jump to navigation

పాలపిట్ట పాట – Promise of People’s Telangana జూలై 12, 2008

Posted by Telangana Utsav in Culture, elections, Identity, NTPP, SEZ, Six Point Formula, Telangana, Telugu (తెలుగు), TRS.
trackback

– అల్లం నారాయణ

జమ్మిచెట్టు మీద ఆయుధాలు దించుకో… నువ్వు ఎన్నో వాడివి. దసరనాడు పాలపిట్టకోసం చూసినట్టు తెలంగాణ కోసం ఎన్నినాళ్లు చూడమంటవ్‌. నిజమే. దేవేందర్‌ గౌడ్‌ సాబ్‌. ఆత్మాభిమానం దెబ్బతిన్నది. ఒకటా రెండా యాభై ఏళ్లయింది. కలిపినప్పుడే విచ్చుకుపోయింది తెలంగాణ ఆత్మ. పచ్చికుండ ఫటిల్లున పగిలిపోయినట్టు. కానీ.. తెలంగాణ మాత్రం రాలేదు. చాలా మంది వచ్చిండ్రు. పోయిండ్రు. ముసలితనానికి దసలిరైకలు తొడుక్కున్న ముదివగ్గు పాత తరపు కురువృద్ధులూ ఇంకా తెలంగాణను నాల్కల కొసలమీద పలవరిస్తూనే ఉన్నారు. కానీ.. దేవేందర్ ‌సాబ్‌. తెలంగాణ రాలేదు.

ఎన్ని పరీక్షలు. యాదికున్నదా! నలభై ఏండ్ల క్రిందట. రాజ్‌భవన్‌రోడ్‌ నెత్తురోడింది. అలీజాకోట్లా, చార్మి నార్‌, ఘాస్‌మండీ, నిజాంకాలేజ్‌, ఆబిడ్స్‌, కోఠి, సుల్తాన్‌బజార్‌లు పోటెత్తి వీధులు తెలంగాణ గాయాలయ్యాయి. చరిత్ర. నిండా నెత్తురు నిండిన చరిత్ర. మనదే అయిన చరిత్ర. కొన్ని కన్నీళ్లూ.. కొంత నెత్తురూ.. కొన్ని కొన్నెత్తుటి నినాదాలూ.. రంగారెడ్డి సాబ్‌ ఏమన్నడానాడు. “గులామ్‌కీ జిందగీసే మౌత్‌ అచ్ఛీ హై”.. బానిసబతుకు కన్నా.. చావుమేలు. చచ్చిపోయిండ్రు కదా.. మూడువందలా డెబ్భై మంది. సోరసోర పోరగండ్లు. కలలుకన్నవాళ్లు.

ఈ ప్రపంచానికి కలల నెనరు తెలిపినవాళ్లు. మందికోసం నెత్తుటి మడుగుల్లో మునిగిన వాళ్లు ఏమయింది. కొన్ని పెద్ద మనుషుల ఒప్పందాలు. కొన్ని ముల్కీ నియమ నిబంధనలు. ఆరు సూత్రాలు, ఆ సూత్రాలు. రానివీ.. పోనివీ.. కాగితాలమీద కచ్చెడు. కానీ ఏమి జరిగింది. గుర్తుందా పార్టీలు.. ఎన్నికలు. ఓట్లు. సీట్లు. ముప్పది ఆరు సంవత్సరాల క్రింద ఎంపీలన్నీ గెలుచుకుని పరీక్షల పాసయింది తెలంగాణ. వేరు తెలంగాణ తప్ప మరిదారి లేదని తేల్చి చెప్పింది తెలంగాణ. మర్రి చెన్నా రెడ్డి ఏమన్నడు. ఎం.పీల బలంతోటి అగవచ్చె తెలంగాణ అన్నడు. ఇగ వచ్చె తెలంగాణ అన్నడు. చివరికి ఇందిరాగాంధీ మాయాజాలంల ఇరుక్కున్నది తెలంగాణ.

మర్రి చెన్నారెడ్డి ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రి అయిండు. ఎక్కడ ఆ 370 మంది మృతవీరుల త్యాగం. ఎవరిని నిందించాలి. ఆ తరం అట్లా నక్సల్బరీలో దూకింది. తెలంగాణలో నెత్తురుచిందని పల్లెలేదు. పొక్కిలి కాని నేలలేదు. చెరసాలలు, ఉరికొయ్యలు, ఎన్‌కౌంటర్లు, చిత్రహింసలు. తెలంగాణ ఒక జైలయింది. అదొక ఆశ్వాసం. అదీ జరుగుతూనే ఉన్నది. పదిహేనేండ్లయింది. మళ్లీ లేచినిలబడింది తెలంగాణ. అప్పుడొక కొలువులే ఆక్షేపణ. ఇప్పుడెన్ని కోణాలు. భాష, యాస, బతుకు, భూమి, జాగ, ఊరు, వాడ వలసకు బలయిన ఒక విధ్వంస సీమ తెలంగాణ. హైదరాబాద్‌ అమ్ముడుపోయింది. లిబర్టీలేదు. కోఠిలేదు. ఆబిడ్స్‌ లేదు. కొఠీర్లు లేవు.

ఇప్పుడొక ప్రపంచబ్యాంకు తైనాతీల రింగురోడ్డు సర్ప పరిష్వంగంలో విలవిలలాడ్తున్న తెలంగాణ. అంతా మారిపోయింది. తెలంగాణ బతుకు ఛిద్రమయింది. యాభైఏళ్ల కలయిక ఆధిపత్య భావజలపు ఒక హక్కు అయిపోయింది. జలదృశ్యం సీను. కేసీఆరూ. తెలంగాణ రాష్ట్ర సమితి. విద్యావంతులు, జర్నలిస్టులు, టీచర్లు, నటులు, కళాకారులు, గాయకులు, ఆటగాళ్లు, పాటగాళ్లు ఒకే గొంతుగా మోగింది ముక్కోటి తెలంగాణ. నడివీధిలో నిలబడి గొంతెత్తిన పెనుకేక అయింది. వీధులు పోటెత్తిన ధూమ్‌ ధామ్‌ అయింది. బెల్లిలలిత ముక్కలయిన తెలం’గానం’ అయింది.

కేసీఆర్‌ అయిదుగురు ఎం.పీలు, పాతిక మంది ఎమ్మెల్యేలు. తెలంగాణ ఢిల్లీ పురవీధుల్లో ఊరేగింది. అదొక ప్రభంజనమై కదల బారింది. అదొక జాతీయ నినాదం అయింది. కానీ… నాలుగేళ్లలో అది నీరసడింది. ఇప్పుడొక ఇద్దరు + ఒక ఎంపీలు, చీలికలు పేలికలయిన తెలంగాణ. తెలంగాణ రాలేదు. ఒక అధినాయకుడి మనసులో పుట్టిన ఎత్తుగడలకు బలయింది తెలంగాణ. అదొక జూదానికి (అదీ మూడు ముక్కల్లాంటి జూదానికి) బలయింది తెలంగాణ. మరోసారి నమ్మకం విచ్చిపోయింది. తెలంగాణ మరోసారి నిలబడింది. కరీంనగర్‌లో తెలంగాణ పరీక్షకు నిలిచింది. ఎన్ని పరీక్షలు. ఎన్ని విజయాలు అపజయాలు. గాయపడింది తెలంగాణ. తల్లడిల్లింది తెలంగాణ.

నాయకత్వం నీరసపడి… ఎవరైతే కిరీటాలు తొడిగారో, ఎవరైతే అర్భకులను అధినాయకులుగా మలిచారో? ఆ జనాన్నే నిందలేసి బదనామ్‌ చేసినప్పుడు బెంగటిల్లి, బిక్క చచ్చింది తెలంగాణ. నిజమే… దేవేందర్‌ గౌడ్‌సాబ్‌! ఆత్మాభిమానం మంటగలిసింది కానీ… ఒక పార్టీ… రెండో పార్టీ.. మూడో పార్టీ… ఒక పరీక్ష. రెండో పరీక్ష. మూడో పరీక్ష అయినా… ఇంకా తెలంగాణ నిలబడే ఉన్నది. కానీ ఎన్నికలు, ఫలితాలు, మెజారిటీలు, సీట్లు చేసిన మోసానికి సమాధానం కోరుతున్నది తెలంగాణ. మూడోసారి… పార్టీలకు ఓట్లేసి గెలిపిస్తే తెలంగాణ వస్తుందా? ఈ ప్రశ్నకు జవాబుందా? నమ్మకం ఇచ్చే వారెవరు? మీరా? మరొకరా? తెలంగాణ నేల పొక్కిలయిన ఒక గాయపడిన ఆర్తగీతం.

అదొక ధ్వంసం అయిన ప్రయో గశాల. అదొక పోలేపల్లి సెజ్‌. కలెబడకుండా, నిలబడకుండా, విధ్వంసాన్ని నిలువరించకుండా… విడిగా ఎన్ని పార్టీ లొచ్చినా… సీట్లొచ్చినా… ‘ఊదుగాలది… పీరిలేవది.’ గౌడ్‌ సాబ్‌ నిజమే. ఊదు గాలాలన్నా పీరిలేవాలన్నా సబ్బండవర్ణాలను జమ చేసుకొని పీరీల గుండంల దుంకులాడాలె! ‘అస్సోయ్‌ ధూలా’ అనే ఆ నిప్పుల మీద నడిచే సాహసం కావాలె ఉందా… అస్సోయ్‌ ధూలా… తెలంగాణ త్యాగాన్నీ… బలిదానాన్నీ ఇచ్చి’ ఉన్నది. అది నెత్తురు ధారవోసి ఉన్నది. ఇప్పుడది ఫలితాన్ని కోరుతున్నది… అస్సోయ్‌ ధూలా… దుంకుత సూడు అలయ్‌ల…

source : aandhra jyothy 12 july 2008

వ్యాఖ్యలు»

No comments yet — be the first.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: