్ధ స్పానిష్‌ శిల్పి, చిత్రకారుడు పికాసో శిల్పాల స్థాయిలో ఉందని అంతర్జాతీయ పత్రికలు కొనియాడాయి. ఢిల్లీలోని గాంధీ విగ్రహం నుంచి టాంక్‌బండ్‌ పైనున్న సురవరం ప్రతాపరెడ్డి విగ్రహం వరకు … రష్యా ఎంబసీ మొదలు సాలార్‌జంగ్‌ మ్యూజియం దాకా ఆయన చెక్కిన విగ్రహాలన్నీ భారతీయ ఆధునిక శిల్పకళ గొప్పదనాన్ని చాటుతాయి. ఆదిశంకరుని అద్వైతంతో పాటు ఆధునిక శిల్పకళ దాకా దేని గురించయినా అనర్గళంగా మాట్లాడే ఈ డెబ్భై ఏళ్ల శిల్పాచార్యుడి ఓపెన్‌హార్ట్‌ ఇది.

నేను పుట్టిపెరిగింది హైదరాబాద్‌ ఓల్డ్‌సిటీలోని అలియాబాద్‌లో. మా నాన్న ఎక్కా నారాయణస్వామి టీచర్‌. నిజాం పాలనలోనే స్త్రీవిద్య, మద్యపాన నిషేధం, గణేష్‌ ఉత్సవాల గురించి అందరితో చర్చలు జరిపేవాడు. మా అమ్మ పేరు నాగమ్మ. ముగ్గులు వేయడంలో దిట్ట. జానపద గీతాలను అద్భుతంగా పాడేది. ఆమె ఉదయమే వాకిట్లో ముగ్గులు వేస్తూ పాటలు పాడుతుంటే నేను నిద్రకళ్లతోనే ముగ్గులను చూస్తూ పాటలు వింటూ ఉండేవాణ్ణి. ఈ విధంగా ఓ వైపు మా నాన్న, మరోవైపు మా అమ్మద్వారా నా చిన్నతనంలోనే అంతర్గతంగా నాకే తెలియని ఓ ఊహాప్రపంచాన్ని సృష్టించుకున్నాను. కానీ అదేమిటో నాకు తెలిసేది కాదు. నేను తరచూ రకరకాల ఇమాజినేషన్స్‌లోకి వెళ్తూవుండేవాణ్ణి. నా జీవితంలో తొలిమలుపు ఇదేనని చెప్పవచ్చు.

హెచ్‌.ఎస్‌.సి నుంచే నాకు చిత్రలేఖనంలో శ్రద్ధ వుండేది. 1957లో నా ఇంటర్‌ పూర్తయ్యింది. ఆ రోజుల్లో ఇంటర్‌ తర్వాత రెండే కోర్సులు ఉండేవి. అయితే డాక్టర్‌ లేదంటే ఇంజనీర్‌. నాకు ఇష్టం లేకున్నా ఎ.ఎం.ఐ.ఇ.లో చేరాను. ప్రాక్టికల్స్‌లో భాగంగా మింట్‌కాంపౌండ్‌కు వెళ్లేవాణ్ణి. అక్కడ పెద్ద పెద్ద బాయిలర్స్‌ కడిగేందుకు నన్ను పంపేవారు. నేను వాటిల్లోకి దిగగానే నాదైన ఊహాప్రపంచంలోకి వెళ్లేవాణ్ణి. చేస్తున్న పనిమీద శ్రద్ధ ఉండేది కాదు. సరిగ్గా అదేసమయంలో హిమాయత్‌నగర్‌లోని ఆంధ్ర యువతిమండలిలో స్వామి చిన్మయానంద బోధనలు జరిగేవి. నేను తరచూ అక్కడికి వెళ్తుండేవాణ్ణి. ఒకరోజు సత్సంగ్‌ జరుగుతుండగా నాలో జరుగుతున్న సంఘర్షణను ఆయన ముందుంచాను. ‘మీతో వచ్చేస్తా’ అన్నాను. దానికాయన సున్నితంగా తిరస్కరిస్తూనే ‘ఆర్ట్‌ అంటే ఇష్టమంటున్నావు కాబట్టి అందులోనే ముందుకు వెళ్లు’ అని ఉపదేశించారు. ఆయన ఉపదేశం నా జీవితానికి గొప్ప మలుపయ్యింది. నా అంతర్గత సంఘర్షణకు సరైన సమాధానం లభించినట్లయ్యింది.

ఇంజనీరింగ్‌ చదువు వదిలేసి 1957లో కింగ్‌కోఠిలోని కాలేజ్‌ ఆఫ్‌ ఫైన్‌ఆర్ట్స్‌లో చేరాను. అక్కడ శిల్పకళ వైపు ఆకర్షితుడనయ్యాను. ఎస్‌.కె.పాటిల్‌ అనే మహారాష్ట్ర టీచర్‌ ఒక హంసబొమ్మను ఇచ్చి ఆ రకంగా చెక్కమన్నాడు. వెంటనే చేసిచ్చాను. ఆవిధంగా శిల్పకళలో లైన్‌ దొరికింది. ఆయన దగ్గర చాలా మెలకువలు నేర్చుకున్నాను. చాలా శిల్పాలను చెక్కాను. కానీ నాకే తెలియని ఏదో అసంతృప్తి నిరంతరం నన్ను వెంటాడుతూ ఉండేది. ఉస్మాన్‌ సిద్ధిక్‌ అనే టీచర్‌ పరిచయమైన తర్వాతగానీ ఆ అసంతృప్తికి కారణమేమిటో తెలియరాలేదు. ఆధునిక శిల్పకళ గురించి ఆయన నాకు వివరంగా చెప్పారు. ఆకలిని శిల్పంగా మలిస్తే బిచ్చగాడిగా కనిపిస్తాడు. దుఃఖాన్ని చూపాలంటే ఏడుపుమొహాన్ని చెక్కాలి. కానీ మోడ్రన్‌ ఆర్ట్‌లో భావం ముఖ్యం. ఒక అంశం పట్ల ఆర్టిస్టు తన భావాలను స్వేచ్ఛగా వ్యక్తీకరించే అవకాశం ఉంటుంది. అందుకే నేను మోడ్రన్‌ ఆర్ట్‌లో నా కృషి ప్రారంభించాను. భారతీయ శిల్పకళను పరిశోధించి లోహ ‘మిథున’ శిల్పాన్ని రూపొందించాను. ఈ శిల్పాన్ని ఢిల్లీలోని నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ ఆర్ట్స్‌వారు కొనుగోలు చేసి ప్రదర్శించారు. నా శిల్పకళ కెరీర్‌లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ‘మిథున’ నాకు అమితమైన గుర్తింపును తీసుకొచ్చింది. ‘ఇంట్రడక్షన్‌ టు ఇండియన్‌ మాడ్రన్‌ స్కల్ప్చర్‌’ అనే గ్రంథంలో ప్రసిద్ధ కళా విమర్శకురాలు జయా అప్పుస్వామి నన్ను స్పానిష్‌ శిల్పి, చిత్రకారుడైన పికాసోతో పోల్చి రాశారు. ఇది నా శిల్పకళా జీవితానికి గొప్పమలుపు. ఆ తర్వాత నేను చెక్కిన సమాధి, మీరా, ఫిష్‌ శిల్పాలు కూడా అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులను తీసుకొచ్చాయి.

ఇంజనీరింగ్‌ చదువు వదిలేసి 1957లో కింగ్‌కోఠిలోని కాలేజ్‌ ఆఫ్‌ ఫైన్‌ఆర్ట్స్‌లో చేరాను. అక్కడ శిల్పకళ వైపు ఆకర్షితుడనయ్యాను. ఎస్‌.కె.పాటిల్‌ అనే మహారాష్ట్ర టీచర్‌ ఒక హంసబొమ్మను ఇచ్చి ఆ రకంగా చెక్కమన్నాడు. వెంటనే చేసిచ్చాను. ఆవిధంగా శిల్పకళలో లైన్‌ దొరికింది. ఆయన దగ్గర చాలా మెలకువలు నేర్చుకున్నాను. చాలా శిల్పాలను చెక్కాను. కానీ నాకే తెలియని ఏదో అసంతృప్తి నిరంతరం నన్ను వెంటాడుతూ ఉండేది. ఉస్మాన్‌ సిద్ధిక్‌ అనే టీచర్‌ పరిచయమైన తర్వాతగానీ ఆ అసంతృప్తికి కారణమేమిటో తెలియరాలేదు. ఆధునిక శిల్పకళ గురించి ఆయన నాకు వివరంగా చెప్పారు. ఆకలిని శిల్పంగా మలిస్తే బిచ్చగాడిగా కనిపిస్తాడు. దుఃఖాన్ని చూపాలంటే ఏడుపుమొహాన్ని చెక్కాలి. కానీ మోడ్రన్‌ ఆర్ట్‌లో భావం ముఖ్యం. ఒక అంశం పట్ల ఆర్టిస్టు తన భావాలను స్వేచ్ఛగా వ్యక్తీకరించే అవకాశం ఉంటుంది. అందుకే నేను మోడ్రన్‌ ఆర్ట్‌లో నా కృషి ప్రారంభించాను. భారతీయ శిల్పకళను పరిశోధించి లోహ ‘మిథున’ శిల్పాన్ని రూపొందించాను. ఈ శిల్పాన్ని ఢిల్లీలోని నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ ఆర్ట్స్‌వారు కొనుగోలు చేసి ప్రదర్శించారు. నా శిల్పకళ కెరీర్‌లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ‘మిథున’ నాకు అమితమైన గుర్తింపును తీసుకొచ్చింది. ‘ఇంట్రడక్షన్‌ టు ఇండియన్‌ మాడ్రన్‌ స్కల్ప్చర్‌’ అనే గ్రంథంలో ప్రసిద్ధ కళా విమర్శకురాలు జయా అప్పుస్వామి నన్ను స్పానిష్‌ శిల్పి, చిత్రకారుడైన పికాసోతో పోల్చి రాశారు. ఇది నా శిల్పకళా జీవితానికి గొప్పమలుపు. ఆ తర్వాత నేను చెక్కిన సమాధి, మీరా, ఫిష్‌ శిల్పాలు కూడా అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులను తీసుకొచ్చాయి.

ఓవైపు నా ఆధునిక శిల్పకళ ముందుకు సాగుతుంటే మరోవైపు 1969లో తెలంగాణ సాయుధ పోరాటం ఊపందుకుంది. అలియాబాద్‌లో కర్ఫ్యూ విధించారు. అందరం బిక్కుబిక్కుమంటూ ఇళ్లలో ఉండిపోయాం. నా మిత్రుడైన వెంకటేశ్వరరావు తన కొడుకు కోసం బయటికి తొంగిచూస్తే సరిగ్గా అప్పుడే ఫైరింగ్‌ జరిగింది. తుపాకీ తూటాకు నా మిత్రుడు నేలకొరిగాడు. భయం, బాధతో వాడి మృతదేహాన్ని నేను చూడలేదు. ఆవిధంగా తుపాకీ శబ్దం, బుల్లెట్‌ నా మైండ్‌లో ఫిక్స్‌ అయిపోయాయి. ఇది జరిగిన మూడేళ్లకు ‘తెలంగాణ అమరవీరుల స్థూపం’ ఏర్పాటు కోసం పురపాలక శాఖ డిజైన్స్‌ను ఆహ్వానించింది. నేను పంపిన డిజైన్‌ను అప్పటి తెలంగాణ మంత్రులైన అంజయ్య, మదన్‌మోహన్‌, మాణిక్‌రావు, ఎం.ఎం.హర్షంల కమిటీ సెలెక్ట్‌ చేసింది. ఆవిధంగా అసెంబ్లీ ముందున్న గన్‌పార్క్‌లో ‘తెలంగాణ అమరవీరుల స్థూపం’ చెక్కాను. ఈ స్థూపం చెక్కుతున్నప్పుడు నా మిత్రుడిని బలిగొన్న బుల్లెట్‌ నా స్మృతిపథంలో పదే పదే కనిపించేది. అందుకే తెలంగాణ సాయుధపోరాటంలో నేలకొరిగిన ఎంతో మంది స్మృత్యర్థం ‘బుల్లెట్‌ ఇంప్రెషన్స్‌’ను దానిపై చెక్కడం జరిగింది. ఒక స్మారక స్థూపంపై ఈ విధంగా బుల్లెట్‌ గుర్తులను ఉంచడం ప్రపంచంలో మరెక్కడా జరగలేదు. ఇన్నేళ్ల తర్వాత … అసెంబ్లీ ముందు నుంచి వెళ్తున్నప్పుడు ఈ స్మారక స్థూపాన్ని చూసినప్పుడల్లా ఇంతపని నేనే చేశానా? అనిపిస్తుంది. నా జీవితంలో ఇదో మర్చిపోలేని మలుపు.

నేను చదివిన కాలేజీ ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌లోనే అధ్యాపకునిగా చేరి విద్యార్థులకు బోధిస్తూనే నా అధ్యయనాన్ని కొనసాగించాను. భారతీయ శిల్పకళను నిశితంగా పరిశీలించి నాదైన ముద్రను ఏర్పరచుకున్నాను. ఇందుకు దేశ విదేశాలకు చెందిన ఎంతోమంది నాకు స్ఫూర్తిగా నిలిచారు. వీరిలో కోల్‌కతాకు చెందిన శంఖుచౌదరి, మద్రాస్‌కు చెందిన జానకీరామ్‌లతోపాటు హెన్రీమోరే, పాబ్లో పికాసోలు ముఖ్యులు. శంఖుచౌదరి శిల్పాల్లోని సింప్లిసిటీ, జానకీరామ్‌ లోహపుముక్కలను కలిపే తీరు నాకు బాగా నచ్చింది. పికాసో శిల్పాల్లోని జిమ్మిక్స్‌, హెన్రీమోరే శిల్పాల్లోని డీప్‌ ఫిలాసఫీ కూడా నాకు స్ఫూర్తిదాయకంగా నిలిచాయి.

నేను చెక్కిన చాలా శిల్పాలు దేశ విదేశాల్లోని మ్యూజియాల్లో ఉన్నాయి. సుమారు 50 ఏళ్ల క్రితం హైదరాబాద్‌ నగరపాలక సంస్థ కోసం నేను రూపొందించిన నెహ్రూ విగ్రహం లాల్‌దర్వాజాలో ఉంది. గాంధీ విగ్రహాన్ని న్యూఢిల్లీలో పెట్టారు. టాంక్‌బండ్‌పై సురవరం ప్రతాపరెడ్డి విగ్రహం, విశాఖబీచ్‌లోని దుర్గాబాయి దేశ్‌ముఖ్‌ విగ్రహం నేను చెక్కినవే. రష్యాలోని ఇండియన్‌ ఎంబసీ, యు.కె., జర్మనీ, యు.ఎస్‌.ఎలలో కూడా నా శిల్పాలున్నాయి. 1975లో జరిగిన ఇంటర్నేషనల్‌ ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌కు మనదేశానికి నేను ప్రాతినిధ్యం వహించడం, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఇచ్చే అత్యున్నత పురస్కారమైన ‘హంస’ అవార్డును 2001లో అందుకోవడం, లలిత కళా అకాడమీ 1984లో నా మోనోగ్రాఫ్‌్‌ పుస్తకాన్ని ప్రింట్‌ చేయడం … ఇవన్నీ నా జీవితంలో మర్చిపోలేని మలుపులే.

2005లో భారత ప్రభుత్వం నాకు ఫెలోషిప్‌ను ఇచ్చింది. దానిలో భాగంగా నేను కర్రతో శిల్పాలు రూపొందించాను. ఇప్పుడు నాకు డెబ్భైయేళ్లు. ప్రస్తుతం శక్తి సన్నగిల్లడంతో శిల్పకళ నుంచి మళ్లీ ఆధునిక చిత్రకళవైపు దృష్టి సారించాను. నేను గీసిన ఎన్నో చిత్రాలు అంతర్జాతీయ గుర్తింపును తీసుకువచ్చాయి. విద్యావంతురాలైన నా భార్య శ్యామలాదేవి నా పనిలో కల్పించుకోకపోవడమే నాకు ఆమె నుంచి లభించిన గొప్ప మద్దతు. ఆధునిక శిల్పకళలో అన్ని ప్రయోగాలూ చేశాను. 20వ శతాబ్దపు శిల్పకళలో తెలుగువాడి కంట్రిబ్యూషన్‌ను చాటిచెప్పిన శిల్పిని నేనొక్కడినేనని గర్వంగా చెప్పగలను.

ఇక శిల్పకళ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే …శివలింగాన్ని మించిన ఆధునిక శిల్పాకృతి ఈ ప్రపంచంలోనే లేదు. పూర్ణానంద స్వరూపానికి అది అనితర సాధ్యమైన సంక్షిప్తరూపం. అంతకన్నా గొప్ప భావాన్ని ఆధునిక శిల్పకళలో చూపడం అసాధ్యం.

phone‌: 9346950709,
-చల్లా శ్రీనివాస్‌

source : aadhivaaram, aandhrajyothy 27 july 2008

వ్యాఖ్యలు»

No comments yet — be the first.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / మార్చు )

Connecting to %s

%d bloggers like this: