jump to navigation

Battle of Ellampalli oustees ఏప్రిల్ 2, 2008

Posted by Telangana Utsav in Appeals, Godavari, Karimnagar, livelihoods, Telangana People, Telugu (తెలుగు).
trackback

గోలివాడ బుచ్చమ్మ… అరవై ఏండ్లు… భర్త లింగయ్య మంచిర్యాల ఎసిసి సిమెంట్‌ కంపెనీలో పనిచేసి రెండేళ్ల క్రితం చనిపోయాడు… శవాన్ని వారి మామిడితోట తలాపునే పూడ్చిపెట్టి సమాధి కట్టారు…

బుచ్చమ్మకు పదకొండున్నర ఎకరాల్లో మామిడి తోట ఉంది. ఆ తోట స్థలాన్ని భర్త కంపెనీలో నౌకరి చేసేటప్పుడు ముర్ముర్‌ గాండ్లోల్ల దగ్గర బుచ్చమ్మ కొనుక్కున్నది… తోటలో పదేళ్ల వయస్సున్న 420 మామిడి చెట్లు ఉన్నయ్యి. పోయిన సంవత్సరం రూ.1.50 లక్షల మామిడికాయల దిగుబడి వచ్చింది… మాములు మామిడితోట కాదు… బంగినపల్లి మామిడిపండ్ల తోట అది… చిత్తాపురం, మామిడిగట్టు ప్రాంతాలు తిరిగి 600 మొక్కలు పెడితే సగం చచ్చినయి… మళ్లీ 200 మొక్కలు పెట్టారు… గంగ(గోదావరి) కు ఇంజన్‌ పెట్టి నీళ్లు పారిచ్చుకుని ఆ చెట్లను బుచ్చమ్మ బతికిచ్చుకుంది… ‘ పిల్లగాండ్లను సాదుకున్నట్లు ఈ చెట్లను పెంచుకున్నా…’ అని చెబుతుంటుంది బుచ్చమ్మ…

ఈబుచ్చమ్మ… ఈ మామిడి తోట… తోటలో భర్త సమాధి… ఇదంతా ఏమిటనుకుంటున్నారా…
రాష్ట్రాన్ని హరితాంధ్రప్రదేశ్‌గా మార్చేందుకు జరుగుతున్న జలయజ్ఞంలో బుచ్చమ్మ జీవితం, కుటుంబం, బతుకు పూర్తిగా మునిగిపోతున్నాయి. 

ఇప్పుడు అన్నీ కోల్పోతున్నందువల్ల తనకు సరైన నష్టపరిహారం ఇవ్వమని రెండేళ్లుగా బుచ్చమ్మ సర్కారుతో యుద్ధం చేస్తున్నది… అలిగి ఎల్లంపల్లి ప్రాజెక్టు దగ్గరున్న గోదావరి గట్టు మీద కూర్చుంది… ప్రాజెక్టులో మునుగుతున్న ఊళ్లకు ఊళ్ల జనం తమ పొలాలకు, చేన్లకు ప్రభుత్వం ఎంత ఇస్తే అంత తీసు కుంటే… ఇది నా కష్టార్జితం… నా హక్కు… నాకు జరిగే నష్టం కట్టివ్వకపోతే సచ్చేదాకా పోరాడుతానని మొండికేసి కూర్చుంది ఈ అరవై ఏండ్ల ముసలి అవ్వ. తన భర్త 60 ఏండ్ల సంపాదన… తన ముగ్గురు కొడుకుల, వారి కుటుంబాల భవిష్యత్‌ అయిన ఈ మామిడితోటకు ‘ఆవలొడ్డు ధర కట్టివ్వాలని రెండేళ్లుగా ప్రభుత్వాన్ని అడుగుతోంది. (ఆవలొడ్డు ధర అంటే శ్రీపాద ప్రాజెక్టు ముంపుకు గురవుతున్న కరీంనగర్‌ జిల్లా భూముల కంటే ఆదిలాబాద్‌జిల్లా భూములకు ఎకరానికి రూ.20వేలు అదనంగా నష్టపరిహారం ఇచ్చారు.) ఆ ధరే కావాలని బుచ్చమ్మ కొట్లాడుతున్నది… ఈవలొడ్డుకు నష్టపరిహారం పొందిన మగాళ్లకంటే ధైర్యంగా బుచ్చమ్మ తన భూమి నష్టపరిహారం కోసం పోరాటం చేస్తున్నది.

రెవెన్యూ అధికారులు ఎన్ని రకాల జిమ్మిక్కులు చేసినా ‘కుదరదు… సారు…’ అని తెగేసి చెబుతున్నది… అంతే కాదు ఇంకా 50 ఏళ్ల దాకా దిగుబడి ఇచ్చే చెట్టుకు కనీసం పదేళ్ల పంట నష్టమైనా తనకు కట్టివ్వా లంటున్నది… రాత్రికి రాత్రి తోటను సర్కారోళ్లు ఏమైనా చేస్తారనే భయంతో కొడుకులను రాత్రి కూడా తోటకు కావలి పెడుతున్నది. రోజంతా బుచ్చవ్వ తోటలోనే ఉంటున్నది… అయితే తోటకు వంద మీటర్ల దూరంలోనే ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మాణం గేట్లు దాటింది… వచ్చే వానకాలం నీళ్లు ఈ తోటను ముంచేసే ప్రమాదం కనిపిస్తున్నది. ఒకసారి తోట మునిగితే ముసల్ది ఎంత ఇస్తే అంత నష్ట పరిహారం తీసుకుంటుందని ప్రభుత్వ అధికారులు బుచ్చవ్వ డిమాండ్‌ను, వేదనను పట్టించుకోవడం లేదు. మేమిచ్చేది ఇస్తాం.. తీసుకుంటే తీసుకో… లేకుంటే లేదంటున్నారు….’కోటి రూపాయలు ఇస్తానన్నా నేను తీసుకోవడం లేదని నన్ను బదనాం చేస్తున్నారు కొడుకా’… అంటూ బుచ్చమ్మ వేదన పడుతున్నది. ‘నాకు గంత ఆపేక్ష ఉందా… చెప్పు..! నాకు జరిగే నష్టం కట్టిస్తే చాలు’..! అని అమాయకంగా అంటున్నది… తోట మునిగితే ఎట్లా అమ్మా అంటే… ‘తోటతో పాటు నేనూ మునుగుతా… నా ఉసురన్నా తగలదా బిడ్డా’… అంటున్నది బుచ్చమ్మ…

-యం. వంశీ ఆన్‌లైన్‌, గోదావరిఖని

source : aandhrajyothy 2 april 2008

ప్రకటనలు

వ్యాఖ్యలు»

No comments yet — be the first.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: