jump to navigation

Regional Inequalities in Education – Chukka Ramaiah ఫిబ్రవరి 26, 2008

Posted by Telangana Utsav in Essays, Fazal Ali Commission, Telangana, Telugu (తెలుగు).
trackback
విద్యలోనూ ప్రాంతీయ వివక్షే!
– చుక్కా రామయ్య
.
కాలంతో పాటుగా వస్తోన్న అనేక రకాల కొత్త చదువులను తెలంగాణ యువత అందుకోలేకపోవడానికి కారణమేమిటి? దారిద్య్రం. తెలంగాణ వెనుకబాటుతనానికి, లేదా వెనుకబడేసిన సందర్భానికి కారణం ఆ ప్రాంతం లో తాండవిస్తున్న పేదరికాన్ని నామరూపాలు లేకుండా చేయలేకపోవడమే. నవాబులు, దొరల ఆధిపత్యం కింద శతాబ్దాలుగా నలిగిపోయిన తెలంగాణుల దుస్థితి ‘పోలీసు చర్య’ అనంతరం కూడా తొలగిపోలేదు. ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణరావు హైదరాబాద్‌ రాష్ట్రాన్ని సమైక్య ఆంధ్రలో విలీనం చేస్తూ సంతకం చేసిన ఐదు దశాబ్దాల తరువాత కూడా తెలంగాణలో విద్య ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది.
.
ఆంధ్రప్రదేశ్‌ ఆవిర్భవించాక తెలంగాణ అభివృద్ధికి సమైక్యరాష్ట్ర పాలకులు తగు శ్రద్ధ చూపారా? విద్యారంగంలో తెలంగాణకు జరుగు తోన్న అన్యాయాన్ని ఎవరు ఎప్పుడు ఏ రకంగా భర్తీ చేస్తారు? నిరంకుశ భూస్వామ్య వ్యవస్థ నుంచి బయ టపడటానికి తెలంగాణులు సాయుధ పోరాటం చేశారు. ఆ పోరాటానికి నాయకత్వం వహించిన ఆంధ్ర మహాసభ ‘పేదరికం పోతేనే సమాజం లోని అన్ని వర్గాల బాలలు చదువుకొనే అవకాశం వస్తుందని’ చెప్పింది. తమ బిడ్డలకు విద్య చెప్పించలేని తల్లితండ్రులుపేదరికంలో ఉన్నట్టే లెక్క. ఆంధ్రప్రదేశ్‌ నేర్పాటు చేసే సమయంలో జస్టిస్‌ ఫజల్‌అలీ కమిషన్‌ తెలంగాణ విషయంలో ఏ రకమైన భయాందోళనలు వ్యక్తం చేసిందో అవి (నేడు) పూర్తిగా నిజమయ్యాయి
.
దారిద్య్రం, కులాధిపత్యంతోపాటు తెలంగాణపై ఇతర ప్రాంతాలవారి రాజకీయ ఆధిపత్యం పెరిగింది. దీని ప్రభావం విద్యారంగంపై కూడా బలంగా పడింది. తెలంగాణలో మొత్తం ఎయిడెడ్‌ కళాశాలలు ఎన్ని ఉన్నాయో ఒక్క గుంటూరు జిల్లాలో అన్ని ఎయిడెడ్‌ కళాశాలలు ఉన్నాయి! ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలలో ఈనాడు ఇంజనీరింగ్‌ పట్టభద్రులతో పాటు నర్సింగ్‌ కోర్సులు పూర్తిచేసిన వారికి కూడా విపరీతమైన డిమాండు ఉన్నది. కానీ తెలంగాణ ప్రాంతం నుంచి నర్సింగ్‌ కోర్సు లు చేసినవారు చాలా తక్కువమంది ఉన్నారు. అదే ఆంధ్రప్రాంతంలో అనేకరెట్లు ఎక్కువ మంది ఉన్నారని ప్రభుత్వ లెక్కలే తెలియజేస్తున్నాయి. మరి ఆంధ్ర-తెలంగాణ ప్రాంతాల మధ్య ఉన్న అసమానతలను పూడ్చడానికి బదులుగా పాలకులు వాటిని మరింతగా పెంచుతున్నారు
.
మొదట విద్యారంగం నుంచి ఈ అసమానతలను తొలగిస్తే, అది, ప్రాంతాల మధ్య ఉన్న వైషమ్యాలను కాస్తంతైనా తగ్గించడానికి దోహదపడవచ్చు. తల్లితండ్రుల పేదరికాన్ని తొలగించడానికి బదులుగా పాలకులు సర్వశిక్షా అభియాన్‌ ద్వారా చదువుకుంటే దారిద్య్రం పోతుందని పాలకులు చెబుతున్నారు. సర్వశిక్షా అభియాన్‌ వాళ్ళు అక్షరాలు చెప్పడమే కాదు, తెలంగాణ పిల్లలు బడికి రాకపోవడానికి కారణమైన ఆర్థిక అసమానతలను కూడా తొలిగించాలి. అలా కాకుండా ‘పిల్లలకు అక్షరాలు చెప్పడమే మా బాధ్యత, వారి పేదరికాన్ని తొలగించడం మా బాధ్యత కాదు’ అంటే సరిపోదు. అందుకే చదివితేనే దరిద్రం పోతుందని ‘సర్వశిక్షా అభియాన్‌’ చెప్పటాన్ని పలువురు విద్యావేత్తలు ఒప్పుకోవటం లేదు
.
స్వాతంత్య్రం వచ్చిన తరువాత తెలంగాణకు విద్యారంగంలో ఏ రకమైన అన్యాయం జరిగిందో ఇంతవరకు ఏనాడు పాలకులు సమీక్షించిన పాపాన పోలేదు. పైగా తెలంగాణ ప్రాంతంలో కొత్తగా నెలకొల్పిన విశ్వవిద్యాలయాలకు సంబంధించి భవనాల నిర్మాణం మొదలైన ప్రాథమిక వసతుల కల్పన దశలోనే ఎంతో అలసత్వం చూపుతున్నారు. నిధుల మంజూరులో వివక్ష చూపుతున్నారు. కడపలో వేమన విశ్వవిద్యాలయం అన్ని రకాల నిర్మాణ పనులు పూర్తిచేసుకొని ముందుకు సాగుతుంటే, నిజామాబాద్‌లోని తెలంగాణ విశ్వవిద్యాలయా నికి ఇప్పటికీ భవన వసతే సమకూరలేదు. ఉద్యోగుల నియామకమూ జరగలేదు
.
అలాగే నల్లగొండలో మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయానికి శంకుస్థాపనచేసి కొబ్బరికాయ కొట్టడం మినహా ఎటువంటి పురోగతిలేదు. తెలంగాణ వెనుకబా టుతనం లేక వెనుకబడేసిన తనం కారణంగా ఈ ప్రాంత విద్యారంగానికి అధిక నిధులు మంజూరు చేయవల్సిన అవసరమెంతైనా ఉంది. నిజాం పాలనలో తెలంగాణలో తెలుగు చదు వుకోకుండా చేశారు. ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడ్డాక తిరిగి తెలంగాణ విద్యారంగంపై కానరాని ఆధిపత్యం కొనసాగుతోంది. పాలకులు ఈ ప్రాంతంపై ఎన్నో వివక్షలు చూపించారు. అదే పరిస్థితి నేటికిని ఈ ప్రాంతాన్ని వెంటాడుతుంది. ఫ్యాబ్‌ సిటీని ఏర్పా టుచేయడం, సైన్స్‌ కాంగ్రెస్‌ సభలు నిర్వహించడం రంగారెడ్డి జిల్లాలోనే. మరి అదే జిల్లా వెనుకబాటుతనానికి ఉదాహరణగా ఉంది! బాణామతులు, చేతబడులు, ఆత్మహత్యలు జరుగుతున్నాయి
.
ఆ జిల్లా, ఆ ప్రాంత ప్రజలు తాము ఎదుర్కొంటున్నది ఏ రకమైన వివక్షో, ఆలస్యంగానైనా పసికట్టగలుగుతారు. ఇకనైనా బలవంతుణ్ణి, బలహీనుడ్ని ఒకేగాటన కట్టివేయకండి. ఆంధ్ర ప్రాంతంపై నాకు ఏ రకమైన శత్రుత్వం లేదు. కానీ తెలంగాణ ప్రాంతానికి జరిగిన అన్యాయాన్ని మాత్రం ఈ నేలపై పుట్టిన వాడిగా ప్రశ్నిస్తాను. విద్యారంగంలో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని వేయిసార్లు ఎలుగెత్తి చాటుతాను. నీళ్ళు, చదువు, భూమి అందరికి సమంగా పంచాలన్న ఏ కాగితంపైన అయినా నేను సంతకం చేస్తాను. పైపైపూతలతో ప్రాంతాల మధ్య, మనుషుల మధ్య ఉన్న ఆధిపత్య భావజాలాలు మారవు. అభివృద్ధి కిందినుంచి జరగాలి. అప్పగింతలు తర్వాత ఎవరూ పట్టించుకోనట్లు తెలంగాణ ‘పెద్ద మనుష్యుల ఒప్పందం’ తరువాత దగాకు గురైంది
.
source :andhra jyothy 25th Feb 2008
ప్రకటనలు

వ్యాఖ్యలు»

1. అనామకం - ఏప్రిల్ 30, 2010
2. Chandramouli - ఫిబ్రవరి 8, 2012

Telangana koti rathanala veena


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: