ఏమి గోస తల్లీ నీకు? జులై 23, 2007
Posted by Telangana Utsav in Poetry & Songs, Telangana, Telugu (తెలుగు).trackback
- సూరెపల్లి సుజాత
పాలమూరు చెల్లి పొట్ట చేత పట్టుకొని
దేశం కాని దేశాలల్ల పనియ్యమని ఊరూరా తిరుగుతున్నది
కన్నవాల్లు కట్టుకొన్నవాడే పొత్తిల్ల బిడ్డని
పాతిపెట్టుతుంటె చాతకాక చూస్తున్నది
ఓరుగల్లు బిడ్డ బతుకు భారమయి బజార్ల బాల్యాన్ని తాకట్టు పెడుతున్నది
సమ్మక్క సారక్క సాక్షిగా పసిపిల్ల కాలే పొట్టకోసం పనిపిల్లయితున్నది
ఆదర్శ జిల్లా ఆదిలాబాదులొ అమ్మ ఆకలికి మాడుతున్నది
అడవిలో పాతాళంల బొగ్గు గనుల్ల అరణ్య రోదనమయినది
యేండ్ల ముందు దేశంబోయిన కొడుకు కోసం
ఇందూరు నిమ్మక్క కండ్లల్ల ఒత్తులేసుకొని జూస్తున్నది
నట్టనడమ నల్లగొండల నీడలేక నీళ్ళు లేక
నారు లేక నీరు లేక నాగక్క నలిగిపోతున్నది
లంబాడి తాండాలల్ల ఈరోజు రాంబాయి కడుపు
ఇదేశాలకు సంటి పిల్లల్ని అమ్మే ఖార్కానా అయినది
రియలెస్టేటు కాటేసిన రంగారెడ్డి పిల్ల రక్త మాంసాల బజార్ల
రంగులేసుకొని కాలి కడుపుతొ రాత్రి కొరకు ఎదురు జూస్తున్నది
ఊరును జాతినీ కొల్లగొట్టె రొహిల్లాల పిడికిలిలో
చెరువయిన కండ్లతో కోయ లేడి విలవిలలాడుతున్నది
హైద్రాబాదు హయిటెక్కు వంచనల సాలె గూడులో
ఆంద్రోల్ల నీడల్ల ఊపిరాడక బిక్కుబిక్కు మంటున్నది
మెతుకు సీమల మట్టి పనైనా దొరకక ఎండిపోయిన మాయమ్మ
ముప్పయి ఏంద్లకే ముసలిదయి మంచాన పడుతున్నధి
బీడీ కూలీతో ఇల్లు గదవక కన్నారంల
మా తెలంగాణ తల్లి కన్న బిడ్డని సాకలేక కాటికి పంపుతున్నది !





వ్యాఖ్యలు»
No comments yet — be the first.