jump to navigation

People’s Movement for Telangana vis-a-vis- Political Parties – A Comment జనవరి 23, 2008

Posted by Telangana Utsav in Articles, Six Point Formula, Telangana, Telugu (తెలుగు).
trackback

 అణచినకొద్దీ రగులుతున్న ‘తెలంగాణ’

వెల్చాల జగపతిరావు

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి దాదాపు ఐదు దశాబ్దాల చరిత్ర ఉంది. ఒకప్పుడు ఇది ‘హమీల’ ఉల్లంఘనకు వ్యతిరేక ఉద్యమం. ఇంకొకప్పుడు వివక్షకు వ్యతిరేకంగా, సమతుల్యానికి, సమభాగస్వామ్యం కోసం చేసిన న్యాయబద్ధమైన పోరాటం. మరొకప్పుడు రాజ్యాంగ హక్కులకు రగిలిన ప్రజాందోళన. తెలంగాణలో జరిగిన ప్రతి ఉద్యమం వెనుక ఒక బలీయ కారణం ఉంది. చెల్లని ఒప్పందాలు, నెరవేరని హామీలు, అమలు చేయని మార్గదర్శక సూత్రాలు, రద్దుచేసిన ‘ముల్కీ రూల్స్‌’, తెలంగాణ ప్రాంతీయ కమిటీ, తెలంగాణ అభివృద్ధి మండలి రద్దులు, నీరూ, నిధుల పైన దురాక్రమణ, వనరుల వాడకంలో దగా- ఇంకా ఎన్నెన్నో కారణాలు. ఐదు దశాబ్దాలుగా తెలంగాణ సంఘర్షణ నిరంతరంగా కొనసాగింది. విద్యార్థులు, ఉద్యోగులు ఆందోళనకు చొరవచూపారు. ప్రజాప్రతినిధులు చట్టసభల్లో తెలంగాణ ప్రజల వాణిని విన్పించారు. సదస్సులు, సమావేశాలు, చర్చలు, పుస్తకాల ప్రచురణ, పాటల ద్వారా తెలంగాణ రాష్ట్ర నినాదం ఇంటింట మారుమ్రోగింది.
1990-95 సంవత్సరాల మధ్య శాసనసభలో ‘తెలంగాణ అఖిలపక్ష శాసనసభ్యుల ఫోరం’ ఏర్పడ్డది. మజ్లిస్‌, బిజెపి, సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్‌ తెలు గుదేశం ఎమ్మెల్యేలు ఒకే వేదికపై కలిసి తెలంగాణకు సం బంధించిన ప్రతి సమస్యపై ‘ఆరా’ తీసి జరిగిన, జరుగు తున్న అన్యాయాన్ని ఎత్తి చూపారు. తెలంగాణ వ్యతిరేక నిర్ణయాలను ఎండగ ట్టారు. ఈ ‘ఫోరం’ సభ్యులు ఢిల్లీ వెళ్ళి రాష్ట్రపతి, ప్రధాన మంత్రికి మెమోరాండంలు సమర్పించారు. శాసనసభలో ముఖ్యమంత్రితో నిర్దిష్టమైన హమీలు పొందారు. ఆనాటి పాలకపక్షం ఎమ్మెల్యేలు కూడా ప్రభుత్వాన్ని ఎదిరించారు. ఎవరికి వారికి సొంత ఎజెండా ఉన్నా ప్రతి ఒక్కరూ తెలం గాణ సమస్యతో మమేకమయ్యారు. వేరు కుంపట్లు పెట్టుకొని తెలంగాణ ఉద్యమాన్ని నిర్వీర్యం చేయలేదు. ‘తెలంగాణ రాష్ట్ర సమితి’ (తెరాస) ఏర్పడి నాలుగు సం వత్సరాలు గడిచిపోయాయి. ఆ పార్టీ వ్యవస్థాపకుడు కె. చంద్రశేఖర రావు తన మాట చాకచక్యంతో తెలంగాణ ఉద్యమానికి కొంత స్ఫూర్తిని ఇచ్చారు.
సభలు, సమావేశాలు పెట్టి జనాన్ని సమీకరించారు. జాతీయ స్థాయిలో కొంతవరకు తెలంగాణ విషయాన్ని ‘లాబీయింగ్‌’ ద్వారా వెలుగు లోకి తెచ్చారు. ఐదు దశాబ్దాల ఉద్యమ చైతన్యం పెంపొందించిన తెలంగాణ సెంటిమెంటు తెరాసకు వడ్డించిన విస్తరిలా సంక్రమించింది. ఉవ్వెత్తున లేచిన ఉద్యమానికి తబ్బిబ్బైన చంద్రశేఖరరావు తెలంగాణకు తానే ‘ఠేకేదారు’ నని విర్రవీగి తెలంగాణ ఉద్యమ స్వరూపాన్ని సమూలంగా మార్చేశాడు. తెలంగాణ ఉద్యమం వెనుక అన్ని పార్టీల కార్యకర్తలు, విద్యార్థులు, ఉద్యోగస్తులు, ప్రజలు, ప్రజానాయకులు ఉన్నరన్న వాస్తవాన్ని ఆయన విస్మరించారు. చంద్రశేఖరరావు మొదటినుంచి తెలంగాణకు అనుకూలంగా ఉన్న బిజెపి, తెలుగుదేశం, సిపిఐ, కాంగ్రెస్‌ కార్యకర్తలందరిని త్రోసిరాజని తన స్వీయ గ్రూపు రాజకీయాలు, ఓట్ల రాజకీయాలు, సీట్ల రాజకీయాలకే ప్రాధాన్యమిచ్చాడు. అధికార కాంగ్రెస్‌తో పొత్తు రాజకీయాలు నడిపి వారి దయాదాక్షిణ్యాల కొరకు నాలుగు సంవత్సరాలు ‘పడిగాపులు’ కాసి ఉద్యమాన్ని నీరు కార్చాడు.
తెలంగాణ ఉద్యమానికి ఆద్యులు విద్యార్థులు, ఉద్యోగస్థులు. వారి సహకారం లేకుండా ఉద్యమం ఈ దశకు చేరేదికాదు. విప్లవ కమ్యూనిస్టులు కూడా తమ మాట, పాట ద్వారా తెలంగాణ నినాదాన్ని గ్రామాలకు చేరవేశారు. చంద్రశేఖర రావు తొలుత విద్యార్థులు, కార్మికులను పార్టీకి దూరంగా ఉంచాలని పట్టుదల చూపాడు. అయితే ఇప్పుడు పార్టీని నడపడానికి వారి సహాయం కోరుతున్నాడు. ప్రత్యేక తెలంగాణ కోసం ఎందరో ప్రాణ త్యాగం చేశారు. ఆస్తులను కోల్పోయినవారూ తక్కువేమీ కాదు. అసంఖ్యాక త్యాగదనుల కారణంగానే తెలంగాణలో ‘సెంటిమెంటు’ బలపడింది. అయితే సెంటిమెంటు తన వలనే బలపడిందని చంద్రశేఖరరావు నమ్మబలుకు తున్నాడు. ఇది పచ్చి అబద్ధం. సెంటిమెంటు ఎలా వస్తుంది, ఎందుకు వస్తుంది, దాని స్వభావమేమిటనే విషయమై చాలామంది ఆసక్తి చూపుతు న్నారు. సెంటిమెంటు అనేది ఒకలాంటి అంతరాత్మ ప్రబోదం. సెంటిమెంటు ఒక అనిర్వచనీయమైన ప్రజాశక్తి. ఇది కంటికి కనపడని ప్రజా ‘నాడి’. అందుకే సెంటిమెంటు రాజకీయ సునామీలాంటిదని, ఒక ప్రమాదకరమైన ‘గాలి’ అని నమ్మేవారు ఉన్నారు.
‘సెంటిమెంటు’ అనే ఇంగ్లీషు పదానికి తెలుగుపండితులు, జర్నలిస్టులు కచ్చితమైన తెలుగుపదం చెప్పలేకపోతున్నారు. కాబట్టి అర్థఛాయను స్ఫురింపచేసే పదాలతో సరిపెట్టుకోక తప్పడం లేదు. సెంటిమెంటు అనేది ఉదాత్తమైన విశ్వాసం, ఆత్మీయత, భావోద్వేగం ద్వారా కలిగిన ఆత్మప్రేరణ. ఆవేశాలకు, భావోద్రిక్తతకు భావసారూప్యతకు, స్పందనకు సంబంధించినది. సెంటిమెంటు ఒక అకుంఠిత దీక్ష, పట్టుదల, ఆలంబన, ఆసక్తి, ప్రబలమైన కోరిక. సెంటిమెంటు ఆధారంగానే ఆంధ్రులు మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయి ఆంధ్ర రాష్ట్రం ఏర్పరచుకున్నారు. తమిళులు హిందీకి వ్యతిరేకంగా పోరాడి తమ భాష ఔన్నత్యాన్ని కాపాడుకున్నారు. ద్రావిడ సంస్క­ృతి సెంటిమెంటుతో ప్రత్యేక దేశంగా విడిపోదామని నినదించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఆంధ్రులు ‘ముల్కీరూల్స్‌’ బాధలు పడలేక ఆంధ్రా సెంటిమెంటును ఎగదోసి ఆంధ్రోద్యమం లేవనెత్తి విడిపోదామని రగడచేశారు. ఎన్‌.టి.రామారావు తెలుగువారి ఆత్మాభిమానం సెంటిమెంటును ఉపయోగించుకొని అధికారం కైవసం చేకున్నారు.
సెంటిమెంటును ఎదుర్కోవడానికి క్షుద్ర ఎన్నికల పన్నాగాలు ఎత్తుగడలు ప్రక్రియలు పని చేయవు.డబ్బు, కులం, పదవుల ప్రలోభాలు పనికిరావు. ఆశలు, ఆవేశాలను అణచలేవు. సెంటిమెంటు దేశభక్తియుత పోరాటం లాంటిది. ఇది త్యాగాన్ని కోరుతుంది. దీనిని ఎంత అణచివేస్తే అంత పైకి లేస్తుంది. భావోద్రిక్తత, మానసిక తీవ్రతను ఎక్కువ చేస్తుంది. ఆలోచనా ఆవేశాల తీవ్రత వలన వొత్తిడి పెరుగుతుంది. ఎంతకాలం గడిచినా సెంటి మెంటు నివురుగప్పిన అణువణువుల్లో దాగి ప్రజ్వరిల్లుతుంది.
తెలంగాణ ఉద్యమకారుల త్యాగాల వలన తెలంగాణ సెంటిమెంటు ఉద్భవించింది. ఇది తెలంగాణ ప్రజల సొత్తు. ఏ ఒక్క పార్టీ కూడా ఈ సెంటిమెంటుకు తామే వారసులమని చెప్పుకునే అర్హత లేదు. తెలంగాణ పేరుతో చెలా మణి అవుతున్న పార్టీలన్నీ ఒకరినొకరు ఛాలెంజ్‌లు చేసుకుంటూ చౌకబారు దూషణలు చేస్తూ దిగజారుడు మాటలు మాట్లాడుతుంటే జనం అసహ్యించు కొంటున్నారు.
తెలంగాణ జనసామాన్యం పార్టీలకు కాదు తెలంగాణకు మాత్రమే ఓటేయాలను కుంటున్నారు. జాతీయ, ప్రాంతీయ పార్టీలను ఎదుర్కొనే శక్తి తెరాసకు లేదు. ఇతర పార్టీల పట్ల ద్వేషం పెంచుకొని ఘర్షణకు దిగితే తెలంగాణ ఉద్యమానికి దోహదం జరగదు. అందుకే తెలంగాణ ఉద్యమానికి సకల రాజకీయ పక్షాలు కలిసి ఒక ‘ఫోరం’గా ఏర్పడి పోటీలో నిలవాలి. లేదా తెలంగాణ సమస్యను ఎన్నికలకు దూరంగాపెట్టి ‘రెఫరెండం’ ద్వారా ప్రత్యేక రాష్ట్రం సాధించుకోవాలి. తెలంగాణ ‘కావాలా? వద్దా’ అనే రెండు వాక్యాల అంశంపైన మాత్రమే ప్రజాభిప్రాయం తెలుసుకోవాలి. పార్టీల సీట్ల గెలుపు ఓట ములతో, సంఖ్యా బలంతో తెలంగాణ రాష్ట్రానికి ముడిపెట్ట కూడదు. ఇదే నేటి తెలంగాణ ప్రజాభిప్రాయం. ఇదే తెలంగాణ సాధనకు ఏకైక సులభతరమైన మార్గం.
source : andhra jyothy, 23 Jan 2008
ప్రకటనలు

వ్యాఖ్యలు»

No comments yet — be the first.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: