jump to navigation

Palamoor to Sri Lanka- Journey of a Journalist మే 3, 2008

Posted by M Bharath Bhushan in In News, Mahabubnagar, Telangana People, Telugu (తెలుగు).
trackback

B Muralidhar Reddy- A Success Story

నా అడ్రస్‌ … కేరాఫ్‌ లైబ్రరీ

ఏ పాత్రికేయుడికైనా విదేశాల్లో పనిచేయడమన్నది ఓ సవాలు. అందులోనూ నిత్యం సంక్షోభాలతో సతమతమయ్యే శ్రీలంక, పాకిస్థాన్‌ లాంటి దేశాల్లో సమాచార సేకరణ కత్తిమీద సాము. ‘ది హిందూ’ ప్రతినిధిగా దాదాపు ఆరేళ్లు పాకిస్థాన్‌లో పని చేసి, రెండేళ్లుగా శ్రీలంకలో ‘బాధ్యతలు నిర్వర్తిస్తున్న బైరెడ్డి మురళీధర్‌రెడ్డి పెద్ద స్కూళ్లలో చదువుకోలేదు. ఫస్టుక్లాసులు తెచ్చుకోలేదు. వారసత్వంగా అబ్బిన విద్యా అంటే … అదీ కాదు! చమట సిరాతో రాసుకున్న సక్సెస్‌ స్టోరీ ఆయనది. ఆ కథలోని మలుపులన్నీ ఆయన మాటల్లోనే …

బైరెడ్డి మురళీధర్‌రెడ్డి, ‘ది హిందు’ శ్రీలంక ప్రతినిధి

‘మీకు పాకిస్థాన్‌లో పనిచేయడానికి ఏమైనా అభ్యంతరమా?’ …. అని ఒకరోజు మా ఎగ్జిక్యూటివ్‌ ఎడిటర్‌ మాలినీ పార్థసారథి ఫోన్లో అడిగిన పుడు కలా నిజమా అన్నంత అపనమ్మకం. పాకిస్థాన్‌లాంటి దేశంలో పనిచేయడం ఏ పాత్రికేయుడి జీవితంలో అయినా ఓ మలుపే. అది నా విషయంలో ఇంత తొందరగా నిజమవుతుందని నేనెప్పుడూ ఊహించలేదు.

దుమ్ముపట్టిన ఫైళ్లు, నిద్రమత్తు ఉద్యోగులు, రంగు వెలిసిన గోడలు … అన్ని సర్కారు కార్యాలయాల్లాంటిదే అదీ! బయట ‘డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఇండస్ట్రీస్‌’ అనే బోర్డొకటి వేలాడుతుండేది. ఆ వింత ప్రపంచంలో నేను ఎల్డీసీ ఉద్యోగం వెలగబెట్టేవాణ్ని. అంతా గందరగోళం. ఎవరు ఎప్పుడొస్తున్నారో తెలియదు, ఎప్పుడు వెళ్తున్నారో తెలియదు. ఏం చేస్తున్నారన్నది అస్సలు తెలియదు. అప్పుడే బద్రుకా కాలేజీలో బీకాం (ఆనర్స్‌) పాసై ఉద్యోగంలో చేరిన నాకు అదంతా అర్థం కావడానికి ఎంతో కాలం పట్టలేదు. అంత నిర్లిప్తంగా, అంత మూసగా బతకడం తనకిష్టం లేదని నా ఇరవై ఏళ్ల వయసు తిరుగుబాటు చేసింది. నా ఆలోచనలు వేరు. నా ప్రపంచం వేరు. నేను చదివింది వేరు. పాత్రికేయుడు కావాలన్నది నా చిరకాల వాంఛ. రెండేళ్లు గడిచేసరికి ఇరవై ఏళ్లు పనిచేసినంత భారంగా అనిపించింది. ఇక అక్కడ ఉండలేనని అర్థమైంది. ఉద్యోగానికి రాజీనామా చేశాను. గుండెనిండా ఆత్మవిశ్వాసంతో ఢిల్లీ రైలు ఎక్కాను. చేతిలో మాత్రం చిల్లిగవ్వ కూడా లేదు. ఇది నా జీవితంలో తొలి మలుపు.

ఢిల్లీ మహానగరంలో ఎవర్ని కలవాలో తెలియదు, ఎక్కడుండాలో తెలియదు. బిక్కమొహం వేసుకుని వీధులెంబడి తిరిగాను. ఓ దశలో బేలతనం ఆవరించింది. ఇక వెనక్కి వచ్చేసి వైఫల్యాన్ని అంగీకరించాలనుకున్నా. అంతలోనే ఓ ప్రభుత్వేతర సంస్థతో పరిచయం కలిగింది. విపత్తు నివారణకు కృషిచేస్తుందా సంస్థ. వాళ్లు దయతలిచి నాకో పార్ట్‌టైమ్‌ ఉద్యోగం ఇచ్చారు. పొద్దున్న అల్పాహారం, రాత్రి భోజనం పెట్టేవారు. అక్కడే మకాం. ఆ పరిస్థితుల్లో అంతకంటే ఏం కావాలి? అలా డిప్లొమా ఇన్‌ జర్నలిజం కోర్సు పూర్తి చేశాను. వెంటనే వామపక్ష భావాల పాత్రికేయుడు నిఖిల్‌ దా (నిఖిల్‌ చక్రవర్తి) నడుపుతున్న ‘మెయిన్‌ స్ట్రీమ్‌’ వార పత్రికలో ప్రూఫ్‌రీడర్‌ ఉద్యోగం దొరికింది. జీతం నెలకు నాలుగు వందల ఇరవై అయిదు. ఆ సంపాదనతో ఢిల్లీ మహానగరంలో బతకడం చాలా కష్టం. కొన్నిసార్లు బస్‌ టికెట్లకి చిల్లర పైసలు కూడా ఉండేవి కాదు. మంచినీళ్లతో కడుపు నింపుకునేవాణ్ని. ఏడాది పాటు కష్టాలు తప్పలేదు. సీనియర్‌ పాత్రికేయులు కె.వి.ఎస్‌.రామశర్మ గారితో పరిచయం నా జీవితంలో మరో మలుపు. ఆయన ‘నేషనల్‌ హెరాల్డ్‌’లో బ్యూరో చీఫ్‌గా పనిచేసేవారు. ఆయన రెండో ఆలోచన లేకుండా నాకు ఉద్యోగమిప్పించారు. పట్టుమని పాతికేళ్లు కూడా లేని కుర్రాడికి ఇది గొప్ప అవకాశమే. పేరుకది కాంగ్రెస్‌ పత్రికే అయినా … పని వాతావరణం మాత్రం మిగతా పత్రికల్లానే ఉండేది. అక్కడ నేను రాసిన మొదటి వార్త ఇప్పటికీ గుర్తుంది … అది అచ్చయిన రోజు నాకు నిద్ర కూడా పట్టలేదు. ఆ వార్త వెనుక ఓ చిన్న కథ ఉంది. ‘మెయిన్‌ స్ట్రీమ్‌’ నుంచి బయటికొచ్చాక కొత్త ఉద్యోగంలో చేరడానికి కాస్త సమయం ఉండటంతో హైదరాబాద్‌ వచ్చేశాను. ఆగస్టు పదిహేనున హెరాల్డ్‌లో చేరాల్సి వుండటంతో … ఓ రోజు ముందు సికింద్రాబాద్‌ స్టేషన్లో రైలెక్కాను. ఏపీ ఎక్స్‌ప్రెస్‌ చాలా సందడిగా ఉంది. ఎటు చూసినా రాజకీయ వాతావరణం.

ఎన్టీఆర్‌ సర్కారును గవర్నర్‌ బర్త్తరఫ్‌ చేయడంతో నెలకొన్న ఉత్కంఠ అది. తెలుగుదేశం ఎమ్మెల్యేలంతా రాష్ట్రపతి ముందు బలప్రదర్శన కోసం ఢిల్లీ వెళ్తున్నారు. రక్షణ వలయం మధ్య అంతా రైలెక్కారు, వెనకాలే విస్కీ బాటిళ్లు, తినుబండారాలు. పన్నెండు గంటలు ఆలస్యంగా (దేశం ఎమ్మెల్యేలు రాష్ట్రపతిని సకాలంలో కలవకుండా కాంగ్రెస్‌ పెద్దలే ఆ పని చేశారని తర్వాత తెలిసింది) బండి గమ్యానికి చేరింది. నేను నేరుగా నేషనల్‌ హెరాల్డ్‌ ఆఫీసుకెళ్లాను. సికింద్రాబాద్‌ స్టేషన్‌ నుంచి ఢిల్లీకి చేరేదాకా …. రైల్లో ఎమ్మెల్యేల హంగామా గురించి రామశర్మ గారికి పూసగుచ్చినట్టు చెప్పాను. ‘నువ్వు చెప్పిందంతా ఓ రిపోర్టులా రాయి’ అంటూ ఓ టైప్‌ రైటర్‌ నా ముందుకు తోశారాయన. పని ముగించుకుని అర్ధరాత్రి నా గదికి చేరుకున్నాను. మంచంమీదైతే వాలాను కానీ, ఎంతకీ నిద్రపట్టదే! పేపర్లో వార్త చూడగానే తెలుగుదేశం కార్యకర్తలు నామీద ఎక్కడ దాడిచేస్తారో అన్న భయం పట్టుకుంది. ‘విస్కీ సీసాలతో ఢిల్లీ యాత్ర’ అనే అర్థం వచ్చే శీర్షికతో మొదటి పేజీలో పెట్టారా వార్తని. నా బైలైన్‌ కూడా ఇచ్చారు. అదృష్టం బావుండి, నేను ఊహించినట్టేం జరగలేదు. ఎన్టీఆర్‌ను తిరిగి పీఠం మీద కూర్చోబెట్టడంతో కథ సుఖాంతమైంది. నేను కూడా హాయిగా ఊపిరి పీల్చుకున్నా. ఇదో మలుపు కాదు కానీ, రెండున్నర దశాబ్దాల పాత్రికేయ జీవితంలో నేను సంపాదించుకున్న జ్ఞాపకాల ఆస్తుల్లో ఇదీ ఒకటి. ఆ తర్వాత హెరాల్డ్‌ ప్రతినిధిగా చాలా వార్తలు రాశాను. చాలా రాజకీయ పరిణామాలు కవర్‌ చేశాను. 1984 ఎన్నికల్లో రాజీవ్‌గాంధీతో కలిసి పర్యటించడం ఓ మంచి అనుభవం. 1986లో ఆర్థిక కష్టాలతో హెరాల్డ్‌ తాత్కాలికంగా మూతపడింది. ఈ చేదు అనుభవం నా జీవితంలో మరో మలుపుకు కారణమైంది. అప్పుడే ‘హిందూ’ ఢిల్లీ ఎడిషన్‌ ప్రారంభించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. సీనియర్‌ పాత్రికేయులు పద్మనాభన్‌గారి చొరవతో నాకు ఆ పత్రికలో ఉద్యోగం వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా ‘హిందూ’తో నా అనుబంధం కొనసాగుతూనే ఉంది.

ఎక్కడో మహబూబ్‌నగర్‌ జిల్లాలోని ఓ మారుమూల పల్లెటూళ్లో పుట్టిన కుర్రాడు … లక్షణమైన ప్రభుత్వ ఉద్యోగాన్ని వదులుకుని ఢిల్లీకి రావడం ఏమిటి? పార్ట్‌టైమ్‌ ఉద్యోగాలు చేసుకుంటూ జర్నలిజం కోర్సు చేయడం ఏమిటి? ‘నేషనల్‌ హెరాల్డ్‌’ విలేఖరిగా కీలకమైన రాజకీయ పరిణామాల్ని రిపోర్ట్‌ చేయడం ఏమిటి? ఆ తర్వాత ‘హిందూ’ ప్రతినిధిగా విదేశాలకు వెళ్లడం ఏమిటి? .. ఎక్కడి నుంచి వచ్చిందీ ధైర్యం? ఎవరిచ్చారీ భరోసా? అలాగని నేనేమైనా చురుకైన విద్యార్థినా అంటే, అదీ కాదు. ప్రతి తరగతిలో అత్తెసరు మార్కులే. చదివిందంతా సర్కారీ స్కూళ్లలోనే. మరి, ఈ మలుపులకు దిక్సూచీ ఏది? …. పుస్తకం, అవును పుస్తకమే నాకంత ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. ఇన్ని మలుపులకు కారణమైంది. చిన్నప్పటి నుంచీ నేను పుస్తకాల పురుగునే. హైదరాబాద్‌లోని ప్రతి సర్కారు లైబ్రరీ నాకెరుకే. అందులో ఏ పుస్తకం ఎక్కడుందో కూడా నాకెరుకే. అక్కడ నేను చదవని పుస్తకం లేదు. నేను తడమని పేజీ లేదు. రోజూ ఏదో ఓ లైబ్రరీలో రెండుమూడు గంటలైనా గడపందే నాకు తోచేది కాదు. పుస్తకాలు ఎటూ చదివేవాణ్ని కాని, దినపత్రికలు, మ్యాగజైన్లంటీ మరీ ఇష్టం. ముఖ్యంగా ‘బ్లిట్‌’్జలో రుస్సీ కరంజియా, ‘మదరిండియా’లో బాబూచంద్‌ పటేల్‌, ‘కారవాన్‌’లో విశ్వనాథన్‌, ‘ఇల్లస్ట్రేటెడ్‌ వీక్లీ’లో కుష్వంత్‌సింగ్‌, ‘సండే’లో అక్బర్‌ … వంటి పాత్రికేయుల శైలి నాకు బాగా నచ్చేది. వాళ్లంతా నా హీరోలు! ఆ అడుగుజాడల్లో నడవాలనే తపనే నన్ను ఖాళీ జేబుతో ఢిల్లీకి పంపింది.

పాత్రికేయ జీవితంలో ఎన్నో ఒత్తిళ్లు ఉంటాయి. ప్రలోభాలు ఉంటాయి. బెదిరింపులూ ఉంటాయి. వాటన్నిటినీ తట్టుకుని నిజాయితీగా పనిచేయడం ఓ సవాలు. ఇరవై రెండేళ్ల వృత్తి జీవితంలో నేనెక్కడా రాజీ పడలేదు. ఏ తాయిలాలకూ లొంగలేదు. నా స్కూలు చదువు కొంతకాలం గద్వాల్‌ తాలూకాలో, కొంతకాలం కర్నూలు జిల్లాలోని గార్గేయపురంలో సాగింది. ఆ తర్వాత హైదరాబాద్‌లోని మలక్‌పేట హైస్కూలులో చేర్పించారు. మా క్వార్టర్స్‌కు కూతవేటు దూరంలోనే బడి. అక్కడ బద్దం భాస్కరరెడ్డిగారు (చెరబండ రాజు) మాకు తెలుగు టీచర్‌. ఆయన విప్లవ రచయితల సంఘం సభ్యుడు. నామీద ఆయన ప్రభావం చాలా ఎక్కువ. ఆయన పాఠాలు నన్ను మంత్ర ముగ్ధుడిని చేసేవి. ఓసారి ప్రభుత్వం భాస్కరరెడ్డిగారి రాతల్ని నిషేధించింది. ఆయన్ని కూడా ఊచలవెనక్కి తోసింది. మాస్టారు విడుదలయ్యాక స్వాగతం పలకడానికి … వందల మంది విద్యార్థులు, టీచర్లు స్కూలు ఆవరణలో వరుస కట్టిన దృశ్యం నా కళ్లముందు ఇంకా కదలాడుతూనే ఉంది. అందరి కళ్లల్లోనూ తడి. నా దృష్టిలో ఆయన ఇప్పటికీ ఓ హీరో. సంక్షోభ సమయాల్లో గుండె దిటవు చేసుకోవాల్సి వస్తే మాత్రం గుర్తొచ్చేది అమ్మే! నాకు తెలిసి అమ్మంత ధైర్యవంతులు ఇంకెవరూ ఉండరు. నాన్న నుంచి విడిపోయాక మమ్మల్ని పెంచడానికి తనెంత కష్టపడింది! పురుషాధిక్య ప్రపంచంలో ఎంతో ధైర్యంగా నెగ్గుకొచ్చింది!

బాబ్రీ మసీదు కూల్చివేత కవరేజీ ఏ పాత్రికేయుడికైనా మరచిపోలేని అనుభవమే. ‘హిందూ’ యాజమాన్యం దాన్ని కవర్‌ చేసే బాధ్యత నాకు అప్పగించింది. డిసెంబరు ఒకటో తేదీకల్లా నేను అయోధ్య చేరుకున్నా. దాదాపు పన్నెండు రోజులు అక్కడే మకాం. సంఘ్‌ పరివార్‌ అంత పని చేస్తుందని మేమెవ్వరూ ఊహించలేదు. ఇదీ ఓ ప్రచార ఆర్భాటమే అనుకున్నాం. కానీ డిసెంబరు 6 ఉదయం పదిగంటలకు పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. పరివార్‌ కార్యకర్తల కళ్లు మామీద పడగానే వారి దాడుల్ని తప్పించుకోడానికి మేం కలాలు, కాగితాలు పడేసి ‘జై శ్రీరాం’ అంటూ తలో దిక్కుకు పరుగుతీశాం.

‘మీకు పాకిస్థాన్‌లో పనిచేయడానికి ఏమైనా అభ్యంతరమా?’ …. అని ఒకరోజు మా ఎగ్జిక్యూటివ్‌ ఎడిటర్‌ మాలినీ పార్థసారథి ఫోన్లో అడిగిన పుడు కలా నిజమా అన్నంత అపనమ్మకం. పాకిస్థాన్‌లాంటి దేశంలో పనిచేయడం ఏ పాత్రికేయుడి జీవితంలో అయినా ఓ మలుపే. అది నా విషయంలో ఇంత తొందరగా నిజమవుతుందని నేనెప్పుడూ ఊహించలేదు. మరో ఆలోచన లేకుండా ‘సరే’ అని చెప్పాను. అలా చెప్పాక …. ఒకటికి పదిసార్లు ఆలోచించాను. ఆ బాధ్యతలకు న్యాయం చేయగలనా అన్నదే నా భయం. నా ఆరేళ్ల పాకిస్థాన్‌ ఉద్యోగ జీవితంలో ఎత్తుపల్లాలైతే ఉండొచ్చుకానీ … మొత్తానికి సంతృప్తికరంగానే సాగింది. సాధారణంగా ఏ పాత్రికేయుడినీ అక్కడ మూడేళ్లకు మించి కొనసాగించరు. నన్ను మాత్రం మరికొంత కాలం కొనసాగమని ఎడిటర్‌ ఎన్‌.రవి కోరడంతో …. మొత్తం ఆరేళ్లు అక్కడే ఉన్నాను. పాకిస్థాన్లో ఉండే ఇద్దరు భారతీయ విలేకరుల్లో నేనొకడిని అన్నమాట. రెండో వ్యక్తి పి.టి.ఐ. పాత్రికేయుడు. పేరుతో సహా వచ్చేది మాత్రం నా వార్తలే. అందులోనూ ‘హిందూ’ లాంటి పత్రికలో వచ్చే వార్తల కోసం, విశ్లేషణల కోసం ఇరు దేశాల అత్యున్నత స్థాయి వర్గాలు ఆసక్తితో ఎదురుచూసేవి. ప్రస్తుతం అందాల దీవి శ్రీలంకలో ఉద్యోగం. రోజూ ఏదో ఓ సంఘటన జరుగుతూనే ఉంటుంది. వాటన్నింటినీ ‘హిందూ’ పాఠకులకు అందించే పనిలో ఉన్నాను.

Source: Sunday Desk, Andhra Jyothy, 4 May 2008

ప్రకటనలు

వ్యాఖ్యలు»

No comments yet — be the first.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: