jump to navigation

ఎచ్చెమ్మ కతల యశోదమ్మ Yashoda Reddy అక్టోబర్ 8, 2007

Posted by Telangana Utsav in In News, Telangana People, Telugu (తెలుగు).
trackback

‘తెలంగాణ పిల్ల’ యశోదమ్మ
– ముదిగంటి సుజాతారెడ్డి

అభిమానం గల తెలం గాణ ముద్దుబిడ్డ యశోదారెడ్డి. 1929లో మహబూబ్‌నగరం జిల్లా బిజినేపల్లి గ్రామంలో సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన పాకాల యశోదారెడ్డి తన సహజమైన ప్రతిభతో విశ్వవిద్యాలయం ఆచార్యులుగా ఎదిగారు. అంతేగాక అధికార తెలుగు భాషాసంఘం చైర్మన్‌ పదవిని అధిష్ఠించిన ఏకైక మహిళ ఆమె. మంచి వక్త. అటు సంస్కృత సమాసభరితమైన శైలిలో ఇటు తెలంగాణ జాతీయాలు, సామెతలు, పలుకుబడులు నిండిన శైలితో ఆమె సమానంగా ధారాళంగా వేదికల మీద మాట్లాడేవారు.

తెలంగాణలో స్త్రీలు చదువుకొని వేదికలు ఎక్కి మాట్లాడటం అరుదైన కాలంలో ఆమె వక్తృత్వ ప్రతిభను చూసి ప్రసిద్ధ చిత్రకారుడు పి.టి.రెడ్డి ఆకర్షితుడై ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఆయన గీసిన అనేక చిత్రాలకు ఆమె స్ఫూర్తి. యశోదారెడ్డి కూడా స్వతహాగా కళాపిపాసి.

ఆమె తెలంగాణలోని ఇత్తడి విగ్రహాలను సేకరిం చేవారు. అలాంటి కళాఖండాలు ఆమె వద్ద ఎన్నో ఉంటాయి. పి.టి రెడ్డి సాంగత్యంతో వాటిలోని కళానైపుణ్యాన్ని, వైభవాన్ని ఆమె గుర్తించగలిగేవారు. ఆ విగ్రహాల్లోని రహస్యాలు ఆమె కు తెలిసేవి. భర్త చిత్రకళా ప్రదర్శన ఏర్పాటు చేసినపుడు ఒక కార్యకర్తగా పని చేసి అది విజయవంతం అయ్యేందుకు దోహదపడేవారు. యశోదారెడ్డి మంచి వక్తృత్వ పటిమ ఉన్న దివాకర్ల వెంకటావధాని శిష్యురాలు. గురువు నుంచి ఆమెకు కొన్ని లక్షణాలు అలవడ్డాయి. అందుకే విద్యార్థి దశ నుంచే మంచి వక్తగా పేరు తెచ్చుకున్నారు. స్త్రీలు పరదాల చాటున ఉన్న రోజుల్లోనే ఆమె ఎంతో ధైర్యంగా వేదికల మీ ద ప్రసంగాలు చేసేవారు. ఇది చాలా మందికి విచిత్రంగా తోచేది. అంతటితో ఆగకుండా రేడియోల్లోనూ ఆమె మాట్లాడేవారు.

1950 నుంచే ఆమె ఆలిండియా రేడియోలో “మావూరి ముచ్చట్లు” శీర్షికతో తెలంగాణ భాష యాసలో వ్రాసిన కథలను చదివేవారు. ఆ విధంగా తెలంగాణ భాషను విస్తృతంగా శ్రోతలకు విన్పించిన చక్కని కథకురాలు ఆమె. అందుకే తెలంగాణ భాష అనగానే అందరికీ ఆమె పేరే గుర్తుకు వస్తుంది. కథలను చదివినప్పుడు వింటే ఆ కథలు ఇంకా బాగా రక్తికట్టేవి. ఆమె అచ్చం తెలంగాణ భాషలో వ్రాసిన కథలు “మావూరి ముచ్చట్లు”, “ఎచ్చెమ్మ కతలు”, “ధర్మశాల” పేరుతో మూడు సంకలనాలుగా వచ్చాయి. తెలంగాణ పల్లె జీవితం ఆ కథల్లో బాగా ప్రతిఫలించి కన్పిస్తుంది. 50వ దశకంలో సినిమాల్లో తెలంగాణ మాండలి కాన్ని ఉపయోగించాలనుకునే వాళ్లు యశోదారెడ్డి వద్దకే వచ్చేవారు. ప్రముఖ నటి, స్వర్గీయ భానుమతి ఆమెకు మంచి స్నేహితురాలు. యశోదారెడ్డి ఇంటికి భానుమతి అప్పుడప్పుడు వచ్చేవారు. ఆమెను ‘తెలంగాణ పిల్ల’ అని పిలిచేవారు.

ప్రముఖ కవి, పండితులు విశ్వనాధ సత్యనా రాయణ కూడా యశోదారెడ్డి ఇంటికి వచ్చేవాళ్లు. ఒకసారి ఇరువురి మధ్య ఆసక్తికరమైన సంభాషణ సాగింది. గోంగూరను తెలంగాణ ప్రజలు పుంటికూర అని పిలుస్తారు. ‘పుంటికూర అనే పదం వింటే పుండు స్ఫూరణకు వస్తుంది’ అంటూ విశ్వనాధ ఎగతాళి చేస్తే..దానికి సమాధానంగా యశోదారెడ్డి..”గోంగూర అంటే ‘గోకుడు’ గుర్తొస్తుంది మా కు అన్నారు. చాలా ధైర్యంగా తన అభిప్రాయలు వెల్లడించే వారామె. ఆ రోజుల్లో తెలంగాణ భాష, యాసలకు ప్రతినిధిగా కన్పించేవారు. యశోదారెడ్డి కథారచయిత్రిగానే కాక విమర్శకురాలుగా సంప్రదాయ సాహిత్య పరిచయం గల పండితురాలుగాను పేరు సంపాదించుకున్నారు.

“తెలుగులో హరివంశములు” అన్న ఆమె సిద్ధాంత గ్రంథం మన్ననలు పొందింది. తెలంగాణ స్పృహలేని కాలంలోనే ఆమె తెలంగాణ వీరాభిమానిగా పేరు సంపాదించుకుంది.

తెలంగాణ జాతీయాలు, సామెతలు చాలా సేకరించా రామె. కానీ వాటిని సంకలనంగా తీసుకురాలేక పోయారు. కానీ ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీ వేసిన పుస్తకాలకు సంకలనకర్తగా ఉన్నారు. భర్త వేసిన వెయ్యి పెయింటిం గులు, శిల్పాలతో ఒక మ్యూజియం రూపొందించాలనే ఆమె కల నెరవేరకుండానే కాలం చేశారు. ప్రభుత్వం చొరవ తీసుకొని అలాంటి మ్యూజియం ఒకటి ఏర్పాటు చేస్తే యశోదారెడ్డికి సరైన నివాళి అర్పించినట్లవుతుంది.

మూలం: ఆంద్ర జ్యోతి Monday 8 October 2007

ప్రకటనలు

వ్యాఖ్యలు»

1. pasunuru sreedhar babu - సెప్టెంబర్ 7, 2011

wonderful piece of writing.


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: